అక్షింతల పురుగులూ...అమ్మభాష!

  • 635 Views
  • 0Likes
  • Like
  • Article Share

వైకోకోమా... కెనడాలో ఓ చిన్న పల్లె. సంద్రం పక్కన అందమైన ప్రాకృతిక సౌందర్యంతో అలరారే ఊరు. అలగ్జాండర్‌ గ్రాహంబెల్‌ అంతటివాడు అక్కడి వాతావరణానికి ముగ్ధుడైపోయాడని చెబుతారు. వైకోకోమాలో ఆదివాసీలు ఎక్కువ. వారు మిక్‌మాక్‌ భాష మాట్లాడేవారు. మిక్‌మాక్‌ అంటే ‘నా స్నేహితులు’ అని అర్థం. మిక్‌మాక్‌ మాట్లాడేవారి స్నేహం తమ సమాజంతోనే కాదు, ప్రకృతితో కూడా! అందుకే సముద్రంతో సహజీవనం చేస్తూ హాయిగా గడిపేసేవారు. అప్పుడు మొదలైందీ కథ!
      1763లో కెనడాని బ్రిటిష్‌ ప్రభుత్వం వశపరచుకుంది. స్థానికులు నోరు మెదపకుండా ఉండాలంటే, వారి అస్తిత్వాన్ని చిదిమేయాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకోసం ఆదిమజాతుల సంస్కృతిని ధ్వంసం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. నిర్బంధ విద్య పేరుతో ఆదిమజాతుల పిల్లలని కుటుంబాల నుంచి వేరుచేయడం ప్రారంభించారు. ప్రతి ఆదివాసీ పిల్లాడూ తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చట్టాన్ని రూపొందించారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ లేదా ఫ్రెంచి భాషలు మాత్రమే ఉండేవి. సాధారణంగా ఈ ప్రభుత్వ పాఠశాలలను ఆదిమజాతుల నివాస ప్రాంతాలకు దూరంగా స్థాపించేవారు. పైగా ఆ బడుల్లో పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉండేవి. పిల్లలను తీవ్రమైన మానసిక, శారీరక వ్యధకు గురిచేసేవారు. ఆ హింసను తట్టుకోలేక కొన్ని వేలమంది చిన్నారులు చనిపోయినట్లు అంచనా! . 1982లో కెనడాకి పూర్తి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా, మరో ఎనిమిదేళ్ల పాటు ఈ పాఠశాలలు కొనసాగాయి. 
      మొత్తానికి బ్రిటిష్‌ వారి పన్నాగం మాత్రం ఫలించింది. వందేళ్లకు పైగా సాగిన ఈ కుటిల నీతితో కెనడాలోని ఆదిమజాతుల వారసులు అయోమయంలో పడిపోయారు. ఇటు తమ సంస్కృతిని వదులుకోలేక, అటు ఇంగ్లీషువారిలో ఇమడలేక రెంటికీ చెడిపోయారు. దిగువశ్రేణి పౌరులుగా మిగిలిపోయారు. అయితే వారిలో కొందరు ఎలాగైనా తమ భాషను నిలుపుకునే లక్ష్యంతో సాగారు. అలాంటి వారిలో ఫిలిస్‌ గూగూ ఒకరు.
వింత మార్గం
వైకోకోమాకి చెందిన ఫిలిస్‌ గూగూకి నాలుగేళ్లు ఉన్నప్పుడు ఓ నిర్బంధ పాఠశాలలో చేర్పించారు. మిక్‌మాక్‌ తప్ప మరో మాట తెలియని ఫిలిస్‌ ఈ కొత్త ప్రపంచంలో తల్లడిల్లిపోయింది. ఇంగ్లిష్‌, ఫ్రెంచి భాషల మధ్య తన అస్తిత్వం అర్థం కాక పిచ్చెత్తిపోయింది. ఇటు అమ్మా లేదు, ఆ అమ్మని తలపించే అమ్మభాషా లేదు. అలాంటి సమయంలో తన బాధని పంచుకునేందుకు ఓ వింత మార్గాన్ని ఎంచుకొంది ఫిలిస్‌. బడి దగ్గరి పొలంలో ఆడుకుంటూ ఉండగా, ఆమెకి కొన్ని అక్షింతల పురుగులు (లేడీ బగ్స్‌) కనిపించాయి. వాటిని చూడగానే ఫిలిస్‌కి ఓ ఉపాయం తట్టింది. వెంటనే బాట పక్కన ఓ చిన్న బొమ్మ ఇల్లుని తయారు చేసింది. అందులో ఈ పురుగులని ఉంచింది. ఇక వాటితో తనివితీరా తన మాతృభాషలో మాట్లాడింది. అప్పటికి కానీ ఆమె మనసు కుదుటపడలేదు. ఇక మీదట తన భాషని సజీవంగా ఉంచుకోవాలంటే, నోరు లేని ఆ జీవాలతో మాట్లాడటమే మార్గం అని నిశ్చయించుకుంది. అవైతే, తన మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేయవు కదా మరి! విచిత్రం ఏమిటంటే ఫిలిస్‌ ఎక్కడైతే ఆ పురుగులను వదిలిపెట్టి వెళ్లేదో, మర్నాడు అదే చోట ఫిలిస్‌ కోసం ఎదురుచూస్తూ అవి కనిపించేవట. అలా ఏ రోజుకి ఆ రోజు తనకి సంతోషం కలిగినా, బాధనిపించినా, కోపం వచ్చినా... తన భావోద్వేగాలను భాష రూపంలో వెలిబుచ్చేందుకు ఆ అక్షింతల పురుగులు ఫిలిస్‌కి తోడుగా నిలిచేవి. మిక్‌మాక్‌లో పాటలు పాడినా, తిట్టినా బుద్ధిగా వినేవి. క్రమంగా ఆ పాఠశాలలో మిక్‌మాక్‌ భాషలో మాట్లాడే మరికొందరు మిత్రులయ్యారు. ఉపాధ్యాయులకు తెలియకుండా వారంతా కలుసుకుంటూ, తమ భాషలో మాట్లాడుకునేవారు. ఆ భాషలో ఉండే కథలూ, గాథలూ పంచుకునేవారు. కుటుంబాలకి దూరంగా ఉన్న తమ బాధని పంచుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకొనేవారు. అలా పాఠశాలలో పరాయి భాషలను నేర్చుకొంటూనే, తమ మనసు భాషని సజీవంగా నిలుపుకున్నారు.
      పాఠశాల నుంచి బయటికి వచ్చే సమయానికి ఫిలిస్‌ అటు ఆంగ్లంలోనూ, ఇటు మిక్‌మాక్‌లోనూ నిష్ణాతురాలిగా మారిపోయింది. ఓ పక్క ఉన్నత విద్యను అభ్యసిస్తూనే, తన జాతివారికి అండగా నిలబడింది. తన ముగ్గురు పిల్లలూ స్వచ్ఛమైన మిక్‌మాక్‌లో మాట్లాడుకునేలా తర్ఫీదునిచ్చింది. భర్త బెర్నీతో కలిసి మిక్‌మాక్‌ ప్రచారానికి కృషి చేసింది. బదులుగా వైకోకోమా ప్రజలు ఫిలిస్‌కి జీవితసాఫల్య పురస్కారాన్ని అందించారు. ఫిలిస్‌ మాత్రం, తన అస్తిత్వపోరాటంలో అండగా నిలిచిన అక్షింతల పురుగుల చలవే ఇదంతా అని నవ్వేస్తుంటారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం