స‌వ్య‌సాచి, అర‌వింద స‌మేతం - వెండితెర‌వెన్నెల‌

  • 282 Views
  • 2Likes
  • Like
  • Article Share

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!
నవ్యతతో సవ్యసాచి..

ఇందులో కథానాయకుడు ఒక్కడు కాదు ఇద్దరు. అంటే కవలల్లో ఒకడి లక్షణాలు కథానాయకుడిలో కొంత మిగిలి పోతాయి. ఆ లక్షణాలకు ఎడమచేయి ప్రతిస్పందిస్తుంది. అంటే రెండు చేతులూ సరి సమాన స్థాయుల్లో శక్తిని కలిగుంటాయి. అర్జునుడు సవ్యసాచి అని.. రెండు చేతులతోనూ బాణాలు వేయగలడనీ చెబుతారు. ఆ లక్షణాన్ని, సామ్యాన్నీ చిత్ర శీర్షికగా చేసుకున్నారు. చాలాకాలంగా ఇలాంటి చిత్ర శీర్షిక రాలేదు. 
      ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని ‘అద్భుతం’ అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని.. వరసకి కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని.. ఈ సవ్యసాచిలో సగాన్ని...’ ఇది కనిపించని రెండో కథానాయకుడి పాత్ర చెప్పే సంభాషణ! ఇతన్ని ‘అంతఃకవల సోదరుడు’ అని అనొచ్చేమో. 
      విద్యార్థుల నాటక ప్రదర్శనలో ‘కృష్ణా.. బలరాముడంటే.. రాముడికి చుట్టమా?’ అంటే ‘సుదర్శనచక్రం సర్వీసింగ్‌కి ఇచ్చానుకాబట్టి సరిపోయిందిరా.. లేకపోతే నీకుండేది..’ అంటూ విసుక్కోవడం నేటి తరం అజ్ఞానం మీద వ్యంగ్యాస్త్రం.
      వాణ్ని చూస్తుంటే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఉన్నాడు కదూ అని ప్రతినాయకుడు అంటుంటే.. మీది పద్మ వ్యూహమే సార్‌. కానీ అతడు అభిమ న్యుడిలా కాదు.. అర్జునుడిలా ఉన్నాడు.. అంటాడు సహపాత్రధారి. శత్రువును గొప్ప శక్తిమంతుడని చెబుతూనే, వాడి ఓటమి మాత్రం తప్పదని ముందే చెప్పడం ప్రతి నాయకుడి మాటలో చక్కగా కనిపిస్తుంది. కానీ, సహపాత్రధారి.. కథానాయకుణ్ని గెలవడం అంత సులువు కాదని చురక అంటించడం మెరుపు. ఈ సంభాషణ సన్నివేశాన్ని ద్విగుణీకృతం చేసింది.

వచనారవింద సమేతం..
ఈమధ్యే తెలంగాణ తెమ్మెరలు పంచిన ఫిదాను, అందులో భాషయాసల మధురిమను మరిచిపోలేం. ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవుడి సీమ మాండలికంతో రసభరితం అయింది తెలుగు చిత్రసీమ. కథలో ప్రధాన ఘట్టాలన్నీ పల్లె వాతావరణంలో సాగటం వల్ల తేటతెలుగు పదాలు వినిపిస్తాయి. దర్శకత్వమూ మాటలూ త్రివిక్రమ్‌. పెంచలదాసు యాస సాయమూ ఉంది.
      ‘‘అందరూ యుద్ధంలో గెలవడం ఓడటమే చూస్తారు. అంతా అయిపోయినాక ఏడవడం ఎవరికీ జ్ఞాపకం రాదు..’’ అన్న మాటలే ఈ చిత్రకథకు మూలం. సీమలోని బతుకు వెతల్ని చెబుతూ ‘‘కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు.. ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్లు.. నిశ్శబ్దంగా ఏడ్చే ఊళ్లూ.. వీళ్ల రక్తంతో సంతకంచేసిన సీమ..’’ అని అంటాడు నాయకుడు. ‘‘వాడి రోజు వస్తే ఎవడైనా గెలుస్తాడు. అసలు యుద్ధం రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు. వాడే గొప్ప..’’ అంటూ కథానాయకుడి జేజి మాటనే పునరావృతం చేసిన నాయకి కథలో మలుపు తీసుకొస్తుంది. 
      ‘అనగనగనగా’ పాటలో సిరివెన్నెల కలం తమాషాగా సాగుతుంది. సాకీలో ‘‘..చీకటిలాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా..’’ అంటూ నాయకి పాత్ర పరిచయం ఆకట్టుకుంటుంది. పెనిమిటి పాటలో రామజోగయ్య శాస్త్రి సీమ పదాలు మనతో అర్థాలు వెతికిస్తాయి. తన భర్తను సగిలేటి డొంకల్లో పదిలంగా రారా.. గలబోటి కూరొండి పిలిచా రారా.. అంటూ ఆర్తిగా పిలవడం హృద్యంగా ఉంది. ఏటకత్తి తలగడై ఏడ పడుకొంటివో.. అన్న ఊహ ఈ పాట మొత్తానికి సౌందర్య స్థానం.
రెడ్డమ్మతల్లి పాటను స్ఫూర్తిగా తీసుకున్న పెంచలదాసు పాట కథాంతం లో భావోద్వేగాలను రాజేస్తుంది. ఇందులో ‘‘సిక్కే నీకు సక్కానమ్మా.. పలవరేని దువ్వెనమ్మా.. సిక్కూదీసి కొప్పేబెట్టమ్మా’’ అన్న అచ్చ జానపద తుళ్లింతకు ప్రేక్షకులు మూడు దశాబ్దాలకు అవతల పడతారు. పలవరేని చెక్కతో ఏటికొప్పాక బొమ్మలు చేస్తారు. పలవరేని దువ్వెనలు ఇప్పుడు వాడకం తగ్గింది. కొందరికి ఈ పదమే కొత్త. ప్రతినాయకుడి మరణానికి పాటను జోడించి గుంభనంగా కథను ముగించడం కొత్తదనం. అయితే.. కథా నేపథ్యం మాత్రం విమర్శలకు తావిచ్చింది.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం