మన లక్ష్యం ప్రజాపక్షమే!

  • 264 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఎన్నికల నేపథ్యంలో సాహితీవేత్తలు పోషించాల్సిన పాత్రేంటి? ప్రజలను చైతన్యవంతుల్ని చెయ్యడంలో, తెలంగాణ భాషా సంస్కృతులను కాపాడుకోవడంలో అక్షరహాలికులు చేయాల్సిన ప్రయత్నాలేంటి? తెలంగాణ రచయితల వేదిక ఏడో రాష్ట్ర మహాసభల్లో ఈ అంశాల మీద సుదీర్ఘ చర్చ జరిగింది. సామాన్య జనసంక్షేమాన్ని కోరుకునే కవులు, రచయితలందరూ ప్రజాపక్షమే వహించాలని వక్తలు పిలుపునిచ్చారు.
నానాటికీ మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో కవులు, రచయితల బాధ్యతేంటన్న దాని మీద విశ్లేషణాత్మక చర్చలకు వేదికయ్యాయి తెలంగాణ రచయితల వేదిక (తెరవే) రాష్ట్ర మహాసభలు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో (కపిలవాయి లింగమూర్తి ప్రాంగణం, అలిశెట్టి ప్రభాకర్‌ వేదిక) నవంబర్‌ 18న జరిగిన మహాసభలు.. పలు అంశాలకు సంబంధించి సాహితీవేత్తలకు నూతన దిశానిర్దేశం చేశాయి.
      ‘‘తెలంగాణ రచయితల వేదిక గతాన్ని ప్రేమిస్తుందిగానీ, దాన్నే పట్టుకొని వేలాడదు. ఇది వర్తమానం నుంచి భవిష్యత్తులోకి ప్రవహించే సంస్థ. ప్రజలు కేవలం ఓటర్లుగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో కవులు, రచయితల్లో ఒక ఆలోచనని, ఆశయాన్ని రగిలించడానికి ఈ సభలని ఏర్పాటు చేశాం’’ అన్నారు తెరవే అధ్యక్షులు ఆచార్య జయధీర్‌ తిరుమలరావు. మహాసభల్లో భాగంగా ‘సాహిత్య సాంస్కృతిక రంగం- వర్తమానం- సవాళ్లు’ అంశంపై ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. పాలకవర్గాల ఆధిపత్యాలు, మ్యానిఫెస్టోలు, ఆలోచనల మధ్య జీవించే పరిస్థితి నుంచి ప్రజలను రచయితలు బయటికి తీసుకురావాలని సూచించారాయన. ప్రస్తుతం ప్రజల మధ్యలో నిలిచే కవులు, రచయితల అవసరం ఉందని చెప్పారు. తిరోగమన విలువలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఇంట్లో, సమాజంలో వాటి గురించి రచయితలు మాట్లాడాలని పేర్కొన్నారు. బహుజన సాహిత్యం స్థానంలో పాలకవర్గాల సాహిత్యం మెల్లగా చొరబడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బహుజనుల ఆత్మగౌరవం, ఆత్మ శక్తిగా నిలబడిన సాహిత్యం, సంస్కృతిని రచయితలు కాపాడుకోవాలన్నారు.  
ప్రశ్నించాల్సింది రచయితలే
సమానత్వ సాధన, స్వేచ్ఛ, భౌతిక వనరులను కాపాడటానికి రచయితలు అక్షరసేద్యం చేయాలని చెప్పారు సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి. ‘సాహిత్య సాంస్కృతిక రంగం- వర్తమానం- సవాళ్లు’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రచయితలు తమ రచనల ద్వారా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేయాలని సూచించారాయన. ప్రజా సమస్యల మీద రచయితలు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని, వాటిని అక్షరబద్ధం చేసేటప్పుడు ఆ సమస్యలను తమకి అన్వయించుకోవాలని మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రసిద్ధ తమిళ రచయిత్రి పి.శివకామి అన్నారు. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లు కేవలం ఒక్క రాష్ట్రానికి సంబంధించినవా, లేదంటే దేశం మొత్తం ఉన్నాయా అన్నదాని మీద రచయితలు దృష్టి సారించి వాటి మూలాలను అన్వేషించాలని సూచించారు. ప్రముఖ రచయిత, సంపాదకులు ఆచార్య హెచ్‌.ఎస్‌.శివప్రకాశ్‌ మాట్లాడుతూ.. భక్తి ఉద్యమాలు స్థానిక కళల మీద బాగా దృష్టి సారించాయని, సమాజంలోని అన్ని వర్గాలనూ ఒక వేదిక మీదకు తెచ్చాయని అన్నారు. తెలుగు, కన్నడ, మరాఠీ సాహితీ సంస్కృతులను తులనాత్మకంగా విశ్లేషిస్తూ ఆయన ప్రసంగం సాగింది. తెరవే పూర్వ అధ్యక్షులు, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ.. భౌగోళిక తెలంగాణ వచ్చినా బతుకు తెలంగాణ ఇంకా మిగిలే ఉందని అన్నారు. తొలి సదస్సుకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆయన.. పాలకులు ప్రజలకు ఏం చెయ్యాలనుకుంటున్నారన్న దాని మీదా రచయితలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. 
      మహాసభల్లో భాగంగా మధ్యాహ్నం ‘ఎన్నికలు-ప్రజల కర్తవ్యాలు-రచయితలు’; ‘మేనిఫెస్టోలు-భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు-వివిధ పార్టీలు’ అంశాల మీద సమావేశాలు నిర్వహించారు. మొదటిదానికి సంబంధించి ప్రముఖ కవి అల్లం రాజయ్య మాట్లాడుతూ ప్రజలను ఎలా ఐక్యం చెయ్యాలి? పోరాటాల్లో ఎలా భాగస్వామ్యం చెయ్యాలో రచయితలు ఆలోచించాలని సూచించారు. రచయితని పురస్కారంతో ప్రభుత్వం గుర్తిస్తే, అది ప్రజల గుర్తింపుగానే భావించాలని ఆచార్య ఎం.ఎం.వినోదిని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు, అవసరాలు, వేదనలను రచయితలు తమ రచనల్లో చిత్రించాలని, ఈ క్రమంలో వాళ్లు తమను తాము ప్రజల్లో ఒకరిగా భావించుకోవాలన్నారు. రెండో సమావేశానికి తెరవే పలు పార్టీల నేతలను ఆహ్వానించింది. దీనికి హాజరైన తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షులు జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ఏ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడినా, విప్లవం వచ్చినా అది రచయితల వల్లేనని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చిన సాహిత్యం గుండెల్లోంచి, ప్రజల మనసుల్లోంచి వచ్చిందని, అలాంటి సాహిత్యం నేడు అవసరమని వ్యాఖ్యానించారు. ‘‘ప్రజల బాధలు నివారించేందుకు దారి చూపించే కవిత్వం రాయాలి, రచయితలు యువత కళ్లు తెరిపించాలి. ఓటర్లని చైతన్యవంతం చెయ్యాలి’’ అని అన్నారాయన. బీఎల్‌ఎఫ్‌ తరఫున వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య మాట్లాడుతూ.. అణచివేతకు గురైన వాళ్లకోసం రచయిత కలం సాగాలని అన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే సాహిత్యం, కళలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ. ఇతర ప్రధాన పార్టీల నుంచి ఎవరూ మహాసభలకు రాలేదు. 
ఎవరేం చేస్తారు?
పార్టీల మ్యానిఫెస్టోల్లోని లోటుపాట్ల గురించి రచయితలు ప్రజలకు తెలియజెప్పాలని మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్‌.జీవన్‌ కుమార్‌ సూచించారు. ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. భాషా సాహిత్యం కళలకి సంబంధించి ప్రతి రాజకీయ పార్టీకి ఒక సాంస్కృతిక విధానం అవసరమని, దీని గురించి పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో తెలియజెప్పాలని రచయితలు డిమాండ్‌ చెయ్యాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక దీని గురించి ఏటా గుర్తుచెయ్యాలని, వాటి అమలు కోసం ఒత్తిడి తేవాలని సూచించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి ఏ పార్టీ మ్యానిఫెస్టోలో ఏముందని గమనిస్తే ఏమీ కనిపించదని ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి చురక అంటించారు.
      మహాసభల్లో భాగంగా సాయంత్రం మట్టిమనుషుల బతుకువెతలకు సాహిత్యగౌరవాన్ని కల్పించిన తెలంగాణ తొలితరం రచయిత పొట్లపల్లి రామారావు శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌ హాజరయ్యారు. ఇందులో పలువురు సాహితీవేత్తలు పొట్లపల్లి సాహితీ కృషిని, ఆయన వ్యక్తిత్వాన్నీ శ్లాఘించారు. చివర్లో వివిధ జిల్లాల తెరవే అధ్యక్ష, కార్యదర్శులను రాష్ట్ర సంఘం తరఫున సత్కరించారు. మహాసభల్లో తొలి ప్రసంగాలు వీరణాల వాద్యంతో మొదలయ్యాయి. అంతకు ముందు భవనం ఎదుట తెరవే జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. విమలక్క ఆధ్వర్యంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య బృందం ఆలపించిన గీతాలు, నృత్యాలు సభాసదుల్లో ఉత్సాహం నింపాయి. ‘నెత్తుటి పాలపుంత, దళిత గీతాలు, ఆకాశమంత పావురం, అడవి దీపాలు, ఆవాజ్‌, ఎన్నీల్ల ముచ్చట్లు’ తదితర పుస్తకాలనూ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 
      ఏ సమాజంలోనైనా సరే, ప్రజల కష్టాలు, పీడన, దోపిడీ, భాషా సంస్కృతుల పరిరక్షణ మీద ప్రజల్లో చైతన్యం నింపాల్సింది రచయితలే. ఈ విషయంలో వాళ్లు నిబద్ధతగా వ్యవహరించాలని ఈ మహాసభలు మరోసారి గుర్తుచేశాయి.
             


వెనక్కి ...

మీ అభిప్రాయం