జనచైతన్య కవితాస్వరం...

  • 149 Views
  • 0Likes
  • Like
  • Article Share

సామాజిక పరివర్తనే లక్ష్యంగా అక్షరసేద్యం చేసిన మల్లవరపు రాజేశ్వరరావు 1949 ఆగస్టు 1న చీమకుర్తిలో జన్మించారు. మధురకవిగా సమసమాజ చైతన్యదీప్తిగా కవితాగానం చేస్తూనే ఉపాధ్యాయుడిగా జీవనాన్ని కొనసాగించారు. తండ్రినుంచి కవితాప్రేరణ పొందిన ఆయన జాషువా ద్వారా ప్రగతిశీలభావాలని అందిపుచ్చుకున్నారు. చిన్ననాటినుంచే పద్యం పై పట్టుసాధించడంతో మల్లవరపు నుంచి ఎక్కువగా పద్యకావ్యాలే వెలువడ్డాయి. ‘భక్తయోబు, అనాథగంగ, ఎయిడ్స్‌ మహమ్మారి, కాళింది, ఎస్తేరురాణి, రజియా ప్రణయం’... ఈయన ఇతర రచనలు. ‘జీవనది’ రాజేశ్వరరావుకు పేరుతెచ్చిపెట్టిన కావ్యం. కొన్ని బాలల గేయాలను కూడా వెలువరించారు. ప్రజల భాషను గొంతుకగా చేసుకుని... ఆకలికేకలనూ.. బడుగుల దీనత్వాన్ని తన కవిత్వంలో పలికించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎలాంటి దుస్థితి పట్టిందో తెలుపుతూ...
మోడుబారెను గ్రామాలు బీడువారె
ఓట్లుపొందగ సారానునోట్ల జూప 
మన ప్రజాస్వామ్యసంస్థయే మలినమయ్యే 
ప్రగతిరథమెట్లు సాగునో భరతధాత్రి...
అని దిగులుపడిన కవి. ‘మల్లవరపు మాట మల్లెమూట’ అనే మకుటంతో శతకం కూడా రాశారు. ఇందులో సాంఘిక అసమానతలనీ, అనైతికతని ఎండగట్టారు. మతమన్నది హితాన్ని బోధించేదిగా ఉండాలనీ ఆకాంక్షించారు. ‘మధుర సాహిత్యభారతి’ సంస్థ ద్వారా సాహిత్యసేవను కొనసాగించి కొత్తతరం కవులను ప్రోత్సహించారు. తనచుట్టూఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించడమే కాకుండా.. సామాన్యుల గొంతులకు అక్షరరూపమిచ్చిన మల్లవరపు ఈ అక్టోబరులో సాహిత్యలోకాన్ని విడిచిపెట్టారు. మల్లవరపును ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో గౌరవించింది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం