సహస్ర గళాల సమష్టి ఆలాపన

  • 589 Views
  • 4Likes
  • Like
  • Article Share

ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వెయ్యిమంది తెలుగు కవులు ఒకే వేదిక మీద కవితాగానం చేస్తే ఎలా ఉంటుంది? విభిన్న నేపథ్యాలు, దృక్పథాలకు చెందిన ఆ అక్షరహాలికుల కవితాసేద్య ఫలాలన్నీ అలా ఒకేచోట ప్రదర్శితమైతే, తెలుగుతల్లి గుండె నిండిపోదూ! ఆ సహస్ర కోయిలల కుహుకుహు రాగాలతో ఓ సరికొత్త భావ వసంతమేదో వెల్లివిరిసి ఉండదూ! తెలంగాణ రైతు హార్వెస్టర్‌ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన సహస్ర కవిసమ్మేళనం ఇలాంటి అనుభూతులనే పంచింది. 
‘‘కవి సమ్మేళనాల వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఒకటి- ప్రజలు ముఖాముఖి కవులను దర్శించుకుని వారి వారి ముఖతః కవిత వినడం. రెండు- యువకవులు అనేకులు ప్రజలకు పరిచయం కావడం. ఇటు ప్రజలకు, అటు కవులకు శ్రేయోదాయకములైనవి కవి సమ్మేళనాలు’’ అన్నారు దాశరథి కృష్ణమాచార్యులు. ఆయన ఇలా అని అరవై ఏళ్లు దాటిపోయినా, ఇప్పటికీ కవిసమ్మేళనాల లక్ష్యమిదే. ఉగాది పండగ నాడో, సాహితీసభల వేదిక మీదో ఎప్పుడు ఎక్కడ కవిసమ్మేళనం ఏర్పాటుచేసినా కవిలోకానికదో తీపికబురు. ‘‘అక్షరాల్లోనూ భావాల్లోను/ పరిచయమే తప్ప/ ముఖాముఖి పరిచయమే లేని/ కవులంతా తమ తమ నెలవుల వదిలి/ ఒకరినొకరు కలుసుకునేందుకు/ ఒకరినొకరు తెలుసుకునేందుకు/ పరస్పర భావాలు పంచుకునేందుకు/ కొత్త ఒరవడిని సృష్టించేందుకు/ కవి సమ్మేళనమొక/ చక్కటి వేదిక/ ప్రాంతీయతా భేదాలు/ యాసల ఊసులు మరచి/ తమ భాషామతల్లికి/ నీరాజనాలర్పించుకునే రంగస్థలమిది’’ అంటారు హైదరాబాదుకు చెందిన అనంతలక్ష్మి. కరీంనగర్‌ శివారులోని శుభం గార్డెన్‌లో సెప్టెంబరు 11న జరిగిన సహస్ర కవిసమ్మేళనంలో పాల్గొన్న ఆవిడ, వేదిక మీద ఇదే కవితను ఆలపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బంగ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు యానాం నుంచీ ఇక్కడికి వచ్చిన కవుల స్వరాల్లో ఆ రోజు పలికిన ఆనందరాగానికి అనంతలక్ష్మి కవిత అద్దంపట్టింది. 
      అమ్మభాషను ప్రేమించాలనే సందేశాన్ని సామాన్యులకు సైతం చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రైతు హార్వెస్టర్‌ సంఘం ఈ కవిసమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రాంతాల వారీగా ‘పాల్కురికి సోమనాథుడు, పోతన, గురజాడ, కాళోజి, దాశరథి, శ్రీశ్రీ, అలిశెట్టి ప్రభాకర్‌’ పేర్లతో వాట్సప్‌ గ్రూపులను పెట్టి, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగుకవులను ఈ సమ్మేళనానికి ఆహ్వానించారు. ఆయా బృందాల్లో మొత్తం 1437 మంది కవులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వాళ్లలో వెయ్యి మంది సమ్మేళనానికి హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణస్థలికి ‘సినారె ప్రాంగణం’గా నామకరణం చేసి, వాట్సప్‌ బృందాల పేరిటే ఏడు వేదికలను ఏర్పాటుచేశారు. ఏ బృందంలో పేరు నమోదు చేసుకున్న వారు ఆ వేదిక మీదే కవితాగానం చేసేలా ఏర్పాట్లు చేశారు. 
దేనికదే ప్రత్యేకం
విభిన్న వస్తువులను తమవైన దృష్టికోణాల్లోంచి కవిత్వీకరించిన కవులు, కవయిత్రులు ఉత్సాహంగా తమ కవితలను చదివి వినిపించారు. ‘‘చందమామతో సరదాలాటలు లేవు/ చుక్కలతో చిలిపి కేరింతలు లేవు/ ఆకాశాన్నంటిన ధరలను చూసి అయోమయంలో పడ్డాయో/ చినుకై వర్షిద్దామనుకుంటే/ పలకరించే పచ్చని మొక్కలేనందుకో/ పలకని మేఘాలన్నీ పంతం పట్టి మౌన వ్రతం చేస్తున్నాయి/ ఇకనైనా మేలుకుందాం/ పచ్చని మొక్కల పాదులు చేద్దాం/ మేఘాలను నేలకు దింపుదాం’’ అంటూ పిలుపునిచ్చారు ఖమ్మానికి చెందిన సునంద. నెల్లూరు వాసి వినీలదుర్గ ఈ సమ్మేళనానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు. అంతేకాదు, ‘‘తెలంగాణ ముద్దుబిడ్డ/ అమ్మభాషకు కీర్తి తెచ్చిన రౌతు/ కలం పోటులోనే కన్నెర్ర చేసిన విప్లవకారుడు...!!/ జనంలో ఒకడై అందరి బాధలకు ఓదార్పై/ పదాలకు సింగారాలు చేసి/ ఎలుగెత్తి చాటిన మహాకవి’’ అంటూ కాళోజీని స్మరించు కున్నారు. కడపకు చెందిన గొంటుముక్కల గోవిందు ‘పేదోడి మందహాసాన్ని’ తన కవితలో చిత్రికబట్టారు. ‘‘మది అగాధాన మంచిచెడుల మరకలెన్నో/ నవ్వుకు చెప్పిన నిర్వచనాలెన్నో/ పెదాలకు చేరని నవ్వులెన్నో/ పదాలకు చిక్కని పదనిసలెన్నో/ పరుగుల పయనాన మనిషిని మరచిన మందహాసాలెన్నో/ మనసును ముంచిన మందగమనాలెన్నో/ పేదోడంటే పెదాలకు విచక్షణనేమో!/ మది సంబరపడే మందహాసాలు లేని విలక్షణ బతుకేమో..!!’’ అంటూ తాత్విక భావాలను పలికించారాయన. 
      ఇలా ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగిన కవితాగానంతో ‘సినారె ప్రాంగణం’ తడిసి ముద్దయింది. భోజనానంతరం నిర్వహించిన సభా కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘మన నాగరికత, సంస్కృతి విస్తృతికి కారణం భాషే. భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడేది తెలుగు భాషనే. ఈతరం పిల్లలు మన భాషను మాట్లాడటం, చదవడం, రాయడం చేయకపోతున్నా, త్వరలో మళ్లీ అందరూ తెలుగు ఒడిలోకి వస్తారు. మానసికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సమృద్ధమైనప్పుడు తనదైన గుర్తింపు కోసం జరిగే ఆరాటంలో  సమాజం మళ్లీ తెలుగు వైపు అడుగులు వేస్తుంది. ఆ రోజు మరెంతో దూరంలో లేదు’’ అని అన్నారాయన. అనంతరం కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులందరినీ సత్కరించారు. డా।। కలువకుంట రామకృష్ణ, దాస్యం సేనాధిపతి, డా।। నలిమెల భాస్కర్‌, శిఖామణి, మాడిశెట్టి గోపాల్‌, సంటి అనిల్‌కుమార్‌, ఆచార్య గంజి భాగ్యలక్ష్మీ, కూకట్ల తిరుపతి, ఐతా చంద్రయ్య, పెండ్యాల సాయికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కవిసమ్మేళనం... వర్ధమాన కవుల్లో ఉత్సాహం నింపడంతో పాటు మొత్తం తెలుగునాడుకు ఓ స్ఫూర్తి సందేశాన్ని అందించింది. ‘సినారె ప్రాంగణం’ ఎలుగెత్తిన ఆ సందేశమేంటో పశ్చిమ బంగకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు వింజమూరి బాలమురళి మాటల్లో విందాం... ‘‘ఆంధ్ర, తెలంగాణ గుండె గదులు వేరైనా లయ ఒక్కటేనన్న భావాన్ని చాటింది ఈ సమ్మేళనం. తెలుగువారంతా ఇలా ఒకే వేదిక మీదకి రావడం ముదావహం’’!


కవులు, సాహితీవేత్తలు తెలుగు భాషకు ప్రాణం పోస్తున్నారు. అలాంటి వారిని వెయ్యిమందిని ఒకే వేదికపైకి తీసుకురావాలని ఈ సమ్మేళనం తలపెట్టాం. మా ప్రయత్నం సంతృప్తిని ఇచ్చింది. ఈ మొత్తం కవుల కవితలతో ఓ సంకలనాన్ని ప్రచురిస్తాం. 

- కాచిడి గోపాల్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ రైతు హార్వెస్టర్‌ సంఘం  


వెనక్కి ...

మీ అభిప్రాయం