మురి‘పాలు’ ఎన్నెన్నో!

  • 1148 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। అవధానం నాగరాజారావు

  • విశ్రాంత తెలుగు అధ్యాపకులు,
  • అనంతపురం,
  • 9866498310
డా।। అవధానం నాగరాజారావు

తెలుగు భాషకు సామెతలు, జాతీయాలు, శబ్దపల్లవాలు పెట్టని ఆభరణాలు. వాణీ పదమంజీర మనోజ్ఞ శ్రవణపేయ నిక్వాణాలు. సామెతలు, జాతీయాల ప్రత్యేకత తెలిసిందే. ఇక రెండు వేర్వేరు అర్థాలు కలిగిన పదాలు ఒక్కటిగా చేరి మరొక కొత్త అర్థాన్నిచ్చేవే శబ్దపల్లవాలు. పల్లవమంటే చిగురు. మరొక నూతన భావాన్ని చిగురింపచేస్తుంది కాబట్టి ఇది శబ్దపల్లవం. అలాంటి శబ్దపల్లవానికి మూలమైన ‘పాలూ, పాల పదార్థాల’ (పద+అర్థం) రుచిని చవిచూద్దాం!
పాలని
కాస్తే మీగడ, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను తదితరాలు తయారవుతాయి. వాటిని నేర్పుగా వండితే పాలకోవా, దూధ్‌పేడ, కలకండ, రసమలై, బాసుంది లాంటి మధుర పదార్థాలు సిద్ధమవుతాయి. ఇదే పాల గొప్పదనం. అందుకే దీన్ని ‘సమతౌల్య’ పదార్థమన్నారు. శరీరపుష్టికీ తుష్టికీ మేలుకూర్చే ఈ పాలే శబ్దపల్లవాల రూపంలో తెలుగుభాషకు చాలా పుష్టినిచ్చాయి.
      పాలు+కాయ.. పాలకాయ. పూర్వం తెలుగు వారిండ్లలో కనిపించేది. చిన్న పిల్లలకు పళ్లు వచ్చే దశలో ఆ బిడ్డలు పళ్ల చిగుళ్ల సలుపు కారణంగా చిగుళ్లు కొరుక్కోవడం లేదా నాలుకో, పెదవులో కొరుక్కుంటూ ఉంటారు. ఆ బాధని తప్పించడానికి చెక్కతో చేసిన చూపుడు వేలు మందమూ, పొడవూ, నునుపుగా ఉండే చిన్న సాధనాన్ని పిల్లల చేతికిచ్చి కొరికించేవారు. దీన్నే పాలకాయ అనేవారు. ఈ చెక్క వాటికి మారుగా తర్వాత కాలంలో మినప పిండి, బియ్యపు పిండి చక్కెర కలిపి కొందరూ, మరికొందరు ఉప్పు కలిపి ఈ పాలకాయ ఆకారంలో చేసేవారు. వాటిని నూనెలో వేల్చి కొయ్య పాలకాయలకు బదులుగా ఈ పిండికాయలను పట్టించేవారు. ఇవి పిల్లలకు ఆరోగ్యాన్నివ్వడమే కాదు, పళ్ల కొరుకుడు అలవాటును తప్పించేవి. నేడు ఇవి కనిపించట్లేదు. పిల్లలందరి నోళ్లలోనూ ప్లాస్టిక్‌ పీకలే నిండిపోతున్నాయి. అవునండోయ్‌ పాలకాయలంటే గుర్తొచ్చింది, పాలపళ్లు తిన్నారా? కాదు.. కాదు చూశారా? చిన్న పిల్లలకు తొలిదశలో వచ్చే పళ్లే పాలపళ్లు. తెల్లగా, చిన్న బియ్యం గింజల్లాగా మిలమిలలాడుతూ అంకురిస్తాయి ఇవి. ‘పాలకడాలు’ కూడా పిల్లలకు సంబంధించినవే. ముఖ్యంగా అమ్మాయిలకు నామకరణం రోజు వెండి, రాగితీగలు కలిపి కడియాలు చేసి వేస్తారు. అవే పాలకడాలు. కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండి, బెల్లం కలిపి చేసే తీపిపదార్థాన్నీ ఇదే పేరుతో పిలుస్తారు. ‘పాలారది’ అని ఇంకో మిఠాయి ఉంది. పాలు, పెసరపప్పు, కొబ్బరి, పంచదారలతో చేస్తారు. ఇక ‘పాలతాలిక’ల రుచిని, ‘పాలకొడిస’(కొండమల్లి)ల పరిమళాన్నీ మర్చిపోగలమా! 
      వినాయక చవితి నాడు ‘పాలవెల్లి’ కింద గణపతిని పూజించే ఉంటారు కదా. ఆ చతురస్రాకార నిర్మాణాన్ని అనంత పాలపుంతలకు ప్రతీకగా చెబుతారు. మామూలుగా అయితే ‘పాలవెల్లి’ అంటే పాలసంద్రం.. లక్ష్మీదేవి పుట్టిల్లు. ఇక మంచి పనుల్లో పాలుపంచుకోవడం చాలామందికి ఇష్టం. పాలు పంచుకోవడమంటే భాగం పంచుకోవడమే కదా! అయినా మనం పాలిచ్చినంత మాత్రాన పోయేదేముంది అంటారా? పాలు+ఇచ్చు.. దీని అర్థమూ భాగమివ్వడమే. ఇంకొకర్థం తల్లి పిల్లాడికి (పిల్లకు) పాలుపట్టడం అనీ వ్యవహారంలో ఉంది. ‘పాలుకివ్వడం’ అని ఇంకో ప్రయోగముంది. కౌలుకివ్వడం అని అర్థం. అన్నట్టు, పాలుపట్టడం అంటే గుర్తొచ్చింది. బాలింతకు పాలుపడలేదేమో అందుకే చంటి బిడ్డకు పాలు పట్టలేక పోతూ ఉందని తల్లులూ బామ్మలూ వాపోతూ ఉంటారు. ఇక్కడ పాలుపడక పోవడమంటే చంటిబిడ్డకు కావాల్సినన్ని పాలు తల్లి దగ్గర లేకపోవడమే. బాలింతకు కాస్త వెల్లుల్లి, ఇంగువ అన్నంతోపాటు తినిపిస్తే పాలు పడతాయంటారు. అయినా ఎవరు వింటారు! మన తెలుగువాళ్లలో ఆధునికం పాళ్లు (పాలు+లు) ఎక్కువ కదా మరి! 
      రైతు పొలంలో జొన్న, సజ్జ, వరి లాంటి కంకుల్ని చిదిమి చూచి ఇంకా పాలు పడలేదు.. ఇంకో వారం పదిరోజులు పట్టొచ్చంటాడు. పాలు పడితేకాని గింజపడి కంకి ముదరదు. కంకి చిదిమినప్పుడు పాలలాంటి తెల్లని ద్రవం కారుతుంది. ఇది సస్యపరమైన ఒక ప్రాకృతిక చర్య. ఇది తెలియనివారు ఏమీ పాలుపోలేదని (తెలియలేదని) బిక్కమొగమేస్తారు. అలాగే, ‘పాలకన్ను’ అని ఓ ధాన్యవిశేషమూ ఉంది. అన్నట్లూ, ‘పాలకత్తి’ తెలుసా? కల్లుగీత కార్మికుల సాధనమిది. బోయిభీమన్న ‘పాలేరు’ (పాలు+ఏరు) నాటకం సుప్రసిద్ధం. దాని సంగతి అలా ఉంచితే, తెలుగువాళ్లలో చాలామంది పలుకుబళ్ల తత్వాన్ని తెలుసుకోవడంలో పాల్మాలుతూ (పాలు+మాలు) ఉంటారు! పాల్మాలడమంటే బద్ధకించడం, సోమరిగా ఉండటం అనే అర్థాలే కాదు, జబ్బు చేయడం అనే అర్థమూ ఉంది. పాల్మాలినప్పటి నుంచి నోరు రుచించడం లేదంటూ ఉంటారు. ఈయన పాలపడ్డామేంట్రా బాబూ! అనుకునే సందర్భాలూ ఎదురవుతుంటాయి కదా! పాలు+పడ్డాడు.. పాలపడ్డాడు.. వాత పడ్డాడు, అనే అర్థంలో వాడుతున్నాం. 
      తెలుగు ద్రావిడ భాషాజన్యమని భాషా శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈ ‘పాలు’ పదార్థం మూలరూపం ‘పాల్‌’. దీన్నే ధాతువంటారు. ఇదే మన భాషలో సందర్భోచితంగా ఇతర పదాలతో కలిసి, ఇన్ని రూ‘పాలె’త్తింది. ఈ పాల్‌ శబ్దం సోదర భాషలు తమిళ, మలయాళాల్లోనూ కనిపిస్తుంది. తమిళులకు ఈ పాలతో ఒక ఏరే ఉంది. అదే ‘పాలార్‌’. మలయాళీలకైతే ఎంచక్కా ఓ ఊరే ఉంది.. అదే ‘పాలక్కాడ్‌’. అక్కడి దాకా ఎందుకంటే, మన మహబూబ్‌నగర్‌ పాతపేరు తెలుసు కదా.. పాలమూరు. ‘పాలు, మోరు (మజ్జిగ) ఒకప్పుడు సమృద్ధిగా ఉన్న ఊరు ఇది’ అంటారు ‘తెలంగాణ పదకోశం’ కర్త నలిమెల భాస్కర్‌. క్షీరరామేశ్వరుడి క్షేత్రం పాలకొల్లు (‘పాలకొలను’ ఇలా మారిందంటారు) కూడా ఉంది మనకి! ఇలాంటి శబ్దపల్లవాలు ఇంకా ఎన్ని ఉన్నాయో బాగా ఆలోచించి, ఈ మాటల ఆటలో మీరూ పాలుపంచుకోవచ్చు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం