జై జై జానపదం!

  • 803 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నాగశేషు

  • నెల్లూరు
  • 9985509053

ఒగ్గుడోలు దరువులు... చిందు యక్షగానాల అడుగులు... కోలాటాల కోలాహలాలు... బుర్రకథలు, గుస్సాడీ నృత్యాలు.. ఒకటేమిటి తెలంగాణలోని సమస్త జానపద కళారూపాల ప్రదర్శనలతో రాష్ట్రమంతా మురిసి మెరిసింది. పది రోజుల వ్యవధిలో ప్రతి జిల్లా కేంద్రంలో జరిగిన ‘జానపద జాతర-2017’ ఉత్సవాలు కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ కళారూపాలను ప్రజలకు మరింత చేరువచేశాయి. 
పంబ, బైండ్ల కథలు, గోత్రాల భాగవతం, కప్పకావిడి, రాజన్నడోలు (శివమేళం- చామల్లాలీ డోలు)... చాలామందికి తెలియని అరుదైన కళారూపాలు. ఈ మట్టి మీద పుట్టిన ఇలాంటి కళలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కొన్ని దశాబ్దాల వెనక్కి వెళితే, ఇవన్నీ జన జీవితంలో విడదీయలేని భాగాలు. కానీ, నేడవి కొనవూపిరితో కొట్టుకుంటున్నాయి. జాతి సాంస్కృతిక వారసత్వ సంపదలైనప్పటికీ మారిన కాలమాన పరిస్థితుల్లో అస్తిత్వ పోరాటం చేస్తున్నాయి. వీటిని కాపాడుకోవడానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రెండేళ్ల నుంచి ‘జానపద జాతర’ను నిర్వహిస్తోంది. ఏటా పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తూ, అన్ని కళారూపాలనూ ప్రదర్శింపజేస్తోంది. ఈసారి కూడా ‘ప్రపంచ జానపద దినోత్సవాన్ని’ పురస్కరించుకుని ఆగస్టు 22న ఈ ఉత్సవాలను నిజామాబాదులో ప్రారంభించారు. రోజుకు మూడు, నాలుగు జిల్లాకేంద్రాల్లో వీటిని నిర్వహిస్తూ 31న హైదరాబాదు రవీంద్రభారతిలో ముగింపు వేడుకలు నిర్వహించారు. మొత్తం 31 జిల్లాల్లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రుల నుంచి స్థానిక శాసనసభ్యుల వరకూ, కలెక్టర్ల నుంచి తహసీల్దార్ల వరకూ అన్నిస్థాయుల నాయకులు, అధికారులు భాగస్వాములవ్వడం విశేషం.
      ‘‘జానపద కళారూపాలను పరిరక్షించుకోవడానికి, వాటి విశిష్టతను భావితరాలకు వివరించడానికి, విశ్వవిద్యాలయాల్లో వాటి మీద పరిశోధనలు నిర్వహింపజేయడానికి త్వరలోనే జానపద అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’’ అని నిజామాబాదులో జరిగిన ప్రారంభ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వెల్లడించారు. అరుదైన చిందు యక్షగాన కళాకారిణి చిందు ఎల్లమ్మ పుట్టిన నేల ఇందూరు నుంచి ‘జానపద జాతర’కు శ్రీకారం చుట్టడం ఆనందకరమని ఆయన అన్నారు. అనంతరం కళాకారులు జిల్లా కేంద్రం ప్రగతి భవన్‌ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకూ ప్రదర్శన నిర్వహించారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాగే ‘జై జానపదం.. జై జై జానపదం’ అంటూ ర్యాలీలతో ఉత్సవాలను ప్రారంభించి, తర్వాత ప్రదర్శనలు ఇచ్చారు. ఆయా జిల్లాల్లో వ్యాప్తిలో ఉన్న అన్ని  కళారూపాలకూ వీటిలో స్థానం కల్పించారు. ప్రతి జిల్లాలో అయిదు వందల నుంచి పదిహేను వందల మంది వరకూ కళాకారులు ఈ జాతరలో భాగస్వాములయ్యారు. వీళ్లకి తెలంగాణ ‘సాంస్కృతిక సారథి’ కళాకారులూ తోడవ్వడంతో వేదికల మీద సంబరాలు అంబరాన్నంటాయి. 
పండగ వాతావరణంలో...
బోనాలు, పోతురాజులు, ఒగ్గు, చిందు, బైండ్ల, పంబ, బంజార, కోలాట కళారూపాలు, బుర్రకథలు, పల్లెసుద్దులు, పాండవుల వేషాలు, యక్షగానాలు, డప్పుల దరువులు, దీపాల నృత్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు... ఎన్నెన్నో కళలు ఈ పదిరోజుల్లో ప్రజల ముందుకు వచ్చాయి. అదిలాబాదులో కలెక్టర్‌ చంపాలాల్‌ సైతం దరువుకొడుతూ జనంలో ఉత్సాహం నింపారు. ‘‘ప్రపంచంలో ఏ జాతి నిలబడాలన్నా జానపద కళలే కీలకం. చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకుని, ఆకాశవాణిలో పనిచేశాను. కళాకారుల బాధలను నేను అర్థం చేసుకోగలను. కడుపు మాడుతున్నా, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా ముఖంపై చిరునవ్వుతో ప్రేక్షకులను మైమరపింపజేయడం ఒక్క కళాకారుడికే సాధ్యం’’ అన్నారు జనగామ కలెక్టర్‌ శ్రీదేవసేన. స్థానిక రైల్వేస్టేషన్‌ నుంచి జూబ్లీ గార్డెన్‌ వరకూ కళాకారులు నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. సిరిసిల్ల వాసవీ కళ్యాణమండపంలో నిర్వహించిన ‘జానపద జాతర’లో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు. ‘‘జానపద కళలు జనజీవన సంస్కృతికి ప్రతిబింబాలు. విజ్ఞాన వినోదాలను పంచే వాఙ్మయాలు. కళాకారులను కాపాడుకోవడం అందరి బాధ్యత’’ అన్నారాయన. గద్వాల కలెక్టర్‌ రజత్‌కుమార్‌ సైనీ కూడా ఇదే పిలుపునిచ్చారు. జనపదాల నుంచి పుట్టినవే జానపదాలని చెప్పిన నల్లగొండ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యాభై ఏళ్లు దాటిన కళాకారులందరికీ పింఛన్లు ఇస్తామని కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ హామీ ఇచ్చారు. చిందు భాగవతం, ఒగ్గుకథ తదితర ప్రదర్శనలను ఆయన ఆసక్తిగా తిలకించారు.  
      ‘జానపద జాతర’ వేడుకలకు నాయకులూ రావడం కళాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. భూపాలపల్లిలో శాసనసభ స్పీకరు మధుసూదనాచారి, నిర్మల్‌, సూర్యాపేటల్లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి,  వరంగల్లు, అదిలాబాదుల్లో శాసనసభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్‌, కోవ లక్ష్మిలు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. వనపర్తిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జానపద కళాకారుల కృషితోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. 
కళాకారులకు ఆరోగ్యకార్డులు
జిల్లాల్లోని సంబరాలన్నీ విజయవంతమవడంతో రవీంద్రభారతిలో ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్‌, వికారాబాదు జిల్లాల కళాకారులు ఈ సందర్భంగా తమ కళానైపుణ్యాలను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షులు అయాచితం శ్రీధర్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రూపొందించిన ‘జానపద సవ్వడి’ ఆడియో సీడీని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రమణాచారి మాట్లాడుతూ... దసరా, దీపావళి నాటికి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కళాకారుడికీ బస్సుపాసులు, ఆరోగ్యకార్డులు (రూ.2 లక్షల వరకూ వైద్యసేవలు అందేలా) అందజేస్తామన్నారు. ఈ హామీలు ఎంత త్వరగా కార్యరూపంలోకి వస్తే కళాకారులకు అంత చేయూత దక్కుతుంది. 
      ‘‘జాతి జీవనాళిక జానపదం’’ అంటారు నందిని సిధారెడ్డి. పరిణామ క్రమంలో ఓ జాతి సముపార్జించుకున్న ఆలోచనా సంపదలూ, జాతిజనుల తాత్విక దృక్పథమూ జానపదాల్లోనే నిక్షిప్తమై ఉంటాయి. వాటిని కాపాడుకోవడం కళాకారుల బాధ్యత మాత్రమే కాదు. మొత్తం జాతి కర్తవ్యం. కళలేవైనా సరే, అవి మన అస్తిత్వ చిహ్నాలు. పదికాలాల పాటు అవి పచ్చగా ఉండటానికీ, తెలుగునాడుకు తమ వెలుగులను పంచడానికీ ‘జానపద జాతర’ లాంటి కార్యక్రమాలు దోహదపడతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం