వేడి వేడి అన్నం... ముద్దపప్పు... మరగకాచిన నెయ్యి... కొత్తావకాయ... నోట్లో నీళ్లూరని వారెవరు!
మూకుట్లోంచి అప్పుడే తీసిన గారెలు... నంజుకు కోడికూర... ఆగమంటే ఆగేవారెవరు!
పులిహోర, పాలతాలికలు... నైవేద్యం పెట్టేదాకా ఉండమన్న అమ్మ మీద అలగని వారెవరు!
ఆకలి రుచి ఎరగదంటారు కానీ, రుచి బాగుంటే ఆకలి రెట్టింపవుతుంది. నాలుక నయగారాలు పోతుంది. అదీ అరిటాకు మీద అచ్చ తెలుగు వంటలన్నీ వరుసగా కొలువుదీరితే నోరు కట్టుకోవడం ఎంతటి వారికైనా కష్టమే.
అందుకే కాబోలు, నన్నయ మొదలు మన కవులందరూ ఏదో ఒక సందర్భంలో కల్పించుకుని మరీ తమ భోజన ప్రియత్వాన్ని ప్రదర్శించారు. పదండి మరి... వారు మెచ్చిన రుచులను మనమూ నోరారా ఆస్వాదిద్దాం!
భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాలు... పంచభక్ష్యాలు. తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు... షడ్రుచులు. కొందరికి ఆ రుచులు గాఢంగానూ, ఇంకొందరికి మధ్యమంగానూ, మరికొందరికి అప్పంగానూ కావాలి. ఒక్కొక్క రుచితో మూడు విధాలుగా వంట చేస్తే మొత్తం పద్దెనిమిది రకాల రుచులు పుట్టుకొస్తాయి. ఈ రుచులను ద్రవపదార్థాలు మినహా పంచభక్ష్యాల్లో మిగిలిన వాటికి అన్వయిస్తే, కనీసం 72 రకాల వంటకాలు తయారవుతాయి. ఇన్నేసి ఆహార పదార్థాలతో పరిచయం ఉంది కాబట్టే మనవాళ్లు భోజనప్రియులు అయ్యారు. తాళ ఫల ప్రమాణంలో ముద్దలు ఎగరేస్తూ... ‘వానిభోజన పరాక్రమంబు వర్ణింప తరంబే’ అనిపించుకున్నారు!
‘పలుతెరంగుల బిండి వంటలూ, పప్పుకూడును, నేతికుండలూ, గుడంబు, దధిప్రపూర్ణఘటంబులూ...’ ఆంధ్ర మహాభారతంలో బకాసురుడికి నన్నయ పంపిన తెలుగు వంటలివి. ‘సత్కవుల్హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి’ అంటూ తాను కందమూలాలను ఇష్టపడినా బాలకృష్ణునికి మాత్రం ‘ఆకులు కంచంబులుగా..., ఊరుగాయలు, చల్దులు, మీగడ పెరుగులతో మన భోజనమే వడ్డించాడు సహజపండితుడు పోతన.
ఇక శ్రీనాథుడి రచనల్లోనైతే తెలుగు వారి భోజనప్రియత్వమంతా విశ్వరూపంతో దర్శనమిస్తుంది. తనని ఆదరించిన రెడ్డిరాజుల ఆస్థానాల్లో తాను చవిచూసిన ‘హేమపాత్రాన్నమే’ ఇందుకు ప్రేరణ అయింది కాబోలు! ఓ అప్సర శివుడికి వడ్డించిన భోజనాన్ని భీమేశ్వర పురాణంలో ఇలా వర్ణించాడు కవి సార్వభౌముడు...
ద్రాక్షాపానక ఖండ శర్కరలతో, రంభాఫల శ్రేణితో
గోక్షీరంబుల తోడ, మండెగలతో, క్రొన్నేతితో, పప్పుతో
నక్షయ్యంబగు నేరుబ్రాల కలమాహారంబు నిశ్శంకతన్
కుక్షుల్ నిండగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్
చదువరుల నోళ్లకు చవులూరించే వర్ణనను ఇక్కడితో ఆపలేదు శ్రీనాథుడు. ద్వాదశీ పుణ్యవేళ లింగమంత్రి పెట్టిన భోజనం ఇలా ఉందంటూ ఇంకా ఊరించాడు...
ఖండశర్కర, జున్ను, కండ చక్కెరలు, దోసెలు, వడల్, సేవె పాసెముల తోడ
కమ్మగా కాచిన కరియాల నేతితో కమనీయ పంచభక్ష్యముల తోడ
సంబారములతోడి శాకపాకములతోడ పక్వమైన పెసరపప్పుతోడ
అచ్ఛలవణాదికములతో అమృతఖండ
పాండురంబైన దధితోడ బ్రాహ్మణులకు
భోజనమువెట్టు ద్వాదశీ పుణ్యవేళ
లింగమంత్రి నవీన రుక్మాంగదుండు
ఆకలి బాధితుడై కాశీనగరాన్ని శపించాలనుకున్న వ్యాసమహర్షికీ, అతని శిష్యులకూ అన్నపూర్ణాదేవి 72 రకాల వంటలు వడ్డించి వారికి కోపాగ్నితోపాటు క్షుధాగ్నినీ చల్లార్చింది. ఆ వంటకాల వివరాలన్నీ కాశీఖండంలో కనిపిస్తాయి. అక్కడ శ్రీనాథుడు పేర్కొన్న ఆహార పదార్థాల్లో కొన్ని నేటికీ కనిపిస్తున్నాయి, మరికొన్ని కావ్యాల్లో మాత్రమే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, పద్నాలుగో శతాబ్దంలో (కవిసార్వభౌముడు నడయాడిన సమయం) ప్రాచుర్యంలో ఉన్న తెలుగు వంటల్లో కొన్ని...
కాకరకాయే కారవేల్లం జంబూ - నేరేడు చూత - మామిడి లికుచ - కమ్మరేగు కపిత్థ - వెలగ కర్కంధూ - రేగు కారవేల్లం - కాకర జంబీర - నిమ్మ మాణింధమం- సైంధవలవణం అశ్మలవణం - రాతిఉప్పు మరిచ - మిరియం రామఠం - ఇంగువ సిద్ధార్థ - తెల్లఆవాలు హయ్యంగవీనం - తాజా ఆవునెయ్యి కుస్తుంబం - కొత్తిమీర |
లడ్డువంబులు, ఇడ్డెనలు, కుడుములు, అప్పడంబులు, ఇప్పట్లు, గొల్లెడలు, జిల్లేడుకాయలు, దోసియలు, సేవియలు, అంగరపోలియలు, సారసత్తులు, బొంతర కుడుములు, చక్కిలంబులు, మడుగుబూరులు, మోరుండలు, పెసరంబులుగములు, చెరకుగుడములు, అరిసెలు, బిసకిసలయములు, వరుగులు, చిరుగడములు, బడిదెములు, బులుపలుబు వివరకలు, పప్పురొట్టియలు, చాపట్లు, పాయసంబులు, కర్కరీకారవేల్ల కూష్మాండ తియ్యగూరలు, పచ్చడులు, బజ్జులు, గిజ్జిణలు, వడియంబులు, కడియంబులు, ఉండ్రాలు, బుణుకులు, నిలిమిడి, చలిమిడి, ద్రబ్బెడలు, వడయును, మక్కెరలు, చక్కెరలు, నేతులు, తేనెతొలలు, మోదకంబులు, గుడోదకంబులు. వీటితో పాటు... పుండ్రేక్షు ఖండంబులు, పిండఖర్జూర, ద్రాక్ష, నారికేళ, కదళీ, పనసపండ్లు, జంబూ, చూత, లికుచ, దాడిమీ, కపిత్థ, కర్కంధూ ఫలంబులు. మాంసాహారం విషయానికొచ్చినా మనం శ్రీనాథుణ్ని స్మరించక తప్పదు. హరవిలాసంలో ఇలా అంటాడు...
మిరియము నుల్లియున్, బసుపు, మెంతియు, నింగువ, జీరకంబు, శ
ర్కరయును, జింతపండును, గరాంబువు, గమ్మనినేయి తైలమున్
బెరుగును మేళవించి కడుబెక్కు విధంబుల బాకశుద్ధి వం
డిరి శిరియాలునిం గటికి డెందమునన్ దరళాక్షులిద్దరున్
మిరియాలు, ఉల్లిపాయలు, పసుపు, మెంతులు, ఇంగువ, జీలకర్ర, చింతపండు, నెయ్యి, పెరుగులను సమపాళ్లలో కలిపి మాంసం వండారట. శివుడు తన భక్తుడు సిరియాళుని ఇంటికి వచ్చిన సందర్భంలో ఇలా మర్యాద చేశారని చెప్పుకొచ్చాడు శ్రీనాథుడు. మరో పద్యంలో, చక్కగా ఉడికించిన మాంసపు ముక్కల నుంచి నీటిని తొలగించి, నేతిలో వేయించి, తర్వాత సన్నగా తరిగిన ముక్కలను ఉడికించి పులుసు చేశారని వర్ణిస్తాడు. దానికి అదనంగా ఎముకలు, మూలుగులతో పెట్టిన చారు కూడా ఉందని నోరూరిస్తాడు. మాంసాన్ని పెరుగుతో కలిపి ఉడికించడం వల్ల వెగటుపోయి మాంసం మృదువుగా తయారవుతుందని చెప్పినవాడు కవి సార్వభౌముడే.
రాయల కాలంలో ‘రాజవిందు’
తెనాలి రామకృష్ణుడూ తానేమీ తక్కువ తినలేదని ‘హరిలీలా విలాసం’లో నిరూపించాడు. అందులో వేడి వేడి భోజనాన్ని ఇలా వడ్డించాడు...
ఆలఘృతంబు, వేడియగు నన్నము, నుల్చినముద్దపప్పు, క్రొం
దాలిపుకూర, అప్పడము, ద్రబ్బెడ, చారులు, పానకంబులున్
మేలిమిపిండి వంటయును, మీగడతోడి దధి ప్రకాండముల్
నాలుగుమూడుతోయములనంజులు గంజదళాక్షి పెట్టగన్
ఆస్థాన కవే అంతగా భోజనప్రియత్వాన్ని ప్రదర్శిస్తే రాయల వారు ఊరుకుంటారా! ‘ఆముక్తమాల్యద’లో ఆనాటి శాకపాకాలను తనదైన నారికేళ పాకంలో ఇలా చవిచూపించారు...
తారుణ్యాతిగ చూతనూత్నఫలయుక్తై లాభిఘారస్వన
ద్ధారా దూపిత శుష్యదంబుహృత మాత్స్యచ్ఛేదపాకోద్గతో
ద్గారంపుం గనరార్చు భోగులకు సంధ్యా వేళలన్ గేళికాం
తారాభ్యంతర వాలుకాస్థిత హిమాంతర్నారికేళాంబువుల్
ఆనాటి శ్రీమంతులు.. చేప తునకల్లో పచ్చిమామిడికాయ ముక్కలు వేసిన తాలింపు కూర తినేవారు. ఉదయం తడి ఇసుకలో పాతిన కొబ్బరి బొండాలను సంధ్యా సమయంలో వెలికి తీసి ఆ చల్లని కొబ్బరి నీటిని సేవించేవారు. రాయలవారికి ప్రజల ఆహారాదులూ, వారి జీవన శైలీ బాగా తెలుసనడానికీ ఇదే నిదర్శనం.
కాళహస్తీశ్వర మాహాత్మ్యంతో తెలుగువారి హృదయాలను భక్తిరసప్లావితం చేసిన ధూర్జటి... ఆ పరమేశ్వరుడికి మాంసాహారంతో పాటు, నేరేడు, నెలయూటి, కొండమామిడి, దొండ, ఫాల, నెమ్మి, బరివంక, చిటిముటి, కవిలె, తొడివెంద, తుమికి, జామ, గంగరేగు, వెలగ, మోవి, బలుసు, బీర, కొమ్మి, గొంజ, మేడి వంటి రకరకాల పళ్లనూ నైవేద్యంగా పెట్టాడు. బియ్యం, తేనె, చారు పప్పులనూ నివేదించాడు.
కాలాన్ని బట్టి... కంచంలోకి... మనవాళ్లు అప్పట్లో రుతువులను బట్టి... తీసుకునే ఆహారంలో మార్పు చేర్పులు చేసుకునేవారు. ఆయా కాలాల్లో దాడికొచ్చే అనారోగ్య సమస్యలను ఆహారంతోనే తిప్పి కొట్టేవారు. తెలుగు ప్రాచీన సాహిత్యాధారాల ప్రకారం వారి భోజన పట్టిక ఇది... వర్షాకాలం కలమాన్నము, ఒల్చినపప్పు, నాలుగైదు పొగసిన కూరలు, వరుగులు, పెరుగు వడియాలు, నెయ్యి శ్రావణమాసం: ఆకుకూరలకు ప్రాధాన్యం. గురుగు, చెంచలి, తుమ్మి, లేతగిరిసాకు... ఈ నాలుగు ఆకులను బాగా తరిగి చింత చిగురు కలిపేవారు. తరువాత నూనె పోసి పొడికూర చేసుకునేవారు చలికాలం పునుగు బియ్యపుటన్నం, మిరియపు పొళ్లతోకూడిన ఉడుకు కూరలు, ముక్కుకెక్కు ఆవఘాటుగల పచ్చళ్లు, ఊరగాయలు, పాయసాన్నం, వేడినెయ్యి, ఇవురగాచిన పాలు, బర్రెమీగడ అన్నం, నిమ్మరసం... అల్లపు ముక్కలతో చద్ది వేసవి నులివెచ్చని అన్నం, తియ్యని చారులు, మజ్జిగపులుసు, పల్చని అంబలి, చెరుకురసం, ఎడనీళ్లు, రసావళులు, వడపిందెల ఊరగాయ, నీరుచల్ల, మంచుతో పిసికిన పంచదారలు (ఐసుక్రీములాంటిదేమో?) పేరినమీగడలతో గడ్డపెరుగు |
అది లేని ఇది...
పదహారు - పదిహేడు శతాబ్దాల్లో విదేశీయులతోపాటే మనదేశానికి మిరపకాయలు కూడా వచ్చాయి. అంతకు ముందు మనవాళ్లు వంటల్లో మిరియాల కారం వాడేవారు. పెమ్మయ సింగధీమణీ శతకంలో ‘మిరియములేని కూరయును మెచ్చునెరుంగని వాని ఈవియున్...’ అని చెప్పాడు. అలాగే, వేమన కూడా ‘నేయిలేని కూడు నీయాన కసువది, కూరలేని తిండి కుక్కతిండి’ అని ఘంటాపథంగా అన్నాడు. ఇక గువ్వలచెన్న శతకకారుడైతే ఉల్లి వెల్లుల రుచిని పొగడలేం అంటూనే పొగడ్తల వర్షం కురిపించాడు.
వెల్లుల్లిబెట్టిపొగిచిన
పుల్లని గోంగూర రుచిని పొగడగ వశమా?
మొల్లముగా నూనె వేసుక,
కొల్లగ భుజియింపవలయు గువ్వలచెన్నా
ఉల్లిని తిట్టిన వారి ముక్కు కోసేయాలంటాడు మరో వీరాభిమాని...
ఉల్లిని దూషించిన యా,
గుల్లామునుబట్టి ముక్కు కోయగవలదా
తల్లుండవలయు లేదా
ఉల్లుండవలయు భోజనోత్సవవేళన్
పంచభక్ష్యాల్లో ఒకటైన ద్రవపదార్థాల విషయంలోనూ మన కవులు వెనుకబడలేదు. ప్రౌఢకవి మల్లన తన ‘రుక్మాంగద పరిణయం’లో చెప్పిన పానీయాలివి... ‘శార్కరంబు, సూనజము, గుగ్లు, సుమఘృత, జంబు, నారికేళజంబు, మాధ్వికంబు ఫలమయంబు, గౌడతాళమయము, నాదిగా తనర్చు నాసవములు’.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందరో కవులు ఎన్నెన్నో వంటకాల పేర్లను అక్షరబద్ధం చేశారు. అయితే, వాటిలో అత్యధిక పదార్థాల వివరాలు మనకు తెలియవు. వాటి తయారీ విధానమూ అంతుబట్టదు. నిఘంటువుల్లో కూడా ‘భోజన విశేష్యం’ అని మాత్రమే దర్శనమిస్తుంది. తరతరాల వారసత్వ సంపదలను జాగ్రత్త చేసుకోవడంలో తెలుగు వారి అజాగ్రత్తే ఈ పరిస్థితికి కారణం. ఇప్పటికైనా తెలుగు జాతి అస్తిత్వానికి ప్రతీకలైన వాటి సమాచారాన్ని చరిత్ర కోసం భద్రపరచాలి. ఎందుకంటే, మన సాంఘిక, ఆర్థిక, సామాజిక చరిత్రకు మూలాధారమదే.
* * *