ఆట పాటలే బోధనా పద్ధతులు

  • 2052 Views
  • 4Likes
  • Like
  • Article Share

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనుంది. అభ్యర్థులు తెలుగు సాహిత్యం, భాష, వ్యాకరణ శాస్త్రాలతో పాటు తెలుగు బోధనా పద్ధతుల మీదా ప్రత్యేక దృష్టి సారించాలి.
అంతర్జాల
వినియోగ విస్తరణతో విద్యావ్యవస్థ సరికొత్త విద్యా లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి వచ్చింది. బోధనాభ్యసన ప్రక్రియలో విప్లవాత్మకమైన, నిర్మాణాత్మకమైన మార్పుల ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ కేంద్ర బోధనా పద్ధతులైన వివరణ, ఉపన్యాస పద్ధతులకు స్వస్తి పలికి, విద్యార్థి కేంద్రమైన బోధన పద్ధతులను అమలు చేయాలి. విద్యా తాత్త్విక భావనలు, మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు, సామాజిక- విద్యార్థి అవసరాలను పరిగణనలోకి తీసుకుని విద్యావేత్తలు అనేక ఆధునిక బోధన పద్ధతులను రూపొందించారు. వీటిని భాషా బోధనకు కూడా అన్వయించుకోవచ్చు.
క్రీడా పద్ధతి
క్రీడా మాధ్యమంగా బోధనాభ్యసనాలు సాగించే పద్ధతి ఇది. విద్యార్థులకు ఆయా అంశాల మీద అభిరుచిని కలిగించడానికి, వారి అభ్యసనాన్ని వేగవంతం చెయ్యడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ పద్ధతిని హెన్రీ కాల్డ్వెల్‌ కుక్‌ ప్రతిపాదించారు. 
* క్రీడ ద్వారా భాషాధ్యయనాన్ని సులభతరం చేయవచ్చని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్న విద్యావేత్త.. కాల్డ్వెల్‌ కుక్‌.
* క్రీడా పద్ధతికి విద్యారంగంలో విశేష ప్రాచుర్యాన్ని కలిగించిన వారు పెర్సీనన్‌, గిఫ్రిత్‌, ఫ్రెడరిక్‌ ఫ్రోబెల్‌, మాంటిస్సోరి.
* ‘‘వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఇష్టపూర్వకంగా, ఉల్లాసంగా నిర్వహించే కృత్యం క్రీడ. ఇది అతనికి ఆనందాన్ని కలిగిస్తుంది’’- గలిక్‌

* ‘‘జీవితంలో మున్ముందు దీక్షాభినివేశాలతో కార్యాచరణకు సమాయత్త పరిచే పీఠికా ప్రాయమైన సాధన క్రీడ’’  - కారల్‌గ్రూస్‌
* ‘‘పిల్లల సంపూర్ణాభివృద్ధికి క్రీడా పద్ధతి చక్కటి సాధన’’  - ఫ్రోబెల్‌
* ‘‘క్రీడల్లో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యావిధానం ఉపయోగించుకుంటే బోధన ఫలవంతం అవుతుంది’’ - పెర్సీనన్‌
      అనుకరణ- అభ్యసన- వినియోగం - ఆనందం భాషాభ్యసనంలో అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటాయి. ప్రాథమికదశలో భాషణ, పఠన, లేఖనాలను నేర్పించేటప్పుడు పాఠ్యాంశ బోధనలోను, ప్రాయోగిక వ్యాకరణం బోధించే సందర్భాల్లోనూ క్రీడలను ఉపయోగించుకోవచ్చు. మాధ్యమిక, ఉన్నత దశల్లో సంభాషణా వ్యాసంగాలు, నాటకీకరణ పాఠాలు, వాక్య పరివర్తనలు క్రీడా పద్ధతి ద్వారా చేయించవచ్చు. దీనివల్ల విద్యార్థుల్లో భావనాశక్తి, సృజనాత్మక శక్తి, గ్రహణశక్తి, వివేచన, సహనం, సమయస్ఫూర్తి, స్మృతిజ్ఞానం పెంపొందుతాయి. అయితే, క్రీడాపద్ధతి నేర్చుకోవడం కంటే ఆనందానికి ప్రాధాన్యమిస్తుంది. తరగతి గదిలో క్రమశిక్షణ కొరవడే అవకాశం ఉంది. 
భాషాక్రీడలు
* పద సంబంధమైనవి- పద నిర్మాణం, పద సేకరణ, పదపోరాటం, అంత్యాక్షరి, పదపూరణం.
* వాక్య సంబంధమైనవి- వాక్యనిర్మాణం, ఖాళీలు పూరించడం, వాక్య పరివర్తనం, పొడుపుకథలు, జాతీయాలు, సామెతలు.
* రచన సంబంధమైనది- సంభాషణ రచన, లేఖా రచన, కథా రచన.
* అభినయ గేయాలు, ఏకపాత్రాభినయం, నాటకీకరణం, కథాగేయాలు, కథలు చెప్పడం, కథాపూరణం, పద్య, గేయపఠనం, వక్తృత్వం, ఉపన్యాసం, వాదోపవాదాలు, క్విజ్‌లు కూడా భాషాక్రీడల్లో భాగమే.
మాంటిస్సోరి పద్ధతి
ఇటలీలో వైద్యశిక్షణ పొందిన తొలి మహిళ డా।। మరియా మాంటిస్సోరి. ఈవిడ 1907లో రోమ్‌ నగరంలోని ‘సాన్‌లొరెన్జొ’లో తొలి మాంటిస్సోరి పాఠశాలను ప్రారంభించారు. తర్వాత 1929లో ‘అసోసియేషన్‌ మాంటిసోరి ఇంటర్నేషనల్‌ (ఏఎమ్‌ఐ)ని స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా నేడు మాంటిస్సోరి పద్ధతిలో నడుస్తున్న పాఠశాలలు దాదాపు 8 వేలు. పిల్లల మానసిక వికాస క్రమాన్ని అనుసరించి విద్యాబోధన జరగాలనే సూత్రం మీద మాంటిస్సోరి పద్ధతి రూపుదిద్దుకుంది. ఇందులో ఉపాధ్యాయులు పర్యవేక్షకులుగా ఉంటారు. ఈ పద్ధతిలో పిల్లల ఎదుగుదలకు ప్రధానంగా రెండు అవసరాల మీద దృష్టి సారిస్తారు.. పరిమితులకు లోబడిన స్వేచ్ఛ, పిల్లలకు అవసరమైన వస్తువులను, అనుభవాలను సమకూర్చగల వాతావరణం. 
ఈ విద్యావిధానం లక్ష్యాలు
* జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ శిక్షణను ఇవ్వడం
* శిశువు శారీరకాభివృద్ధికి, మానసికాభివృద్ధికి దోహదం చేయడం
* సాంఘిక పరిజ్ఞానాన్ని, స్వావలంబనను పెంపొందించడం
* విద్యార్థి కేంద్రంగా బోధన జరుపుతూ.. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కల్పిస్తూ.. స్వీయక్రమశిక్షణ అలవర్చడం.

కిండర్‌గార్టెన్‌ పద్ధతి
కిండర్‌, గార్టెన్‌ అనే రెండు జర్మన్‌ పదాలు కలిసి ‘కిండర్‌గార్టెన్‌’ పదబంధం ఏర్పడింది. ‘శిశువులతోట’ అని దీనికర్థం. దీన్నే ‘బాలోద్యాన పద్ధతి’ అంటారు. దీన్ని జర్మనీకి చెందిన విద్యావేత్త ఫ్రెడరిక్‌ ఫ్రోబెల్‌ రూపొందించారు. పిల్లల అవసరాలు, శక్తులు విలక్షణంగా ఉంటాయనే భూమిక మీద ఆయన ఈ పద్ధతికి రూపకల్పన చేశారు. ప్రధానంగా పూర్వప్రాథమిక విద్యార్థుల కోసం ఉద్దేశించిన పద్ధతి ఇది. 
      తోటల్లో లేతమొక్కల్ని పెంచినట్లే శిశువులను కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దాలనేది కిండర్‌గార్టెన్‌ సిద్ధాంతం. 4-6 సంవత్సరాల వయసు పిల్లలకు అవసరమైన సామాజిక అనుభవాన్ని ఈ పద్ధతి కలిగిస్తుందన్నది ఫ్రోబెల్‌ ఉద్దేశం. ఆయన విద్యాతాత్త్విక భావనలోని ప్రధాన అంశాలు నాలుగు.. స్వేచ్ఛాయుతమైన స్వీయ భావ ప్రకటన, సృజనాత్మకత, సామాజిక భాగస్వామ్యం, చాలక ప్రకటన. ‘‘పిల్లలు ప్రారంభదశలో పరిసరాలను అన్వేషిస్తూ తమకు తారసపడిన వస్తువులను వినియోగిస్తూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే వారికి క్రీడ’’ అన్నారు ఫ్రోబెల్‌. క్రీడ పిల్లల్లో స్వీయక్రమశిక్షణను, నియమాలు- క్రమత పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. బడి పిల్లల శారీరక, చాలక నైపుణ్యాలను పెంచడానికి క్రీడలకు ప్రాధాన్యమిస్తూ కిండర్‌గార్టెన్‌ పద్ధతికి ఆయన ఓ రూపమిచ్చారు. దీనికోసం ఫ్రోబెల్‌ ‘గిఫ్ట్స్‌’ పేరిట కొన్ని ఉపకరణాల శ్రేణులను తయారు చేశారు. ఇవి 1 నుంచి 20 వరకు ఉంటాయి.
      కిండర్‌గార్టెన్‌ పద్ధతి ముఖ్య లక్ష్యం పిల్లల ఆరోగ్యం, విద్య. ఇందులో విద్యాబోధన తరగతి పద్ధతిలో జరుగుతుంది. బోధన కాలపరిమితి 30 నిమిషాలు. గిఫ్ట్‌లు, ఆక్యుపేషన్లు, ఆటలు, పాటలు, కృత్యాల సాయంతో జ్ఞానేంద్రి యాలు, కర్మేంద్రియాల ద్వారా విద్యార్థులు పరిజ్ఞానం పొందుతారు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయురాలితో పాటు ఓ పర్యవేక్షకు రాలు తరగతి నిర్వహణలో పాలుపంచు కుంటారు. మొత్తమ్మీద ఇంటికి, బడికి ‘వారధి’గా ఉండి విద్యార్థులను పాఠశాల జీవితానికి సంసిద్ధులను చేసే పద్ధతి ఇది. 
డాల్టన్‌ పద్ధతి
మిస్‌ హెలెన్‌పార్క్‌ హార్ట్స్‌ 1908లో దీన్ని ప్రతిపాదించారు. ప్రతి విద్యార్థీ ఓ ప్రత్యేక వ్యక్తి అని, తన శక్తులకు- అవసరాలకు అనుసంధానం అయ్యే పాఠ్యప్రణాళిక, చక్కటి అభ్యసన వాతావరణం ఉంటే అతను స్వతంత్ర అభ్యాసకుడిగా రూపొందగలడన్నది ఈ పద్ధతి ప్రధాన సిద్ధాంతం. అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రం డాల్టన్‌ నగరంలో 1919లో ఈ పద్ధతిలో హార్ట్స్‌ పాఠశాల నెలకొల్పారు. వ్యక్తి కేంద్రక బోధన పద్ధతి కాబట్టి దీన్ని వ్యక్తి పద్ధతి, వ్యష్టి పద్ధతి అనీ అంటారు. ఇందులో ‘హౌస్‌’ చాలా ముఖ్యమైంది. హౌస్‌ అడ్వయిజర్‌ విద్యార్థుల అభ్యసనంలో కీలకపాత్ర వహిస్తారు. డాల్టన్‌పద్ధతిలో తరగతి గదులు, కాలవ్యవధులు, పరీక్షలు ఉండవు.
ప్రాజెక్టు పద్ధతి
అమెరికాలో వచ్చిన అభ్యుదయ విద్యా ఉద్యమ ఫలితమిది. నిజానికిది బోధనా పద్ధతి కాదు. ఓ విద్యావిధానం. భావి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యం విద్యార్థులకు పాఠశాల ద్వారా లభించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. దీన్నే ‘సమస్యా పరిష్కార పద్ధతి, ప్రకల్పనా పద్ధతి, ఉద్యమ పద్ధతి, ఎత్తుగడ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి’ అనే పేర్లతో పిలుస్తారు. ఈ పద్ధతి జాన్‌ డ్యూయి ప్రతిపాదించిన విద్యాతత్త్వ మూలసూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది. దీని విద్యాసూత్రాలు... పని ద్వారా అభ్యసించడం, తెలిసిన దాన్నుంచి తెలియని దాన్ని అభ్యసించడం, స్వానుభవం నుంచి శాస్త్రజ్ఞానాన్ని పొందడం. జె.ఎ.స్టీవెన్‌సన్‌ 1908లో ఈ ప్రాజెక్టు పద్ధతిని వినియోగించారు. కిల్‌ ప్యాట్రిక్‌ అనే విద్యావేత్త ‘ద ప్రాజెక్ట్‌ మెథడ్‌’ వ్యాసం ద్వారా 1918లో ఈ భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం