ఇగ్నోలో తెలుగు... ఇకపై వెలుగు!

  • 1324 Views
  • 7Likes
  • Like
  • Article Share

ఉత్తమ నాణ్యతా ప్రమాణాల పరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) తెలుగు విద్యార్థులకు మరింత చేరువకానుంది. ఇకమీదట ఇగ్నోకు సంబంధించిన కోర్సుల్ని తెలుగులోనే చదువుకోవచ్చు. ఆ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వివిధ కోర్సులకు సంబంధించిన అభ్యసన సామగ్రి కూడా మన భాషలో లభ్యం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు యాభై వేల మంది విద్యార్థులకు మేలుచేసే ఈ పరిణామం.. ఓ వ్యక్తి కృషి ఫలితం. ఆయనే ఆచార్య వి.వేణుగోపాలరెడ్డి. 
ఇప్పటిదాకా ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే ఇగ్నో అభ్యసన సామగ్రి అందుబాటులో ఉండేది. పరీక్షలు కూడా ఆ రెండు భాషల్లోనే రాయాల్సి వచ్చేది. దీంతో తెలుగు విద్యార్థులు ఆసక్తి ఉన్నా ఇగ్నో సేవలను ఉపయోగించుకోలేకపోతున్నారు. వీరి ఆవేదనను అర్థం చేసుకున్న ఇగ్నో ప్రాంతీయ సేవల సంచాలకులు ఆచార్య వి.వేణుగోపాలరెడ్డి (రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు) తెలుగువారికి ఇగ్నోను దగ్గర చేయాలనుకున్నారు. విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కోర్సులను తెలుగులోకి తీసుకురావాలని సంకల్పించారు. అయితే, అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా ఉన్న ఇగ్నోలో ఓ స్థానిక భాషను బోధన మాధ్యమంగా తీసుకురావడం అంత తేలికగా సాధ్యమయ్యేది కాదు. అయినా సరే, వేణుగోపాలరెడ్డి వెనకడుగు వేయలేదు. అనుకున్నదే తడవుగా ఇగ్నో ఉపకులపతితో సంప్రదింపులు జరిపారు. అడుగడుగునా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇతర శాఖాధిపతులు ఎన్నో అభ్యంతరాలు లేవనెత్తారు. కార్యక్షేత్రంలో వచ్చే ఇబ్బందులంటూ మరెన్నో ప్రశ్నల్ని సంధించారు. వేణుగోపాలరెడ్డి అందరికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. తెలుగులోకి కోర్సుల్ని తీసుకురావడం వల్ల అటు విద్యార్థులకు, ఇటు విశ్వవిద్యాలయానికి ఏవిధంగా ప్రయోజనం కలుగుతుందో వివరించారు. దాదాపు సంవత్సరకాలం జరిగిన ఈ చర్చల్లో వేణుగోపాలరెడ్డిదే అంతిమ విజయం. తెలుగుమాధ్యమంలో అభ్యసన సామగ్రి అందించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
      తొలి ప్రయత్నంగా గత సంవత్సరం రెండు కోర్సులను తెలుగులో ప్రారంభించారు. పాడిపరిశ్రమకు సంబంధించిన డిప్లొమా కోర్సు, ఎలాంటి విద్యార్హత లేకపోయినా డిగ్రీ చదువుకునేందుకు అర్హత కల్పించే అనుసంధాన శిక్షణ కోర్సు (బ్యాచిలర్‌ ప్రిపరేటరీ ప్రోగ్రాం)- ఈ రెండూ ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి. వీటితోపాటు పౌల్ట్రీరంగానికి సంబంధించిన సర్టిఫికెట్‌ కోర్సు అభ్యసన సామగ్రి పూర్తిగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ కోర్సుల్లో ఇప్పటికే ఏటా 500 మంది ఉత్తీర్ణులు కావడంతోపాటు వెంటనే ఉద్యోగాలూ పొందుతున్నారు. మరోవైపు.. 2018, జులై నుంచి మరో పదిహేను సర్టిఫికెట్‌, పది డిప్లొమా కోర్సుల్ని కూడా తెలుగులోకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి తర్వాత బియ్యే, బీకాం కోర్సుల్ని కూడా తెలుగులోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి అభ్యసన సామగ్రిని మన భాషలోకి అనువదించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
తోడ్పాటు కావాలి
ఇప్పుడిక ‘ఇగ్నో’ తనకు తెలుగు విషయంలో చేయూతనిచ్చే నిపుణుల కోసం ఎదురుచూస్తోంది. వివిధ కోర్సుల అభ్యసన సామగ్రిని తెలుగులోకి అనువదించేందుకు విషయనిపుణులైన రచయితలు, అనువాదకుల నుంచి ఇగ్నో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల వారు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదుల్లోని ఇగ్నో ప్రాంతీయకేంద్ర సంచాలకుల పేరు మీద దరఖాస్తు చేసుకోవచ్చు.
      ‘‘ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషతోనే విజ్ఞానాభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఆలోచనలు మాతృభాషలోనే సాగుతాయి. కనీసం పాఠశాల స్థాయి వరకైనా బోధన, అభ్యసన మాతృభాషలో జరగాలి. మాట్లాడే ప్రజల సంఖ్య ఆధారంగా మన మాతృభాష తెలుగు దేశంలోనే రెండో స్థానంలో ఉంది. విజ్ఞానశాస్త్రాల అభ్యసన సామగ్రి తెలుగులో లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు సాధారణ చదువుతోనే ఆగిపోతున్నారు. ఈ అడ్డంకిని తప్పించి, అందరికీ విద్య అనే భారతప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేయడానికి, ప్రత్యేకించి పుట్టినగడ్డకు సేవ చేయడానికి ఇగ్నో కోర్సులను తెలుగులోకి తెచ్చేలా కృషి చేస్తున్నాను. అది ఫలించడం మొత్తం తెలుగుజాతి సాధించిన విజయం’’ అంటారు వేణుగోపాలరెడ్డి. ఇలాంటి వారి చొరవే అమ్మభాషాభివృద్ధికి చోదకశక్తి. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కోర్సులు నిర్వహించేందుకు తమ విశ్వవిద్యాలయం తరఫున ఇద్దరు ముఖ్యమంత్రులనూ కలిసి, విజ్ఞాపన పత్రం అందజేస్తామంటున్నారు వేణుగోపాలరెడ్డి. ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటే తమ కోర్సుల్ని వెంటనే ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఈ కోర్సులు త్వరగా అందుబాటులోకి వస్తే ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భవిష్యత్తు మీద భరోసా లభిస్తుంది.


