మాధవమాల...కీర్తి సుమాల

  • 1526 Views
  • 204Likes
  • Like
  • Article Share

    బి.రాజేశ్‌కుమార్‌, 8008574559; సి.వెంకటరత్నం, 8008574555

  • శ్రీకాళహస్తి, ఏర్పేడు

అందమైన ఆ ఊరిపేరుకు తగ్గట్టే చక్కదనాల చెక్కబొమ్మలకు మారుపేరు.. మాధవమాల. తిరుపతికి సమీపంలోని ఈ చిన్న జనపదం.. వాసికెక్కిన హస్తకళాక్షేత్రం. సృజనాత్మకతకు శ్రమను జోడించి స్థానికులు దిద్దితీర్చే దారుశిల్పాలు చూపుతిప్పుకోనివ్వవు. చీర్ణాలతో జీవంపోసుకునే ఈ సహజ సౌందర్య కళాఖండాలకు దేశవ్యాప్తంగా అభిమానులెందరో! తరాల వారధి మీదుగా అఖండంగా కొనసాగుతున్న మాధవమాల కళావారసత్వపు విశేషాలూ.. కొయ్యబొమ్మల తయారీకి ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లూ.. ఆ కళాకారులు కోరుకుంటున్న ప్రోత్సాహకాల సమాహారమిది!
పొద్దుపొద్దున్నే జగతికి వెలుగు కిరణాలు పంచే తమ్మిదొరని చీర్ణాల చప్పుళ్లతో మేల్కొలుపు తుంది మాధవమాల. కోడి కూడా కూయక మునుపే ఇక్కడి కళాకారులంతా ఏకాగ్రచిత్తంతో బొమ్మలు చెక్కడంలో మునిగి పోతారు. అలా పొద్దువాలే దాకా పనిచేస్తూనే ఉంటారు. తరాలు మారుతున్నా వృత్తి పట్ల అదే నిబద్ధత కొనసాగిస్తున్న వీరు.. హస్తకళాసృజనలో దేశవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 
      చిత్తూరు జిల్లాలో ఏర్పేడు మండల కేంద్రానికి పది కిలోమీటర్లు, శ్రీవేంకటేశుడు కొలువైన తిరుపతికి పదహారు కి.మీ దూరంలో ఉంటుంది మాధవమాల. వందేళ్ల కిందట తమిళనాడులోని పెద్దపాళెం నుంచి శిల్పకారుల కుటుంబాలు కొన్ని ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాయి. అప్పటి నుంచి ఈ గ్రామానికే ప్రత్యేకమైన కొయ్యబొమ్మల కళా ప్రస్థానం మొదలైంది. గతంలో వాళ్లు దేవాలయాల నిర్మాణా లప్పుడు శిల్పాలు చెక్కేవారు. ఆ పనులు క్రమంగా తగ్గిపోవడంతో ఉపాధి వెతుక్కుంటూ తెలుగు నేలకు తరలివచ్చారు. కాలక్రమం లో కొయ్యలతో బొమ్మలు చెక్కడం మొదలుపెట్టారు. వీటికి బాగా ఆదరణ లభించడంతో గ్రామంలోని ఇతరులు కూడా ఈ విద్యను నేర్చుకున్నారు. అలా ఇప్పుడు మాధవమాలలో దాదాపు 60 కుటుంబాలు కొయ్యబొమ్మలను రూపొందిస్తున్నాయి.  
శిల్పశాస్త్రమే ప్రామాణికం
ఉక్కుతో తయారుచేసిన ఉలి లాంటి చీర్ణం, సుత్తి, కొలపట్టీ(టేపు), ఉప్పుకాగితం, పెన్సిల్‌, కుంచె... ఇవే మాధవమాల కళాకారుల తయారీ సామగ్రి. చీర్ణాలను సుత్తితో తడుతూ ముడి చెక్క నుంచి కళాఖండాలకు ప్రాణం పోస్తారు. వీళ్ల పూర్వీకులు పాలకొయ్యతో బొమ్మలు చెక్కేవాళ్లు. ఇప్పుడది అంతగా అందుబాటులో లేకపోవడంతో టేకు, సీమచింత, మామిడి, వేప చెక్కలతో బొమ్మలు రూపొందిస్తున్నారు. అవసరమైన కలపను శ్రీకాళహస్తి, తిరుపతి టింబర్‌ డిపోల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా వేంకటేశ్వరస్వామి, దశావతారాలు, గణేశుడు, గుర్రాలు, సింహాలు, ఏనుగులు, అష్టలక్ష్ములు, నెమళ్లు, పూలతీగలు లాంటి బొమ్మలు తయారు చేస్తుంటారు. ముందుగా ముడి కలపను ఇరవై రోజులు నీళ్లలో నానబెడతారు. దీంతో చెక్క మృదువుగా మారుతుంది. ఆ తర్వాత అనుకున్న ఆకృతిని పెన్సిల్‌తో చెక్క మీద గీసి, ఆమేరకు చెక్కుతారు. మళ్లీ పదిరోజుల పాటు ఆ బొమ్మను నీళ్లలో నానబెడతారు. ఆ తర్వాత ఆరబెట్టి, నునుపుచేసి, రంగులు వేస్తారు. గతంలో కరక్కాయ లాంటి వాటితో సొంతంగా రంగులు రూపొందించుకునేవారు. పక్షి ఈకలతో తయారుచేసుకున్న కుంచెలు వాడేవాళ్లు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే రంగులు, కుంచెలనే ఉపయోగిస్తున్నారు. 
      నాలుగంగుళాల నుంచి అయిదారు అడుగుల బొమ్మల వరకూ.. అన్నింటినీ అంతే అందంగా సృష్టించగలిగిన ప్రతిభాశాలులు మాధవమాల కళాకారులు. సాధారణంగా కృష్ణుడు, బాలాజీ, గణపతి, సరస్వతి, పుస్తకం లేదా దీపం పట్టుకున్న స్త్రీబొమ్మలు, స్తంభాలు, అజంతా శిల్పాలు లాంటివాటిని అయిదారడుగుల్లో దిద్దితీర్చుతారు. ఇళ్లలో అలంకరణ కోసం వీటిని తయారుచేయించుకునే వాళ్లు చాలామందే ఉన్నారు. ఇక ఉత్సవ విగ్రహాలు, ఉరేగింపునకు అవసరమైన వాహనాలు, రథాలను రూపొందించడం లోనూ ఇక్కడి కళాకారులది అందెవేసిన చెయ్యి. బొమ్మ ఏదైనా శిల్పశాస్త్రానికి అనుగుణంగా తీర్చిదిద్దడం ఈ కళాకారుల ప్రత్యేకత. తెలుగునేల మీది ఇతర కొయ్యబొమ్మల నుంచి మాధవమాలను ప్రత్యేకంగా నిలిపేది ఇదే. ఏ బొమ్మను ఎంత కొయ్య ఉపయోగించి చెయ్యాలి? ఎలా చెక్కితే ముఖం అందంగా కనిపిస్తుంది? శరీరాన్ని ఎలా మలచాలి? మోకాలు ఎంత కిందకి ఉండాలి? పాదాలు, చేతుల పొడవు ఎంత ఉండాలి? ఇలా ప్రతి దానికీ వీళ్లు ప్రామాణిక కొలతల్ని పాటిస్తారు. నాలుగంగుళాల బొమ్మ అయినా సరే శిల్పశాస్త్ర నిర్దేశిత కొలతల్లో చెక్కితేనే అందం వస్తుందన్నది వీరి విశ్వాసం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం ఇరవై ఏళ్ల కిందట తాత్కాలికంగా ఆగిపోయింది. ఎందుకోగానీ శిల్పశాస్త్రాన్ని పక్కనపెట్టే ప్రయత్నం జరిగింది. దాంతో బొమ్మల్లో ఆకర్షణ తగ్గి అమ్మకాలు పడిపోయాయని, కొన్నాళ్లు పూటగడవడమే కష్టంగా మారిందని, మళ్లీ శిల్పశాస్త్రాన్ని ఆశ్రయించి పూర్వవైభవం అందుకున్నామని వీళ్లు గుర్తుచేసుకుంటారు.
దిల్లీ వరకు ఖ్యాతి
మాధవమాల బొమ్మలు అతి సూక్ష్మ కళా నైపుణ్యంతో కూడుకున్నవి. బొమ్మలోని ప్రతి అంశాన్ని చీర్ణాలతోనే తీర్చిదిద్దాల్సి ఉంటుంది. అందుకే ఒక్కో కుటుంబం చిన్న బొమ్మలైతే నెలకు ఏడు నుంచి పది వరకు, పెద్దవైతే మూడు నాలుగు బొమ్మలే తయారుచేయగలుగుతుంది. ఈ కళ గొప్పదనాన్ని గుర్తించి ప్రస్తుత యువతరం కూడా దీని పట్ల ఆసక్తి చూపుతోంది. డిగ్రీ, పీజీ చదివిన పది మంది వంశపారంప ర్యంగా ఈ కళను స్వీకరించారు. ఉన్నత చదువులు చదివినా ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయాల్సిందే.. వయసు మళ్లాక మళ్లీ గ్రామానికి రావాల్సిందే. అలాంట ప్పుడు ఇక్కడే ఉంటూ తరాల నుంచి వస్తున్న ఈ అరుదైన కళలో కొనసాగడమే మంచిదన్నది వాళ్ల అభిప్రాయం. అలాగే ప్రస్తుతం చదువుకుంటున్న వాళ్లు కూడా తీరిక సమయాల్లో బొమ్మలు చెక్కడంలో నిమగ్నమవుతున్నారు. 
      మాధవమాలలో విద్యను నేర్చుకున్న చాలామంది తిరుపతి, శ్రీకాళహస్తి, బండారుపల్లి, పుత్తూరు, గుండాలమిట్ట, చిత్తూరు, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలసవెళ్లి కొయ్యబొమ్మలకు జీవం పోస్తున్నారు. పలు నగరాలు, పట్టణాల్లో దుకాణాలు ప్రారంభించి, ఆర్డర్ల మీద నేరుగా ఇళ్లకే కొయ్య బొమ్మలు అందిస్తున్నారు. వీళ్లంతా ఎక్కడికక్కడ స్థానికులకు ఈ కళను నేర్పిస్తూ మాధవమాలకు చిరకీర్తి తెస్తున్నారు. 
      దేశ రాజధాని దిల్లీ మొదలు అన్ని ప్రాంతాల వాళ్లకి మాధవమాల బొమ్మలంటే మక్కువే. అందుకే అన్ని రాష్ట్రాల నుంచీ ప్రజలు మాధవమాలకి వస్తుంటారు. తమిళనాడు వాళ్లు బాలాజీతో పాటు మురుగన్‌, గజలక్ష్మి, మీనాక్షి కల్యాణం, అష్టలక్ష్మి బొమ్మలు ఎక్కువగా అడుగుతారట. దిల్లీ వాళ్లయితే ఆరడుగుల పొడవు, పద్దెనిమిది అడుగుల వెడల్పుతో వాకిలికి ఏర్పాటు చేసుకునే గుర్రపు బొమ్మలు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతారని అంటారు ఇక్కడి కళాకారుడు భాస్కరాచారి. ఇక కన్నడిగులకు బాలాజీ విగ్రహాలు ఇష్టమైతే, తెలుగువారు శ్రీవేంకటేశుడితో పాటు రామాసీతా సెట్టు లాంటివి చేయించుకుంటూ ఉంటారు. నూతన సాంకేతికతను కూడా ఈ కళాకారులు తమ వ్యాపారానికి చక్కగా వినియోగించుకుంటున్నారు. బొమ్మలు అవసరమైన వాళ్లు ఫోన్లు చేసి వాట్సప్‌ ద్వారా తమకి నచ్చిన బొమ్మలు ఎంచుకుంటున్నారని, ఆన్‌లైన్‌లోనే నగదు తమ ఖాతాల్లో జమ చేస్తే, బొమ్మలను నేరుగా వారి చిరునామాలకు పంపిస్తున్నామని మరో కళాకారుడు రాజాచారి సంతోషంగా చెబుతారు.
రూ.కోటి వ్యాపారం
అప్పట్లో మాధవమాలకు వలసవచ్చిన కుటుంబాల మాతృభాష తమిళం. అయితే, కాలక్రమంలో వీళ్లు తెలుగు సంస్కృతిలో మమేకమైపోయారు. బొమ్మల తయారీలో నిత్య నవ్యత పాటించడం ఈ కళాకారుల మరో ప్రత్యేకత. బొమ్మలు ఎప్పటికప్పుడు వైవిధ్యంగా కనిపించేలా వాటి వెనుక నేపథ్యాలు, అలంకరణలు లాంటివి మారుస్తుంటారు. ఆ నైపుణ్యమే వీరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మాధవమాలకు చెందిన భాస్కరాచారి, ధనుంజయ ఆచారి, రవి ఆచారి, కృష్ణమూర్తి ఆచారిలు రాష్ట్ర స్థాయి పురస్కారాలు దక్కించుకున్నారు. ఈ గ్రామం నుంచి శ్రీకాళహస్తికి వలస వెళ్లిన సత్యనారాయణ జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం మాధవమాల వర్ధమాన కళాకారులు కూడా అదే వృత్తినైపుణ్యం సాధించడానికి శ్రమిస్తున్నారు. వ్యాపారం, కాలానుగుణంగా బొమ్మల నాణ్యత పెంచడం తదితరాలపై చర్చించుకునేందుకు వీళ్లు ‘హస్తకళాకారుల సంఘం’ ఏర్పాటు చేసుకున్నారు. కేరళలోని కైరాలి, చెన్నైలోని పూమ్‌పుహార్‌ లాంటి ప్రదర్శనశాలలకు తమ బొమ్మలు అందించడానికి సంసిద్ధులవుతున్నారు. 
      కొయ్యబొమ్మల తయారీ ద్వారా మాధవమాలలో ఒక్కో కుటుంబం నెలకి దాదాపు రూ.30 వేల వరకు ఆర్జిస్తోంది. అయితే ప్రతి నెలా ఒకే విధంగా రాబడి ఉండదు. ఆర్డర్లు తగ్గినప్పుడు సంపాదన కూడా తగ్గిపోతుంది. మొత్తమ్మీద ఇక్కడి బొమ్మలతో ఏడాదికి రూ.కోటి వరకు వ్యాపారం జరుగుతుంది. లేపాక్షి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ హస్తకళల అభివృద్ధి సంస్థ ఇక్కడి బొమ్మలను విక్రయిస్తూ సాయపడుతోంది. అయితే ఎంపిక చేసిన మేరకే బొమ్మలు తీసుకోవడం వల్ల.. వేరే దారిలేక మిగిలిన బొమ్మలను తక్కువ ధరకే దళారులకు అప్పగిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు స్థానికులు. అలాగే, హస్తకళల అభివృద్ధి సంస్థ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రదర్శనలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నా రవాణా ఖర్చులకు భయపడి వాటికి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ముడి చెక్క ధరలు పెరగడం కూడా మాధవమాల కళాకారులను ఇబ్బందులపాల్జేస్తోంది. గతంలో ఒక గుంట (144 అంగుళాల) చెక్క రూ.300 ఉంటే, ఇప్పుడు రెట్టింపై రూ.600 వరకు చేరింది. ప్రభుత్వం చొరవ తీసుకొని రాయితీపై ముడి చెక్క అందించే ఏర్పాటు చెయ్యాలని కళాకారులు కోరుతున్నారు. బొమ్మల మీద జీఎస్టీని కూడా మినహాయించాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు.. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం సమకూర్చుతూ ఈ కళాకారులకు చేయూత అందిస్తోంది. 
       ఆంధ్ర పల్లెల ప్రత్యేకతలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక వృత్తులను దేశవిదేశీయులకు పరిచయం చేసేందుకు రాష్ట్ర పర్యటక శాఖ ‘పల్లెవిందు’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భారతీయులతో పాటు బెల్జియం దేశస్థులు 20 మంది ఇటీవల మాధవమాలలో బస చేశారు. ఇక్కడి బొమ్మల్లో తొణికిసలాడే జీవకళను చూసి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. పర్యటక శాఖ అండతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్న మాధవమాల.. త్వరలోనే తన బొమ్మలను విదేశీ విపణిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అది సాధ్యమవ్వాలంటే.. అరుదైన హస్తకళను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తున్న ఆ కళాకారులు ఆశించిన మేరకు సహేతుక ప్రోత్సాహకాలను పాలకులు కల్పించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  హస్తకళలు