తెలుగుతోనూ జయం జయం

  • 1336 Views
  • 10Likes
  • Like
  • Article Share

ఆఁ... దండగండీ! తెలుగు మాధ్యమంలో చదువుకున్నవాళ్లు ఏమీ సాధించలేరండీ!! అంటూ నాలుక చప్పరించేవాళ్లకి చెంపపెట్టులాంటి విజయాలివి. అమ్మభాషలో విద్యాభ్యాసంతోనే పిల్లల్లో నిజమైన నైపుణ్యాలు వృద్ధిచెందుతాయనే పరిశోధకులు, భాషాభిమానుల వాదన తిరుగులేనిదని చాటిన గెలుపు కథలివి. అఖిలభారత సర్వీసులకు సమర్థులను ఎంచడానికి యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ తెలుగుతేజాలు చూపించిన ప్రతిభ... విద్యావ్యవస్థలోంచి కనుమరుగవుతున్న తెలుగు మాధ్యమం ప్రాధాన్యాన్ని పట్టి చూపించింది. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దనే సందేశాన్ని బలంగా వినిపించింది.
పది లక్షల మంది రాసిన సివిల్స్‌ పరీక్షల్లో గెలిచింది వెయ్యిమంది! వాళ్లలో దాదాపు 90 మంది వరకూ తెలుగువాళ్లు. వీళ్లలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణతో సహా మరికొంతమంది తెలుగు మాధ్యమం విద్యార్థులు విశేషంగా రాణించారు. దీనికి కారణమేంటి? దీనికి సమాధానం ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ మాజీ అధ్యక్షులు, ‘పద్మశ్రీ’ డా।। అశోక్‌ పంగారియా మాటల్లో కనపడుతుంది. ‘‘మానవ నియోకోర్టెస్క్‌ (మెదడు పైభాగం)లో పెద్ద భాషాసంబంధిత ప్రాంతం ఉంటుంది. తెలివితేటలు, విశ్లేషణాశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను అది ప్రభావితం చేస్తుంది. మాతృభాషలో చదువుకుంటున్నప్పుడు అది విశేషంగా స్పందిస్తుంది. చదివిన విషయ సారాంశాన్ని మెదడు జీర్ణించుకుంటుంది. దాని లోతుపాతులపై మెరుగైన పద్ధతిలో చర్చించడానికి, తిరిగి ప్రశ్నించడానికి అవసరమైన చురుకుదనాన్నీ ప్రేరేపిస్తుంది’’ అంటారాయన. 
      శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోలు కిషోర్‌రెడ్డిని గమనిస్తే పంగారియా మాటలు అక్షరసత్యాలని అర్థమవుతుంది. కిషోర్‌ పదో తరగతి వరకూ తెలుగుమాధ్యమంలో చదువుకున్నారు. ఇంటర్లో ఆంగ్ల మాధ్యమానికి మారారు. వెయ్యికి 961 మార్కులు సంపాదించారు. ఆ తర్వాత ఎంసెట్‌లో 2100 ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ‘గేట్‌’ రాస్తే జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు ఒడిసిపట్టారు. ముంబై ఐఐటీలో ఎంటెక్‌ చదివి, బంగారు పతకం అందుకున్నారు. ఇప్పుడు సివిల్స్‌లో 468వ ర్యాంకు  సాధించారు. తెలుగు రూపంలో పునాది గట్టిగా ఉండటంతోనే అన్నిచోట్లా గెలిచానంటారాయన. ‘‘సివిల్స్‌ పరీక్షల్లో నెగ్గేందుకు ఆంగ్లంలో ప్రావీణ్యం అవసరం లేదు. తెలుగు మాధ్యమంలో చదివినా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. దీనికి నేనే ఉదాహరణ’’ అంటారు కిషోర్‌. ఆంగ్లంలో చదువుకుంటే తప్ప భవిష్యత్తు లేదనే చాలామందికి ఈ కుర్రాడి విజయగాథ ఓ కనువిప్పు లాంటిదే!
సామర్థ్యానికి పదునుపెట్టే భాష
బట్టీకొట్టిన ‘పరిజ్ఞానం’తో గట్టెక్కే పరీక్షలు కావు సివిల్స్‌ అంటే! అభ్యర్థుల నిజమైన నైపుణ్యాలను, వాళ్ల తార్కిక విశ్లేషణా శక్తినీ పరీక్షిస్తాయి ఇవి. అమ్మభాషలో చదువుకున్న విద్యార్థులకు ఈ నైపుణ్యాలు సహజంగా అబ్బుతాయి. ‘‘మాతృభాషలో విద్యాభ్యాసం స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తుంది. శక్తిని పెంచుతుంది. సహజ మేథస్సుకు వన్నెలద్దుతుంది. మౌలికాంశాల మీద లోతైన అవగాహనను పెంచుకోవడానికి తోడ్పడుతుంది’’ అని చెబుతారు ‘ఇస్రో’ చంద్రయాన్‌ ప్రాజెక్టు సంచాలకులు మేల్‌స్వామి అన్నాదురై. సివిల్స్‌లో 555వ ర్యాంకు సాధించిన బండారు రంజిత్‌ కుమార్‌ కూడా ఈ వాదనను సమర్థిస్తారు ‘‘తెలుగు మాధ్యమంలో చదివితే చదివినవి బాగా గుర్తుంటాయి. సులభంగా అర్థమవుతాయి. స్పష్టత అనేది ఎక్కువగా తెలుగు మాధ్యమం వాళ్లకే ఉంటుంది. తెలుగు సాయంతో ఎలాంటి పోటీ పరీక్షకైనా నిర్భయంగా వెళ్లొచ్చు’’ అంటారాయన. జయశంకర్‌ జిల్లా ములుగు మండల కేంద్రానికి చెందిన రంజిత్‌, ఎనిమిదో తరగతి వరకూ తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు. పాఠశాలల్లో కనీసం అయిదో తరగతి వరకైనా తెలుగు మాధ్యమం తప్పనిసరిగా ఉండాలని, ఆ తర్వాత అవసరమైతే ఆంగ్ల మాధ్యమంలోకి మారొచ్చని సూచిస్తారు.
      అనంతపురం జిల్లా యాడికి మండలం భోగాలకట్ట గ్రామానికి చెందిన జగదీశ్వరరెడ్డిదీ ఇదే మాట. తొమ్మిదో తరగతి వరకూ తెలుగులోనే చదువుకున్న ఈయన, సివిల్స్‌లో తెలుగునే ఐచ్ఛికాంశంగా తీసుకుని 249వ ర్యాంకు సాధించారు. ‘‘తెలుగు మాధ్యమంలో చదువుకున్నవాళ్లు సివిల్స్‌ రాయలేరు,  రాసినా మంచి ర్యాంక్‌ దక్కదనేది అపోహ మాత్రమే. మెయిన్స్‌లో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాచారం ఎంత మేరకు రాశామనేదే ప్రధానం’’ అన్నది జగదీశ్వరరెడ్డి మాట. ఇదే జిల్లా గుత్తి మండలం సూరసింగనపల్లికి చెందిన కృష్ణకాంత్‌యాదవ్‌దీ ఇలాంటి విజయచరితే. ఇంటర్‌ వరకూ తెలుగులోనే చదువుకున్నారు కృష్ణకాంత్‌. తనలానే ఇంటర్‌ దాకా తన మాతృభాషలో చదువుకుని, ఐపీఎస్‌ సాధించిన ఓ తమిళ స్నేహితుడి స్ఫూర్తితో సివిల్స్‌ రాశారు. 620 వ ర్యాంకు సాధించారు. ‘‘తెలుగు మాధ్యమం విద్యార్థులు ఎవరైనా సివిల్స్‌ రాయాలనుకుంటే, తెలుగులో చదువుకున్నాం కాబట్టి మనమేదో తక్కువస్థాయి వాళ్లమనే భావనను పక్కనపెట్టాలి. మనం ఎవరికీ తీసిపోమ’’ని తోటివారిలో ఆత్మవిశ్వాసం నింపుతారు కృష్ణకాంత్‌. 
      353వ ర్యాంకు సాధించిన మరో సీమ (కడప) కుర్రాడు పవన్‌కుమార్‌రెడ్డి కూడా ఇంటర్‌ వరకూ తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు. ‘‘మాతృభాషలో ప్రాథమిక విద్యను పూర్తిచేయటం వల్ల ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోగలిగాను. ఇంటర్‌ తర్వాతే ఆంగ్లం మీద దృష్టిపెట్టాను. తెలుగు మాధ్యమంలో చదివేవారిని చిన్నచూపు చూసే పరిస్థితి పోవాల’’ంటారు పవన్‌. ఈయన తర్వాత స్థానంలో (354వ ర్యాంకు) నిలిచిన సునీల్‌కుమార్‌రెడ్డిదీ కడపే. ఆయన కూడా ఏడో తరగతి వరకూ తెలుగు మాధ్యమం విద్యార్థే. ‘‘నిజంగా ఎవరెన్ని అనుకున్నా తెలుగుకు ఉన్న మాధుర్యం చెప్పలేనిది. ఎవరూ వెలకట్టలేనిది. అసలు తెలుగుబిడ్డగా జన్మించడమే ఓ వరం’’ అంటారు డా।। జి.పూజిత. చిత్తూరు జిల్లా కేబీఆర్‌పురం గ్రామానికి చెందిన ఈ వైద్యురాలు 282వ ర్యాంకు సాధించారు. నాలుగో తరగతి వరకూ తెలుగులోనే చదువుకున్న పూజిత, ‘దేశభాషలందు తెలుగులెస్స’ అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలను ఎన్నటికీ మరిచిపోలేనంటారు. 
కలాం చెప్పిన మాట...
‘‘అమ్మభాషలో చదువుకోవడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. పాఠ్యాంశాన్ని త్వరగా అర్థం చేసుకునే శక్తీ సమకూరుతుంది. నేను పదో తరగతి వరకూ మాతృభాషా మాధ్యమంలోనే చదువుకున్నా. తర్వాత ఆంగ్లం నేర్చుకున్నా. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలు చూపించే సృజనాత్మకతే వారి భవిష్యత్తుకు పునాది. ఆ సృజనాత్మకత అమ్మభాషలో చదువుతోనే సాధ్యం’’ అని చెప్పేవారు అబ్దుల్‌ కలాం. తెలుగు మాధ్యమ విద్యార్థులు సివిల్స్‌లో ఇంతగా విజయవంతం కావడానికి ఆ సృజనాత్మకతే కారణం. ఇక, నాకూ తొమ్మిదో తరగతి వరకూ పెద్దగా ఆంగ్లం తెలియదు అంటారు చింతా కుమార్‌. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఈయన 608వ ర్యాంకు సాధించారు. ‘‘తెలుగు కమ్మటి భాష. అమ్మలాంటిది. నేను ఇంటర్మీడియట్‌ వరకూ పూర్తిగా తెలుగులోనే చదివా. తొమ్మిదో తరగతి తర్వాత ఉపాధ్యాయులు, నిఘంటువుల సాయంతో ఆంగ్లం మీద  పట్టుపెంచుకున్నా’’నని చెబుతారు కుమార్‌. మాతృభాష మీద పట్టున్న వాళ్లు ఏ భాషనైనా నేర్చుకోగలరన్నది ఇప్పటికే పరిశోధనల్లో తేలిన విషయం! కలాం చెప్పినట్టు సహజసిద్ధమైన సృజనాత్మకతతో గెలిచిన మరో యువకుడు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగురాయపురం గ్రామానికి చెందిన విద్యాధర్‌. పదో తరగతి వరకూ తెలుగులోనే చదువుకున్న ఈయన, ఎలాంటి శిక్షణా తీసుకోకుండా 487వ ర్యాంకు సాధించారు. 
      వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన చెన్నూరి రూపేశ్‌దీ ఇలాంటి ప్రయాణమే. పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలుగులోనే చదువుకున్న ఈయనకు 526వ ర్యాంకు వచ్చింది. ‘‘గతంలో మూడుసార్లు పరీక్ష రాసినా ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. కాని ఈసారి ఒక్క పేపర్‌ కోసం మాత్రం నెలరోజుల పాటు శిక్షణ పొందా. పాఠశాల స్థాయి నుంచే తెలుగు మీద పట్టు సాధించడమే నాకు బలమైంది. ముఖాముఖిలో నీ హాబీలేంటని అడిగారు. పుస్తకాలు చదవడం అని చెప్పా. ఆత్మకథలు ఎక్కువగా చదువుతానని చెప్పాను. వాటి ద్వారా విజేతల స్వీయ అనుభవాలు తెలుసుకోవచ్చని చెప్పాను’’ అంటూ అమ్మభాష, పుస్తకపఠనంలతో ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తారు రూపేశ్‌. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఉప్పరపల్లె వాసి కొప్పుల సురేశ్‌ కూడా ఇంటర్‌ వరకూ మాతృభాషలోనే విద్యాభ్యాసం చేశారు. తెలుగు సాహిత్యాన్ని ఐచ్చికంగా తీసుకుని సివిల్స్‌ రాశారు. 895వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ‘‘తెలుగు సాహిత్యానికి సంబంధించి పుస్తకాల సేకరణ కొంత ఇబ్బందిగా మారినప్పటికీ మాతృభాషపై నాకున్న విశ్వాసంతో దాన్ని ఎంచుకున్నాను’’ అని అంటారాయన. నిజామాబాద్‌ జిల్లా ఇసాపల్లి వాసి పట్టెం ప్రేమ్‌ప్రకాశ్‌ కూడా తెలుగు సాహిత్యాన్నే ఐచ్ఛికంగా తీసుకుని 1015వ ర్యాంకు సంపాదించారు. ‘‘నన్నయ, తిక్కన, శ్రీశ్రీ, సినారె, గుర్రం జాషువా లాంటి పండితకవుల కవిత్వాన్ని ఆస్వాదిస్తూ చదివాను. తెలుగు మీద నాకున్న ఆసక్తితో ఆయా కవుల శైలీ విశ్లేషణలను సులభంగా చేయగలిగాను. నా స్నేహితుడు శీనయ్యకు తెలుగు మీద మంచి పట్టు ఉంది. తెలుగు అధ్యయనంలో తను నాకు బాగా సహకరించారు’’ తెలుగు తీపినీ,  స్నేహబంధంలోని మధురిమను చాటిచెబుతారు ప్రేమ్‌ప్రకాశ్‌.  
అమ్మభాషే పెద్ద వరం
‘తెలియని భాషలో పాఠశాల విద్యను ప్రారంభించే వారికంటే మాతృభాషలో చదువుకు నాంది పలికే పిల్లలు విద్యానైపుణ్యాలను ఒడిసిపట్టడంలో ముందుంటారు’... 150 దేశాల్లో అధ్యయనం చేసి మరీ యునెస్కో చెప్పిన మాట ఇది. సిద్ధిపేట జిల్లా కల్వకుంటకు చెందిన నరేశ్‌ లాంటి వారిని చూస్తే ఇది కచ్చితంగా వాస్తవమేనని అర్థమవుతుంది. సివిల్స్‌లో 979వ ర్యాంకు సాధించిన నరేశ్‌, గురుకుల పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదివారు. సివిల్స్‌లో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా తీసుకున్నారు. ‘‘మాతృభాష మీదుండే సహజ ఆసక్తితో తెలుగు పాఠ్యాంశాలను సులభంగా అర్థంచేసుకోవచ్చు. పైపెచ్చు పాఠ్యసామగ్రి బాగా దొరుకుతుంది. కాబట్టి ర్యాంకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంద’’ంటారాయన. 741వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్‌ వాసి రవితేజ యాదవ్‌ కూడా పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమం విద్యార్థే. తెలుగు మాధ్యమంలో సివిల్స్‌ రాస్తే విజయావకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని చెబుతారాయన. 812వ రాం్యకు సాధించిన విజయనగరం జిల్లా కుర్రాడు గ్రంథి మనోజ్‌బాబు కూడా అయిదో తరగతి వరకూ అమ్మభాషలోనే విద్యాభ్యాసం చేశారు. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో తెలుగు మాధ్యమ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నది ఒట్టి అపోహ మాత్రమేనని చెబుతారు. 
      మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ మెయిన్స్‌ను తెలుగులోనే రాశారు. దీని వల్ల ప్రయోజనమేంటో అదే జిల్లాకు చెందిన 588వ ర్యాంకరు ఇజ్జాడ మధుసూధనరావు మాటల ద్వారా తెలుస్తుంది. ‘‘తెలుగు మాధ్యమంలో చదవడం చాలా ప్రయోజనకరం. చదివిన విషయాలు సులువుగా అర్థం కావడంతో పరీక్షల్లో మనస్ఫూర్తిగా రాయడానికి వీలవుతుంది. ప్రశ్నలు ఆంగ్లంలో ఉన్నప్పటికీ, వాటిని అర్థం చేసుకుని తెలుగులో చక్కగా సమాధానాలు రాయవచ్చు. పైగా తెలుగులో రాస్తే, భయపడకుండా వేగంగా రాయగలుగుతాం’’ అంటారు మధు. ఈయన పూర్తిగా తెలుగు మాధ్యమం విద్యార్థి. 
      ‘‘నా దృష్టిలో తెలుగు మన మాతృభాషే అయినా అది నేర్చుకోవడమే కష్టం. ఒక్కసారి దాన్ని సరిగ్గా నేర్చుకున్నామా ఇక ఏ భాషనైనా ఇట్టే నేర్చుకోవచ్చు. అందుకే నాకు ఇంటర్‌లో కానీ, ఇంజినీరింగ్‌లో కానీ ఏదీ కష్టం అనిపించలేదు’’ అనే విశ్వాప్రగడ ఫణీంద్ర 412 ర్యాంకు సాధించిన ఈయనది తూర్పుగోదావరి జిల్లా శానవిల్లిలంక. అక్కడి జిల్లాపరిషత్తు పాఠశాలలోనే పదో తరగతి వరకూ చదువుకున్నారు. ‘‘కేవలం సాఫ్ట్‌వేర్‌ రంగం వల్లే ఇంగ్లిషు పట్ల వ్యామోహం పెరిగిపోయింది. కంప్యూటర్‌ కోడింగ్‌ తెలుగులో ఉంటే దాని ప్రాధాన్యం తగ్గిపోతుంది! తెలుగు బతకడానికి పనికిరాని భాష అని ముద్ర వేశారు. విద్య అనేది జ్ఞాన సముపార్జన కోసం కాక ఉపాధి కోసం మాత్రమే అన్నట్టుగా మారిపోయింది. అందువల్లే భాషకు ఈ దుస్థితి. నిజానికి కమ్యూనికేషన్‌ అంటే భాష కాదు. భావవ్యక్తీకరణ మాత్రమే. తెలుగు మాట్లాడటం అంటే చక్కగా మాట్లాడగలగాలి. అదీ నేర్చుకోవడం అంటే. భాష పరిరక్షణ ప్రయత్నాలు మరిన్ని జరగాలి. ఏదైనా సాధించడానికి కావాల్సింది కృషి, పట్టుదల మాత్రమే. సివిల్స్‌ విషయానికి వస్తే కావాల్సిన మెటీరియల్‌ అందుబాటులో ఉందా, లేక మనమే తయారు చేసుకోవాలా అన్నది చూసుకోండి. అది తప్ప తెలుగు మాధ్యమ విద్యార్థులకు మరే అడ్డంకీ లేదు’’ అనే ఫణీంద్ర లాంటి వారి విజయగాథలను విన్న తర్వాతైనా తెలుగునాట అమ్మభాష మీద గౌరవం పెరుగుతుందా!?

సహకారం: ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం, తెలుగు సివిల్‌ సర్వెంట్స్‌ అసోసియేషన్‌


వెనక్కి ...

మీ అభిప్రాయం