పిల్లల పత్రిక..చేతనాపతాక!

  • 322 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందలూరి నారాయణరావు

  • అద్దంకి

ఓ ప్రయత్నం..
పిల్లలతో వార్తలు రాయించాలని. ఆ అవకాశం ఇస్తే వాళ్లు ఎలాంటి అంశాలను ఎంచుకుంటారో చూద్దామని. 
ఓ ప్రయత్నం..
పిల్లల సామాజిక అవగాహనా శక్తిని తెలుసుకోవడానికి. వాళ్ల ఆలోచనలూ, ఆశలూ, ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి.
ఓ ప్రయత్నం..
తెలుగుపై పిల్లల్లో ఎంత మక్కువ ఉందో గమనించడానికి. తెలుగులో వాళ్లు ఏమాత్రం రాయగలుగుతారో పరిశీలించడానికి.
ఇంత మంచి ప్రయత్నానికి బాలల దినోత్సవానికి (నవంబరు 14) మించిన ముహూర్తం ఏముంటుంది! దానికి తగ్గట్టుగా ‘ఈనాడు’ యంత్రాంగం సంసిద్ధమైంది. నాలుగు నగరాల్లోని పద్నాలుగు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ‘పిల్లల పత్రిక’ రూపకల్పనకు నడుంబిగించింది. 
      చింతలగూడ, ఎర్రమంజిల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, రాజ్‌భవన్‌, సిస్టర్‌ నివేదిత పాఠశాలలు (హైదరాబాదు); ఎస్‌.ఆర్‌. నేషనల్‌, తేజ ఇంటర్నేషనల్‌, లెర్నర్స్‌ ల్యాండ్‌, తేజస్వి పాఠశాలలు (వరంగల్లు); శ్రీ వేెంకటేశ్వర ప్రాచ్యోన్నత పాఠశాల, మాలవ్యాజీ నగరపాలక ఉన్నత పాఠశాల, గీతం, రెడ్‌చెర్రీస్‌ పాఠశాలలు (తిరుపతి); పెందుర్తి ప్రభుత్వ, చినముషిడివాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు (విశాఖపట్నం) ఈ ప్రయోగానికి వేదికలయ్యాయి. వీటిలోని 301 మంది ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థినీ విద్యార్థులు ఇందులో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. స్థానిక ‘ఈనాడు’ ప్రతినిధులు ఈ పిల్లలందరితో మాట్లాడారు. వార్త అంటే ఏంటో దగ్గరి నుంచి.. వార్తాకథన రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకూ అన్ని అంశాలనూ వాళ్లకి వివరించారు. ఒక్క రోజులోనే చిన్నారులు ఆ సూచనలను ఆకళింపు చేసుకున్నారు. సామాజిక, ఆర్థిక, భాషా, సాంస్కృతిక, విద్యారంగాలకు సంబంధించిన విభిన్న అంశాల మీద తమవైన దృష్టికోణాలతో అనేక వార్తాకథనాలు రాశారు. వాటిన్నింటినీ కాస్త సరిచేసి.. అందంగా పత్రాలంకరణ చేసి.. ఏ పాఠశాలకు ఆ పాఠశాల ‘పిల్లల పత్రిక’ను  ‘ఈనాడు’ ముద్రించింది. తెల్లారి పత్రిక ప్రతులను తీసుకెళ్లి ఆ చిన్నారుల చేతుల్లో పెడితే, తమ రచనలను అచ్చులో చూసుకుని ఆ పసివాళ్లు ఎంతగా మురిసిపోయారో.. ఎంతెంతంగా హర్షాతిరేకాలు వ్యక్తంచేశారో!! 
అచ్చతెలుగు పిల్లలం!
అమ్మభాషతో ఈతరానికి పెద్దగా అనుబంధం ఉండట్లేదనే మాట సాహితీసభల్లో వినిపిస్తూ ఉంటుంది. కానీ, నేటితరం తెలుగు గురించి ఆలోచిస్తోంది. అమ్మ పంచిన భాషను అమ్మలానే చూసుకోవాలని ఆలోచిస్తోంది. ‘తేనెలొలుకు మాట నా తెలుగు’ అంటూ తిరుపతి గీతం పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎన్‌.హేమావతి ఓ పెద్ద కథనమే రాసింది. తెలుగు బాగుండాలంటే నాదో సూచన అంటూ ‘‘మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆంగ్లం అవసరం మేరకు నేర్పించాలి’’ అని చెప్పిందా చిట్టితల్లి! వరంగల్లు తేజస్వి పాఠశాల విద్యార్థి బి.శ్రీనాథ్‌ (తొమ్మిదో తరగతి).. ‘అలుసవుతున్న అమ్మభాష’ శీర్షికతో తెలుగు వినియోగం ఎందుకు తగ్గిపోతోందో రాసుకొచ్చాడు. విద్యా ఉపాధి అవకాశాలనూ, అమ్మభాషనూ అనుసంధానిస్తే బాగుంటుందనే మేలైన సూచన చేశాడు. ‘‘మా చిన్నతనంలో హైదరాబాదులో ఎక్కడికి వెళ్లినా ఉర్దూ, హిందీలో మాట్లాడేవారని మా అమ్మానాన్నలు చెబుతుంటారు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా ఆంగ్లం, హిందీల్లో మాట్లాడుతున్నారు. కొందరి ఇళ్లలో తెలుగు మాట్లాడటమే తగ్గిపోయింద’’ని ఆందోళన వ్యక్తంచేసింది ఎం.సంధ్య. హైదరాబాదు రాజ్‌భవన్‌ బడిలో చదువుకుంటున్న ఈ చిన్నారి, ‘పిల్లల పత్రిక’ కోసం తమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శరత్‌బాబు ముఖాముఖి తీసుకుంది.
      సాహిత్యం, కళల గురించి వార్తలు రాసిన చిన్నారులూ ఉన్నారు. తిరుపతి గీతం పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎస్‌.జాస్మిన్‌ పద్యాల గొప్పతనాన్ని వివరించింది. నీతి శతకాలను చదివితే మనం మంచి మనుషులుగా ఎదుగుతామని చక్కగా రాసింది. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ‘హరిశ్చంద్ర’ నాటకాన్ని తెలుగువాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు కదా. మరి దానిగురించి ఇప్పటి చిన్నారులకు తెలుసా! దీని గురించి పెందుర్తి పిల్లలకు బాగా తెలుసు. అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని గౌరీశ్వరి.. ఈ నాటకం మీదే ఓ చిరుకథనం రాసింది. ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న రోజుల్లో రాసిన నాటకమిది అంటూ.. దాని ప్రత్యేకతను చెప్పింది. అదే బడిలో అదే తరగతి చదువుతున్న బొడ్డేటి భాగ్యశ్రీ అయితే, హరిశ్చంద్రుడి గాథను స్థూలంగా వివరించింది. హైదరాబాదు ఎర్రమంజిల్‌ పాఠశాల తొమ్మిదో తరగతి పిల్లాడు కె.నవీన్‌కుమార్‌.. కళలను సంస్కృతికి దర్పణాలుగా అభివర్ణించాడు. వరంగల్లు తేజ ఇంటర్నేషనల్‌ విద్యార్థిని కె.రుతిక (ఎనిమిదో తరగతి) జానపద కళల ప్రత్యేకతలను చెప్పింది. యక్షగానాలు, గొల్లసుద్దులు తదితర కళారూపాలను సంక్షిప్తంగా పరిచయం చేసింది.
అవగాహన భళా!
సామాజిక సమస్యలు, సమకాలీన పరిణామాల మీదా పిల్లలు స్పందించారు. నల్లధనం ఎలా పేరుకుపోతోంది.. దేశ ప్రగతిని అదెలా దెబ్బతీస్తోందో వరంగల్లు లెర్నర్స్‌లాండ్‌ పాఠశాల పదో తరగతి విద్యార్థి ఎండీ.షార్‌ఫుద్దీన్‌ రాశాడు. నల్లధనాన్ని వెలికితీసేదెప్పుడని ప్రశ్నించాడు. పెద్దనోట్ల రద్దుతో పేదలకొచ్చిన కష్టాలను ‘తేజస్వి’లో తొమ్మిదో తరగతి చదువుతున్న త్విష వివరించింది. వాయుకాలుష్యం కారణంగా పెరుగుతున్న అనారోగ్య సమస్యల మీద విశాఖ చినముషిడివాడ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి డి.శ్రీను ఆందోళన వ్యక్తం చేశాడు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి ఏ స్థాయిలో హాని జరుగుతోందో చెబుతూ, దాన్ని వినియోగించడం మానెయ్యాలన్నాడు కె.సాయిప్రణీత్‌. తిరుపతికి చెందిన ఇతను, రెడ్‌చెర్రీస్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థుల్లో ఒత్తిడి పెంచుతున్న నేటి విద్యావిధానం మీద అసంతృప్తి వ్యక్తంచేసింది సమీరా మెహేక్‌. వరంగల్లు ‘లెర్నర్స్‌ లాండ్‌’లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ప్రభావవంతంగా వివరించింది. భ్రూణహత్యల మీద తేజ ఇంటర్నేషనల్‌ పిల్లలు ఇజుంటి అక్షయ, జె.లక్ష్మీసాయి ఆవేదన వ్యక్తం చేశారు.
      చినముషిడివాడ శాంతినగర్‌లోని జిల్లా పరిషత్తు పాఠశాల భవనం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మంచినీటి, మురుగు సదుపాయాల్లేవు. పక్కనే చేపలమార్కెట్‌ ఉంది. బడిలోకి వెళ్లాలంటే మురుగునీటి కాల్వ దాటాలి. ఈ సమస్యలన్నిటిపైనా.. చక్కటి ఛాయాచిత్రాలతో ఎనిమిదో తరగతి విద్యార్థి ఎ.చరణ్‌తేజ్‌ కథనం రాశాడు. ఇలాగే, తమ విద్యాలయానికి సొంత భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించాలని హైదరాబాదు చింతలగూడ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం చిత్రాలు జోడించి కథనంలో ఇచ్చారు. చర్మ క్యాన్సర్‌ ఎందుకొస్తుంది? మనం తక్షణం తీసుకోవాల్సిన రక్షణ చర్యలేమిటో మౌనిక అనే చిన్నారి వివరించింది. పెందుర్తి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది తను. రహదారి ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వరంగల్లు ‘లెర్నర్స్‌ లాండ్‌’ పదో తరగతి విద్యార్థి ఎండీ నిషాన్‌ అన్వర్‌, తిరుపతి శ్రీవేంకటేశ్వర ప్రాచ్యోన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.శ్రావణి వివరించారు. హైదరాబాదు సిస్టర్‌ నివేదితలో చదువుకుంటున్న కె.శ్రీ కథనమూ.. రహదారి ప్రమాదాలను తగ్గించడానికి ఏం చేయాలో సూచించింది. అదే పాఠశాలకు చెందిన సీహెచ్‌ పూర్బిత, జాస్మిన్‌లు బోరుబావుల్లో పడి చిన్నారులు చనిపోతుండటం మీద ఆందోళన వ్యక్తంచేశారు. వివిధ రంగాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిని తిరుపతి మాలవ్యాజీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎన్‌.మౌనిక సూటిగా విమర్శించింది. భూమి పుట్టుకకు సంబంధించి శాస్త్రీయ సిద్ధాంతాలు, పురాణ కథలను సమాంతరంగా చెబుతూ పెందుర్తి పాఠశాల విద్యార్థి జి.