పానుగంటి పద పయోనిధ

  • 3312 Views
  • 10Likes
  • Like
  • Article Share

    డా।। పి.ఎస్‌.ప్రకాశరావు,

  • తెలుగు ఉపాధ్యాయులు
  • కాకినాడ.
  • 9963743021
డా।। పి.ఎస్‌.ప్రకాశరావు,

అచ్చమైన తెలుగు పదాలు తెరమరుగైపోతున్నాయి. మన సాహిత్యానికి జవసత్వాలద్దిన మహామహుల పదప్రయోగాలూ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మచ్చుకు పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలనే చూడండి! ఎన్నెన్ని సుమధుర శబ్దాలు ఆ వాక్యాల్లో ప్రతిధ్వనిస్తాయో!! తెలుగుదనానికి పర్యాయాలైన ఆ పదాలను తిరిగి తెచ్చుకుంటే... మన వాడుకలోకి వెల్లువెత్తుతున్న పరభాషా పదాలకు కాస్తయినా అడ్డుకట్టపడుతుంది.
కందుకూరి ప్రహసనాలు చదువుతుంటే ‘‘శిష్యులకు శృంగార కట్టెతో పూజ జరిగింది’’ అనే వాక్యం కనిపించింది. ‘శృంగారకట్టె’కు అర్థం నిఘంటువుల్లో దొరకలేదు. కానీ, శతావధాని వేలూరి శివరామశాస్త్రి అలుకు గుడ్డమీద చెప్పిన ‘‘శృంగారకట్టచే జిమ్మిన భూమిని/ జలము సింగారించి యలుకు కొరకు--’’ అనే సీసపద్యం కళ్లబడింది. ‘శృంగారకట్టె’ అంటే ‘చీపురుకట్ట’ అని అర్థమైంది. ‘‘శృంగారకట్టె మిశ్రమనామం. స్త్రీలు వాడతారు కాబట్టి శృంగారం తప్పలేదన్నమాట’’ అన్నారు బూదరాజు రాధాకృష్ణ. ‘స్త్రీల చేతిలో ఆయుధం’ అనే భావనతో దాన్నే ‘కాంతాకరవాలం’ అన్నారు పానుగంటి. ఇలాంటి పదాలింకా ఎన్ని మరుగున పడిపోయాయో! అలాగే, కందుకూరి స్వీయచరిత్రలో ‘ఉపాధ్యాయులకు ముట్టెడు మాసవేతనములకు దానికలు గైకొనబడుచుండెను’ అనే వాక్యంలోని ‘దానిక’ ఇప్పుడు మాయమైపోయింది. ఫార్సీ నుంచి ఉర్దూలోకి వచ్చిన ‘రసీదు’ నేడు తెలుగులో రాజ్యమేలుతోంది. 
      వచనంలో రాసేవారు సాధారణంగా తమ కాలం నాటికి విస్తృతంగా వాడుకలో ఉన్న మాటల్నే ఎంపిక చేసుకుంటారు. ఆనాటి వస్తువులు ఈనాడు వినియోగంలో లేకపోతే ఆ పదాలు ఆ రచనలకే పరిమితమైపోతాయి. లేదంటే నిఘంటువుల్లో ఉండిపోతాయి.  ఉదాహరణకు స్వామినేని ‘హితసూచని’కి రాసిన పీఠికలో ‘కుర్రవాళ్లచేత అయిదోయేట కజితం మీద అక్షరాలు రాయిస్తారు’ అని రాసి, ‘కజితం’ అంటే పలకలాంటిది అని చెప్పారు ఆరుద్ర. గుడ్డమీద జిగురు కలిపిన మసిపూసి నల్లగామార్చి అట్టగా చేసేవారు. అదే ‘కజితం’. దీనిమీద బలపంతో రాసేవారు. కాలక్రమంలో దీన్ని స్థానంలోకి పలక వచ్చింది కాబట్టి ఆ మాట మనకు అవసరంలేదు. కానీ, పానుగంటి వాడిన ‘గంజికావడి’ మాత్రం ఇప్పటికీ ఉపయోగపడేదే. ‘సాక్షి’ వ్యాసాల్లో ఓచోట ‘కరణముగారిని గంజికావడి వైచి భటులు మోసికొనిపోయిరి’ అనే వాక్యం కనిపిస్తుంది. ‘గంజికావడి’ అంటే నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని ఇద్దరు మనుషులు చెరో రెక్కా పుచ్చుకుని మోసుకుపోవడం. ఇలా మోసుకుపోవడం ఇప్పుడు కూడా వ్యవహారంలో ఉంది. అయితే ‘గంజికావడి’ అనే మాట మాత్రం వినిపించదు! ‘వచన యోధుడు’ పానుగంటి లక్ష్మీనరసింహారావు సాహిత్యంలో ముఖ్యంగా ‘సాక్షి వ్యాసాల్లో’ కనిపించే ఇలాంటి ఇతర ఆసక్తికరమైన పదాలను పరిశీలిద్దాం.  
రామవాక్యం
‘‘ఒక రామవాక్యమును పురస్కరించుకొని ----- కొందరు బుద్ధిమంతులు రచనలు చేయడానికి పూనుకుంటున్నారు’’.. ఇది పానుగంటి ప్రయోగం. ఇందులోని ‘రామవాక్యం’ ఓ పదబంధం. ఉల్లంఘించరానిది, తిరుగులేని నిజం అనే అర్థాలున్నాయి ఈ మాటకి. సీపీ బ్రౌను తన నిఘంటువులో gods truth అనే పదానికి ‘రామవాక్యం, వేదవాక్యం’ అనే పదాలు సూచించాడు. ‘రామవాక్యం’ నేడు వాడుకలో లేకపోయినా, ‘తిరుగులేనిది’ అనే అర్థంలో ‘రామబాణం’ అనే మాట ప్రజల నోళ్లలో ఉంది.
కాకిచెమ్మలు
‘‘ఈ కాకి చెమ్మల యుపన్యాసములు గాలికిపోవునే కాని నిల్చునవి కావు’’ అంటాడు జంఘాల శాస్త్రి. వెర్రిచేష్టలు అని ఆంధ్రనామ సర్వస్వం, ‘మూర్చలో కలిగే పెక్కువికారాలు’ అని శ్రీహరి నిఘంటువు అర్థాలిచ్చాయి. డా।। ఓఏ శర్మ వైద్యశాస్త్ర నిఘంటువు మాత్రం epilepsy అంటే ‘కాకిసొమ్మ, మూర్ఛలరోగం’ అని చెబుతోంది.
‘కాకిచెమ్మల మనిషి’ అని ఓ ప్రయోగం ఉంది. కళిగాంధ్ర మాండలికంలో దీనికి ‘అడ్డరపు మనిషి/ విడ్డూరపు మనిషి’ అని అర్థం. 
కేపుమారి
‘‘కాలాచార్యులు రాజుగారిచ్చిన కన్యాదాన ధనమును కేపుమారి మామగారి ఒడిలో పోశాడ’’ంటాడు. జంఘాల శాస్త్రి. చూసేవాళ్ల కన్నుగప్పి వస్తువులను మాయం చేసేవాడే కేపుమారి. swindleకి ‘కేపుమారి, మాయలమారి’ అనే తెలుగర్థాలిచ్చి, కేపుమారి తమిళ పదం అన్నాడు బ్రౌన్‌!
పొసగువాడు
‘‘వైద్యుడు లేని మరణము- పొసగుడువాడు లేని పశువుల సంతయు లేవు’’ అంటాడు జంఘాలశాస్త్రి. బేరం కుదిర్చేవాడు అని ఈ మాటకు అర్థం. ‘పొసగడం’ అంటే అనుకూలంగా చేయడం. ‘పొసగుడుకాడు’కు ‘బేరం పొసగజేయువాడు’ అని అర్థం చెబుతుంది సూర్యరాయాంధ్ర నిఘంటువు.
తలబీకన కాయలు
‘‘తోకచుక్క మన భూమిని కొడితే తలబీకనకాయలై యెగసిపడి ఆకాశం నుండి పడిపోవడం ఖాయం’’ అంటాడు జంఘాలుడు. గందరగోళం పడిపోవడం, కలత చెందడం అని ఈ పదానికి అర్థం. బ్రౌన్‌ ‘తలబీకనకాయ’ అనే మాటకి puzzle, riddle, difficulty అనే ఆంగ్ల అర్థాలిచ్చాడు.
బాబాకరపు బ్రహ్మచారి
ఘోటక బ్రహ్మచారికి పర్యాయపదంగా దీన్ని ప్రయోగించారు పానుగంటి. ఘోటకం అంటే మగ గుర్రం. అది అంతవరకూ బాగానే ఉంటుంది. ఆడగుర్రం కనిపించిన వెంటనే దాన్లో కామవికారాలు మొదలవుతాయి. అందుకే బ్రహ్మచారినని కబుర్లు చెబుతూ స్త్రీని చూశాక హావభావాల్లో కామాన్ని ప్రదర్శించే వారిని ‘ఘోటక బ్రహ్మచారి’ అంటారు. ఇక ‘బాబా’ అంటే గుర్రం (ఆడ లేదా మగ). కాబట్టి బాబాకరపు బ్రహ్మచారి అనే పదబంధాన్ని పురుషులకు ప్రయోగించారు పానుగంటి. స్త్రీల విషయం వచ్చేసరికి ‘బాబాకరపు చూపులు’ అన్నారు. 
పంచబంగాళం
‘‘పెద్దన్న తిక్కన్నల కవితా తారతమ్యం.... వ్యాసతేజము ముందు పంచబంగాళమగును’’ అన్నది ప్రయోగం. ఇందులో పంచబంగాళం అంటే చెల్లాచెదురైపోవడం, బాగా చెదిరిపోవడం. ‘పంచముపాడు’ అనేది దీనికి రూపాంతరం. పంచ అంటే ‘అధికం’ అని తెలుసును కానీ ‘బంగాళం’ అంటే సరైన అర్థం దొరకలేదు. ‘వంగ దేశం, ఇక్షు విశేషం’ అని మాత్రమే చెప్పింది సూర్యరాయాంధ్ర నిఘంటువు. బ్రౌణ్యానిదీ అదే మాట. 
డోకడాలు
బొర్రయ్య గురించి చెబుతూ ‘‘ఇతడు డోకడాలవలీలగా కట్టగలవాడు’’ అంటాడు సాక్షి. వడ్డీ కట్టడానికి మూలధన సంఖ్యను కాలంతో గుణించగా వచ్చిన మొత్తం అని ఈ మాటకు అర్థం. ఉదాహరణకు నెలకి వంద రూపాయలకు రూ.2 వడ్డీ చొప్పున వెయ్యి రూపాయలకు అయ్యే వడ్డీని ఇలా లెక్కిస్తారు... 1000్x12 (నెలలు)x2/ 100=240. ‘ఏదైనా ఒక నాణెంలో నూరవభాగం’ అనే అర్థం కూడా ఈ పదానికుంది.
ఎగ
‘పశువుల సంత- స్వప్నం’లో బారుకొమ్ములగేదె ‘‘ఎగ వచ్చినప్పుడేది లభించునో దానితోనే తాత్కాలికపు పెళ్లి’’ అంటుంది. కామోద్రేకం అని దీనికర్థం. బ్రౌన్‌ excite, tempt అన్నాడు.
చపేటం
‘‘రెండు చపేటములూచి పుచ్చుకొని యా ... నాకు కటాక్షించెను’’... ఇదీ వాక్య ప్రయోగం! వేళ్లు చాచి అరచేత్తో ఎదుటివ్యక్తి చెంపను చెళ్లుమనిపించడమే చపేటం. చెంపదెబ్బ, జెల్లకాయ, లెంపకాయ అనే అర్థాలూ ఉన్నాయి. దీన్నే (slap అన్నాడు బ్రౌన్‌.
గాడిదగత్తర
‘‘శ్లోకము కీర్తనముగాగ ఎంత గాడిదగత్తర యగునో’’ అన్న వాక్యంలో ఈ మాట కనిపిస్తుంది. గాడిదగోల, గందరగోళం, అల్లరి అనే అర్థాలు నిఘంటువుల్లో ఉన్నాయి. గత్తర అంటే ఒక క్రమం లేకుండా కలిసిపోయి ఉండటం. ఈ పదంతో గాడిద ఎందుకు కలిసిందో మరి! 
పులికాపు
‘‘నా అభిప్రాయములను పులికాపు చేసి మెరుగుపెట్టి..’’ అన్నది పానుగంటి భాష. లోహంతో చేసిన దేవతా విగ్రహాలను చింతపండు కలిపిన నీటితో శుభ్రం చేయడాన్ని ‘పులికాపు చేయడం’ అంటారు. అభిప్రాయాన్ని పులికాపు చేయడమంటే.. అది స్పష్టమయ్యేలా క్రమపద్ధతిలో పెట్టడం.
బ్రహ్మకాయ
‘‘జంఘాల శాస్త్రి... బ్రహ్మకాయవలె వటవట వదరుచున్నాడ’’ట! వదరుబోతు, వాచాలుడు అని దీని అర్థం. ‘స్వవిషయములందు కాక పరుల విషయములను, వస్తువులను గ్రహించుటయందు శ్రద్ధగలవాడు’ అంటుంది సూర్యరాయాంధ్ర నిఘంటువు.
రెట్టకాయ
‘‘ఒక యువతి రెట్టకాయంత బొట్టు పెట్టుకుని... కనబడింద’’ట! ‘కుంకిడికాయ’ అని దీని అర్థం. శ్రీహరి నిఘంటువు ప్రకారం ఇది చిత్తూరు జిల్లా మాండలికం రెండూ ఒకటిగా కలిసిన (కవల)కాయ అనే అర్థం కూడా దీనికి ఉందట.
నానుకోళ్లు
‘‘ఒక కాంత... మెడలో నానుకోళ్లుగలది’’ అంటాడు జంఘాలశాస్త్రి. A gold necklace of small sticks ( అన్నాడు బ్రౌన్‌. ‘నానుక్రోవి, నానుచుట్టు అనేవి పర్యాయపదాలు. ‘హంసవింశతి’ కవి అయ్యలరాజు నారాయణ ‘‘కుప్పెరాగిడిబిళ్ల‌.... ’’ పద్యంలో స్త్రీలు ధరించే ఇలాంటి ఆభరణాలన్నెన్నింటినో ప్రస్తావించాడు.
మింటిగుమ్మటం
‘‘మనకు ప్రయాణమునకు... మింటి గుమ్మటములక్కరలేదు’’, ‘‘...ఇంటి యావిడనెవ్వడో మింటి గుమ్మటమున గొనిపోయె’’ అని రెండు ప్రయోగాలు పానుగంటి రచనల్లో కనిపిస్తున్నాయి. ‘గుమ్మటం’ అంటే బెలూన్‌. స్కైబెలూన్‌ అంటే ఆకాశగుమ్మటం. దీనినే ‘మింటి గుమ్మటం’ అన్నారు. వేడిగాలిని ఉపయోగించి ఆకాశంలో ప్రయాణం చేసేది వేడిగుమ్మటం.
ముచ్చెనగుంట
‘‘మా జడచుట్టలు బిగిగానున్నయెడల మా ముచ్చెనగుంటలోని చిరువెండ్రుకలే రాలిపోవును’’ అని అంటుంది ఓ మహిళ జంఘాలుడితో. ‘తల, మెడ కలిసిన వెనకవైపు గుంట’ అని దీనర్థం. ‘ముచ్చిలిగుంట, అవటు ప్రదేశం’ దీని పర్యాయ పదాలు. The nape or hollow at the back of the neck అన్నాడు బ్రౌన్‌.
రాగిడి
‘‘స్వదేశీయోద్యమానికి ఒకామె రాగిడి ఆభరణమిచ్చిందంటాడు’’ జంఘాలశాస్త్రి. బాలికలు నెత్తి మీద పెట్టుకునే నగ ఇది. ‘రాగిడీబిళ్ల, రాకిడి’ అనే రూపాలూ ఉన్నాయి.
తమ్మంటులు
యువకుల అధునాతన వేషాలను విమర్శిస్తూ ‘‘ఆ కుక్క చెవులలో ముత్తెపు చిప్పల తమ్మంటువెందులకు’’ అంటాడు జంఘాలశాస్త్రి. చెవిపోగులు అని దీనర్థం. ‘తమ్మె’/ ‘తమ్మియ’ అంటే చెవి అడుగు భాగం. ‘తమ్మెట్లు’ ఇంకా వాడుకలో ఉంది.
దూముడి
మన చాకచక్యాన్ని ‘‘మనల బిగించిన తూముళ్లను’’ సడలించుకోడానికి ఉపయోగించుకోవాలి అంటాడు జంఘాలశాస్త్రి. జారుముడి, సులభంగా తీయడానికి వీలుగా వేసిన ముడి అని ఈ మాటకు అర్థం. ‘దూయు’ అంటే (కత్తి తదితరాలు) లాగడం. ‘దూయు+ముడి= దూముడి’ అంది సూర్యరాయాంధ్ర నిఘంటువు. ‘దుస్సిపోయేముడి’ అని చెప్పింది బ్రౌణ్యం.
తంటసం
‘‘పడుచువాండ్రుగా గానబడుటకు కనుబొమలమీది తెల్లవెండ్రుకలను దంటసముచే లాగించుచున్నార’’ట! ‘క్షురకుడు వెంట్రుకలు ఊడబెరికే పనిముట్టు’, ‘చిన్నపట్టకారు’ అనే అర్థాలున్నాయి ఈ మాటకు. ‘ఎలుగుబంటికి తంటసపుపని’ అనే సామెత ఉంది. ‘చిమ్మట, కుటిలిక, తండసం’ అనేవి దీనికి పర్యాయపదాలు. tweezers అన్నాడు బ్రౌన్‌.  
జుంజురు వెండ్రుకలు
‘‘జుంజురు వెండ్రుకలవారు వచ్చార’’ంటాడు జంఘాలశాస్త్రి. చింపిరి జుట్టువాడు అని అర్థం. ‘సంస్కారవిహీనమై విరియబోసిన వెంట్రుకలు’ అని చెప్పాడు బ్రౌన్‌.
ఇలా చెప్పుకుంటేపోతే ఎన్నో పదాలు! ‘‘కుర్రవానికి కొంచెం నమలబెట్టుమమ్మా’’ అంటుంది అత్తగారు. స్తన్యమివ్వడం, పాలివ్వడం అని ఈ మాటకర్థం. ‘‘మఖశాలలో చేరి తైతక్కలాడటం’’ అనే వాక్యంలోని ‘మఖశాల’... తలవాకిటి చావడి. ‘మొగుణ్ని కొట్టి మొగశాలకెక్కింది’ అనే సామెతలోని ‘మొగశాల’కి మూలం ఈ మఖశాలే. జ్యోతిష్యుణ్ని ‘కార్తాంతికుడు’ అన్నారు పానుగంటి. కృతాన్నీ(జరిగినదాన్నీ), అంతాన్నీ(చివరిదాకా జరిగేదాన్నీ) చెప్పేవాడు కాబట్టి అతడు కార్తాంతికుడు. ‘వదరుబోతు’ అనే అర్థంలో ‘వావదూకు, వాచాటుడు’ అనే మాటలు వాడారు. అశ్వశాలను ‘లాయం’ అనీ, ఆడగుర్రాన్ని ‘గోడిగ’ అనీ, ఏనుగులను ఉంచే స్థలాన్ని ‘ఆలానశాల’ అనీ ప్రయోగించారు. ‘‘దగయగునెడల సోడా సిద్ధముగనేయున్నది’’ అన్న వాక్యంలోకి ‘దగ’ అంటే అతి దాహం. ‘‘మన తేరయేడుపులు మనల రక్షింపగలవా?’’ అన్నారు పానుగంటి మరో సందర్భంలో. ఉత్తుత్తి, దొంగ ఏడుపులని దీనికర్థం. పూర్వ సాహిత్యాన్ని పరిశీలించాలే కానీ, ఈనాడు వ్యవహార దూరమైన మాటలెన్నో కనిపిస్తాయి. ఆ పదమందారాలను తిరిగి తెలుగుతల్లి సిగలో అలంకరించాల్సిన బాధ్యత భాషాభిమానులదే.


వెనక్కి ...

మీ అభిప్రాయం