నీకే తగురా రంగా నీకే తగురా కృష్ణా

  • 1123 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నాగశేషు

  • నెల్లూరు
  • 9985509053

యశోదమ్మకు ఏమీ అర్థంకావట్లేదు. చుట్టుముట్టిన రేపల్లె భామలందరూ తన ముద్దుల కిట్టయ్య మీద ఎగిరెగిరి పడుతుంటే ఏం చేయాలో ఆమెకు పాలుపోవట్లేదు. చేసిందంతా చేసిన కన్నయ్యేమో ఇప్పుడు అమ్మ చెంగును చాటుచేసుకున్నాడు. 
      ‘‘నిన్న మాపటి వేళ మాకన్నె చిన్న దాన్ని బట్టి/ కన్న తిప్పలుబెట్టి పెదవులు కొరికి పరుగిడొచ్చినాడు/ అమ్మా! తనయుని దుడుకులు తెల్పెదమె తల్లీ!/ తనయుని తప్పులు తెల్పెదమె’’ అంటూ కన్నెర్రచేసింది ఓ ఇంతి! ‘‘అయిదుయేండ్ల బాలుడు వాడిన్ని పనులు సేయనేరడు’’ అంటూ మొదట్లో తన కొడుకును వెనకేసుకొచ్చినా, ఈ ఫిర్యాదును విని తట్టుకోలేకపోయింది యశోద. ‘‘యెంత కొండెకాడవన్న కృష్ణా భామలపై నీకు చలమేలరా?’’ అని నిలదీసింది. అబద్ధాలకోరువి (కొండెకాడు) నువ్వు.. అమ్మాయిల మీద నీకంత ద్వేషమేంటి (ద్వేషానికి పర్యాయపదాల్లో ‘చలము’ ఒకటి) అని అమ్మ గుడ్లురిమినా సరే, ఆ కొంటె కన్నయ్య ముఖమింకా అమాయకంగా ఉంది. పైగా ‘‘చక్కని శ్రీకృష్ణ రమ్మని/ చిక్కితివి నీ ముద్దు తెమ్మని/ రక్కసివలె ముద్దు పెట్టితె/ వొక్కపల్లిటు సోకెనేమొ/ తెలియదే తల్లి తెలియదే’’ అంటూ నేరమంతా ఆ పిల్ల మీదికి నెట్టేశాడు.     
      ‘‘గొల్ల భామలంత గూడి చల్లలమ్మను బోవుచుండగ/ చల్లబానకు సుంకమిమ్మని చిల్లులూ పడగొట్టినాడు అడుగావే తల్లీ’’ అంటూ గొంతెత్తింది ఇంకో ఇల్లాలు. ‘‘చిల్లులూగ సమయమున/ వడగండ్ల వర్షమొచ్చి బానలు/ చిల్లులూ పడగొట్టెనేమొ/ చిల్లరాపనులెరుగతల్లి తెలియాదె తల్లి’’ అని యథాలాపంగా భుజాలెగరేశాడు బాలకృష్ణుడు. ‘‘నోటి నిండా విడెము వేసుక/ నీటుగా నిలుచున్న కృష్ణుడు/ దారిపోయే చిన్నదానిపై సూటిగా వుమ్మేసినాడు’’- తాంబూలం (విడెము) వేసుకుని నీటుగా (ఇది అచ్చతెలుగు మాట- ‘శృంగార గర్వం, మురిపెం’ దీనికి సామాన్య అర్థాలు. కోస్తాంధ్ర, రాయలసీమ మాండలికాల్లో ‘టెక్కు, డంభం’ అని అర్థం) నిల్చున్న ఆ శ్యామలాంగుడు, దారినపోయే పిల్ల మీద ఉమ్మేశాడని నెత్తికొట్టుకుంది ఇంకో అతివ. ఇలాంటి చిల్లరబుద్ధులు తన బిడ్డకు ఎప్పటి నుంచి అబ్బాయో తెలియని యశోద, ‘‘చిల్లరాబుద్ధులు నీకు కొంటె కాండ్రెవ్వారు నేర్పిరి క్రిష్ణ?’’ అని అడిగింది. అల్లరి నేస్తాలతో తిరిగి తన పిల్లాడు చెడిపోతున్నాడని బాధపడింది. అయినా సరే, ఆమె ముద్దుల కొడుక్కి మాత్రం చీమకుట్టినట్టయినా లేదు! ‘‘వెండికొయ్య నూదుకుంటూ/ వేడుకాతో ఆడుకుంటు ఆట బడిన కావరాన గోడపై వుమ్మేస్తి తల్లి’’- చక్కగా వేణువు ఊదుకుంటూ ఆటల్లో పడి ఏదో గోడ మీద ఉమ్మేశాను కానీ, ఈ సంగతి నాకు తెలియదమ్మా అన్నాడు. గోపికల చీరలెత్తుకుపోయి చెట్టెక్కి కూర్చోవడం గురించి అడిగితే... ‘‘చెట్టుపై కూర్చుండి నేను పండుతినే సమయమందు సుడిగాలి వచ్చి/ చీరలన్నియు చెట్టుపైబడ నేసెతల్లి తెలియదె తల్లి తెలియదె’’ అని గోడకట్టినట్టు అబద్ధమాడేశాడు.
      గోపాలుడి గడుసుదనాన్ని కళ్లకుకట్టే ఈ సందర్భాన్నే కాదు, ఆ మాధవుడి లీలలన్నింటినీ తమదైన శైలిలో పాడుకుంటూ వస్తున్నారు మన పల్లీయులు. శ్లోకాలు, పద్యాల రూపంలో పండితులు ఆస్వాదించిన భాగవత మాధుర్యాన్నే పాటగా జుర్రుకున్నారు జానపదులు
బాలగోపాల రార
‘‘ఎవ్వరే నా స్వామి నవ్వుల్ల తండ్రి/ నవ్వుముఖముతో నా తండ్రి కృష్ణా’’ అంటూ ప్రతి తెలుగు తల్లీ తన బిడ్డను ఆ కన్నయ్యతో పోల్చుకుంటుంది. ‘‘ఏడవకు నాతండ్రి ఏడవకు కృష్ణా/ పాడి యూచెద నిన్ను బాలగోపాలా’’ అని జోల పాడుతుంది. ‘‘బాలగోపాల రార ఉయ్యాల లూగ/ బాలగోపాల రార పాలూ వెన్నారగించా’’, ‘‘లాలి కృష్ణయ్య నీల మేఘశ్యామన్న/ పాలా గోపాలన్న పవ్వళించగ రావయ్య/ శృంగారించిన బంగరు ఉయ్యాలలో / ఆదిశేషుని పాన్పుమీద పవ్వళించగ రావయ్యా’’ అంటూ నేరుగా ఆ శ్రీకృష్ణుణ్నే ఆహ్వానించే అమ్మలూ లేకపోలేదు. 
      పిల్లలకు లాలిపాడటం సహజం. గోవిందుడు అందరివాడు కాబట్టి ఆయన్ను ఉద్దేశించిన ఇలాంటి పాటలు ఎక్కువగా ఉండటమూ సాధారణమే. కానీ, బాలగోపాలుడికి కాకుండా మదనగోపాలుడికి పాడే లాలి పాట తెలుసా! ఇదే మరి తెలుగు జానపదుల ప్రత్యేకత!! 
లాలి శ్రీ జనలోల లీలా వినోదా
లాలి ద్వారకపురి బాలగోపాలా...
తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వేసి
నాలుగూ వేదములు గొలుసులమరించీ
బలువైన ఫణిరాజు పాన్పులమరించీ
చిత్తమనియేటి దూలములు వేసి..
అందముగ జాంబవతి చందనము పుయ్య
పొందుగా కాళింది పూవులందియ్య
మందయానయు రాధ మడుపులందియ్యా
ఇందుముఖి లక్షణా వింజామరెయ్యా...
చుట్టు గోప స్త్రీలు తొట్టెనూచంగా
కోట రంగారాజు కోర్కెలొసగంగా... 

      ప్రధాన స్రవంతి సాహిత్యం పెద్దగా పట్టించుకోని పాత్రలకు సైతం పట్టంకట్టడంలో జానపదులు ఎప్పుడూ ముందుంటారు. దీనికి ఈ పాటే ఓ నిదర్శనం. జాంబవతి, కాళింది, లక్షణ లాంటి విస్మరణకు గురైన శ్రీకృష్ణుడి ఇల్లాళ్లతో పాటు రాధను, గోపికలను పురమాయించి ఆ లీలామానుషవిగ్రహుడికి లాలిపాడించడం మన పల్లీయులకే చెల్లింది. ఇంతకూ ఆ మాధవుడు ఎక్కడ పవళించాడట! బ్రహ్మాండాన్నే తొట్టిగా చేసుకుని, నాలుగు వేదాలనే గొలుసులుగా అమర్చుకుని, ఆదిశేషుణ్ని మెత్తగా మార్చుకుని సేదదీరాడట. ఈ భావం వింటూంటే ‘‘తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన’’ అంటూ కావేటి రంగడికి అన్నమయ్య పాడిన లాలి గుర్తొస్తుంది. అందులో ‘‘వేదములే చేరులై వెలయంగా శేషుడే/ పాదుకొను తొట్టెలై పరగగాను/ శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై / సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు’’ అంటాడు ఆ పదకవితా పితామహుడు. ఆదిశేషుడు ఉయ్యాలగా, నాలుగు వేదాలు దానికి తాళ్లుగా మారిన తర్వాత.. అందులో శ్రీలక్ష్మితో కలిసి రంగనాథుడు సేదదీరుతున్నాడన్నది ఆయన భావన. వేదాలను ఉయ్యాల గొలుసులుగా అమర్చిన జానపదులను చూసి అబ్బురపడి అన్నమయ్య ఈ భావాన్ని తన పదంలోకి గ్రహించాడా? లేదా అన్నమయ్య సంకీర్తనా ప్రభావంతో ఈ పాటను కట్టుకున్నారా సామాన్యులు? ఆదానప్రదానం ఎటునుంచి ఎటైనా ఉండవచ్చు!
వసుదేవ పుత్రుడమ్మా!
పెద్దవాళ్లు ఏది చేయవద్దని చెబుతారో.. పిల్లలు అదే చేస్తారు! ‘‘కాళాంగి దారి మడుగు- కాళాంగి దారి మడుగు/ పోబోకురా కృష్ణ - రాబోకురా కృష్ణ’’ అని యశోదమ్మ కూడా చెప్పింది. ఎందుకని? ‘‘వానలు కురవంగ వంకలు దొర్లంగ పామూసేరున్నాది’’ కాబట్టి! కానీ, కృష్ణుడేం చేశాడు? అక్కడికే వెళ్లాడు. కాళీయమర్దనం చేసి మరీ వచ్చాడు! ఇంతటి ఘటికుడు కాబట్టే ‘‘ఎవరైన భయములేదే’’ అంటాడు. ఇలాంటిదే మరో సందర్భంలో. ‘‘మంచిపని చేయకుంటే గొల్లభామా నన్ను మాధవుడందురంటే పల్లవాధరీ’’ అని తన అవతార రహస్యం ప్రకటిస్తాడు ఇంకోచోట! ‘పల్లవాధర’ అంటే స్త్రీ. ‘‘రేపల్లె వాడలాకు క్రిష్ణమూరితీ నీవు ఏమి పనికొచ్చినావు చిన్నిమాధవా/ రేపల్లె వాడలాకు గొల్లభామా నేను పాలు పెరుగు వెన్నకొస్తి పల్లవాధరీ’’ అన్నది ప్రసిద్ధ కోలాటం పాట. 
      కోలాటమాడేవారు ఎక్కువగా పాడేది కృష్ణుడి పాటలే. కృష్ణాష్టమి నాడు ఎక్కువగా వీటి ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. ఇంటి ముందు గోపబాలుడి అడుగులను దిద్దితీర్చడం నుంచి ఇంట్లోని చిన్నారులతో కృష్ణుడు, గోపిక, రాధ వేషాలు ధరింపజేయడం వరకూ... ఊరి బయల్లో ఉట్టి కొట్టడం నుంచి గుళ్లో భజనలు చేయడం వరకూ జన్మాష్టమి అంటే చాలు! ఆబాలగోపాలమంతా కృష్ణభక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. శ్రీకృష్ణజనన వృత్తాంతాన్ని ఇలా పాడుకుంటూ తరిస్తుంది.
కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగా/ శ్రీరంగ రంగ రంగా నినుబాసి యెట్లు నేమరచుందురా!!/ కంసుణ్ని సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు/ 
దేవకీ గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను!!/ ఏడురాత్రులు ఒకటిగా ఏక రాత్రిని జేసెను/ ఆదివారం పూటనూ అష్టమి దినమందు జన్మించెను!!/ తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చు ననుచు/ యెదురుకాళ్లను బుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు!!/ తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ని యెత్తుకొనుచు/ అడ్డాలపై వేసుకు ఆ బాలు చక్కదనము చూచెను!!/ వసుదేవ పుత్రుడమ్మా ఈబిడ్డ వైకుంఠవాసుడమ్మా/ నవనీత చోరుడమ్మా ఈబిడ్డ నందగోపాలుడమ్మా!!

      ‘‘పైకొని చూడరో వుట్లపండుగ నేఁడు’’ అంటూ జన్మాష్టమి నాడు తిరుమలలో నిర్వహించే ఉట్ల పండగను వర్ణిస్తూ శ్రీకృష్ణ జనన విశేషాలను చెబుతాడు అన్నమయ్య. ‘‘ఆది కాలమునఁ గృష్ణు డవతరించినయట్టి/ ఆదట  శ్రావణ బహుళాష్టమాయను/ దాదాత రోహిణినక్షత్రము గూడె నడురేయి/ సాధించ లోకులకెల్లా జయంతియాయను’’ అంటాడు. ‘‘నీకే తగురా రంగా నీకే తగురా కృష్ణా/ దీనుల రక్షింప బిరుదు దీన దయా  దేవ దేవ’’ అంటూ మనసారా దండంపెట్టుకుంటూ కృష్ణ జయంతిని అంగరంగవైభవంగా జరుపుకుంటారు జానపదులు.  
      ‘కంసవధ’ ఘట్టమైతే ఓ బయలు నాటకంగా పల్లెల్లో సుప్రసిద్ధం. ముఖ్యంగా తెలంగాణ చిందు యక్షగాన కళాకారులు దీన్ని విరివిగా ప్రదర్శిస్తుంటారు. పాటలు పాడుతూ, కథ చెబుతూ, సంభాషణల రూపంలో నాటకాన్ని నడిపిస్తూ అద్భుతంగా ప్రదర్శన ఇస్తారు. అసలు చిందు యక్షగాన కళారూపమే ఓ ప్రత్యేక అధ్యయనాంశం. దాని సంగతి అలా ఉంచితే, పారిజాతం కోసం పట్టుబట్టి సాధించుకోవడమే కాదు, పెనిమిటితో కలిసి రిపుని గెల్చిన సత్యభామ మీద అయితే ‘‘ఒయ్యారమెందుకే ఓ సత్యభామా/ వద్ద కృష్ణుడు లేని ఒయ్యారమేలా?’’ లాంటి జానపదాలు కోకొల్లలు. నరకాసురుని వధించి లోకాన్ని వెలుగులో ముంచేసిన దీపావళి పండుగ, ఆ సత్యాకృష్ణుల సంవాదాల నుంచి రాధాకృష్ణుల ప్రణయపాటల దాకా ఇంకా ఎన్నెన్నో పాటలు! అన్నీ తెలుగుతోటపై కురిసిన కృష్ణపక్షపు వెన్నెలలే! ‘‘కిష్నా కరునలోల/ గోవర్దన గిరిదర గోపాలా/ నందకుమార నవనీతశోరా/ నారాయణ నిన్నే నమ్మితిరా/ ఆపద్బాందవ ఆనంద రాచ్చక/ ఆదరించరా మా పాండురంగా/ పచ్చివాయనా పాండవపచ్చ/ మమ్మాదరించవా మాపాలిదేవ/ కిష్నా కరునలోల/ గోవర్దన గిరిదర గోపాలా’’ అంటూ తమదైన భాషలో కైతగట్టి కిట్టయ్యకు కోట్లాది పల్లె గుండెలు అర్పించిన నాద నైవేద్యాలే!! 


వెనక్కి ...

మీ అభిప్రాయం