కలలు కరిగి... కన్నీళ్లుగా మారి...

  • 1868 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.శ్రీదేవి

  • హైదరాబాదు
  • 9490470718

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

వచ్చేశావా ప్రాణనేస్తం!
వస్తావో, రావోనని ఒకటే దిగులు. కొట్టుకుపోతున్న గుండెతో... కన్నీళ్లు బిగపట్టిన కళ్లతో ఎంతగా నిరీక్షిస్తున్నానో నీ కోసం! నువ్వొస్తావని తెలుసు! అయినా... వచ్చే వరకు ఏదో తపనతో వేసారిపోతా. నన్ను కలుస్తావనీ తెలుసు. అయినా... నిన్ను కలిసే వరకూ చెప్పలేని వేదనతో అల్లాడిపోతా.
      ఇదేనేమో ప్రేమంటే..!?
       నవ్వుతున్నావా? అదేంటి నీ నవ్వులోంచి చిత్రమైన రంగుల పూలు అదే పనిగా రాలి... ఎండిన ఈ ఇసుక తిన్నెల మీద పరుచుకుంటున్నాయి! ఆ పూల గుండెల్లోంచి పుప్పొళ్లు చెలరేగి నా మేనంతా ముసురుకుంటున్నాయి. 
      ఓహ్‌! ఎంత కమ్మని సుగంధం! నా ఆత్మ శరీరాన్ని వదిలి నీతో కలుస్తున్న అనుభూతి.
      ఒక్కసారి నాకు దగ్గరగా రావూ? 
      అబ్బ! నువ్వు అడుగుతీసి అడుగు వేస్తుంటే... ఆ సవ్వడికి చెదిరిన చల్లగాలి అలలు నన్ను ఆర్ద్రంగా తాకుతున్నాయి.
      నీ సిందూరపు చీర కొంగుల్నేమిటి నేల నాలుగు చెరగులకూ అలా పరిచేస్తున్నావు? 
      మందార వర్ణాలను మౌనంగానే విరజిమ్ముతున్నావు? 
      ప్రియా! నీ చెక్కిళ్ల మీద వెలుగుతున్న కెంపుల దీపాలు నా కళ్లలో ప్రతిఫలిస్తున్నాయి చూడు. ఆ దీపాల ఎర్రనికాంతి పడి ఆ నీలినీలి సాగర కెరటం చిరుమంటల్ని సిగలో ముడుచుకున్న జ్వాలాముఖిలా ఎలా మిడిసిపడుతోందో! 
      నెచ్చెలీ! నీ పెదవుల్లోని అరుణిమను నా కళ్ల వెలుగుల్లో రంగరించి నీ పాదాలకు పారాణి అద్దాలనేది నా యుగాల స్వప్నం. తీయనా మరి ఊపిరి కుంచెలు?
      ప్చ్‌... పాదాలకు పారాణి రాసుకునే వచ్చావా? ఎంతటి దురదృష్టం నాది? పోనీ దిక్కుల్లో రేగుతున్న సిందూరధూళి నీ నుదుట తిలకంగా దిద్దుదామంటే అస్తమించే సూర్యబింబం నా కంటే ముందే ఆ పని చేసేసింది. నిజంగా ఎంతటి నష్టజాతకం!
      పగలబడి నవ్వకు... అలా ఎద పునాదులు కదిలేలా! నన్ను చూస్తుంటే ఎగతాళిగా ఉందా?
      అనుక్షణం నిన్నే ధ్యానిస్తూ, నీ నిరీక్షణలో గడుపుతూ నీ సమక్షంలో ప్రాణాలు సైతం విడిచిపెట్టేయగల ఈ నా ఆరాధనను చూస్తుంటే కనికరం కలుగట్లేదా నేస్తం!
      అరెరే వెళ్లిపోతున్నావా? నా స్వప్నాల రెక్కలు తెంపి, నా ఆశల గొంతునులిమి వెళ్లిపోతున్నావా!? నువ్వు లేని ఈ నిశిలో, నిశ్శబ్దంలో రోదిస్తూ... నీ విరహంలో మరణించమని చెప్పకనే చెబుతూ వెళ్లిపోతున్నావా!!
      ఏం పాపం చేశానని, నా కనుపాపల్లో దాచుకున్న నీ అద్భుత రూపాన్ని నిర్దాక్షిణ్యంగా చెరిపేశావు? నా కలలను కరిగించేశావు?
      నువ్వు నాకు కావాలి నేస్తం. కావాలంతే!
      నీ నవ్వుల వెన్నెల కరవై ప్రపంచమంతా చీకటి పరచుకుంటోంది. నలువైపుల నుంచి కమ్ముకుంటున్న ఈ అంధకారాన్ని భరించలేను. నీరవ నిశీధిలో వెక్కివెక్కిపడుతూ ఒంటరిగా ఈ పయనాన్ని సాగించలేను. నా చుట్టూ కరడుకట్టిన నిశ్శబ్దం చుక్కచుక్కగా రాలిపడుతూ చేసే వికృత శబ్దాన్ని వినలేను. గాఢాంధకారపు నిశి విడిచే నిశ్వాసాల సెగలకు నా గుండె కణాలు కాగిపోతున్నాయి. ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. తట్టుకుని బతకడం సాధ్యమే కాదు.  
      ఓసారి కనిపించవూ! నా కళ్లలో పుట్టిన కన్నీళ్లు కనురెప్పలను దాటకముందే... అవి నా చుబుకాన్ని దాటి గొంతును తడిచేసి మూగపోనీయక ముందే... ఒక్కసారి నిన్ను ప్రేమగా పిలుచుకోనీయవూ..!
నిజం... నేస్తం! నువ్వు నా వంక చూస్తే ఈ విశాల విశ్వం వెలిగిపోతూ కనిపిస్తుంది!!!

కలలు కరిగి... కన్నీళ్లుగా మారి...

వెనక్కి ...

మీ అభిప్రాయం