మూడు దశాబ్దాల అనుభవం
వేణుగోపాలరెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన తిరుపతి, కావలిల్లో చదువుకున్నారు. వాణిజ్యశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 1987లో ఇగ్నోలో సహాయ ఆచార్యుడిగా చేరారు. కర్ణాటక, కేరళ, జమ్మూకశ్మీర్‌, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొత్తదిల్లీలోని ఇగ్నో పరిశోధన కేంద్రానికి మొట్టమొదటి సంచాలకుడిగా పనిచేసి తెలుగువారి కీర్తిని జాతీయస్థాయిలో పదిలం చేశారు. విద్యార్థి సేవా కేంద్రాల నిర్వహణ, కొత్త కోర్సుల రూపకల్పన, అధ్యయన కేంద్రాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 60 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాణిజ్యశాస్త్రానికి సంబంధించి నాలుగు పుస్తకాలు రచించిన వేణుగోపాలరెడ్డి, పదిహేను పొత్తాలకు సంపాదకత్వం వహించారు. దేశంలోని 68 ఇగ్నో ప్రాంతీయ కేంద్రాలకు సంచాలకులైన ఆయన ఇటీవలే రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇగ్నోలో ఈ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించిన తెలుగువారిలో వేణుగోపాలరెడ్డి రెండోవారు.


జాతిపిత
రక్తపాతంబులేనట్టి రణమొసంగి
కన్నతల్లిని దాస్య శృంఖల విముక్తి
జేసినావయ్య జగతి జేజేలొసంగ
జాతిపితవీవు భారత జాతికెల్ల!!

జగమునన్‌ బుట్టె కారణజన్ముడనుచు
ఖండఖండాంతర ఖ్యాతి గాంచినావు
బోసినవ్వుల ‘బాపు’గా వాసికెక్కి
విశ్వశాంతి కాంక్షించి వెడలినావు।।


 


వెనక్కి ...

మీ అభిప్రాయం