కుంభకోణాలూ... కైంకర్యాలూ!

  • 1080 Views
  • 8Likes
  • Like
  • Article Share

    యల్‌.నరసింహప్రసాద్‌

  • ఉపాధ్యాయుడు
  • నెల్లూరు
  • 9490251797
యల్‌.నరసింహప్రసాద్‌

‘‘తిరుమలలో 60 వేల లడ్డూల కైంకర్యం’’... ఈమధ్య ఓ పత్రికలో కనిపించిన వార్తాశీర్షిక ఇది! తిరుమలరాయుడికి రకరకాల సేవలు జరుగుతుంటాయి కానీ, ‘లడ్డూల సేవ’ అంటూ ఏదీ లేదే! మరేంటి ఈ శీర్షికకు అర్థం? నిజానికి కైంకర్యం అంటే సేవ! కానీ, ఇప్పుడు ‘అపహరణ, మోసం’ తదితరాల గురించి చెప్పడానికి ఈ పదాన్ని వాడుతున్నారు. ఇదే కాదు.. పూజ, ఆధ్యాత్మిక విషయ సంబంధిత పదజాలంలో ఎక్కువశాతం నిందార్థంలోనే వినిపిస్తున్నాయి!!
ఒకప్పుడు గౌరవార్థంలో ప్రయోగితమై.. రాన్రానూ నిందార్థం, పరిహాసార్థాల్లో స్థిరపడిపోయిన పదాలు తెలుగులో బోలెడు. భాషాశాస్త్ర పండితులు ఈ పరిణామాన్ని ‘అర్థగ్రామ్యత/ అర్థాపకర్ష’ అంటారు. కానీ, ఇలా మౌలికార్థాలను పోగొట్టుకుని ఇప్పుడు నిమ్నార్థాలను వ్యక్తీకరిస్తున్న పదాల్లో అత్యధికం సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినవే కావడం విషాదకరం.
      ‘‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేలా’’ అంటూ పోతన మహాకవి రాసిన మధుర గ్రంథం ‘భాగవతం’. ఈ భాగవత పదానికి ‘ఆత్మ తత్త్వాన్ని ప్రకటించే జ్ఞానం’ అనే అర్థాన్ని చెప్పింది ‘పారమార్థిక పదకోశం’. కానీ, ఇప్పుడు నేరాలకు సంబంధించిన/ జుగుప్స కలిగించే విషయాలను చెప్పడానికి ఈ మాటను వాడుతున్నారు. ‘ఎన్నాళ్లుగా సాగుతోందీ బాగోతం, వాళ్ల బాగోతం ఇప్పుడు బయటపడింది’ లాంటి ప్రయోగాలతో ఈ పదానికి అవమానకర వ్యంగ్యార్థాన్నిస్తున్నారు. ఇక దిల్లీ నుంచి గల్లీ వరకూ ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా, వాటిని ‘కుంభకోణాలు’ అనడం పరిపాటైపోయింది. వాస్తవానికి ‘కుంభకోణం’ అనేది తమిళనాడులోని ఓ దివ్య క్షేత్రం. పన్నెండు శైవాలయాలు, నాలుగు వైష్ణవాలయాలు, అరుదుగా కనిపించే బ్రహ్మదేవాలయం కొలువుదీరిన గడ్డ అది. అలాంటి ఊరి పేరును అవినీతి కార్యకలాపాల గురించి చెప్పడానికి వాడటాన్ని ఎలాంటి పరిణామంగా అర్థం చేసుకోవాలి?
నైవేద్యమంటే అదా?
‘‘శ్రీశస్థ లేష్వన్వహం కైంకర్యం’’- పెరుమాళ్లు వేంచేసి ఉన్న దివ్యక్షేత్రాల్లో శక్తి కొద్దీ సేవచేయటాన్నే ‘కైంకర్యం’ అన్నారు రామానుజాచార్యులు. ఇది దేవాలయ పరంపరలోని పదం. ‘భగవంతుడికి, భగవద్భక్తులకు చేసే ఊడిగం’ అని శబ్దరత్నాకరం కూడా దీనికి అర్థాన్నిచ్చింది. కానీ, ఏం లాభం? తమకు చెందని వాటిని (వస్తువులు, ఆస్తులు..) అనైతికంగా సొంతం చేసుకోవడాన్ని నేడు   కైంకర్యంగా చెబుతున్నారు. ‘నైవేద్యం’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ‘‘తన ఇంటఁగలుగు నన్నము/ మును దేవతలకు నివేద్యముగఁ జేసి ప్రణా/ మనియమసహిత సమర్పణ/ మునఁ గృతకృత్యుఁడుగ వలయుఁ బురుషుండనఘా!’’- భక్తులెవరైనా సరే, ఇంట్లో వండుకున్న అన్నాన్ని దేవతలకు నమస్కారపూర్వకంగా నైవేద్య రూపంలో సమర్పించాలని చెబుతుంది భారతం. భగవంతుడికి భక్తిపూర్వకంగా నివేదించే ఆహారమే నైవేద్యం. కానీ, కాలక్రమంలో ఈ అర్థం మారిపోయింది. ‘సొంత పనుల కోసం ఇచ్చే ముడుపు’గా స్థిరపడిపోయింది.  
      ‘‘ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేవి దాయయస్వాహా’’- పూజలు, హోమాల హవిస్సును దేవతలకు అర్పిస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారు. ‘అగ్నాయ స్వాహా, ఇంద్రాయ స్వాహా’ అంటారు. వైదిక క్రతువుకు సంబంధించిన ఈ ‘స్వాహా’ పదానికి కూడా నేడు నిమ్నార్థాన్ని కల్పించారు. ‘ప్రభుత్వ భూములను స్వాహా చేశారు’ లాంటి ప్రయోగాలతో, దాన్ని తస్కరణకు పర్యాయపదం చేసేశారు. ‘‘ముప్పునఁ గాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్‌/   గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్‌/ గప్పినవేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ నాటికిప్పుడే/ తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!’’- మరణం ఆసన్నమైనప్పుడు నీ స్మరణ చేయగలుగుతానో లేదో, అందుకే, ఇప్పుడే నీ భజన చేసుకుని కైవల్యం పొందుతానని ఆ శ్రీరామచంద్రుణ్ని వేడుకున్నాడు కంచర్ల గోపన్న. చిన్న చిన్న మాటలు, సరళ వాక్యాలతో, సులువైన రాగాలతో కూర్చిన భగవత్‌ కీర్తన భజన. వాద్యాల సాయంతోనో లేదా చప్పట్లు చరుస్తూనో దేవుడి భజన చేయడం జానపద సంప్రదాయం. కానీ, కాలం మారింది కదా! స్వలబ్ధి కోసం ఇతరులను పొగడటమే ‘భజన’ అయిపోయింది. ఇలాగే.. ‘చిందులు తొక్కడం’ అంటే కోపంతో అరవడం, గొడవలు చేయడం అని చెబుతారు! ఇదీ అర్థ గ్రామ్యతే. ‘‘బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు? గోవిందుని లీలా మకరందమునందరికీ అందించుటకు’’ అంటూ చక్కని లయ ప్రకారం భజన పాట పాడుతూ నృత్యం చేసే పక్రియ ‘చిందు’. కోలాటం, తప్పెట భజనల్లా ప్రసిద్ధ దేశీయ కళారూపమిది. ఇక ‘తాండవం’ లయకారుడి నృత్యం. ‘‘శివతాండవం, పరమశివతాండవం, భూతనాయక మహాద్భుత తాండవం, సరస నటనాద్భుతం సకల భువనోత్సవం’’ అంటూ కవులు ఆ కైలాసగిరివాసుడి నాట్యాన్ని వర్ణించారు. ‘‘ఆడెనమ్మా! శివుడు/ పాడెనమ్మా! భవుడు’’ అంటూ ఆ ‘శివతాండవాన్ని’ కళ్లకుకట్టారు పుట్టపర్తి నారాయణాచార్యులు. కానీ, ఈరోజుల్లో ఎవరికి కోపం వచ్చినా అది తాండవమైపోతోంది. రసాభాస చేయడం, కొట్లాట, గొడవలకు దిగేవాళ్లందరూ తాండవమాడేవారుగా వార్తలకు ఎక్కుతున్నారు. 
ఛాందసులంటే చిన్నచూపెందుకు?
‘వాడు ఎగనామం పెట్టాడు’ లాంటి మాటలూ తరచుగా వినపడుతుంటాయి. ఏంటీ ఎగనామం? అప్పు ఎగ్గొట్టడమా? కాదు. వరాహస్వామి సనత్కుమారుడికి చెప్పిన ఉపనిషత్తులో ఊర్ధ్వపుండ్రాలను శరీరంలో ఎక్కడెక్కడ (పన్నెండు చోట్ల) ధరించాలో చెప్పారు. ఈ ఊర్ధ్వపుండ్రాలనే ఎగనామాలని వ్యవహరిస్తారు. ఇది వైష్ణవుల ఆచారానికి అద్దంపట్టే సంకేతం. అలాంటిది ఇవాళ ‘బడికి పోకుండా ఇంట్లో ఉండటం, తప్పించుకుపోవడం, చెప్పకుండా మానేయడం, తీసుకున్న రుణం చెల్లించకపోవడం’ తదితర అర్థాల్లో ప్రయోగితమవుతోంది. ‘ఛాందసం/ ఛాందసుడు’ లాంటి పదాలూ ఇలాగే మౌలికార్థాన్ని పోగొట్టుకున్నవే. ఛందశాస్త్రానికి సంబంధించింది ఛాందసం. ఇదో వేద వ్యాఖ్యాన గ్రంథం. దాన్ని చదువుకున్నవాడే ఛాందసుడు. నిఘంటువుల ప్రకారమైతే ‘వేదం చదివినవాడు, శ్రోత్రియుడు, వేదవేత్త’ లాంటి అర్థాలూ ఉన్నాయి. కానీ, వ్యవహారంలో మాత్రం ఛాందసమంటే మూర్ఖత్వం! తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లని వాదించడం!! ఈ ఛాందసానికి అర్థం మారిపోయినట్టే, ‘గోవిందా గోవిందా’ అన్న నామోచ్చారణకూ మారింది. శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తూ భక్తులు ఆర్తితో పలికే ఈ నామం, నేడు పోగొట్టుకోవడానికి సమానార్థకమైంది!  
      అష్టాదశ పురాణాలు అమూల్య జ్ఞాన భాండాగారాలు. మానవులు పాటించాల్సిన ధర్మాలు, చేయాల్సిన పనులు, దర్శించాల్సిన క్షేత్రాల గురించి చెప్పే విభిన్న కథలకు ఇవి ఆలవాలాలు. భగవద్భక్తి చరిత్రలు, మహాపురుషుల గాథలను శ్రద్ధగా విని, వాటిలోని మంచిని గ్రహించి, ఆచరణలోకి తెచ్చుకోవడానికి ఉద్దేశించినవే పురాణాలు. ఇవి ఊరికే విని వదిలేసేవి కావు. కానీ, నేడు అదే అర్థం స్థిరపడింది. ఇంకొంతమంది అయితే, పురాణానికి బూతు అనే పదాన్ని చేర్చి జుగుప్సాకరమైన విషయాల గురించి చెబుతున్నారు. ఇక ‘హరికథ’.. యక్షగానం నుంచి ఆవిర్భవించింది. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచడానికి వీటిని గానం చేసేవారు. ఆధునిక వ్యవహారికంలో మాత్రం ఎవరైనా చెప్పింది వినకపోయినా, విన్నది అర్థం చేసుకోకపోయినా ‘నేనేమన్నా హరికథ చెబుతున్నానా?’ అంటున్నారు. ‘సోది’ స్థితీ అలాగే ఉంది! ‘‘ముంజేతులను ముఖాంబుజమున నొక వింత - పొలుపు దెల్పెడు పచ్చబొట్టులెసగ/ గురుమాపు పయ్యెంట చెరగులో నిడుకున్న - ముద్దుబల్కుల చిన్ని బుడుతడమర/ తరతరంబుల నుండి తమయింట వెలయు పుత్తడి పైడి బుట్ట మస్తకమున వెలుగ/ బోముల సందున నామంబు భూతిపూత, నెన్నొసట, బుక్కిట విడెంబు కన్నుగొనల కాటుక రహింపవచ్చి’’ సోది చెప్పే ఎరుకత, కొరవంజి ప్రసక్తి అనేక కావ్యాల్లో కనపడుతుంది. ఓ దశాబ్దం కిందటివరకూ ఈ సోదెమ్మలు ఇంటింటికీ తిరిగి పిలిచిన వారికి, నియమ నిబద్ధతలతో జ్యోతిషం చెప్పేవారు. అలా వాళ్లు చెప్పేదే ‘సోది’. కానీ, ఇప్పుడు అనవసర, అసందర్భ ప్రేలాపనలన్నీ సోదులే అవుతున్నాయి.  
      అక్షింతలు (తిట్లు), హారతి (పోవడం), శఠగోపం (మోసం), తీర్థం (మద్యం), తైలం (లంచం), ధర్మరాజు (వెర్రిబాగులవాడు).. ఇలా ఎన్నో మాటల మౌలికార్థాలు మారిపోతున్నాయి. కాలానుగతిలో ఇది సహజం అని సరిపెట్టుకోలేని ‘పరిణామమిది’. ఆచార వ్యవహారాలు, విశ్వాసాలకు సంబంధించిన పదాలను పరిహాసం చేయడం సంస్కారవంతుల లక్షణమూ కాదు. బలంగానో, కొత్తగానో భావవ్యక్తీకరణ చేయాలనుకున్నప్పుడు సామెతలు, జాతీయాల సాయం తీసుకుంటే ఇలాంటి పదాలను చెడగొట్టాల్సిన అవసరం రాదు. కాదని ఇలాగే మాట్లాడితే, రాస్తే... మనదైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని మనమే కించపరచుకున్న వారమవుతాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం