తందానా తందానా తాని తందనాన!

  • 1775 Views
  • 24Likes
  • Like
  • Article Share

    గణేశ్‌ బెహరా

  • వాటపాగు, శ్రీకాకుళం జిల్లా
  • 7732097027
గణేశ్‌ బెహరా

జుం జుం తధింత! జుం జుం తధింత!
జుం జుంత! ధింత జుం జుంత! 
తక తక్కిట్ట! తక్కిట తక్కిట్ట!

      గుమ్మెటల మీద వంతల వేళ్లు నాట్యం చేస్తుంటాయి. ‘త! ఝణం తకత! ఝణం తకత!’... కడలి కెరటాల ఘోషలా ఆ దరువు సాగిపోతుంటుంది. 
వినరా భారత వీరకుమారా 
విజయము మనదేర, 
వినరా ఆంధ్రుడ పల్లనాటి 
ఘన వీరచరిత నేడు..

      తంబుర మీటుతూ ఏ పల్నాటి యుద్ధం కథో ప్రారంభిస్తాడు కథకుడు. ‘భళానంటి భాయి తమ్ముడా- సై భాయి భళానోయి దాదానా’ అంటూ వంతలు ఊపుతెస్తారు. 
పట పటపట పండ్లుగొరుకుచు - పటుతర గతివేగ
కటకట కటకట కోరలొరిపిడికి - చిటపటయనెనిప్పుల్‌
రెట్టలు దట్టుచు అరేరేరేయని - మిట్టపడుచువేగ
పొట్టిమీసములు పట్టిదువ్వి - కునుబొమలు ముడియబట్టి
పఠాకత్తులు కఠారుబాకులు - తటాలనందుకొని
పెఠిల్లుమని కక్కటిల్లుచును - దిక్తటంబు లదరగను
గండ్రగొడ్డండ్లు కత్తులుబాణా - కర్రలు చేబూని
వేండ్రమైన రోకండ్లు గుతపలును - బిండివాలములను
తళతళ నాకసమందు మెరియగా - తలపడె నిరువాగు
కరులు సేనలను నురుమాడుచు - మున్ముందు కేగుచుండు
రణభేరి ధణధణలకు ధరణి - దద్దరిల్లుచుండ
శరవేగంబున శత్రుసేనలో - చొరబడి బాలుండు
ధరణిమీద నరివీరులతలలు - తరుగుచు బాలుండు
విచ్చుకత్తి నరి వీరులరొమ్ముల - కుమ్మిచిమ్ముచుండ
గుండెలు ప్రేవులు వొక్ముమ్మడిగా - తుండెములైజార
కొండలరీతిగ శవములన్నియు - గుట్టలు బడుచుండ
నెత్తురు చిమ్ముచు తలలు మొండెములు - దొర్లాడుచునుండ
శత్రుసేనలు బెదరి జెదరెను - చెట్లకు గుట్టలకును

      ముందుకూ వెనక్కీ కదులుతూ, పళ్లు పటపట కొరుకుతూ, కళ్లలో రౌద్రం కురిపిస్తూ కథకుడు ఉచ్ఛస్థాయిలో కథ చెబుతుంటే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చివరికి ‘తక ఝ్ఝంత ధింత...’ అంటూ గుమ్మెట మీద ముక్తాయింపు పలికించి ఆ పూటకు సెలవు తీసుకుంటారు ఆ కళాకారులు. ఇది ‘బుర్రకథ’. తెలుగునాడును కొన్ని దశాబ్దాల పాటు అలరించిన కళారూపం. ఇప్పటికీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్న అచ్చమైన తెలుగు కళాప్రవాహం. తెలుగునాట చోటుచేసుకున్న ఏ సామాజిక మార్పులోనైనా బుర్రకథ తనదైన పాత్ర పోషించింది. ప్రజలను చైతన్యవంతులను చేసింది. స్వాతంత్య్రోద్యమం నుంచి అక్షరాస్యతా కార్యక్రమం వరకూ గుమ్మెటలు మోగని సందర్భం లేదు. కాబట్టే బుర్రకథ కళాకారులు గండపెండేరాలు తొడిగించుకున్నారు. వాడవాడలా సన్మానాలూ పొందారు. 
యక్షగానమే మూలం
తంబుర (తంత్రి+బుర్ర) నుంచే ‘బుర్రకథ’కు ఆ పేరు వచ్చింది. ‘ఢక్కీకథ, గుమ్మెటకథ, తంబురకథ, తందానకథ’ అనే పేర్లూ ఉన్నాయి. బుర్రకథ పితామహుడు నాజర్‌ ‘‘సోదర ఆంధ్ర వీరుల్లారా... జోడు గుమ్మెటలు తాధిమి యనగ/ తోడుగ వంతలు ఆడిపాడగా/ రాగతాళగీతాది నృత్యముల తంబురకథ వినుడీ’’ అనేవారు. వాస్తవానికి ఈ బుర్రకథ ప్రాచీనమైందే. యక్షగానం దీనికి మాతృక. దాన్నుంచి వచ్చిన జోడు వంతల జంగం కథల స్ఫూర్తితో బుర్రకథలు రూపురేఖలద్దుకున్నాయి. 
      ‘తందాన కథలు’ పేరిట కాకతీయుల కాలం నాటికే బుర్రకథలు ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్ర’, శ్రీనాథుడి ‘కాశీఖండం’లో తందాన పదాల ప్రస్తావన కనిపిస్తుంది. నాటి ఓరుగల్లులో ‘తందానలు’ మార్మోగేవని వినుకొండ వల్లభుడి క్రీడాభిరామంలోని ‘అకలంక స్థితి గోరి కొల్చెదరు... తకదుందుమ్ములు తాళముల్‌ జవనికల్‌ తందానలమ్మయ్యకున్‌’ పద్యం సాక్ష్యమిస్తుంది. క్రీడాభిరామంలోని మరో పద్యం ‘ద్రుత తాళంబున వీర గుంభి తకధుం ధుం ధుం కిటాత్కార సం/ గతి వాయింపుచు...’  కూడా బుర్రకథ సంబంధితమైనదేనంటారు ప్రముఖ రచయిత, రంగస్థల విమర్శకులు శ్రీనివాస చక్రవర్తి. ఆయన అభిప్రాయం మేరకు తొలి తెలుగు బుర్రకథ... శ్రీనాథుడి ‘పల్నాటి వీరచరిత్ర’. అయితే, ఈ కళారూపం ఓ స్థిరమైన రూపాన్ని సంతరించుకుంది మాత్రం 1940ల్లోనే. 
      యక్షగాన సంప్రదాయాలను, జంగం కథల చాతుర్యాన్ని మేళవిస్తూ నేటి బుర్రకథలకు ప్రాణంపోసిన వ్యక్తి నాజర్‌. విస్తృతంగా ప్రదర్శనలు ఇస్తూ ఈ కళారూపాన్ని ప్రజలకు చేరువ చేశారు. ప్రధాన కథకుడు, ఇద్దరు వంతలు ప్రత్యేకమైన దుస్తులు ధరించడం, వంతల్లో ఒకరు సమకాలీన రాజకీయాల మీద వ్యాఖ్యానించడం తదితర సంప్రదాయాలకు ఆయనే ఆది. అందుకే ఆయన ‘బుర్రకథ పితామహుడు’ అయ్యారు. ఇక వంతల్లో రెండో వ్యక్తి పిట్టకథలు చెబుతూ జనాన్ని నవ్విస్తూంటాడు. ప్రేక్షకులకు విసుగు రాకుండా అలరించడానికి ఇవి ఉపయోగపడతాయి. ‘ప్రభుత్వ సారా బోరుకొట్టు, స్పిరిట్‌ కలిపి కొట్టు, తాగినోడు నెల బతికితే ఒట్టు’, ‘బంధువు పేర బస్సు రూట్లు, భార్యల పేర్ల ఇళ్ల ప్లాట్లు, ఓట్లిచ్చిన మనకు అగచాట్లు’, ‘ప్రేమించి పెళ్లిచేసుకో, నీ కట్నాలన్నీ గుట్టుగా తీసుకో’... సమాజ అవలక్షణాల మీద నాజర్‌ బుర్రకథల్లో ఇలాంటి విసుర్లు చాలానే పడేవి. ‘హా! నాథా పోయెదవా!  ఫో యెదవా!’ లాంటి సరదా చమక్కులకూ లోటుండేది కాదు.  
కథ... వంత
సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం, హాస్యం... వీటన్నింటి సమాహారం బుర్రకథ. అందుకే దీనికి ‘కమ్మని కథాగాన లాస్యం... హాయిగా నవ్వించే హాస్యం... తీయగా కథను వివరించే భాష్యం’ అనే నిర్వచనమిచ్చారు ప్రఖ్యాత కళాకారుడు నదీరా. చెప్పే కథకు అనుగుణంగా హావభావాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరిస్తారు కళాకారులు. ఎక్కువగా వీర, రౌద్ర, కరుణరసాల్లో కథ చెబుతారు. వినేవారికైతే ఆ కథ కళ్లముందు జరుగుతున్నట్టే అనిపిస్తుంది. కావాలంటే సుంకర సత్యనారాయణ ‘రుద్రమదేవి’ బుర్రకథలోని గోన గన్నారెడ్డి గుర్రపు స్వారీ ఘట్టాన్ని చూడండి...
... అప్పుడు గన్నారెడ్డి సాహిణి/ ఆజ్ఞలందుకుని అంబకు మ్రొక్కి/ బిరానదట్టీ బిగించిగట్టీ/ జరీ అంచు తలపాగా జుట్టీ/ కుప్పించి పైకే లేచాడా/ గుర్రం మీదే వాలాడా/ కాళ్లంకెమున పెట్టనేలేదు/ కళ్లెమైన చేపట్టనేలేదు/ అరరే చూడుము దాని తామసం/ అదురుపాటుగా లేచిన గుర్రం/ మూడే చక్రాల్‌ గొట్టిందా/ ముందుకు చెంగున దూకిందా/ దూకిన గుర్రం మింట లేచెరా/ ధూళి ఆకసం వేపు లేచెరా/ కన్నుమూసి కన్దెరువలేదురా/ కంటికి గుర్రం కానరాదురా/ గుట్టలు మిట్టలు దాటిందా/ పిట్టవోలే అది పోతుందా...
      కథకుడు ఇలా తంబురా మీటుతూ గానం చేస్తుంటే... ‘వినరా ఆంధ్రకుమారా ధీరా విజయము మనదేరా’, ‘తందాన భాయీ దేవనందనానా- తందాని తాన’, ‘ఓ భారతీయుడా, ఓ వీరయోధుడా లేవయా- లేచి రావయ్యా’, ‘తందానా, తుమ్మెదా’, ‘భేష్‌’, ‘శహభాష్‌’, ‘భళిభళా’, ‘వహ్వా’ అంటూ అతణ్ని ఉత్సాహపరుస్తారు వంతలు. విషాద ఘట్టాల్లో ‘అయ్యో, హరిహరీ’ అంటుంటారు. 
      అలాగే, కాంభోజరాజు కథలో ‘తందానా తందానా తాని తందనాన’, బొబ్బిలి కథలో ‘రామ రాఘవా రామ రఘురామ’, ముగ్గురు మరాఠీల కథలో ‘సైసై’, సర్వాయి పాపడు కథలో ‘ఏలో’, శారద పదాల్లో ‘భళీ భళీ’ అనీ వంత పాడతారు. సామాజిక అంశాలకు సంబంధించిన కథల్లో అయితే ‘కూడి చరించిన విజయము మనదే కూలి రైతులారా, జయము జయము మన మహిళలందరకు జయము కలుగుగాక, వినరా నైజాం తెలుగు ప్రజల ఘన వీర సమర చరిత’... ఇలా అందుకుంటారు. కథకు అనుగుణంగా ఇద్దరు వంతలూ గుమ్మెట్ల మీద ‘దద్ధోతిమి, తధిమి తత్తధిమి, తకిట తతధిమి, దింతక్కదాతద్దిందా, తక తక్కి, తకతక్కా’ అంటూ దరువేస్తారు. ఈ గుమ్మెట్లను  వాయించడంలో ఆ రోజుల్లో ఖమ్మం వాసి బుర్రపంతులు, దొడ్డారపు వెంకటస్వామి, తాడికొండ సుబ్బయ్య (గుంటూరు) తదితరులు పేరు పొందారు. 
కదిలించే సాహిత్యం
బుర్రకథల్లో చిక్కటి కవిత్వం ఉంటుంది. కానీ, అది ప్రేక్షకుల మేధస్సుకు పరీక్ష పెట్టేదిలా ఉండదు. అలా ఉంటే ఆ బుర్రకథ రాణించదు. ఎందుకంటే, దీన్ని చూడటానికి వచ్చేవాళ్లలో ఎక్కువమంది సామాన్యులే. విషయం వాళ్లకు అర్థమయ్యేలా ఉండాలి. అలా అని మరీ ‘కట్టె- కొట్టె- తెచ్చె’ మాదిరిగా చెబితే చప్పగా ఉంటుంది. అలా కాకుండా జనం హృదయాలను నేరుగా తాకే సాహిత్యానికి పట్టం కట్టాయి బుర్రకథలు. దీనికి ‘కామమ్మ కథ’ ఓ ఉదాహరణ. అందులో కామమ్మ తన భర్త చితిని కావలించుకుని  ‘ఎంత చల్లగా ఉన్నది నీ జాజివనము మారయ్య’ అంటుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ‘పైసకు గడ్డిని మేసెడి/ పశువు జన్మమేమెత్తం/ జానెడు పొట్టను నింపగ/ సత్యము తప్పము తప్పము’ అనే ‘అల్లూరి సీతారామరాజు’ కథలోని మల్లుదొర మాటలు ప్రజలకు మంచిబాటను చూపిస్తాయి. పల్నాటియుద్ధం కథ చెబుతూ ‘ధననష్టం, జననష్టం, రణమంటే ముదనష్టం’ అంటూ యుద్ధాల మీద నిరసన ప్రకటించారు బుర్రకథ కళాకారులు. ‘ఆది నుండి మన భారతదేశం అన్నపూర్ణయండీ/ పూర్వము నుండీ భారతదేశము పుణ్యభూమియండీ’ అని దేశభక్తిని రగిల్చారు.
కాకుమాను సుబ్బారావు 1942లో రాసిన ‘బాబూరావు బుర్రకథ’తో ఆధునిక బుర్రకథా రచన ప్రారంభమైంది. అప్పటివరకూ పురాణ కథలను వినిపించిన కథకులు అప్పటినుంచి సాంఘిక సమస్యల మీద గొంతెత్తడం ప్రారంభించారు. దీనికి ఊతమిచ్చింది సుంకర సత్యనారాయణ రచనలు. కష్టజీవి, రైతు విజయం, రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం తదితర ఆయన బుర్రకథలు తెలుగునాట ఓ చైతన్యానికి బీజంవేశాయి. తర్వాత నాజర్‌ రాసిన ‘బెంగాలు కరువు, పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు, నేటి రాయలసీమ’ బుర్రకథలూ కాలమాన పరిస్థితులకు అద్దంపట్టాయి. 
      విజయనగరంలో నాజర్‌ ‘బొబ్బిలియుద్ధం’ కథకు స్థానిక నీటి సమస్యనూ జోడించి, ఆ ప్రాంతీయుల మన్ననలను అందుకున్నారు. ‘పల్నాటియుద్ధం’లో ‘లెండిక జాగేలా- పోదము/ రండి వీరులారా/ దండిగ గ్రామస్థులంత లెండోయి కూడి వేవేగమే/ దుండగులగు వైరుల దుండగమ్ముల చెండిక బిరబిర/ అండగ వైరుల పైకి’ అంటూ ఆయన పాడుతుంటే, నాటి స్వాతంత్య్రోద్యమ పరిస్థితుల్లో యువతలో రక్తం మరిగేదట. ఇలా కథాంశం ఏది తీసుకున్నా, దాన్ని సమకాలీన పరిస్థితులకు అన్వయించి, అభ్యుదయాన్ని ఆకాంక్షించారు కళాకారులు. 
ఉద్యమాలకు ‘సై సై’ 
తెలంగాణ సాయుధ పోరాటంలోనూ బుర్రకథ కీలకపాత్ర పోషించింది. . సాయుధ పోరాటంలో అసువులుబాసిన అమరవీరులను స్మరిస్తూ తిరునగరి రామాంజనేయులు ‘తెలంగాణ వీరయోధులు’ బుర్రకథ రాశారు. ‘హైదరాబాద్‌ ప్రజల స్వాతంత్య్ర పోరాటం’, ‘కాశీం రజ్వీ’ (ఎస్‌.కె.చౌదరి), ‘షోయబుల్లాఖాన్‌’ (చెర్విరాల బాగయ్య), కూరపాటి వెంకటరాజు ‘జమీందార్‌’, ‘ధర్మయ్యబాబు బుర్రకథ’, అడ్లూరి అయోధ్య రామకవి ‘నైజాం విప్లవం’, ‘నైజాం ప్రజావిజయం’ బుర్రకథలూ ప్రసిద్ధమైనవే. ఆ కాలంలోనే వచ్చిన ‘ఆంధ్రమహాసభ’ (చౌడవరపు విశ్వనాథం) బుర్రకథ యువత మీద చాలా ప్రభావాన్ని చూపించింది. నాటి తెలంగాణ జీవన స్థితిగతులను వివరిస్తూ ‘తెలంగాణ’ బుర్రకథ రాశారు సుంకర. దీనికి బందగీ వీరగాథను జోడించి చెప్పేవారు కళాకారులు. 
      మద్రాసుకు చెందిన అబ్బురాజు శర్మ ‘స్వతంత్రపోరాటం’, వారణాసి వెంకటనారాయణశాస్త్రి ‘కట్నంలేని కమలమ్మ పెండ్లి’, ‘దివ్యజ్యోతి’ (గాంధీ సిద్ధాంతాల ప్రచారం), నదీరా ‘లఢక్‌ వీరులు’ బుర్రకథలూ చైతన్య ప్రబోధాలే. వానమామలై వరదాచార్యులు, జంపన చంద్రశేఖరరావు, కొసరాజు, నీలా జంగయ్య, శత్రుఘ్నరావు, మాచిరాజు లక్ష్మీపతి, రెడ్డి చినవెంకటరెడ్డి, పేరి సుబ్బారావు, మూర్తిశ్రీ, నేదునూరి, ద్వారంపూడి, శాంతిశ్రీ, వాడ్రేవు శేషగిరిరావు తదితరులు బుర్రకథా రచయితలలో ప్రసిద్ధులు. 


ప్రసిద్ధ కథకుల్లో కొందరు... జూనియర్‌ నాజర్‌, నిట్టల సోదరులు (శత్రుఘ్నరావు, హనుమంతరావు), పున్నంరాజు భానుమూర్తి, నిడదవోలు అచ్యుతరామయ్య, కప్పగంతుల రామం, సలాది, కుమ్మరి మాష్టారు (దార అప్పలనారాయణ), రాఘవకుమార్‌, రొంగలి సత్యం, వింజమూరి రామారావు, గొర్రెల రామం, సైదులు, తాతా నాగేశ్వరరావు, కొమరశ్రీ, కోటంరాజు, జయంతి, భువనగిరి నారాయణ


బుర్రకథ దళాలు

ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో బుర్రకథ దళాలు (కథకుడు, ఇద్దరు వంతలను కలిపి దళం అంటారు) చైతన్యస్ఫోరకమైన ప్రదర్శనలు ఇచ్చాయి. నాటి ఉద్యమాల నుంచి నేటి సాక్షరతా మిషన్‌ వరకూ బుర్రకథ దళాలు కథలు చెబుతూనే ఉన్నాయి. నాజర్‌తోపాటు సుద్దాల హనుమంతు, శిష్ట్లాసాంబశివరావు, నదీరా, పండు మాష్టారు, చందన కోటేశ్వరరావు, బెనర్జీ, లక్ష్మీకాంత్‌ మోహన్‌ బుర్రకథ దళాలు ఒకప్పుడు తెలుగునాట సుప్రసిద్ధమైనవి. శారద, వాణి, మహంకాళి లక్ష్మి, చింతల కోటేశ్వరమ్మ తదితర మహిళా కథకులూ తమ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించిన వారే. 
మరోవైపు, వెండితెర మీదా బుర్రకథ ఓ వెలుగు వెలిగింది. ‘పుట్టిల్లు’ చిత్రంలో రాణిరుద్రమ బుర్రకథాగాన సన్నివేశం ఆకట్టుకుంటుంది. అగ్గిరాముడు, భలేబావ, నిలువు దోపిడి, పెత్తందార్లు, సర్దార్‌ పాపారాయుడు, యువతరం కదిలింది, ఆంధ్రకేసరి,  మనుషులంతా ఒక్కటే తదితర చిత్రాల్లో సైతం బుర్రకథలకు ప్రాధాన్యమిచ్చారు. ‘అగ్గిరాముడు’లో నాజర్‌ చెప్పిన అల్లూరి సీతారామరాజు బుర్రకథను సినీ నటుడు కృష్ణ చూశారు. అప్పుడే తనకు అల్లూరి మీద సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందని ఓ సందర్భంలో చెప్పారాయన. 
      కుటుంబ నియంత్రణ, శిశుసంరక్షణ, వరకట్న నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, మిషన్‌ భగీరథ (తెలంగాణ ప్రభుత్వ పథకం) తదితర ప్రచారాల్లో ఇప్పటికీ బుర్రకథ దళాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో దాదాపు 60 వరకూ దళాలున్నాయి. తెలంగాణలో ప్రభాకర్‌, యడ్ల ప్రమీంద్ర, నారాయణ; ఆంధ్రలో షేక్‌ బాబూజీ (నాజర్‌ కుమారుడు), భద్రకాళి, గొర్లె రామ్మూర్తి, విభూది బాబూరావు తదితర దళాలు ప్రసిద్ధం. ఒకప్పుడు వందల్లో ఉన్న దళాలు నేడు పదుల సంఖ్యలోకి చేరుకోవడం మాత్రం బాధాకరం. నల్గొండ జిల్లాలోని ధర్మాపురంలో ఒకప్పుడు 12 బుర్రకథ దళాలు ఉండేవి. ఇప్పుడు అయిదారు మాత్రమే మిగిలాయి. ప్రభుత్వాల నుంచి చేయూత లభిస్తేనే ఈ కళాకారులూ తమ కళను కొనసాగించగలుగుతారు. కళ ఏదైనా, దాన్ని కాపాడుకోవడం నాగరిక జాతి లక్షణం. బుర్రకథ లాంటి సామాజిక ప్రయోజనం ఉన్న కళలకైతే ఈ ఆదరువు మరీ అవసరం.


చేయూత ముఖ్యం
ఆ రోజుల్లో ‘కాశీమజిలీ బుర్రకథ’ మూడు రోజులకు పైగా చెప్పేవారు. ఇప్పుడు రెండున్నర గంటల్లో సరిపెట్టాల్సి వస్తోంది. యువత రంగస్థల ప్రదర్శనల మీద ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. దానికి వాళ్లను నిందించి లాభం లేదు. వాళ్లకు మన సంస్కృతి గురించి పెద్దలే చెప్పాలి. ‘బుర్రకథ’తో పాటూ అన్ని కళారూపాల మీదా అధ్యయనాలు సాగాలి. కృష్ణరాయల స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ కళాభివృద్ధికి కృషి చేయాలి. కళాకారులకు, పరిశోధకులకు చేయూతనివ్వాలి.    

- షేక్‌ బాబూజీ 


ఉపాధి లేక...
మాది నల్గొండ జిల్లా ధర్మాపురం. మా ఊరు కళాకారుల్లో కొంతమంది ఇప్పుడు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. మరికొంతమంది వలస వెళ్లిపోయారు. మేం ఇరవయ్యేళ్లుగా బుర్రకథల మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. కళాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. 

- యడ్ల ప్రమీంద్ర 


తగ్గిపోతున్నారు
బుర్రకథకు ప్రఖ్యాతి తెచ్చింది నాజర్‌ అయితే, సుద్దాల హనుమంతు ద్వారా తెలంగాణలో ఈ కళ ప్రాచుర్యం పొందింది. నేను ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే బుర్రకథలు చెబుతున్నాను. రాణాప్రతాప్‌, భగత్‌సింగ్‌, ఛత్రపతి శివాజీ బుర్రకథలు రాశాను. ప్రస్తుతం తెలంగాణలో బుర్రకథ చెప్పేవాళ్లు తక్కువగా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ పరిస్థితి. 

- బండిరాజుల శంకర్‌, ఆలేరు, నల్లగొండ జిల్లా


వెనక్కి ...

మీ అభిప్రాయం