ఎలా ఉన్నావు సీలేరూ?

  • 8411 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పెండ్యాల సర్వశ్రీ

  • హైదరాబాదు
  • 9963968038

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన సీలేరుకి, 
ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. రెండేళ్ల క్రితం నిన్ను చూసేటప్పటికీ ఇప్పటికీ నీలో ఏ మార్పు కనిపించలేదు. ఇంతకీ నేనెవరో గుర్తు పట్టావా? నేనే పెండ్యాల శ్రీరామమూర్తి గారి పెద్దమ్మాయిని. అదే! ఎనిమిదో అడ్డ రోడ్డులో ఉండే వాళ్లం. బజారు నుంచి వస్తుంటే కుడివైపు మొదటి ఇంట్లో ఆంగ్లో ఇండియన్స్‌ డాలి వాళ్లు, కొండలరావు, ఆకురాతి ఆంజనేయులుగార్లు, మేమూ, మాపక్క గొర్రెల వెంకటేశ్వరరావు గారు, మధ్యలో ఎవరో గుర్తులేదు. కానీ చివర ఇటికరాల వాళ్లు, ఇంకా ఎంతో మంది ఉండేవారు. హమ్మయ్యా! ఇప్పుడు గుర్తుకొచ్చానా? అయినా ఎంతో మంది నీ ఒడిలో పెరిగారు కదా! గుర్తుంచుకోవడమూ కష్టమేలే! నాకు పన్నెండేళ్లు వచ్చేదాకా అక్కడే ఉన్నాం. నిన్నూ, ఆరోజులనూ తలచుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఇంటి దగ్గరే బడి. దాని ముందే పార్కు. అక్కడ ఆటలు ఆడటం ఇవన్నీ గుర్తుకొస్తుంటే ఏదో మధురానుభూతి కలుగుతుంది.
      మాకు విద్యాబుద్ధులు నేర్పిన పప్పు జగన్నాథం మాస్టారు, డ్రిల్‌ మాస్టారు, డ్రాయింగ్‌ మాస్టారు, హిందీ టీచరు, సైన్స్‌ టీచరుగారూ... అందరూ గుర్తున్నారు. ఎక్కడ అస్థిపంజరం చూసినా, కడుపులో పెరిగే నెలల పిల్లల్ని చూసిన సీలేరు సైన్స్‌ ల్యాబే గుర్తుకొస్తుంది. మా తరగతి నేస్తాలు రమణి, శోభ, రాధ, ఎల్‌.వి.రమాదేవి, ఎన్‌.రామలక్ష్మి, కుమారి, రుక్మిణి, చిన్న రమణి వీళ్లంతా నిన్ను ఎప్పుడైనా కలిశారా? నేరేడుచెట్టు మీదనుంచి పడి ముఖర్జీ చనిపోవడం గుర్తొచ్చినప్పుడల్లా విషాదం కమ్మేస్తుంది. బడి పక్కనే పోలీసుస్టేషను, దాని పక్క ఆసుపత్రి, ఎదురుగా పోస్టాఫీసు అన్నీ కళ్లకు కట్టినట్లు గుర్తున్నాయి. 
      నిన్ను చూసిన మా పిల్లలు ఏమన్నారో తెలుసా? ‘‘ఇంత మంచి ఊరుందని ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఆహా! ఎంత ప్రకృతి సౌందర్యం, ఏం ఆహ్లాదకర వాతావరణం. దీని ముందు ఊటీ వంటివీ దిగదుడుపే. అమ్మా! నువ్వెంత అదృష్టవంతురాలివో ప్రకృతి ఒడిలో పెరిగావు’’ అన్నారు. అప్పుడు ఎంత తబ్బిబ్బయ్యానో. నువ్వెక్కడున్నావో ఎవరికీ చెప్పనులే. ఎందుకంటే నీ ఉనికి తెలిస్తే నీ పర్యావరణాన్ని కూడా పాడు చేసేస్తారు.
      నువ్వున్నచోట వానొస్తే పెద్దపెద్ద వడగళ్లు పడేవి. వాటిని ఏరుకుని ఫ్లాస్క్‌లో వేసి ఆడేవాళ్లం. అమ్మవాళ్లు అరుగుమీద కూర్చుని బియ్యమేరుతుంటే అక్కడికి పిచ్చుకలు ధాన్యం తినేందుకు వచ్చి వాలేవి. వాటిని చూస్తుంటే భలే ముచ్చటేసేది. కాకులే కనిపించేవి కావు ఎందుకనో!
      మా ఇంట్లో పూసిన చేమంతులను దండలు కట్టి, బస్సుల్లో మా తాత గారింటి కి పంపేవాళ్లం. కాకినాడ బస్, మెయిల్‌బస్‌ లాంటివి మూడో నాలుగో మాత్రమే ఉండేవి. ఇప్పుడేమైనా పెంచారో లేదో?
      బజార్లో కిరాణాకు ఉప్పు సుబ్బారావు, కూరలకు ఈశ్వరరావు, బట్టలకు సాయి కొట్లకు వెళ్లేవాళ్లం. ఎప్పుడన్నా అమ్మవాళ్లు ఊరెళితే పంతులు హోటల్లోనూ, నాన్నగారి ఆఫీసు దగ్గర అయ్యరు హోటల్లోనూ తినేవాళ్లం. బడి పక్కనే సీతారామయ్య షాపులో చాక్లెట్లు, బల్లిగుడ్లు, పెన్సిళ్లు, పెన్నులు కొనుక్కునే వాళ్లం. 
      జయమ్మ వాళ్లింట్లో జామకాయలు, మా ఇంట్లో నారింజకాయలు, శోభ వాళ్లింట్లో దానిమ్మ, పెద్దా వాళ్లింట్లో కమలాలు పండేవి. అందరింట్లోనూ అరటిపళ్లు పండేవి. వీటన్నింటినీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొనే వాళ్లం. వినాయకచవితికైతే ఇవన్నీ పెట్టేవాళ్లం. పాలవెల్లి కోసం మొక్కజొన్నపొత్తులు, తమలపాకులు, కొబ్బరికాయ మాత్రమే కొనేవాళ్లం. పత్రి, పూలు అంతా పెరట్లోదే. అందుకే పాలవెల్లి కడుతున్న ప్రతిసారీ గుర్తుకొస్తావు.
      రాధ సంపెంగ పూలనూ, భ్రమరాంబ గారు, నారాయణగారి అత్తగారు మల్లెపూల నూ మా వీధిలోని ఆడపిల్లలకు పంచేవాళ్లు. రోజుకి ఇద్దరు ముగ్గురు చొప్పున మల్లెపూల జడ వేసుకుని, పట్టు పరికిణీ కట్టుకుని బాగా అలంకరించుకుని స్నేహితులతోపాటు ఇంటింటికీ వెళ్లి జడ చూపించి రావడం ఎంత సంబరంగా ఉండేదనీ! ఆషాఢంలో ప్రతి ఆదివారం గోరింటాకు పెట్టుకునేవాళ్లం. అట్లతద్దికి వేకువనే లేచి డ్యామ్‌ దగ్గర ఆటలాడి, స్నానాలు చేసొచ్చేవాళ్లం. కార్తీకమంతా నదీస్నానం, ప్రతి ఆదివారం పిక్నిక్‌ల హడావుడి. సంక్రాంతికీ అలానే ఎవరో ఒకరింటిలో సరదాగా గడిపేవాళ్లం. 
      ఇంటికొచ్చిన చుట్టాలందరికీ డ్యామ్, పవర్‌ హౌస్, ఐ.బి, ఆంజనేయస్వామి గుడి చూపించే వాళ్లం. దేవుని దయవల్ల నీ ఒడిలో పెరిగిన ఎందరో గొప్ప స్థానాల్లో ఉన్నారని విని సంతోషించాను. జీవితంలో ఇప్పుడు కాస్త తీరిక దొరికింది. కాబట్టి వీలు చూసుకుని ఓ నాలుగు రోజులు నీ ఒడిలో గడపాలనీ, సేదదీరాలనీ ఉంది. ‘‘సీలేరు’’ అని తలుచుకోగానే భావాలు సెలయేరులా ప్రవహిస్తాయి. ఉంటా మరి.

ఇట్లు.... సర్వలక్ష్మి

ఎలా ఉన్నావు సీలేరూ?

వెనక్కి ...

మీ అభిప్రాయం