విజ్ఞాన ప్రేమనాథుడు పాల్కురికి సోమనాథుడు

  • 772 Views
  • 1Likes
  • Like
  • Article Share

పదాలకు విషయ విస్తృతిని ఆపాదించి, స్థూలంగా విపులీకరించేది విజ్ఞాన సర్వస్వం. ఒక విషయం లేదా దానికి సంబంధించిన వివిధ అంశాలను సంగ్రహ సారాంశ రూపంలో వివరించే సంప్రదింపు గ్రంథమిది. తెలుగు భాషలో అలాంటి విజ్ఞాన సర్వస్వాలకు బాటలు పరిచిన కవి పాల్కురికి సోమనాథుడు. పన్నెండో శతాబ్దం నాటి తన ‘పండితారాధ్య చరిత్ర’లో ఆనాటి తెలుగువారి జీవితాన్ని పొల్లుపోకుండా దృశ్యమానం చేశాడాయన.
గతానికీ, వర్తమానానికీ వారధులు భాషాసాహిత్యాలు. ఇవి ఆయా కాలాల్లో పల్లవించిన విజ్ఞాన సుమాల సుగంధాలను ఆగామికాలానికి వ్యాపింపజేస్తాయి. ఈ నిరంతర స్రవంతిలో నిఘంటువులు, విజ్ఞానసర్వస్వాలు పోషించే పాత్ర అపూర్వం. అవే అనాది నుంచీ భాషకు, విజ్ఞానానికీ కొత్త ఒరవళ్లను దిద్దుతున్నాయి.
      దాదాపు రెండువేల సంవత్సరాల కిందటి నుంచీ, మానవాళి చరిత్రలో విజ్ఞాన సర్వస్వాల ఉనికి మొదలైంది. ప్రాచీన రోమన్‌ దేశపు పండితుడు, రచయిత మార్కస్‌ టెరెంటియస్‌ (క్రీ.పూ.116- 27) రచించిన తొమ్మిది గ్రంథాలు తర్వాతి తరాలకు చెందిన విజ్ఞాన సర్వస్వాల రచయితలకు మార్గదర్శక నమూనాలయ్యాయి. క్రీ.శ.77- 79లో ప్లినీ సెమండి (ప్లినీ ద ఎల్డర్‌) అనే రాజకీయవేత్త వెలువరించిన ‘నాచురలిస్‌ హిస్టోరియా’ ఆధునిక యుగ విజ్ఞాన సర్వస్వాలకు ప్రామాణికం. రెండొందల మంది రచయితల రెండు వేల రచనల నుంచి స్వీకరించిన ఇరవై వేల అంశాలను 37 అధ్యాయాల్లో పొందుపరిచినట్లు ఈ గ్రంథ పీఠికలో పేర్కొన్నాడు ప్లినీ. ఇక ఆంగ్లంలోని ప్రసిద్ధ ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’ ప్రచురణ 1771లో ప్రారంభమైంది. భారతీయ భాషల విషయానికొస్తే... మొట్టమొదటి ఆధునిక విజ్ఞానసర్వస్వం కూర్పు తెలుగులోనే ఆరంభమైంది. 1906లో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు దీనికి శ్రీకారం చుట్టారు. ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ పేరిట మూడు సంపుటాలను వెలువరించారాయన. ఆ వరుసలో ఇప్పటి వరకూ 24 సంపుటాలు తెలుగువారికి అందుబాటులోకి వచ్చాయి. అలాగే, 1921లో ‘బెంగాలీ విశ్వకోశ్‌’ను రంగలాల్‌ బందోపాధ్యాయ ప్రచురించారు. తమిళ విజ్ఞాన సర్వస్వం ‘కలైక్కలాంజం’ 1954లో, మలయాళీ ‘సర్వవిజ్ఞానకోశం’ 1972లో వెలువడ్డాయి. ‘గుజరాతీ విశ్వకోశ్‌’ 1985లో అచ్చయింది.  
సోమన బాట
ఆధునిక విజ్ఞాన సర్వస్వాల ప్రామాణికతతో రాయకపోయినా, ప్రాథమికంగా విషయ వివరణకు పూనుకున్నాడు సోమన. ఆనాటి సాంఘికజీవన పరిస్థితులను తర్వాతి తరాలకు స్ఫుటంగా తెలియజెప్పాడు. అనంతరకాలంలో వెలువడిన విజ్ఞానసర్వస్వాలకు మౌలికంగా బాటలు వేశాడు. ‘‘తేటతెనుగు ద్విపద రచింతు’’ అంటూ ఆయన రాసిన ‘పండితారాధ్య చరిత్ర’లో 11,910 ద్విపదలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, రాగాలు, తాళాలు, వీణలు, కొండలు, నదులు, పళ్లు, పువ్వులు, వాదాలు, నేత్రవ్యాధులు, అలంకార శాస్త్ర విషయాలు, చౌర్యం, ద్యూతం, మత సిద్ధాంతాలు, భాషలు, సామెతలు, జాతీయాలు, గ్రామాలు, ఆటలు, పాటలు, వినోదాలు, నగలు, వస్త్రాలు లాంటి అనేక విషయాలను ఇందులో స్పృశించాడు సోమన. తన సమకాలీన సమాజానికి సంబంధించిన అన్ని అంశాల గురించీ స్థూలంగా ఈ కావ్యంలో చెప్పాడు.   
      ఇంద్రనీలమయ, శైలమయ, చంద్రకాంత, మణిమయ, హేమమయ, రౌప్యమయ, కాంస్యకమయ, పార్థివ, స్ఫాటికాయత, అన్నమయ, దారుజమయ, తామ్ర, నారకూట భాస్వల్లింగం తదితర వివిధ పదార్థమయ లింగ రూపాల్లో శివార్చనలు జరుగుతున్నాయని ‘పండితారాధ్య చరిత్ర’ దీక్షాప్రకరణంలో వివరించాడు వీరశైవలింగార్చకుడు సోమనాథుడు. ‘‘పెద్దభక్తుల కాళ్లబడి కడ్గి తాగడం, ముకుళితహస్తులై మోగి జయవెట్టటం, సాష్టాంగులై మొక్కటం, భక్తుల పాదాబ్జాలపై పడి పొర్లడం, పాదరేణువులపై పడి పొర్లడం, చుట్టూ తిరిగి దండాలు పెట్టడం, భక్తులను ఎత్తుకుని ఆడటం, మొలచుట్టూ, తలచుట్టూ మోకులను కట్టుకుని నాట్యమాడటం, చూరులో ఉన్న సెంబళికోలను దూసుకుని చిందులు వేయటం, కత్తి- బల్లేలను పట్టుకుని ఎగురుతూ ఆడటం, భక్తుల పాదరక్షలను తల మీద పెట్టుకుని ఆడటం, చప్పట్లు కొడుతూ భక్తితో శివమహిమలను పాడటం, పంచమహావాద్యాలను మోగిస్తూ ఆడటం’’ లాంటి చేష్టలతో భక్తులు శివమహోత్సవాలను జరిపే వారని వర్ణించాడాయన.
ఎన్నెన్ని విశేషాలో..
ఆ కాలం నాటి ప్రజలు ‘‘కావిపచ్చడాలు, కావిదుప్పట్లు, చల్లడాలు, దట్టిపచ్చడాలు, రత్నకంబళ్లు, వలిపొత్తుపచ్చడాలు, జూరవాదములు, పట్టు పచ్చడాలు, వెలిపట్టె, చంద్రసూర్యులున్న చీరెమకుటాలు, కంబళమకుటాలు, నందిమకుటాలు, పులితోలు, కరకంచుకావులు, వెలిబేలెములు, చందురుకావి పల్చని వలువలు, పల్చటి జోడుకుప్పసాలు’’ లాంటి వస్త్రవిశేషాలను ధరించేవారు. ‘‘వెంట్రుకల దండలు, పిల్లాండ్లు, కంచుమట్టెలు, నల్లగాజులు, వల్దయూరులు, తగరపు గాజుపూసలు, సంకుపూసలు, వెండిపసిడి గొలుసులు, పూసలపేర్లు, బన్నసరాలు, రాగికంటెలు, రాగి ఉంగరాలు, రాగి జంధ్యాలు, కాలి అందెలు, ఒడ్డాణాలు, కటిసూత్రాలు, శుద్ధస్ఫటిక, బంగారు, రాగి, నంది, నాగకుండలాలు, మంగళసూత్రాలు’’ తదితరాలు వారి ఆభరణాలు. అలాగే.. ‘‘రాగుంజు పోగుంజులాట, కుందెన, గుడిగుడి గుంజం, అప్పలవిందులు, చప్పట్లు, సరిగుంజులాట, చేరపోతులాట, సిట్లపొట్లాట, గోరంటలాట, దాగుడుమూతలాట, దిగుదిగు దిక్కొనే ఆట, పంచాంసి పేరణి, చిందులాట, కోడంగలాటలు’’ ఆడుకునేవారు. ‘‘తుమ్మెద, ప్రభాత, పర్వత, ఆనంద, శంకర, నివాళి, వాలేశు, గొబ్బి, వెన్నెల, సంజ, గణవర్ణన పదాలు’’ పాడుకునేవారు. అచ్చమైన ఈ తెలుగు ఆటపాటలు, వస్త్రాభరణాల్లో నేడు మనకు తెలిసినవెన్ని? తెలిసిన వాటిలో ఇప్పుడు మిగిలినవెన్ని?
      ఇంకా నాట్యవిజ్ఞానం, సంగీత విషయాలు, సప్తవింశతి శుద్ధతాళాలు, అష్టాదశవాసనాదాలు, గతిభేదాలు, సప్తాలాపాలు, అష్టోత్తర శతతాళ భేదాలు, తంత్రులు, వీణల్లో రకాల్లాంటి కళా విజ్ఞాన విశేషాలు ‘పండితారాధ్యచరిత్ర’లో కనిపిస్తాయి. వివిధ వ్యాధులు, అనేక రకాల ఉత్పాతాల్లాంటి వివిధ అంశాలకు సంబంధించిన వివరాలనూ సోమన దోసిళ్లతో తవ్వి గంపలకెత్తాడు.
ఆ నాలుగూ...
‘పండితారాధ్యచరిత్ర’ తర్వాత తెలుగువాళ్లకి విజ్ఞాన సర్వస్వాలు అనదగిన కావ్యాలు... వినుకొండ వల్లభామాత్యుడి ‘క్రీడాభిరామం’, అయ్యలరాజు నారాయణకవి ‘హంసవింశతి’, పాలవేకరి కదరీపతి ‘శుకసప్తతి’, కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’లు. ‘క్రీడాభిరామం’లో 14, 15 శతాబ్దాల నాటి విదేశీ వ్యాపారం, వాణిజ్య ఉత్పత్తులు, పిండివంటలు, పల్నాటిసీమ ఆహార విశేషాలు, రాజుల పన్ను విధింపు ప్రక్రియలు, ఆభరణాలు, ఇళ్లనిర్మాణం మొదలైన అంశాలు కనపడతాయి. ఇక ‘హంసవింశతి’.. పువ్వులు, వంటకాలు, వివిధ వాద్యాలు, వృక్షాలు, ఆటపాటలు, వస్త్రవిశేషాలను తెలియజేస్తుంది. పాలవేకరి కదరీపతి తన కావ్యంలో పదహారో శతాబ్దానికి చెందిన వృత్తులు, ఆచార వ్యవహారాలు, కట్టూబొట్టు, విశ్వాసాలు, వినోదాలు, వ్రతాలు, తిరునాళ్లు, మోసాలు, ధర్మాల్లాంటి ప్రజాజీవన స్రవంతిని విపులీకరించాడు. ‘సింహాసన ద్వాత్రింశిక’లో తెలంగాణ తరిసేద్యం, ఆనాటి నాణేల విశేషాలను చూడవచ్చు. అయితే.. పాల్కురికి సోమనాథుడికి ముందు, ఆ తర్వాతి తెలుగు కవులెవరూ ‘పండితారాధ్య చరిత్ర’ స్థాయిలో సాంఘిక పరిస్థితులను పేర్కొన్నది లేదు. 
      గతంలోని జీవన సరళిని అవగతం చేసుకోవటానికి అవసరమైన విజ్ఞాన సర్వస్వాల రచనకు తెలుగులో శ్రీకారం చుట్టిన ఘనత ‘పండితారాధ్యచరిత్ర’ది. ‘‘తెలుగు కవులలో ఈయనవలె ప్రజలకు యింత సన్నిహితంగా వుండిన కవీ, తెలుగు ప్రజాజీవనమును యింత చక్కగా తన కావ్యంలో ప్రదర్శించిన కవీ యీయన ఒక్కడు మాత్రమే’’ అని సోమనాథుణ్ని కీర్తించిన తిమ్మావఝల కోదండరామయ్య మాటల్లో చెప్పాలంటే ఈ కావ్యం.. ‘తెలుగుజాతి తొలి విజ్ఞానసర్వస్వం’!


వెనక్కి ...

మీ అభిప్రాయం