దేవదాసు, శైలజారెడ్డి అల్లుడు - వెండితెర వెన్నెల

  • 321 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందలూరి నారాయణరావు

  • అద్దంకి

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!

దేవదాసు కొత్తగా మారాడు
ఒక పెద్ద గూండాకి, అమాయకపు వైద్యుడికి మధ్య జరిగిన కథ ‘దేవదాసు’. మానవ సంబంధాలను కథలో అంతర్లీనంగా చూపించారు. ‘‘కన్నుకి ఒకవైపే భయముండదు దేవా.. ప్రాణం పోతుందన్నప్పుడే భయపడరు.. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి దూరం అవుతుందన్నప్పుడు కూడా భయపడతారు. మారిపో దేవా..’’, ‘‘మనతో కలిసి బతకాలంటే డబ్బు, పవర్‌ అవసరం లేదు.. కొంచెం చిరునవ్వు కొంచెం ప్రేమ ఉంటే చాలు.. లైఫ్‌ చాలా అందంగా తయారవుతుంది..’’, ‘‘నిజం చెప్పేస్తే గతం అవుతుంది.. అబద్ధాన్ని కొనసాగిస్తే అది భవిష్యత్‌ అవుతుంది..’’ లాంటి సంభాషణలు (భూపతిరాజా, సత్యానంద్‌) ఆకట్టుకుంటాయి.
      ‘‘వారూ వీరు అంతా చూస్తూ ఉన్నా..’’ పాటలో (సిరివెన్నెల) ప్రేమ కోసం వెంపర్లాట ‘‘పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ.. అల్లా పడిపోకపోతే ఏం లోటో ఏమో ఖర్మ..’’ అంటూ సరదాగా సాగిపోయింది. మరో పాటలో మెరుపుతీగ నవ్వడం, వెలుగు వాగు పారడం.. నేల కాస్త నింగై మెరిసిందేమో.. ఏమో ఏమో అంటూ సాగే భావాలు హాయిగా ఉన్నాయి.
      ‘‘చిందర వందర సుందర వదనా..’’ పాట (రామజోగయ్య శాస్త్రి) తమాషా పదాల పుట్ట. హార్మోనియం వాయింపుల నడుమ శ్లేష పలికించడం ఆకట్టుకుంది. మరో పాట ‘‘హే బాబు.. తెలిసిందా ప్రేమంటే..’’ మధురంగా ఉంది. ‘‘లకలక లకుమికరా’’ అంటూ బొజ్జ గణపయ్యను స్తుతించే పాట ఇక నుంచి ఏటా ఊరేగింపు వేడుకల కోసం నిలిచిపోతుంది.


మొత్తానికి అల్లుడయ్యాడు!
అమ్మనుంచి పొగరును వారసత్వంగా పుణికి పుచ్చుకున్న ఓ గారాల కూతురు కథానాయిక. అనుకోకుండా పంతాలకు పోయిన వాళ్లను కలిపి.. తానో ఇంటివాడవ్వాలన్న తప్పనిసరి పరిస్థితిలో నాయకుడు. ఇలా ‘శైలజారెడ్డి అల్లుడు’ కథంతా సరదా సన్నివేశాలతో తీర్చి దిద్దుకున్నదే. 
      ‘అను బేబీ’ పాటలో (సాహిత్యం కృష్ణకాంత్‌) అలకొచ్చిన అణుబాంబులా చూడొద్దని చెప్పడం, విసుగొచ్చిన మేరీకోమ్‌లా మండకే అని వేడుకోవడం కొత్తగా ఉంది. కోపానికి ఉపమానంగా బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ ఉగ్రరూపాన్ని ప్రస్తావించడం ఓ ప్రయోగం. 
      ‘‘శైలజారెడ్డి అల్లుడు సూడే’’ పాట (శ్యామ్‌ కాసర్ల) జానపద బాణీతో అలరించింది. ‘‘అత్తనుచూస్తే నిప్పుల కుండ.. కూతురు చూస్తే కత్తుల దండ.. ఈ ఇద్దరూ సల్లగుండ.. పచ్చటి గడ్డి భగ్గున మండ.. పట్టిన పట్టు వద్దనకుండ ఏ ఒక్కరూ తగ్గకుండా..’’ అంటూ అంత్యప్రాసలతో జోరెత్తించింది. ‘‘ఏ ఊరు ఏ దారి ఏ దూరమైనా.. నే రాన చేసేసి ఏ నేరమైనా.. గదులు ఆపేనా... నదులు ఆపేనా.. నేను దాటేయనా చాటేయనా ప్రేమనీ..’’ పాట (కృష్ణకాంత్‌) వినసొంపుగా సాగింది. ‘‘పోరి పోరి సత్యభామా.. దుమ్ము దులిపి వెళ్లేనంట.. విచ్చుకున్న మాట వచ్చి గుచ్చెనంటా..’’ పాటలో (శ్రీమణి) పదాల పొందిక శాస్త్రీయ గళంలో తాళప్రధానంగా కొత్తగా వినిపించింది. ‘‘తను వెతికిన తగు జత నువ్వేనని.. కనుతెరవని మనసుకు తెలుసా అని.. బదులడగని పిలుపది నీదేనని.. తెర మరుగున గల మది విందా అని..’’ సాగే సిరివెన్నెల సాహిత్యం సంగీత ప్రియులకు కానుక. ఇందులో అతి గారం, అల్లరి, పొగరు, విచిత్ర వైఖరి.. వీటిని కట్నాలుగా చెప్పడం కొత్త మెరుపు. ‘‘ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలిగానీ, ఎర్రగా ఉందని మొహానికి పులుముకోకూడదు సార్‌..’’ లాంటి సంభాషణలు నవ్వులు పూయించాయి. ‘‘పొగరుతో సాధించలేని ఎన్నో విషయాలు ప్రేమతో సాధించవచ్చు కదా’’ అని కథానాయకుడు అంటే.. ‘‘ఇలాంటి వాట్సప్‌ మెసేజులు సాయిబాబా ఫొటో పెట్టి గుడ్‌మార్నింగులు చెప్పడానికి బావుంటయి..’’ అంటూ వ్యంగ్యాస్త్రం తిరిగి తగులుతుంది. ఇలాంటి సంభాషణలతోనే కథంతా నడవటంతో చిత్రం ఆహ్లాదంగా సాగిపోయింది.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం