తెలుగే గెలుపు సాధనం

  • 407 Views
  • 0Likes
  • Like
  • Article Share

    క్రాంతికుమార్‌ కొలిశెట్టి

  • సూర్యాపేట
  • 9652527788
క్రాంతికుమార్‌ కొలిశెట్టి

అమ్మఒడిలోంచి బడిలోకి అడుగు పెట్టగానే పిల్లల మీద పిడుగులు పడుతున్నాయి. ఆంగ్లంలోనే మాట్లాడాలి.. ఆంగ్లంలోనే ఆలోచించాలంటూ ఆ పసి మెదళ్ల మీద నిర్దాక్షిణ్యంగా ఒత్తిడి పెంచేస్తున్నారు చాలామంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. ఏం.. ఎందుకు అంటే అలా చేస్తేనే ఆంగ్ల భాష వస్తుంది; అది వస్తేనే వాళ్ల భవిష్యత్తు బాగుంటుందని వాదిస్తారు! ఆంగ్లం బోధనా మాధ్యమంగా ఉన్నంత మాత్రాన చిన్నారులకు ఆ భాషలో పట్టుపెరగదని, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అమ్మభాషలో చదువుకుంటేనే వాళ్లలో నిజమైన నైపుణ్యాలు వికసిస్తాయని పరిశోధకులు, మేధావులూ ఎంతగా మొత్తుకుంటున్నా వాళ్లు వినిపించుకోవట్లేదు. పైగా తెలుగు మాధ్యమాన్ని తేలిగ్గా తీసిపారేస్తున్నారు. కానీ, మనదైన భాషలోనే చదువుకుని అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్లెందరో ఉన్నారు. అలాంటి వారి విజయగాథలు నిత్య స్ఫూర్తిదాయకాలు. అమ్మభాషతోనే ఎదిగిన యువకెరటాల్లో హైదరాబాదు ఐఐటీ ఆచార్యులు నిశాంత్‌ దొంగరి ఒకరు. తన విజయప్రస్థానం తెలుగుతోనే ప్రారంభమైందని చెబుతారాయన.
      నిశాంత్‌ పాఠశాల విద్య మొత్తం తెలుగులోనే పూర్తి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఉపకారవేతనాలు, పురస్కారాలు సొంతం చేసుకున్నారు. వివిధ దేశాల్లో పరిశోధనలు చేసి, ప్రస్తుతం మాతృభూమి సేవకు అంకితమయ్యారు. హైదరాబాదు ఐఐటీలో పాఠాలు చెబుతూనే, అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలకు సేవలందిస్తున్నారు. ‘‘ఆంగ్ల భాషను నేర్చుకోవాలి కానీ... దాన్ని సంస్కృతిగా మార్చుకుంటే మనకే నష్టం. చిన్నారుల మీద ఇతర భాషలను బలవంతంగా రుద్దితే వారు సహజత్వాన్నీ, సృజనాత్మకతను కోల్పోయే ప్రమాదం ఉంది. పాఠశాల విద్యను మాతృభాషల్లోనే అందిస్తున్న దేశాలు సాంకేతిక, సృజనాత్మక రంగాల్లో అందరికంటే ముందున్నాయి’’ అంటారాయన. 
      సెప్టెంబరు 2, 1986న జన్మించిన నిశాంత్‌ స్వస్థలం సూర్యాపేట జిల్లా అన్నారం. బంధుమిత్రుల పిల్లలు ఆంగ్లంలోనే చదువుతున్నా, ఆంగ్ల మాధ్యమంలో చదివించే ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ ఆయన తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లల్నీ పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమంలోనే చదివించారు. ఇంటర్లో ఆంగ్ల మాధ్యమంలో చేరిన నిశాంత్‌, మొదట్లో కొంత ఒత్తిడికి గురయ్యారు. దాన్ని అధిగమించడానికి కొన్ని రోజులు తెలుగు మాధ్యమం తరగతిలో కూర్చొని పాఠాలు వినేవారు. పాఠ్యాంశాలను తెలుగు నుంచి ఆంగ్లంలోకి సొంతంగా తర్జుమా చేసుకునేవారు. అలా నెల.. నెలన్నర రోజుల్లోనే ఆంగ్లం మీద పట్టు సాధించారు. ఆ తర్వాత బొంబాయి ఐఐటీలో సీటు సాధించి, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. తెలుగు మాధ్యమం విద్యార్థులు ఒత్తిడి, ఆత్మన్యూనత భావంతోనే వెనకబడుతున్నారని.. ప్రణాళికాబద్ధంగా చదివితే అందరికంటే ముందు ఉంటారన్నది ఆయన అభిప్రాయం. బొంబాయి ఐఐటీలో ఉన్నప్పుడే.. ప్రాంగణ ఎంపికల్లో జర్మనీలోని ఓ పరిశ్రమలో నిశాంత్‌కు ఉద్యోగం లభించింది. ఇక్కడ పనిచేస్తుండగానే ప్రతిష్ఠాత్మక మేరీక్యూరీ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. దాంతో మాస్టర్స్‌ చదవకుండానే బ్రిటన్‌లోని  స్ట్రాత్‌క్లైడ్‌ విశ్వవిద్యాలయంలో (గ్లాస్గో) పీహెచ్‌డీలో చేరారు. మూడేళ్లలో దాన్ని పూర్తిచేసి, అక్కడే అధ్యాపకుడిగా సేవలందించారు. 2013 నుంచి ఐఐటీ హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 

అన్నయ్య కూడా అంతే!
నిశాంత్‌ అన్న నిఖిల్‌ అఖిల భారత సర్వీసు అధికారి. భారతీయ రైల్వే మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నారు. ఈయనకీ అమ్మభాషంటే చాలా ఇష్టం. సివిల్స్‌ పరీక్షల్లో తెలుగును ఓ ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. మాతృభాషలో భావవ్యక్తీకరణకు ఎక్కువ అవకాశం ఉంటుందన్న కారణంతో మెయిన్స్‌, ఇంటర్వ్యూలను కూడా తెలుగులోనే పూర్తి చేశారు. సివిల్స్‌ పరీక్షలకు అవసరమైన సమాచార వనరులు, సంప్రదింపు గ్రంథాలు తెలుగులో కాస్త తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను తనదైన కృషితో అధిగమించారు నిఖిల్‌. ఆంగ్లంలో లభించే మెటీరియల్‌ను తెలుగులోకి అనువదించుకుని, అధ్యయనం చేశారు. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి, ‘ఐఆర్‌పీఎస్‌’కు ఎంపికయ్యారు.

పుస్తక ప్రేమికుడు
నిశాంత్‌ కేవలం బోధనకే పరిమితం కాలేదు. డీఆర్డీవో చేపడుతున్న వ్యూహాత్మక క్షిపణి పరిశోధనల్లో భాగం పంచుకుంటున్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిలబస్‌ ఎంపిక కమిటీ సభ్యుడిగా... సాంకేతిక సలహాదారుగా సేవలందించారు. వివిధ కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో పరిశోధకుడిగా.. సలహాదారుగా ఉన్నారు. సొంతంగా ‘ప్యూర్‌ ఎనర్జీ’ పేరిట అంకుర సంస్థను స్థాపించి... అత్యాధునిక సాంకేతికత కలిగిన సౌర విద్యుత్‌ పరికరాలను అందిస్తున్నారు. నిశాంత్‌ పరిశోధనలు 20 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, ఇటలీలతో పాటు మరో పన్నెండు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో ఆయన పత్ర సమర్పణలు చేశారు. బోధన, పరిశోధన రంగాల్లో నిశాంత్‌ కృషికి అనేక గౌరవాలు లభించాయి. మేరీక్యూరీ ఫెలోషిప్‌తోపాటు.. మేరీక్యూరీ ప్రైజ్‌ అవార్డు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి ‘యువ శాస్త్రవేత్త’, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ నుంచి ‘స్ఫూర్తిదాయక అధ్యాపకుడు’ పురస్కారాలను అందుకున్నారు.  
      చదువుకుంది మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అయినా, నిశాంత్‌కు తెలుగు సాహిత్యం అంటే ఎనలేని అభిమానం. సినారె, కాళోజీ, శ్రీశ్రీ, చలం, అంపశయ్య నవీన్‌ రచనలను ఇష్టపడతారు. తన బ్లాగు, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో కవితలూ రాస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా నిశాంత్‌ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని బోధిస్తుంటారు. ‘‘మన ఎదుగుదలలో భాష, సంస్కృతులదే కీలకపాత్ర. విద్య, పరిశోధన, ఉద్యోగాల్లో భాగంగా అనేక దేశాలకు వెళ్లాను. అభివృద్ధిలో ముందున్న ఆ దేశాలన్నీ విద్యను తమవైన మాతృభాషల్లోనే బోధిస్తున్నాయి. ఆ దేశాలు మాతృభాషను జాతి ఆత్మగౌరవంగా గుర్తిస్తున్నాయి. జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఫిన్లాండ్‌, స్పెయిన్‌, స్వీడన్‌, చైనా లాంటి దేశాల్లో అన్ని రంగాల్లో మాతృభాషనే వినియోగిస్తారు. తమ దగ్గరకి వచ్చే విదేశీయులు తమ భాషను నేర్చుకోవాలని వాళ్లు ఆశిస్తారు. జర్మనీలోనైతే పెద్దపెద్ద ప్రైవేటు సంస్థలూ తమ విదేశీ ఉద్యోగులు జర్మన్‌ భాషను నేర్చుకునే దిశగా ప్రోత్సహిస్తాయి. అందుకు తగ్గ ఏర్పాట్లూ చేస్తాయి. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఏ స్థాయి ఉద్యోగులైనా సరే, జర్మన్‌ భాషలోనే మాట్లాడతారు. సమావేశాలనూ అందులోనే నిర్వహిస్తారు. మన దగ్గర మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం! ఇది మారాలి. అలాగే, కాలానుగుణంగా కొత్త పదాలను చేర్చుకుంటూ ఉంటేనే ఏ భాష అయినా సజీవంగా ఉంటుంది. తెలుగులో పదసృష్టి కోణంలో ‘ఈనాడు’ మాత్రమే కృషిచేస్తోంది. ప్రభుత్వాలు కూడా తెలుగు బోధించే, చదివేవారికి ప్రత్యేక గౌరవం కల్పించాలి. ఉద్యోగ, ప్రవేశ పరీక్షల్లో ఆంగ్ల నైపుణ్యం మీద కనీస మార్కుల నిబంధన పెట్టినట్టుగానే.. తెలుగులో నైపుణ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లలకు ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే బోధించాలి. ఆంగ్లం నేర్చుకోవాలి కానీ దాన్నే జీవనవిధానంగా మార్చుకోకూడదు’’ అనే నిశాంత్‌ ఓ అచ్చ తెలుగు చైతన్యజ్యోతి. అమ్మభాష వినియోగానికీ, అభివృద్ధికీ విలోమానుపాత సంబంధాన్ని అంటగట్టేవాళ్లు.. ఇలాంటి విజేతలను చూసైనా తమ ఆలోచనలను మార్చుకుంటారా? రంగం ఏదైనా సరే, అభివృద్ధికి అమ్మభాషే చోదకశక్తి అని గుర్తిస్తారా? 


వెనక్కి ...

మీ అభిప్రాయం