మేటి దొరవు అమ్మకుచెల్ల! నీసాటి ఎవరుండట కల్ల!!

  • 844 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। కె.ధ‌న‌ల‌క్ష్మి

  • విశ్రాంత అధ్యాప‌కురాలు, ఏపీఆర్ స్కూల్ (బీసీబాలురు)
  • కోట‌, నెల్లూరు
  • 9441685248
డా।। కె.ధ‌న‌ల‌క్ష్మి

తెలుగు సాహిత్యాన్ని రెండోసారి జ్ఞానపీఠం ఎక్కించిన కవి సి.నారాయణరెడ్డి. అదే సమయంలో తన అద్వితీయ నైపుణ్యంతో సినిమా పాటనూ సమున్నతంగా నిలబెట్టారు. వెండితెర దృశ్యకావ్యాలకు తగిన భాషలోనే విభిన్న ‘వర్ణాల’తో అందమైన, అనితరసాధ్యమైన భావచిత్రాలను సృజించారు. సినారె సినీ గీతాల్లోని మెరుపులన్నీ ఆ మహాకవి రచనా వైదుష్యానికీ, విస్తారమైన ప్రాచీన సాహిత్యాన్ని ఆపోశన పట్టిన ఆయన మేథకూ అద్దంపడతాయి.
తెలుగు సినిమా పాట అనగానే ఆనాటి సముద్రాల నుంచి ఈనాటి సీతారామశాస్త్రి వరకు అసమాన ప్రతిభావంతులైన గేయ రచయితలంతా మనసులో మెదులుతారు. వీళ్లంతా తమ ప్రత్యేకతలతో సినీ గీతానికి అందం, నిండుదనం తెచ్చారు. అనంతవాహిని లాంటి చలనచిత్ర సాహిత్యంలో 1961లో వచ్చి చేరిన కొత్త కెరటం సి.నారాయణరెడ్డి. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకొచ్చే పాట- ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ’. ఇది ఆయన మొదటి పాట కూడా. అది మొదలు సినిమా పాటకు సినారె చేసిన సేవ అజరామరం.
      ‘కవిత్వం నా మాతృభాష’ అని కవితాత్మకంగా తన హృదయాన్ని ఆవిష్కరించారు సినారె. ప్రాచీన కావ్య పరిజ్ఞానంతో ఏర్పరచుకున్న కవితా భాషకు ఆలంకారికతతోను, అనుప్రాసలతోను వన్నెచిన్నెలు దిద్ది తనదైన శైలిని పొందుపరచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రతి భావాన్నీ, ప్రతి విషయాన్నీ లయాత్మకంగా కవిత్వీకరించడమే ఆయన శైలి. ఆయన కావ్యభాష సహృదయ వేద్యం. ఆ కవితాధారలో సుదీర్ఘ సమాసాలు సైతం ఒద్దికగా ఇమిడిపోయాయి. కొంతమంది దృష్టిలో ఇది శబ్దాడంబరంగా కనిపించినా ఆయన శబ్దపటిమను ఏ మాత్రం తగ్గించలేకపోయింది. అంతకు ముందటి కవులు ప్రయోగించినన్ని శబ్దాలూ, కావ్యాల్లో మాత్రమే కనిపించే సుదీర్ఘ సమాసాలూ సినీ గీతాల్లో ప్రయోగించిన కవి నారాయణరెడ్డి.
      సుదీర్ఘ సమాస చాలనం ఉన్న సినారె పాటకు ‘శ్రీకృష్ణపాండవీయం’ చిత్రంలోని స్వాగతగీతం చక్కటి ఉదాహరణ. ‘స్వాగతం సుస్వాగతం’ అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటలోని రెండు చరణాల చివరా సంస్కృత సమాస ప్రయోగంతో పాటకు ఔజ్వల్యం వచ్చింది. ‘‘ధరణిపాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా’’, ‘‘కదనరంగ బాహు దండ భుజగదా ప్రకట పటు శౌర్యాభరణా’’... ఇవే ఆ సమాసాలు. ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలోని ‘ఎవ్వడు నినుమించువాడు’ పాటలో వచ్చే ‘‘అసమానరమ్య రసికావతంస, అసుర వంశ సరసిరాజహంస, నిజభుజకంపిత రజతా చలాగ్ర శేఖరా- సురభీకరా, అసదృశ విక్రమ చకచ్చకిత విషకందరా- దశకంధరా’’ లాంటి సమాసాలు సినారె ప్రతిభకు మరికొన్ని ఉదాహరణలు.
అచ్చతెలుగు పద పరిమళాలు
తన జావళీల్లోను, జానపదాల్లోను అచ్చతెలుగు పదాలను, దేశీయపు పలుకుబడులను ప్రయోగించారు సినారె. రెంటికీ బరువైన భాష అవసరం లేదు. పూర్తి సంస్కృతంతో ‘సంగీత సాహిత్య సమలంకృతే’ అనే పాటను రాసిన చేత్తోనే సామాన్యులు కూడా పాడుకోగలిగే పాటలను రాయడంలో కవికి ఉన్న ఉభయభాషా పరిజ్ఞానం తెలుస్తుంది. ‘‘మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెలపైన’’ (మదనా సుందర నాదొర- ‘గులేబకావళి కథ’), ‘‘ఒంటరిగానేనుంట చూసీ, అవ్వ!/ తుంటరియై పడకింట దూరి/ జుంటితేనెలిమ్మని పెదవిని/ మునిపంటనొక్కు ఈ కొంటెగాని పని చూడవే’’ (చూడవే చూడుచూడవే- ‘ఉమ్మడి కుటుంబం’), ‘‘గుత్తపు రవిక ఓయమ్మో,/ చెమట చిత్తడిలో తడిసి ఉండగా/ ఎంతసేపు, నీ తుంటరి చూపు/ అంతలోనె తిరుగాడుచుండగా (ఎంతటి రసికుడవో తెలిసెరా- ‘ముత్యాలముగ్గు’)... తదితర సినారె అచ్చతెలుగు పద ప్రయోగాలు సినీపాటకు మట్టి పరిమళాలను అద్దాయి. ఇక  ‘రాజా’ అనే ఒక్క పదాన్ని తప్ప మిగిలిన పాటనంతా అచ్చ తెలుగు కావ్యాల్లోని మాటలతో రాసిన పాట.. ‘‘ఛాంగురే బంగారు రాజా’’. ఇందులోని ‘మజారే, అయ్యారే, భళారే’ లాంటి ఆశ్చర్యార్థకాలు కూడా గమనించదగ్గవి. ‘‘మాయదారి సిన్నోడు, నా మనసే లాగేసిండు/ మాగమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే/ ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా’’ (అమ్మమాట) లాంటి పాటలైతే సినారె కలం పటిమతో పూర్తిగా జానపద సొబగులను పొదువుకున్నాయి.   
ప్రాచీన కవుల బాటలో...
తన సమకాలీన సినీ కవుల్లాగే సినారె కూడా సంప్రదాయాల్ని మరువలేదు. పౌరాణిక చిత్ర గీతాల రచనకు తనకున్న కావ్య పరిజ్ఞానం ఎంతగానో ఉపకరించిందని ‘పాటలో ఏముంది.. నా మాటలో ఏముంది’ పుస్తకంలో చెప్పారు. కాళిదాసు, నన్నయ, శ్రీనాథుడు, పోతన, పెద్దనాది ప్రాచీన కవులను, ఆధునిక కవులను గుర్తుచేసే ఆయన సినీగీతాలెన్నో!  
      ‘పాలమనసులు’ చిత్రంలోని ‘ఇదే సమాధానం’ పాటలో ‘‘అడుగేసినావు అడుగేయలేవు’’ అన్న మాటలను వింటే కాళిదాసు కుమార సంభవంలోని ‘శైలాధిరాజ తనయానయయౌనతస్థా’ అనే పంక్తి గుర్తుకొస్తుంది. ‘దేవకన్య’లోని ‘‘అందాలపూలే తలంబ్రాలుగా’’ పాటలో నన్నయ శకుంతలోపాఖ్యానంలోని ‘కుసుమాక్షతలు సేసలు వెట్టినట్లయ్యె’ ప్రయోగం స్ఫురిస్తుంది. అలాగే, ‘‘ఏ తల్లి నిను కన్నదో’’ (దానవీరశూరకర్ణ) పాటలోని ‘‘అజస్ర సహస్ర నిజప్రభలతో’’ అనే పంక్తి, ఉదంకుడితో నన్నయ చేయించిన నాగస్తుతి ‘అజస్ర సహస్ర ఫణాళిదాల్చి’ని గుర్తుచేస్తుంది. శ్రీనాథుడి హరవిలాసంలో ‘చిరుసాన బట్టించి చికిలి సేయించిన’లోని ‘చికిలి’ (పదును అని అర్థం) చికిలి చూపుగా, శృంగార నైషధంలోని ‘చంద్రికాజాలము’ చంద్రజాలంగా సినారె పాటలో ప్రత్యక్షమవుతాయి. అలాగే, పోతన మహాకవిని తలపిస్తూ, భాగవతంలోని ‘అరవిందంబుల కంటె...’ అనే పద్యం గుర్తుకు వచ్చేలా ‘‘వెదురు పొదల్లో తిరిగి తిరిగి/ నీ పదపల్లవములు కందిపోయెనో/ ఎదపానుపుపై పవళించరా, నా/ పొదిగిన కౌగిట నిదురించరా’’ (నీ పేరు తలచినాచాలు- ఏకవీర) రాశారు.
ప్రబంధాల సొగసులు
సినారె మీద పెద్దన, చేమకూర వెంకన్నల ప్రభావం బాగా ఉంది. అంతేకాదు ‘నీలా సుందరీ పరిణయం, యయాతి చరిత్రం’ లాంటి అచ్చ తెలుగు ప్రబంధాల ఛాయలూ ఆయన పాటల్లో ప్రతిఫలిస్తాయి. ‘‘ఎక్కడివాడో గాని చక్కనివాడే’’ అన్న ‘ఖైదీబాబాయ్‌’ నాయికకు, ‘‘ఈ తుంటరి గాలికి నను ఒంటిగా వదిలేస్తావో’’ అన్న ‘పద్యవ్యూహం’లోని నాయికకు, ‘శ్రీరామ పట్టాభిషేకం’లోని ‘శతపత్రేక్షణ, చంచరీక చికుర, చంద్రవదన’ మండోదరికి స్ఫూర్తి పెద్దన వరూధినే.
      చేమకూర కవి విజయ విలాస ప్రయోగాలను తలపించే సినారె పాటలూ బోలెడు. ‘‘మన్మథునికే మేనమామలా వున్నావు పున్నమ చంద్రుని అన్నలా వున్నావు’’ (కోడెవయసు కో అంది- ‘దేవుని గెలిచిన మానవుడు’) అనే పాటకు స్ఫూర్తి- ‘అతనినుతింపశక్యమె జయంతుని తమ్ముడు సోయగమ్మునన్‌’ అనే అర్జున వర్ణన! ‘ధనమా దైవమా’ చిత్రంలోని ‘‘ఏమిటో ఇది... గుడుగుడుకుంచం గుండేరాగం’’ అనే పాటలోని ‘‘నీ కళ్లు చూశాను, నా ఇల్లే మరిచాను/ నీ పెదవులే చూశాను, జున్నూ మీగడ మరిచాను’’ పంక్తులతో సుభద్రను చూచి మైమరచిన అర్జునుడి స్థితి- ‘వెలది కెమ్మోవిగని జపావృత్తి మరచె/ తరుణి లేఁగౌనుగని హరి స్మరణమరిచె- కళ్ల ముందు మెదులుతుంది. పెద్దన, చేమకూరలను గుర్తు చేసేలా ‘అమ్మక చెల్ల’ పద ప్రయోగాన్ని సినారె గారు పాటల్లో చేశారు. ‘‘మేటి దొరవు అమ్మకచెల్ల/ నీసాటి ఎవ్వరుండుట కల్ల’’ (ఛాంగురే బంగారు రాజ)... దీనికో ఉదాహరణ.
ప్రబంధాల్లో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ఆ ధోరణిలో సినారె చేసిన నాయక వర్ణన చూడండి... ‘‘చొక్కపు బంగరు మేను, పొగ/ రెక్కిన సింగపు నడుము, ఆ/ చుక్కల రాయని సోయగమ్ము నెక/ సెక్కము లాడే మోము’’! ‘అగ్గివీరుడు’లోని పాట ఇది.  అలాగే, ‘ఓ ఆడది, ఓ మగాడు’ చిత్రంలోనూ ఇలాంటి వర్ణనే వినిపిస్తుంది. ‘‘ఔరా ఏమి దీనిసౌరు/ అంగాంగముల తీరు/ ఆ మేనివన్నె బంగారు/ ఆ వేణి తుమ్మెదలబారు/ ఆ మోము కళలు పదునారు’’... అంటూ ప్రబంధ కవిలా మారిపోతారు సినారె.  
రాచవన్నెలు.. చిగురువలపులు
‘‘ఏటిదాపుల తోటలోపల, తేటతేనియ లొలుకు పలుకుల/ ఎవరినే పిలిచేవు కోయిల ఎవరినే’’ (ప్రేమకానుక), ‘‘ఎందుదాగి ఉన్నావో బృందావిహారీ/ నీపాద ధూళినై నిలువనీయవోయీ/ తీసిన గంథపు వాసనలారెను, అల్లినదండల మల్లెలువాడెను/ కన్నయ్యా నీ సన్నిధికరవై గడియే యుగమై తోచెనురా’’.. ఈ రెండు పాటలను వింటుంటే కృష్ణశాస్త్రి రాశారా అనిపిస్తుంది. కానీ ఇవి సినారెవే. అలాగే, ‘ఎంకి పాటల’ను గుర్తుచేసే ప్రయోగాలూ ఆయన సినీ సాహిత్యంలో ఉన్నాయి. ‘‘సన్నజాజి పూలు పెట్టి’’ (విజయం మనదే) పాటలో ‘‘ఎవ్వరో చూసినట్టుంది ఎందుకో గుండె ఝల్లుమంటుంది’’ అనడంలో ‘నా ఎనక ఎవ్వరో నవ్వినటులున్నది’ అన్న నండూరి వారి మాట తలపునకు వస్తుంది. అలాగే, ‘‘చీకటిలో నిదుర రానిచో చిరుదివ్వెను వెలిగించనా/ ఆ చిరు వెలుగే పనికి రానిచోనా కనులే వెలిగించనా’’ అన్న ‘భలేరంగడు’ గీతం ‘సీకట్లో సూడాలి నీ కళ్ల తళతళలు’ అనే అభివ్యక్తిని తలపిస్తుంది. సినీగీతాల్లో సందర్భానుసారంగా ఇలా ప్రాచీన, అర్వాచీన కవులు జ్ఞప్తికి వచ్చేలా రాయడం సినారెకే సాధ్యం. నిరంతరాధ్యయనమూ, బోధనానుభవమూ దీనికి కారణం.
      నారాయణరెడ్డి సినీ గేయాల్లోని నుడికారపు సొంపులు చెప్పుకుంటే తరిగేవి కావు. మానార్థంలో- పుట్టెడు (కళ), దోసెడు (వలపు), బారెడంత (జడ), చారడేసి (కనులతో), పిడికెడంత (నడుము); శ్రేష్ఠతావాచకాలైన పసిడి (కిరణాలు), వరహాల (చిరునవ్వు), రతనాల (లాలి), ముత్యాల (పందిరి) లాంటి పదాలు; ఇంకా- కొదమతేటులు, చిగురువలపు చిలకల కొలికి, బెళుకు చూపులు, మిసిమి కోరికలు, కన్నె గాలి, (చిరుగాలి అనే అర్థంలో), మొలక నవ్వు (లేనగవు అనే అర్థంలో), దోరవయసు ఆశల పందిరి, ఎలనాగ, రాచవన్నె, గాలి పల్లకి, రవ్వల మేడ, మదనుని తూపులు, సిగపూవు, జిలుగుపైట, మల్లెపూల జాతర, పరువాల రాగాలు తదితర మాటలు ఆయన పాటల్లో అందంగా అమరాయి.  
కవితాత్మక ప్రయోగాలు.. చతురోక్తులు
సినారె ఒట్టి పొడిపొడి క్రియాపదాలను ఎప్పుడూ ప్రయోగించలేదు. వాటి మీద కవితాగంథం చిలికించనిదే ఆయన కలానికి తృప్తి లేదు. ఇలాంటి కవితా చమత్కారాలు ఎక్కువగా ప్రణయ గీతాల్లోనే కనిపిస్తాయి. నాయికను మధుర శృంగార మందారమాలగా అభివర్ణించడం, ఆమె సొగసు జగములను ఏలుతుందని చెప్పడం, అది దివికి, భువికి వంతెన వేసిందనడం సినారెకే ప్రత్యేకం. గుండెలో బొండు మల్లెలు విరియడం, పల్లవించిన కలలు విరజాజులుగా పరిమళించడం, తొలి పరువం కన్నెమనసు తెర తీయడం, కనుల కొసలు పిలవడం, మనసు బదులు పలకడం, మౌనం రాగమై ఎగసిపడటం, పెదవి మురళియై పిలవడం, హృదయమే భ్రమరమై దాగడం... ఇవన్నీ ఆ మహాకవి మధుర ఊహలే. 
      సినారె సినీగీత సాహిత్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం- తెలుగును మాధుర్యానికి ప్రతీకగా తీసుకోవడం. ‘‘వస్తుంది వస్తుంది వరాలపాప వస్తుంది/ తెలుగులాంటి తియ్యని పాప/ వెలుగులొలికే నా కనుపాప’’ లాంటి పాటల్లో దీన్ని గమనించవచ్చు. ఇక ‘‘పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం/ అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం’’ అనడంలో శృంగార రసాన్ని వివరించేటప్పుడు మధుర శబ్దాలే తప్ప కఠినోక్తులు ఉండరాదనే లాక్షణికుల మాటను పాటించినట్టు ఉంటుంది. ఇలా సినీ గీతానికి ఎన్నెన్నో కవితాసింగారాలు చేసిన సినారె, ఆ పాటను కావ్యపంక్తిలో నిలబెట్టారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం