సాహిత్యంపై పట్టు...నెట్టుకు మెట్టు

  • 3699 Views
  • 13Likes
  • Like
  • Article Share

    డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

  • స‌హాయ ఆచార్యులు, తెలంగాణ విశ్వవిద్యాల‌యం
  • డిచ్‌ప‌ల్లి, నిజామాబాదు
  • 9866917227
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

స్నాతకోత్తర (పీజీ) స్థాయిలో ఉత్తీర్ణత తర్వాత మరింత లోతైన అధ్యయనాల కోసం పీహెచ్‌డీలో చేరడం అవసరం. పీహెచ్‌డీలో ప్రవేశం దొరకాలంటే జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) ఉత్తీర్ణత అనివార్యం. ఇలా ‘నెట్‌’ ప్రాధాన్యం అధికమవడంతో సహజంగానే పోటీపడేవారూ పెరుగుతున్నారు. తెలుగులో అభ్యర్థుల సంఖ్య మరింత ఎక్కువ. ‘నెట్‌’తో పాటు రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (సెట్‌)లో ఉత్తీర్ణత సాధించడం వల్ల కూడా పీహెచ్‌డీ ప్రవేశానికి అర్హత ఏర్పడుతుంది. ఈ రెండు పరీక్షల్లో గెలవడం సులువేమీకాదు. అయితే.. తెలుగు సాహిత్య చరిత్ర మీద పట్టు సాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
స్నాతకోత్తర అంశాలపై అవగాహన ఉన్న అభ్యర్థులకు ఈ పరీక్షల్లో విజయసాధన సులువే. నిశితమైన విశ్లేషణాత్మక దృక్పథంతో కూడిన విస్తారమైన అధ]్యయనంతో విజయతీరాల్ని చేరుకోవచ్చు. తెలుగు సాహిత్య చరిత్ర చాలా కీలకమైన విభాగం. మొత్తం సిలబస్‌లో రమారమి 30 శాతం వరకు దీనికి సంబంధించిన అంశాలుంటాయి. సంప్రదాయ కవిత్వం, ఆధునిక సాహిత్యం -వివిధ ప్రక్రియలు, ఇటీవలి కాలంలో గుర్తింపు పొందిన అతి వినూత్న ప్రక్రియలు- వివిధ ఆధునిక కాలపు ఉద్యమాలు ఇవన్నీ సాహిత్య చరిత్ర పరిధిలో చేరతాయి. అర్హతా పరీక్షల్లో (నెట్‌/సెట్‌) మంచి మార్కులు సాధించడంతోపాటు భవిష్య జీవితంలో సాధికారిక సాహితీ వేత్తలుగా నిలబడాలనుకునేవారు సాహిత్య చరిత్ర అధ్యయనం పట్ల ప్రత్యేకదృష్టి సారించాలి.
ప్రామాణిక గ్రంథాలు
ఆనాటి కందుకూరి వీరేశలింగం పంతులు ‘ఆంధ్రకవుల చరిత్రము’తో పాటు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, పింగళి లక్ష్మీకాంతం, ఖండవల్లి లక్ష్మీరంజనం, జి.నాగయ్య, ద్వా.నా శాస్త్రి, వెలమల సిమ్మన్నల రచనలతో ఇటీవల కాలంలో దాదాపు వేయి పుటలతో వెలువడిన ‘సాహితీసుధ’ ఇవన్నీ ప్రామాణిక గ్రంథాలే. ఒక పుస్తకంలో దొరకని అంశాలు మరొక గ్రంథంలో లభ్యమవుతాయి. అయితే ఇన్ని గ్రంథాలు చదవాలంటే ఎంతో సహనం అవసరం. సహనమే విజయానికి దారులు నిర్మిస్తుంది మరి! 
      సాహిత్య చరిత్రపై సాధికారిక పరిజ్ఞానాన్ని సాధించేందుకు ప్రణాళికా బద్ధమైన అధ్యయనం, వ్యూహాత్మక దృష్టికోణం బాగా తోడ్పడతాయి. 
      ముందుగా తెలుగు సాహిత్యచరిత్రలో సంప్రదాయ కవిత్వ కాలాన్ని చదువుతున్న క్రమంలో కొంతమంది కవుల్ని జాబితాగా చేసుకోవాలి. వారు...
పద్యకవులు: నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు, భాస్కర రామాయణ కవులు, కొరవి గోపరాజు, జక్కన, మంచన, నంది మల్లయ - ఘంట సింగన, మారన, నాచన సోమన, పిల్లలమర్రి పినవీరభద్రుడు, అల్లసాని పెద్దన, శ్రీకృష్ణదేవరాయలు, నందితిమ్మన, తెనాలిరామకృష్ణుడు, మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, పింగళి సూరన, కందుకూరి రుద్రకవి, రామరాజ భూషణుడు, చేమకూర వేంకటకవి, రఘునాథనాయకుడు, పొన్నెగంటి తెలగన, కూచిమంచి తిమ్మకవి, కంకంటి పాపరాజు, మొల్ల, దూబగుంట నారాయణకవి, పాలవేకరి కదిరీపతి, అయ్యలరాజు నారాయణామాత్యుడు, బద్దెన, వేమన, ఏనుగు లక్ష్మణకవి, ధర్మపురి శేషప్ప, గోగులపాటి కూర్మనాథుడు, కాసుల పురుషోత్తమకవి, రామదాసు- వీరంతా పద్యకవులు.
ద్విపద కవులు: పాల్కురికి సోమన, గోనబుద్ధారెడ్డి, గౌరన, తాళ్లపాక తిమ్మక్క, తాళ్లపాక చిన్నన్న.
భక్తికవులు: అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగరాజు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, తూము నరసింహదాసు, సారంగపాణి
      ఈ కవులందరితోపాటు ప్రధానమైన సంస్థానాలలో జరిగిన సాహిత్య సేవల్ని గురించీ చదవాలి.
సంప్రదాయ కవిత్వాన్ని అధ్యయనం చేసే క్రమంలో కింద సూచించిన పద్ధతిలో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇవి శాశ్వత ప్రయోజనకారులవుతాయి.
1. కవి జీవించిన కాలం- దీనికి ఉన్న స్పష్టమైన ఆధారాలు; బిరుదులు.
2. కవి రచించిన కృతులు- ఆయా రచనల మూలం- మూలం నుంచి తీసుకున్న అంశంలో మార్పులు, చేర్పులు ఏవి? కృతి ఆశ్వాసాల సంఖ్య, కృతిని ఎవరికి అంకితం ఇచ్చారు?
3. కవి రచనలుగా కొందరు పరిశోధకులు చెబుతున్నప్పటికీ పెద్దగా ఆధారాలు లేని రచనలు- వాటిలో విశేషాలు (ఉదా: తిక్కన కృష్ణశతకం లాంటివి)
4. కవి రచనలోని ప్రత్యేకతలు- వినూత్న అంశాలు; సంప్రదాయ విశేషాలు
5. కవి రచన చేసిన కాలం నాటి సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు.
      సంప్రదాయ కవిత్వ కాలం- ఆధునిక యుగాల మధ్య ‘కుంఫిణీ’ (తూర్పు ఇండియా కంపెనీ) యుగం ఒకటి సాహిత్య చరిత్రలో కనబడుతుంది. ఈ కాలాన్ని పూర్తి స్థాయిలో ఆధునికంగా అంచనా వేయలేం, దీన్ని సంప్రదాయ యుగంలోనూ చేర్చలేం. అందువల్ల దీనిని కుంఫిణీ యుగంగానే అధ్యయనం చేయాలి. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం ఇందుకు తోడ్పడుతుంది. 
      ఆధునిక తెలుగు సాహిత్యం ఎంతో విస్తృతమైంది. ఇందులో కవిత్వంతోపాటు మరెన్నో ప్రక్రియలూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. వ్యాసం, నవల, నాటకం, నాటిక, కథానిక, గల్పిక, ఖండకావ్యం, జీవిత చరిత్ర, ఆత్మకథ, వచన కవిత్వం, గేయం, యాత్రా చరిత్ర, మ్యూజింగ్స్‌, మినీ కవిత్వం, నానీ, హైకూ, సాహిత్య విమర్శ- సాహిత్య పరిశోధన.
ప్రక్రియలతోపాటు పలు ఉద్యమాలు- కొన్ని ధోరణులూ ఉన్నాయి. అవి.. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, నవ్య సంప్రదాయం, జాతీయోద్యమం, దిగంబర కవిత్వం, చేతనావర్త కవిత్వం, అనుభూతి వాదం, విప్లవ సాహిత్యం, దళిత వాదం, స్త్రీవాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయ అస్తిత్వ వాదం, ఆధునికానంతర వాదం.
ఆధునిక సాహిత్య చరిత్రలోని అంశాలపై నోట్సు రాసుకుంటున్నప్పుడు ఈ కింది అంశాల్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి.
1. ఆధునిక సాహిత్యంలో ఒకానొక ప్రక్రియ (ఉదాహరణకు ‘వ్యాసం’) ఎప్పుడు ఆరంభమైంది?  
2. ఆ ప్రక్రియలో తొలి రచన ఏది? తొలి రచన చేసిన వారెవరు? (కవి / రచయిత)
3. ఇప్పటివరకు ఆ ప్రక్రియలో వెలువడిన ప్రముఖ రచనల జాబితా?
4. ఇప్పటివరకు ఆ ప్రక్రియలో వెలువడిన అతి విశిష్టమైన రచనల ప్రత్యేకతలు
5. ఆ ప్రక్రియలో ప్రముఖ సాహితీవేత్తలకు లభించిన విశిష్టమైన పురస్కారాలు
6. ఆ ప్రక్రియ (స్థూలంగా) తెలుగు సాహిత్యంపై చూపించిన ప్రభావం.
7. అత్యాధునిక ప్రక్రియల్లో (నానీ / హైకూ వంటివి) కొన్ని ప్రముఖ రచనల సంక్షిప్త జాబితా 
ఉద్యమాలు- ధోరణుల గురించి అయితే,
1. ఒకానొక సాహిత్యోద్యమం ప్రారంభం కావడానికి గల చారిత్రక నేపథ్యం.
2. సాహిత్య ఉద్యమానికి కేంద్రాలుగా ఎదిగిన ప్రదేశాలు
3. సాహిత్య ఉద్యమాలకు తోడ్పాటునందించిన పత్రికలు
4. సాహిత్య ఉద్యమాల ప్రేరణతో వెలువడిన ప్రముఖ రచనలు
5. సాహిత్య ఉద్యమాల నేపథ్యంలో రచనలు చేసిన ప్రముఖుల విశేషాలు
6. కొన్ని ఉద్యమాలు బలహీనపడేందుకు కారణాలు
7. వివిధ వాదాల సామాజిక, చారిత్రక, ప్రాంతీయ భూమికలు. 
ఇప్పటివరకు వివరించిన అంశాలతోపాటు మరికొన్ని అంశాల్ని కూడా సాహిత్య చరిత్ర అధ్యయనంలో చేర్చాలి. అవి..  
1. జానపద వాఙ్మయం
2. తెలుగు నాట ప్రముఖ శాసనాలు- వాటి విశేషాలు (ఇందులో నన్నయ పూర్వకాలం నాటి శాసనాల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం)
3. తెలుగు భాషా చరిత్రకు సంబంధించిన కీలకాంశాలు (దీనికోసం ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకత్వంలో వెలువడిన తెలుగు భాషా చరిత్రలోని కొన్ని ప్రధాన అధ్యాయాలను చదవాలి)
పై మెలకువల్ని పాటిస్తూ సొంత నోట్స్‌ తయారుచేసుకున్న తర్వాత, గత పోటీ పరీక్షల ప్రాతిపదికతో సొంతంగా ప్రశ్నలు రూపొందించుకోవాలి. ఇదే సమయంలో సాహిత్య చరిత్రను ఆరోహణ, అవరోహణ పద్ధతుల్లో మననం చేసుకుంటూ ఉండాలి.
ప్రశ్నలన్నీ సులభంగా ఉండవు. అలా అని అన్ని ప్రశ్నలూ కఠినతరమైనవి కావు. సాధారణంగా ఈ రెండు గుణాల సమ్మేళనంగా ప్రశ్నలుంటాయి. 
సులువైన ప్రశ్నలకు ఉదాహరణలు..
1. పాల్కురికి సోమన రచించిన శతకం? (బి)
ఎ) దాశరథీ శతకం 
బి) వృషాధిప శతకం 
సి) సుమతీ శతకం      
డి) కాళహస్తీశ్వర శతకం 
2. భాస్కర రామాయణ కవులలో ఈ కవి లేరు..? (సి)
ఎ) అయ్యచార్యుడు      
బి) కుమార రుద్ర దేవుడు 
సి) మారన      
డి) మల్లికార్జున భట్టు
3. ప్రబంధ పద్ధతిలో రచించిన రామాయణం? (డి)
ఎ) భాస్కర రామాయణం      
బి) మొల్ల రామాయణం 
సి) నిర్వచనోత్తర రామాయణం      
డి) రామాభ్యుదయము
4. ప్రపంచ కథానికల పోటీలో బహుమతిని సాధించిన తెలుగు కథ? (డి)
ఎ) మామిడి చెట్టు      
బి) నీళ్లు 
సి) కార్నర్‌ సీటు      
డి) గాలివాన
5. ఈ కింది పత్రికల్లో సాహిత్య పత్రిక కానిది? (ఎ)
ఎ) జయభారత్‌       
బి) భారతి 
సి) సుజాత      
డి) జ్వాల
కొంచెం కఠినమైన ప్రశ్నలు ఇలా ఉండవచ్చు..
1. భజన సంప్రదాయానికి సన్నిహితంగా ఉండే రచనలు చేసిన వాగ్గేయకారుడు? (సి) 
ఎ) త్యాగరాజు      
బి) క్షేత్రయ్య 
సి) రామదాసు      
డి) అన్నమాచార్యులు
2. తెలుగులో తొలితరం వ్యాస రచయితల దృక్పథం? (బి)
ఎ) బ్రిటిష్‌ పాలనపై వ్యతిరేకత      
బి) సంఘ సంస్కరణ 
సి) సాహిత్య ప్రచారం      
డి) వైజ్ఞానిక అంశాలు
3. ఆధునిక తెలుగు కవిత్వంపై ఈ వాదం ప్రభావం అతి స్వల్పం? (ఎ)
ఎ) అధివాస్తవిక వాదం      
బి) అభ్యుదయ వాదం 
సి) కాల్పనిక వాదం      
డి) విప్లవ వాదం
4. సినారె ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? (బి)
ఎ) జలపాతం 
బి) మంటలూ మానవుడు
సి) కర్పూర వసంతరాయలు 
డి) భూమిక
5. ప్రతీకవాద ప్రభావం లేని తెలుగు ఆధునిక కావ్యం? (డి)
ఎ) విశ్వంభర       
బి) నా దేశం నా ప్రజలు 
సి) త్వమేవాహం      
డి) తెలంగాణ
కాలక్రమ పద్ధతిలో ప్రక్రియలు, కవుల గురించిన ప్రశ్నలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు..
1. ఈ కింది ఆధునిక ప్రక్రియల క్రమాన్ని సరిచేయండి. (సి)
ఎ) వచన కవిత, కథానిక, నవల, నాటకం
బి) కథానిక, నవల, నాటకం, వచన కవిత
సి) నాటకం, నవల, కథానిక, వచన కవిత
డి) కథానిక, నాటకం, నవల, వచన కవిత 
2. ఈ కింది కవుల కాలక్రమాన్ని సరిచేయండి. (బి)
ఎ) పావులూరి మల్లన, శ్రీనాథుడు, గోన బుద్ధారెడ్డి, ధూర్జటి
బి) పావులూరి మల్లన, గోన బుద్ధారెడ్డి, శ్రీనాథుడు, ధూర్జటి
సి) ధూర్జటి, శ్రీనాథుడు, పావులూరి మల్లన, గోన బుద్ధారెడ్డి
డి) గోన బుద్ధారెడ్డి, పావులూరి మల్లన, శ్రీనాథుడు, ధూర్జటి 
ఇలా వివిధ రకాలైన పద్ధతుల్లో సాధన అవసరం. విస్తారమైన శాస్త్ర అవగాహన, విశ్లేషణాత్మక అధ్యయనం చేయడం వల్ల మాత్రమే సాహిత్య చరిత్రపై పూర్తి సాధికారత సాధించగలం.


వెనక్కి ...

మీ అభిప్రాయం