ఉదయ్‌  కుమార్‌ ఓ చక్కటి కథనం రాశాడు.  అరకు లోయ అందాలు.. అక్కడి ప్రకృతి వింతలపై ఇదే పాఠశాలకు చెందిన జమ్ము పుష్ప వివరించింది. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని, ఆ విశిష్టతను కాపాడుకోవడం మనందరి బాధ్యతని వరంగల్లు ‘లెర్నర్స్‌ లాండ్‌’, ‘తేజస్వి’ విద్యార్థినులు జి.లాన్విత, టి.సాహితి రాశారు. ఇంకా, అడవులు, చెట్ల సంరక్షణ, వరకట్నం, అత్యాచారాలు, నిత్యావసర వస్తువుల కల్తీ తదితరాల మీద నాలుగు నగరాల పిల్లలూ వివిధ కోణాల్లో వార్తలు రాశారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ల వినియోగంపై వ్యతిరేక కథనాలు ఇచ్చారు. పొదుపు విషయాలపై ఆసక్తి కనబరిచారు. నీరు, విద్యుత్తు, డబ్బుల పొదుపు లాంటి వాటిపైనా స్పందించారు. ఎక్కువమంది విద్యార్థులు స్వచ్ఛభారత్‌పై వ్యాసాలు రాశారు. పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి.. తద్వారా మంచి వాతావరణం ఎలా ఏర్పడుతుందీ చక్కగా వివరించారు. ఇవే కాదు తల్లిదండ్రులు-పిల్లల మధ్య అనుబంధాలు ఉండాల్సిన తీరు, అంతర్జాల ఆటలు, చరవాణికి బానిసవడం వల్ల కలిగే ఇబ్బందులను చెప్పారు. ‘బాహుబలి’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ లాంటి చిత్రాలనూ తమ కోణం నుంచి సమీక్షించారు.
సానబెడితే వజ్రాలే
* పిల్లలను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయొచ్చని ‘పిల్లల పత్రిక’లతో రుజువైంది. వారు ఎంచుకున్న అంశాలు నేటి సామాజిక పరిస్థితులని ప్రతిబింబించాయి.
* చిన్నారులు తమ కథనాల్లో విలువైన సమాచారం ఉండాలని చేసిన ప్రయత్నాలు మెచ్చుకోదగ్గవి. గణాంకాలు, అదనపు సమాచారాన్ని ఉపాధ్యాయులు, పత్రికలు, అంతర్జాలం ద్వారా సేకరించారు.
* అబ్బాయిల కన్నా అమ్మాయిలు విషయ సేకరణలో ఎక్కువ కసరత్తు చేసినట్లు కనిపించింది. అంశాల ఎంపికలోనూ అమ్మాయిలు పరిణతి ప్రదర్శించారు. సమస్యల మీద రాసిన వాళ్లతో పాటు సానుకూల కథనాలు రాసినవారూ గణనీయంగానే ఉన్నారు.
* రచన పరంగా చిన్న చిన్న వాక్యాల్లో బాగా రాశారు. ఎక్కువమంది రచనలో స్పష్టత కనిపించింది. అక్షర దోషాలు చాలావరకు తక్కువగానే చోటుచేసుకున్నాయి. అన్వయ దోషాలు మాత్రం కాస్త ఎక్కువగా దొర్లాయి. వాళ్ల వయసుకు అవి సహజం. క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే అవి తగ్గిపోతాయి.
* దేని మీదైనా సరే రాయడం.. విషయ విశ్లేషణా శక్తిని పెంచుతుంది. వార్తారచనకు సామాజిక పరిశీలనాదృష్టి అవసరం. అది మన పిల్లల్లో బాగా ఉన్నట్టు ‘పిల్లల పత్రిక’తో నిరూపితమైంది.
సమాజంలో, కుటుంబంలో తమ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్నీ పిల్లలు గమనిస్తుంటారు. ప్రతిదానిపైనా తమదైన అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అయితే, వాటిని వ్యక్తం చేయడానికి వాళ్లకి సరైన వేదికలు లభ్యంకావు. ‘పిల్లల పత్రిక’లాంటివి ఆ కొరత తీరుస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం