మూగబోయిన గుడిగంటలు

  • 1879 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కాసారం భారతి

  • నిజామాబాదు
  • 9951040339

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన శ్రీవారికి,
      మీ బంగారు శ్రీమతి ప్రేమతో రాస్తున్న లేఖ. మీరక్కడ కుశలమా? ఇక్కడ నేనూ, పిల్లలంతా క్షేమమే. పెళ్లయిన పదహారేళ్లలో ఎప్పుడూ నన్ను విడిచి వెళ్లలేదు. విధి నిర్వహణలో (పోలీసు) భాగంగా ప్రత్యేక శిక్షణకోసం మమ్మల్ని వదిలి అంత దూరం వెళ్లారు. అప్పటి నుంచి ప్రతీ క్షణం నా హృదయం మీకోసమే తపిస్తోంది. పెళ్లికి ముందే మనం ప్రేమించుకున్నాం కానీ ప్రేమలేఖలేనాడూ రాసుకోలేదు. ఇన్నాళ్లకు రాసే సమయం వచ్చింది.
      పరవశించే ప్రకృతి ఒడిలో, గలగలపారే సెలయేటి పరవళ్లతో, నా మనసులో ఉప్పొంగే భావాలతో రాస్తున్న తొలి ప్రేమలేఖ ఇది. మనసారా చదువుకోండి... మనసులో దాచుకోండి.
      ఉదయం లేచిన్నుంచి పడుకునేంత వరకూ మీ తలపులే వెంటాడుతున్నాయి. వంట చేస్తున్నపుడు మీరు నా పక్కనే ఉన్నట్టు, బట్టలుతుకుతుంటే సాయపడుతున్నట్టు, భోంచేస్తున్నపుడు ఇంకాస్త వడ్డిస్తున్నట్టు, అలసిసొలసి నేనుంటే విశ్రమింపజేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇన్నేళ్లుగా నా తోడూనీడగా ఉంటూ... నన్ను కనుపాపలా చూసుకున్నారు. పసిపాపలా లాలించారు. నా పెదవులపై చిరునవ్వులు చిందింపజేస్తూ... నా కళ్లకు ఆనందకాంతులిస్తూ.... నా హృదయాన్ని అనుక్షణం ప్రేమతో పులకరింపజేసేవారు. ఇప్పుడు దూరంగా వెళ్లారు. దాంతో నేను కలల ప్రపంచాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. 
      ఏనాటి పుణ్యమో ఈనాటి మీ సాహచర్యం! ఏ జన్మబంధమో ఈ అనుబంధం! ఎన్నెన్ని జన్మలెత్తినా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా - మీ ప్రేమనే కోరుకుంటా.
      శకుంతలను నేనైతే దుష్యంతుడిలా వరించారు. రాధనైతే మాధవుడిలా అనురాగం పంచారు. అలనాటి జానకిని అయినప్పుడు మీరు రఘురాముడై పెళ్లాడారు. ఆనాటి నుంచి అర్ధనారీశ్వరుడయ్యారు. 
      ఆకాశమే హద్దుగా... సాగరమంత లోతుగా ప్రేమించారు. పంచభూతాల సాక్షిగా మీదాన్ని చేసుకున్నారు. నాపైనే పంచప్రాణాలు పెట్టుకున్నారు. అలాంటి మీరిప్పుడెలా ఉన్నారోనని నా మనసు తల్లడిల్లుతోంది. నిష్కల్మషమైన మీ ప్రేమను, నిర్మలమైన మీ మనసును ఎప్పుడైనా నొప్పించుంటే క్షమించండి.
      కన్నవాళ్ల ఆత్మీయతను, తోడబుట్టిన వాళ్ల ఆదరణను, స్నేహితుల మైత్రిని, పుట్టింటి ఆప్యాయతను, మెట్టినింటి అనురాగాన్నీ మీరొక్కరే అందించారు. తియతియ్యని ప్రేమామృతాన్ని పంచారు. నాలో మిమ్మల్ని చూసుకున్నారు. అందుకే నా కాలిలో ముల్లు దిగితే మీ కంట కన్నీరొచ్చేది. ఇంతటి గొప్ప మనసున్న మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను!
      మన ప్రేమకు ప్రతిరూపాలైన పిల్లలు నాన్న ఎప్పుడొస్తాడని అడుగుతున్నారు. పని మీద వెళ్లారని బుజ్జగిస్తున్నాను వాళ్లను. అయినా... మారాం చేస్తూనే ఉన్నారు.
      మన చింటూ పనులన్నింటినీ మీరే చేస్తూ వాణ్ని గారాబం చేశారు. వాటిని గుర్తు చేసుకుంటూ వాడిప్పుడు ఏడుస్తున్నాడు. పాపను కూడా కళ్లలో పెట్టుకుని చూసుకునే వాళ్లు కదా... అందుకే అది ‘నాన్నా నేనూ ఓ జట్టు’ అంటూ నా మాట వినకపోయేది! మీరు పక్కన లేరన్న దిగులుతో కాబోలు ఇప్పుడు అల్లరి చేయట్లేదు. టీవీ ఎక్కువ చూడట్లేదు. అందరం మీకోసం కోటి కళ్లతో ఎదురు చూస్తున్నాం. 
      కాలాలు మారుతున్నా, రుతువులు మారుతున్నా ప్రపంచం మారుతున్నా నామీద మీకున్న ప్రేమ మారదు. మీమీద నాకున్న మమకారమూ ఆవగింజంతైనా తరగదు. మీరు లేని క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది. మీరు లేని ఇల్లు చిన్నబోయింది. ప్రతిధ్వనించే మీ మాటలు గుడి గంటలను తలపించేవి. ఆ గంటలిప్పుడు మూగబోయాయి. అంత నిశ్శబ్దంలోనూ నా కంటికి కునుకు కరవైంది. అయినా... కొద్దిరోజులేగా!
      నామీద బెంగతో తినడం మానేయకండి. శ్రీమతిమీద పిచ్చి ప్రేమతో మీ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కోటి వెలుగులు చిమ్మే సంతోషమెప్పుడూ మన సొంతం కావాలి. నవవసంతం మన ముంగిట నిలవాలి. 
      మోడువారిన మనసును చిగురింపజేయడానికి వసంతం కోసం ఎదురుచూసే చెట్టులా మీ రాక కోసం ఎదురుచూస్తున్నా! ప్రస్తుతానికి ప్రత్యుత్తరం కోసం ఆశపడుతున్నా...! ఆ అక్షరాల్లో మిమ్మల్ని చూసుకోవడానికి తొందరపడుతున్నా...!

ఇట్లు... మీ ముద్ద మందారం

మూగబోయిన గుడిగంటలు

వెనక్కి ...

మీ అభిప్రాయం