జానపదమే ఆయన ప్రాణం

  • 440 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొండం రుక్మిణీనర్సింహారెడ్డి

నూరేళ్లు పైబడిన వయసులోనూ వారం రోజులు పాటు ఏకధాటిగా జానపద కథలు చెప్పి, ఔరా! అనిపించుకున్న జానపద కళా దిగ్గజం తండ భిక్షం. ప్రాచీన జానపద కళారూపం ‘పటం కథ’ చెప్పడంలో ఆయన ప్రత్యేకతే వేరు. ఎన్నో తాళపత్ర గ్రంథాలు సేకరించడంతో పాటు స్వయంగా కొన్ని రాశారు కూడా. భిక్షం స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లి. తల్లిదండ్రులు మల్లమ్మ, వెంకటకిష్టయ్య. తొమ్మిదో ఏట నుంచే ఆయన జానపద కళల మీద ఆసక్తి పెంచుకున్నారు. పన్నెండో ఏట నుంచే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. అయిదు మందితో ఓ కళా బృందంగా ఏర్పడి దేవరపండగలప్పుడు సౌనమ్మకథ, కాటమరాజు కథ, కంసుని కథ, కృష్ణభాగవతం, గంగాతర్క సంవాదంతో పాటు వివిధ జానపద కథలను వినిపించేవారు. జానపద కళాకారుడిగా ఆయన ప్రస్థానం సుదీర్ఘంగా తొమ్మిది దశాబ్దాలు కొనసాగింది. వివిధ ప్రాంతాల్లో వందలకొద్దీ ప్రదర్శనలిచ్చారు. దేవరపండగలు, లింగమంతుల జాతర, గంగమ్మ జాతరలకు గురువుగా ఆయన ప్రసిద్ధం. భిక్షం తన దగ్గరి తాళపత్ర గ్రంథాల్లోని కథలకు అనుగుణంగా చిత్రాలను రూపొందించి కళా ప్రదర్శనలు ఇచ్చేవారు. జానపద కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను ‘ప్రతిభ’ పురస్కారంతో సత్కరించింది. తాళపత్ర గ్రంథ సేకరణకుగానూ రాష్ట్ర పురావస్తు శాఖ సన్మానించింది. తుదిశ్వాస వరకు కళాప్రదర్శనలు ఇస్తూనే ఉన్న భిక్షం 106 ఏళ్ల వయసులో అక్టోబరు 1న స్వర్గస్థులయ్యారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం