శాశ్వత చైతన్యతేజం

  • 993 Views
  • 3Likes
  • Like
  • Article Share

    డా।। వెలువోలు నాగరాజ్యలక్ష్మి

  • విశ్రాంత ప్రిన్సిపల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • గుంటూరు
  • 9394113848
డా।। వెలువోలు నాగరాజ్యలక్ష్మి

 

తెలుగు సాహిత్యానికి అత్యున్నతమైన ‘జ్ఞానపీఠ’ పురస్కార గౌరవం అందించింది ‘విశ్వంభర’. మానవ వికాసాన్ని భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక తాత్త్వికావస్థలలో ప్రతీకాత్మకంగా, వ్యంగ్య సుందరంగా చిత్రీకరించిన రచన ఇది. డా।। సి.నారాయణరెడ్డి సృజించిన ఆధునిక ఇతిహాస మహాకావ్యమిది.
‘‘ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తం లేని, పేర్లతో అవసరం లేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అల్రెగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్‌, బుద్ధుడు, లింకన్‌, లెనిన్‌, మార్క్స్‌, గాంధీ ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి? కామం, క్రోథం, లోభం, మదం, ప్రకృతి శక్తుల వశీకరణం ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి? ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకూ మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు’’ అంటారు సినారె ‘విశ్వంభర’ ప్రారంభంలో!
      మానవుడు కళాత్మకంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా త్రిముఖాలుగా సాగించిన పురోగతి ఈ కావ్యంలోని వస్తువు. ఆ చిత్రణకు తోడ్పడే ప్రతీక గాథలు అలెగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు తదితరుల భావచిత్ర చరిత్రలు. ఈ చరిత్రలను ఐక్యతా సూత్రంతో కూర్చిన  నేర్పే సంవిధానం. నాచన సోమన ‘ఉత్తర హరివంశ’ కావ్యంలో వంశకథా సూత్రంతో కావ్య కథలను సంవిధానం చేసి ‘సంవిధాన చక్రవర్తి’గా తనను తాను ప్రకటించుకున్నాడు. ‘విశ్వంభర’ కవి కూడా ఆధునిక ఇతిహాస కావ్య కథా సంవిధాన చాతుర్యాన్ని వ్యక్తం చేశారు. తాత్త్విక దృష్టితో మానవతావాద సిద్ధాంతపరంగా మానవ స్వభావానికి, ప్రవర్తనకు ఉండే బహిరంతర సంబంధాలను ప్రకృతి ప్రతీకలతో వ్యాఖ్యానించిన ఇతిహాసం ‘విశ్వంభర’.
కావ్యమూ ఇతిహాసమూ
కావ్యం.. మానవుడి ఒక పురుషార్థానికి సంబంధించిన స్వయం సమగ్రమైన కార్యాన్ని వస్తువుగా నిర్వహిస్తుంది. ఇతిహాసం ఏమో ఒక సమగ్ర జీవితంలో పురుషార్థ సాధనను చిత్రించిన అనుభవాన్ని ఇతివృత్తం ద్వారా అందిస్తుంది. ఈ అర్థగాంభీర్యాన్ని సూచిస్తూ సినారె ‘విశ్వంభర’ వచన కవితలో ‘ఒక సమగ్ర కావ్యం’ అని పేర్కొన్నారు. అటు ఇతిహాస గౌరవాన్ని, ఇటు మహాకావ్య గౌరవాన్ని సాధించిన కావ్యం ‘విశ్వంభర’. మానవ వికాసాన్ని ఐతిహాసిక దృక్పథంతో, కావ్య స్పృహతో చిత్రించాలన్న ప్రయత్నాన్ని ‘భూమిక’ కావ్య రచనతో ప్రారంభించారు సినారె. ‘విశ్వంభర’ దాని పరిణత ప్రయోగం. ‘భూమిక’లో మానవ పరిణామ శీలాన్ని చిత్రించిన నారాయణరెడ్డి, ‘విశ్వంభర’లో దాని పరిణామ తత్త్వాన్ని సమీక్షించారు. కాబట్టి ‘భూమిక’కు ‘విశ్వంభర’ విశ్వరూపంలా దర్శనమిస్తుంది.
      మానవత్వ దైవత్వాలను విడివిడిగా దర్శించే ద్వైతం నుంచి ఏకత్వంగా అనుభూతి చెందే అద్వైతం వరకు సాగిన మానవ జ్ఞానప్రస్థానం ‘విశ్వంభర’లోని తాత్త్విక సూత్రం. మనిషి సాగించే కళాసాధన హృదయ సంబంధి. విజ్ఞాన సాధన బుద్ధి సంబంధి. ఆధ్యాత్మిక సాధన ఆత్మ సంబంధి. ఈ మూడు మానవ జీవిత సాధన త్రయం. ఈ సాధనకు మొదలు ఎక్కడ? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కావ్యానికి నాంది.
ఆ చైతన్యమే జ్ఞానబీజం
ఆదిమానవుడు శుద్ధ చైతన్య స్వరూపుడు. దైవత్వానికి ప్రతినిధి. అతని చుట్టూ ఉన్నది సుందర ప్రకృతి. మానవుడి శుద్ధ చైతన్య స్వరూపంలో ఉన్న సౌందర్య కాంక్ష స్త్రీ పుంసయోగ రూపమైన ప్రణయం దిశగా పయనించింది. దైవత్వం సాధించేది అమృతత్వం. మానవత్వం సాధించేది సంస్కృతి. ఆదిమానవ దంపతులు ప్రణయఫలం తిన్నారు. వికృతినే ప్రకృతిగా భావించారు. దైవత్వం ప్రశ్నించింది. మానవత్వం ఎదిరించింది. ఆ సందర్భాన్ని వర్ణిస్తూ సినారె ఇలా చెప్పారు... ‘‘తెలుసా! శాసన ధిక్కారానికి ఫలితం?/ తెలుసు. మట్టిలో మొలకెత్తే మరో జీవితం./ ఆ జీవితానికి అనుక్షణం మృత్యుభయం?/ ఆ మృత్యువు కోరలతో ఆడుకోవటం మాకు ప్రియం./ అయితే వెళ్లిపో మట్టి మనిషీ! ఆ మట్టిలోకి/ అలాగే వెళ్లి పొంగిస్తాను ఆ మట్టిని నింగిపైకి./ అందాకా వచ్చిందా నీ అహంకృతి?/ అక్కడే మొదలవుతుంది మానవ సంస్కృతి’’! ఇది మానవేతిహాస ప్రారంభ వృత్తాంతం. కవి ప్రతిభకు నిదర్శనం.
      మనిషి ప్రతిభ విశ్వంభరను దర్శించింది. చీకటి వెలుగులు, జయాపజయాలు దాని లక్షణం అని తెలుసుకుంది. ‘‘ఒక దేహం మట్టిలోకి/ ఒక జీవం మట్టిపైకి./ ఇదీ క్రమం ప్రకృతికి’’ అని మనిషి అర్థం చేసుకున్నాడు. ‘‘ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి’’ అని చైతన్యం పొందాడు. ఆ చైతన్యమే జ్ఞానబీజం. దాని నుంచి మనశ్శక్తి ఉద్భవించి మహావృక్షమై శాఖలతో విస్తరించింది. మనసే మానవ సంస్కృతికి మూలం అయింది. ‘‘మనసొక వృక్షమూలం/ అది చేదుకుంటుంది/ అగుపించని పొరల్లోని జీవసారం’’, ‘‘అంతరిక్షంగా ఉంటూనే/ అణువులా కుదించుకుంటుందది’’... ఇలా మనసు పరిణామాలను, చర్యలను, అన్వేషణను సినారె వర్ణించిన తీరు ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ అనే వేదాంత వాక్యాన్ని ఆధునికంగా వ్యాఖ్యానించినట్లు కనిపిస్తుంది.
మనసుకు తొడుగు మనిషి
‘‘సృష్టికి మూలం జ్ఞానబీజం/ విశ్వంభరా భ్రమణానికి మూలం/ శాశ్వత చైతన్య తేజం...’’ ఈ జ్ఞాన ప్రస్థానంలో మనిషి ఎంతోదూరం పయనించాడు. ప్రకృతి స్వభావాన్ని తెలుసుకోగలుగుతున్నాడే కాని ఆత్మచైతన్య తత్త్వాన్ని అవగతం చేసుకోలేక పోతున్నాడు. ఎన్నెన్ని ప్రస్థానాలు గడిచినా ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ‘‘ఎవరు తాను? ఏ ధాతు గర్భం నుంచి ఎదిగిన మాను?...’’; ‘‘ఎందాకా? ఈ నడక... ఇది ప్రశ్నగా మిగిలిన ప్రశ్న’’! 
      ప్రకృతిని జయించానని అహంకరించే మనిషికి మృత్యువు ముడి విప్పలేని సమస్య. జీవిత పరమార్థం ఏంటి? అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకని ప్రశ్న. ఈ ప్రశ్నల తర్వాత మనిషి జీవన సారాన్ని ఆధ్యాత్మిక కోణంలో దర్శించే ప్రయత్నం చేస్తాడు- ‘‘దృష్టికందని సృష్టి ఉందేమో/ సృష్టికందని దృష్టి ఉందేమో/ వ్యక్తిని ఆవరించే శక్తి ఉందేమో/ ఉన్నట్టే ఉంది’’! ప్రశ్నలు నాటిన పాదుల్లో ప్రార్థనలు మొలకెత్తాయి. మళ్లీ ప్రశ్నలు. ‘‘మూలతత్త్వం ఒక్కటైతే ఇన్ని ముసుగులెందుకు?/ ప్రేమసస్యం పండాలంటే ద్వేషం దుక్కిదున్నాలా?’’ అని మనసు ఆక్రోశించింది. ‘‘మనిషీ! నువ్వెక్కడ?’’ అని ఘోషించింది. ‘‘ఇది నిత్య ప్రస్థానం/ ఎగుడుదిగుళ్లు తప్పవు/ ఇది నిత్య ప్రయోగం...’’ అని మనిషి తన ఆధ్యాత్మిక చైతన్యంతో తెలుసుకోగలిగాడు. ‘‘అణువు నుండి అంతరిక్షానికి/ అంబరం నుండి అవనీతలానికి’’, ‘‘అనుభూతి నుండి ఆకృతికి/ అదృశ్యం నుండి అభివ్యక్తికి...’’ జరుగుతున్న అవిరళ శోధనమే ఈ జగత్తు అని అర్థం చేసుకున్నాడు. కాంతి చక్షువైన మనసు పట్టు తప్పినప్పుడు ఆలోచననే ఆయుధంగా మలచుకుని అంతశ్చేతననే ఆలంబనంగా స్వీకరించి మనిషి పురోగమించాలని సినారె తీర్మానించారు. ‘‘మనస్సుకు తొడుగు మనిషి/ మనిషికి ఉడుపు జగతి/ ఇదే విశ్వంభరా తత్త్వం/ ఇదే అనంత జీవిత సత్యం’’ అంటూ జీవిత తత్త్వాన్ని ఆవిష్కరించారు.
      ఇలా విశ్వాన్ని ఆత్మీకరించుకుని, ఆకాశాన్ని పిడికిలించుకుని ‘‘ఆకులు రాలిపోయినా చిగురాకులు పుట్టవా?’’ అని సందేశం ఇచ్చి సినారె మట్టితో మమేకమయ్యారు. ఈ అనంత ప్రయాణంలో తిరిగి ఎప్పుడు ఎక్కడ ఎలా అభివ్యక్తం అవుతారో కాలమే చెప్పగలదు. ప్రకృతియే చెప్పగలదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం