ఇవిగో బుజ్జి కథలు! అవిగో జేజిమామయ్య పాటలు!

  • 1979 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.రాధ‌

  • విజ‌య‌వాడ‌
  • 9032044635
వి.రాధ‌

తరతరాలుగా తెలుగు ఇళ్లలో బామ్మలు, తాతయ్యలూ తమ మనువళ్లు, మనువరాళ్లకు తీరిక వేళల్లో ఆసక్తికరమైన కథలు, పద్యాలు, గేయాలు వినిపించేవారు. ఎంతో ఘనమైన ఈ మౌఖిక వారసత్వ సంపద అచ్చుయంత్రం వచ్చాక లిఖితరూపం దాల్చింది.  ఆ తర్వాత పత్రికలు నడుంకట్టడంతో సరికొత్త బాలసాహిత్యం పురుడుపోసుకుంది. తెలుగింటి చిన్నారులను విజ్ఞాన, వినోదాల ప్రపంచంలో స్వేచ్ఛగా విహరింపజేసింది. 
‘‘బాలసాహిత్య వికాసానికి, ప్రచారానికి సాధనాలైన వాటిలో ప్రథమస్థానం పత్రికలదే. బాలల పఠనానురక్తికి, భాషాభివృద్ధికి అవి ఎంతో దోహదకారులు. బెంగాలీ, హిందీ మొదలైన భాషల్లో ఈ శతాబ్దం తొలిపాదంలోనే పిల్లలకు ప్రత్యేకమైన పత్రికలు వెలువడ్డాయి. ఇంగ్లీషులో అంతకు ముందే సర్వతోముఖంగా బాలసాహిత్యం అభివృద్ధి చెందింది. తెలుగులో 1940 వరకూ బాలలకు ప్రత్యేకమైన పత్రిక లేదు. కొన్ని సాహిత్య పత్రికల్లో బాలశీర్షికలు లేదా విభాగాలు మాత్రం కేటాయించబడ్డాయి’’ అంటారు ‘తెలుగులో బాలగేయ సాహిత్యం’ మీద తొలిసారి పరిశోధన చేసిన డా।। యం.కె.దేవకి. అలా తెలుగులో బాల సాహిత్యాన్ని తొలిసారిగా అచ్చొత్తింది ‘జనవినోదిని’ మాసపత్రిక. మద్రాసు స్కూల్‌ బుక్‌ సొసైటీ తరఫున 1875- 1885 మధ్య ఈ పత్రిక వెలువడింది. ‘చిట్ల పొట్లకాయ, సీమ చింతకాయ’ లాంటి బాలల గేయాలను ఇది ప్రచురించింది. తర్వాత 1908- 1910 మధ్య ‘వివేకవతి’ మాసపత్రిక పిల్లల కోసం సరళ భాషలో కథలు, గేయాలు అందించింది. ఈ పత్రికలో గిడుగు వెంకట సీతాపతి రాసిన ‘రైలుబండి, చిలుకమ్మ పెండ్లి’ లాంటి గేయాలకు స్థానం దక్కింది. కాకినాడ నుంచి వింజమూరి వెంకటరత్నమ్మ వెలువరించిన మహిళాపత్రిక ‘అనసూయ’ కూడా బాలసాహిత్యానికి వేదికైంది. కృష్ణశాస్త్రి రచించిన బాలగేయాలు ఇందులో వచ్చాయి.  
      కాశీనాథుని నాగేశ్వరరావు నేతృత్వంలోని ‘ఆంధ్రపత్రిక’ వారపత్రిక బాలసాహిత్యానికి ప్రాధాన్యమిచ్చింది. ‘బాలభారతి’ (1924), ‘నవ్వులతోట’ (1925) లాంటి పత్రికల ద్వారా వావిలికొలను సుబ్బారావు కూడా బాలసాహిత్యాన్ని అందించారు. 1928లో ‘గృహలక్ష్మి’ మహిళల మాసపత్రికలో ‘తొక్కుపల్కులు, పొడుపు కథలు, వినోద కథలు, నీతి కథలు’ లాంటి రచనలతో ‘బాలవిజ్ఞాన శాఖ’ అనే శీర్షిక ప్రారంభమైంది. కౌతా శ్రీరామశాస్త్రి ‘శారద’, కాశీనాథుని ‘భారతి’ పత్రికల్లోనూ ఎన్నో బాలల రచనలు వెలువడ్డాయి. గిడుగు సీతాపతి ‘భారతి’లో ‘బాలానందం’ అనే కొత్త శీర్షికను ప్రారంభించి బాలసాహిత్య ప్రగతికి పునాదులు వేశారు. 
      బాలసాహిత్య రంగంలో ఓ కొత్తశకానికి నలభయ్యో దశకం నాంది పలికింది. మేడిచర్ల ఆంజనేయమూర్తి సంపాదకత్వంలో 1940లో ‘బాలకేసరి’ ప్రారంభమైంది. ఇది తొలి తెలుగు పత్రిక. అయితే, కొంతకాలమే నడిచింది. అనంతరం ‘బాల’ సచిత్ర మాసపత్రిక వచ్చింది. ‘రేడియో అన్నయ్య’ న్యాయపతి రాఘవరావు 1945లో దీన్ని ప్రారంభించారు. ఎందరో రచయితల్ని బాలసాహితీవేత్తలుగా మలచిందీ పత్రిక. ఆ తర్వాత 1946లో నాగిరెడ్డి-చక్రపాణిలు ప్రారంభించిన ‘చందమామ’ బాగా జనాదరణ పొందింది. రెండు మూడు తరాలను విశేషంగా ప్రభావితం చేసింది. దీని స్ఫూర్తితో ‘బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి’ లాంటి పత్రికలు వెలిశాయి. 1976లో ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమీ ఏర్పడి బాలల సాహిత్యాభివృద్ధికి చాలా కృషి చేసింది. 1979లో ‘బాలచంద్రిక’ మాస పత్రికను ప్రారంభించి అన్ని ప్రాథమిక పాఠశాలలకూ అందించింది. పిల్లల కథలు, గేయాలు, సైన్స్‌ కబుర్లు, పిల్లలు రాసిన కథలు, ఫొటో కథలు, ప్రముఖుల బాల్య విశేషాలు, దేశ చరిత్రలు, పజిళ్లు తదితరాలతో ఇది చిన్నారులను ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ పత్రికలన్నీ కలిసి మౌఖిక గేయాలు, కథలను అచ్చొత్తడంతో పాటు కొత్త రచయితలెందరినో ప్రోత్సహించాయి. పిల్లల కోసం వాళ్లతో ప్రత్యేక రచనలు చేయించాయి. ఆనాటి ప్రఖ్యాత సాహితీవేత్తలూ ఈ పత్రికల కోసం రచనలు చేసేవారు. అలా ఈ పత్రికల ద్వారా విలువైన బాలసాహిత్యమెంతో వెలుగు చూసింది. 
ముచ్చటించే బాలగేయాలు
బాలసాహితీ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలున్నా వాటిలో గేయాలది ఉన్నత స్థానం. వీటిలో ఎల్లోరా రాసిన ‘పండుగ- పాటలు’ చెప్పుకోదగ్గవి. తరతరాలుగా పండగల్లో అనుశ్రుతంగా వస్తున్న పిల్లల పాటలను సేకరించిన వారిలో నందిరాజు చలపతిరావు, నేదునూరి గంగాధరం, కృష్ణశ్రీలు ముఖ్యులు. అప్పట్లో ప్రతి ఇంట్లో చిన్నారులకు వేమన, సుమతీ శతకాలు నేర్పేవారు. విలువలతో కూడిన జీవితాలకు పునాది వేసేవారు. చిల్లా వెంకట కృష్ణయ్య ‘కుమార’, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి ‘కుమారీ’ శతకాలు (1920), ముళ్లపూడి వెంకటరమణ ‘బాలశతకం’ (1946) కూడా ఈ కోవలోవే. కరుణశ్రీ ‘తెలుగుబాల’, నార్ల చిరంజీవి ‘తెలుగుపూలు’, ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి ‘తెలుగు బిడ్డ’, బృందావనం రంగాచార్య ‘తెలుగుబోధ’ శతకాలు బాలసాహిత్యానికి వన్నె తెచ్చాయి. 
కవిరావు ‘ముద్దుపాప’ శతకంలోని ‘‘బడికి వేళకేగి పాఠాలు వల్లించి/ క్రొత్తవాని నేర్చుకొనగ వలయు/ క్రమము తప్పకుండ శ్రమజేసి తేనియు/ వృద్ధి చెందగలవు ముద్దుపాప!’’  లాంటి పద్యాలు పిల్లల్ని ఆలోచింపజేస్తాయి. రెడ్డి రాఘవయ్య ‘బాలనీతిమాల’ 1979లో (అంతర్జాతీయ బాలల సంవత్సరం) ఉత్తమ రచనగా పేరొందింది. 
తెలుగు వాడివి నీవు, తెలుగు దేశము నీది,
తేనెలొలుకు తెలుగు పలుకు నీది, 
తెలిసి మెలగవలయు తెలుగు జాతి చరిత, తెలిసికొనుము నీవు తెలుగుబాల!

      ..ఇలా అలతి అలతి పదాలతో  సాగే ఈ శతకం ఓ నీతిమాటల మూట! అలాగే, చింతా దీక్షితులు రాసిన ‘లక్కపిడతలు’ గేయ సంకలనంలోని ‘హనుమంతుడి తోక’ గేయం మొత్తం రామాయణ కథను విడమరుస్తుంది. ‘రాముని బంటు, రాముని బంటు/ హనుమంతుల వారూ.../ హనుమంతుడి కొక తోక ఉన్నది/ అందమైన తోక...’ అంటూ సాగుతుందీ గేయం. భావకవితా చక్రవర్తి కృష్ణశాస్త్రి కూడా పిల్లల కోసం ఎన్నో గేయాలు రాశారు. ‘‘ఇది మా బడి, ఇది మా బడి/ ఇది మా అమ్మ ఒడి...’’ అంటూ బడి గురించి చెప్పిన ఆయన, ‘తల్లీ భారతి వందనం/ నీ ఇల్లే మా నందనం’ అంటూ దేశభక్తిని ప్రబోధించారు. ఇక వేజెండ్ల సాంబశివరావు బాలలతో కలిసిపోయి ‘‘నిద్దురలేచా, పొద్దును చూచా/ చద్దిని మెక్కా, పలకను పట్టా’’ అంటే, ఏడిద కామేశ్వరరావు తన ‘ఓనమాలు’ గేయంలో ‘‘బాలా! బడికి వెళ్లావా?/ బాలా! బరులు దిద్దావా?/ అ, ఆ లొచ్చాయా? నీకు ఇ, ఈ లొచ్చాయా?’’ అని అడుగుతారు. 
      అంకెలను గేయ రూపంలో పరిచయం చేస్తూ చల్లా రాధాకృష్ణశర్మ, రంగులను గేయరూపంలో చూపుతూ ఆలపర్తి వెంకట సుబ్బారావు రచనలు చేశారు. రేడియో అన్నయ్య అయితే ‘‘బాలలకే స్వరాజ్యం వస్తే/ పిల్లలకే స్వాతంత్య్రం ఇస్తే/ చిట్టి తండ్రిని రాజుని చేస్తాం/ చిట్టి తల్లిని రాణిని చేస్తాం’’ అని పిల్లలతో పాడించారు. బాలాంత్రపు రజనీకాంతరావు రాసిన ‘జేజి మామయ్య పాటలు’లోని వానపాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. వానా వానా వల్లప్పా/ వాకిలి తిరిగే చల్లప్పా,/ ఎండా వేసిన వస్తువులన్నీ/ ఇంట్లో ఎట్టు చెల్లప్పా! ... వాన వచ్చినప్పుడు పిల్లలు చేతులు పట్టుకుని తిరుగుతూ ఇలా పాడుకుంటూ ఆడుకోవడం ఓ మధుర దృశ్యం!  
కమ్మటి గేయకథలు
చిన్నారులకు ఎంతో ఇష్టమైనవి గేయకథలు. గిడుగు సీతాపతి రాసిన ‘చిలకమ్మ పెళ్ళి’, ‘ఎలుక- పిల్లి’, ‘సాలెపురుగు- ఈగ’ లాంటివి ఆ రోజుల్లో పిల్లలను విశేషంగా ఆకర్షించాయి. ‘‘చిలకమ్మ పెండ్లియని చెలికత్తెలందరును/ చెట్లు సింగారించి, చేరి కూర్చున్నారు’’... ఇలా సాగే ‘చిలకమ్మ పెళ్ళి’ గేయం బాగా ప్రాచుర్యం పొందింది. ‘మహాప్రస్థానం’తో యువతను పోరుబాటకు మళ్లించిన శ్రీశ్రీ  సైతం చిన్నారులకు గేయకథలు చెప్పారు. ఆయన రాసిన ‘కప్పవైద్యుడు’తో పాటు ఆలూరి బైరాగి ‘వేటగాని సాహసం’, ‘స్నేహధర్మం’, ‘కలవారి అబ్బాయి’ లాంటి గేయకథలు ఆనాటి పిల్లలకు సుపరిచితాలు. అలాగే, మహీధర నళినీమోహన్‌ సరళ భాషలో పిల్లల కోసం చక్కటి గేయకథలు రాశారు. 1982లో ఆయన వెలువరించిన ‘కోతితపస్సు’ గేయ సంకలనం చెప్పుకోదగింది.
భలే భలే కథలూ.. నవలలు
బాలల కోసం అనేక పురాణ గాథలను 1900- 1948 మధ్యకాలంలో ప్రచురించారు. 1948లో మాగంటి బాపినీడు ‘బాలల బొమ్మల భారతం’ను సచిత్రంగా ప్రచురించారు. ఆ తర్వాత అదే బాటలో భాగవత, రామాయణాలు వచ్చాయి. 1957లో అన్నపూర్ణాదేవి చరిత్ర కథలు రాశారు. అనసూయాదేవి, దమయంతి, శకుంతల, సావిత్రి లాంటి వారి జీవితకథలను పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. జయంతి జగన్నాథరావు 1950లో ‘నారదుని కథలు’, నండూరి విఠల్‌ 1955లో ‘బైబిల్‌ కథలు’ ప్రచురించారు.
      అద్భుత కథలంటే పిల్లలకు మక్కువ. వీటిలోని ఊహలు పిల్లలను ఆకర్షిస్తాయి.  సాహస కథలు పిల్లల ఆలోచనలను ఇనుమడింపజేస్తాయి. మండవ రఘునాథ్‌ రాసిన ‘మహేంద్రమణి’, లక్ష్మీకాంత మోహన్‌ ‘పేదరాశి పెద్దమ్మ కథలు’, ఎంఎస్‌ మూర్తి ‘ఇంద్రజాల కథలు’ ఇలాంటివే. సత్యవోలు రాజశేఖరం ‘అల్లావుద్దీన్‌-అద్భుతదీపం’ (1958), సుబ్రహ్మణ్యశాస్త్రి ‘ఆలీబాబా-నలభై దొంగలు (1959), కె.రమేష్‌ ‘మాయగంట’ (1960) అద్భుత రసానికి పెద్దపీట వేశాయి.
      బాలల సాంఘిక నవలలు, కథలూ సాధారణంగా ఇల్లు, బడి రంగస్థలంగా ఉంటాయి. ఇలాంటి వాటిలో ఇల్లిందల సరస్వతీదేవి ‘మూడు పిల్లికూనలు’, తురగా జానకీరాణి ‘బొమ్మలపెళ్లి’, నార్ల చిరంజీవి ‘ఆటా-పాటా’, ‘ముగ్గురు స్నేహితులు’ (1961), చింతా దీక్షితులు ‘సూరి- నీతి- వెంకీ’, ‘ఎన్నో చేస్తాను’, ‘నీతి పాఠము’ (1956), మునిమాణిక్యం ‘గాలి పిల్లలు’ (1956), మద్దులూరి రామకృష్ణ ‘నాన్న కోసం’ (1954), మండా సూర్యనారాయణ ‘బహుమతి’, పొలంకి వెంకట రామచంద్రమూర్తి ‘దొంగలున్నారు జాగ్రత్త’, రావూరి భరద్వాజ ‘పితృహృదయం’ (1959), ఆలపర్తి వెంకట సుబ్బారావు ‘గాలిపటం’ (1956) ఆసక్తికరంగా సాగుతాయి. ఇక అప్పట్లో వచ్చిన తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలూ నేటికీ అందరినీ అలరిస్తున్నాయి. న్యాయపతి రాఘవరావు సృష్టించిన ‘పొట్టిబావ - చిట్టి మరదలు’, ‘కొంటె కృష్ణయ్య’ పాత్రలు మరపురానివి. ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’నైతే ఎప్పటికీ మర్చిపోలేం. 
పిల్లల నాటికలు... నాటకాలు
బాలసాహిత్యంలో తొలి నాటిక జనమంచి రామకృష్ణ రాసిన ‘యమునా తీరం’. ఇదో కృష్ణ కథ. ‘బాల’ పత్రిక పెట్టిన తర్వాత ప్రచురితమైంది. గురజాడ రాసిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ బాలల గేయనాటికగా పేరొందింది. సి.నారాయణరెడ్డి, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్‌, నండూరి సుబ్బారావు, సోమంచి రామం తదితరులు బాలల కోసం నాటికలు రచించిన ప్రసిద్ధులు.
ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమీ వివిధ వర్గాల బాలల కోసం పుస్తకాలను ప్రచురించింది. ఎనిమిదేళ్లలోపు వారికి ‘బుజ్జి కథలు’ సిరీస్‌లో ‘బాతు-బంగారుగుడ్డు, ‘గుర్రం- గాడిద, నాన్నా! పులి, పట్నం ఎలుక, గాడిద తెలివి, కాకి- పడవ, సింహం- ఎలుక లాంటి చిట్టి కథల పుస్తకాలు మంచి బొమ్మలతో విడుదలయ్యాయి. పన్నెండేళ్లలోపు పిల్లల కోసం బి.వి.నరసింహారావు ‘మల్లెలు- మందారాలు’, మండా సూర్యనారాయణ ‘అనగా అనగా’, వెలగా వెంకటప్పయ్య ‘గోడమీద బొమ్మ’, కవిరావు ‘వెలుగు బాటలు’, ‘ప్రముఖుల జీవితచరిత్రలు లాంటి సంకలనాలు తెచ్చారు. న్యాయపతి కామేశ్వరి ‘భోగిపళ్లు’, నాళం కృష్ణారావు ‘మీగడ తరకలు’, రావూరి భరద్వాజ  ‘చిలక తీర్పు’, గంగిశెట్టి శివకుమార్‌ ‘యథారాజా తథా ప్రజా’, రెడ్డి రాఘవయ్య ‘గుర్రం గుడ్డు’ పుస్తకాలనూ అకాడమీ ప్రచురించింది. పన్నెండేళ్లు పైబడ్డ వారిలో దేశభక్తిని పెంచేలా డి.రామలింగం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’, కల్వి గోపాలకృష్ణ మూల రచనకు చొక్కాపు వెంకటరమణ అనువాదం ‘పొగడరా నీ తల్లి భూమి భారతిని’ పొత్తాలు ప్రచురిత మయ్యాయి. ఇల్లిందల సరస్వతీదేవి ‘ఇందిరాప్రియదర్శిని’, కోడూరి లీలావతీదేవి ‘ఇంద్రధనుస్సు’, ఎన్‌.మంగాదేవి ‘వేగు చుక్క’, డి.రామలింగం ‘విశ్వకవి’ లాంటి పుస్తకాలూ వచ్చాయి. న్యాయపతి రాఘవ రావు ‘పసిడితెర’, ఏడిద నాగేశ్వరరావు రాసిన ‘చిరుగజ్జెలు’, బుర్రకథల మీద పాలడుగు నాగయ్య రాసిన ‘తందాన తాన’, మద్దిపట్ల వెంకటరావు హాస్యనాటికల సంకలనం ‘పొట్టిబావ’, ‘పాలవెన్నెల’, ‘ఆంధ్రుల కథ’, ‘బాలప్రపంచం’ సైన్సు కథలతో ‘విజ్ఞాన విజయాలు’ లాంటి సంకలనాలు చిన్నారుల్లో విజ్ఞానజ్యోతులను వెలిగించాయి.
      కాలం గడుస్తున్న కొద్దీ చిన్నారులకు బాలసాహిత్యంతో... అసలు తెలుగుతోనే అనుబంధం తగ్గిపోతోంది. ఇది వాళ్ల వ్యక్తిత్వ నిర్మాణం మీద ప్రభావం చూపుతోంది. కాబట్టి.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకుని పిల్లల్లో పుస్తకపఠనం మీద ఆసక్తి కలిగించాలి. వాళ్లలో సాహిత్యాభిలాష పెంపొందించాలి. బడిలో రోజూ పుస్తకపఠనం ఉండేలా చూడాలి. వారు చదివిన పుస్తకాల మీద చర్చలు నిర్వహించాలి. బాలల మానసిక వికాసానికి తోడ్పడే అభ్యాసనాలివి. వీటిని ఎంత త్వరగా అందిపుచ్చుకోగలిగితే అంత తొందరగా విలువల పునాది మీద భావి భారతాన్ని ఆవిష్కరించుకోగలం.


వెనక్కి ...

మీ అభిప్రాయం