ప్రియమైన మిస్సమ్మకు...

  • 1769 Views
  • 3Likes
  • Like
  • Article Share

    ఎం.వి.యన్‌. విశ్వనాథ్‌

  • ప్రొద్దుటూరు, కడప
  • 9908548346

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ఎలా ఉన్నావు మిస్సమ్మా, నేను బాగున్నా, నువ్వు బాగున్నావనే అనుకుంటున్నా. రేపటి రోజు నీకు గుర్తుందా? రేపటికి సరిగ్గా మనం పరిచయమై నాలుగేళ్లు.  నువ్వు నాకు దూరమై అప్పుడే రెండేళ్లవుతోంది. 
      పెద్ద చదువులకోసం నువ్వీ దేశం వదిలి వెళ్లక తప్పలేదు. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటున్నా... ప్రియురాలికి  రాసే ప్రేమలేఖ చాలా మధురానుభవం. అందుకే మొదలుపెట్టా. 
      అదీగాక నువ్వు పరిచయమైన మొదటి రెండేళ్లల్లో మనం గడిపిన తియ్యటి క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేం. అందుకే నిన్ను కాసేపు ఆ తీపి జ్ఞాపకాల ప్రపంచంలోకి తీసుకెళ్తాను. 
      మొదటిసారి నిన్ను చర్చి దగ్గర చూశాను. బయట ఉండే తాతలకు డబ్బులిస్తూ ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తున్నావో గమనించాను. కాలం కలిసిరావడంతో నీతో మాట కలిసింది. పరిచయం అయిన కొన్ని రోజులకు గానీ కబుర్లు ప్రారంభం కాలేదు. అలా ఊసులు కలిసి మనసులు దగ్గరయ్యాయి. ఆ ముచ్చట్లాటల్లోంచి పుట్టిన స్నేహమే... మన ప్రేమకు శ్రీకారం చుట్టింది. 
      నా పుట్టినరోజుకి ఓ చోటికి వెళ్దామని చెప్పి... అనాథ శరణాలయానికి తీసుకెళ్లావు. అక్కడి చిన్నారులందరికీ నా చేత మిఠాయిలు పంచి పెట్టించావు. వాళ్లకు కడుపారా భోజనం తినిపించావు. ఆనాడు ఆ పిల్లల మోముల్లో మెరిసిన చిరునవ్వులతో నా కడుపు నిండిపోయింది. ఆ రోజు నాకు  కలిగిన సంతోషం ఇంకా నా గుండెలో పచ్చగానే ఉంది. 
      ఓసారి మనం ఓ భోజనశాలకు వెళ్తే.... నేను తినని మాంసాహారం తప్ప అక్కడేమీ లేదు. నువ్వు తింటుంటే, నీ కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయాను. ఆకలి గుర్తొస్తే ఒట్టు. ఆ క్షణాలను మర్చిపోలేను. నిజం చెప్పనా... అప్పుడు నువ్వు ఇంకాస్త ఎక్కువ సేపు తింటే బాగుణ్ననిపించింది! ఎందుకంటే... ప్రేమంట!
      తర్వాత మీ ఇంటికి తీసుకెళ్లి నువ్వు గీసిన బొమ్మలు చూపించావు. అవి కూడా నీలాగే ఎంత ముద్దుగా ఉన్నాయో! 
      నువ్వు ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తూ పెట్టిన పప్పన్నం, ఆవకాయ, గోంగూర పచ్చళ్లను తలచుకుంటే ఇప్పటికీ  నోరూరిపోతుంది. కారణం వాటి రుచి కాదు... వాటిలో కలగలిసిన నీ ప్రేమ!
      నవరాత్రి ఉత్సవాలకు నాతో పాటు మా ఊరికి వచ్చావు. ప్రతిరోజూ అమ్మవారిని దర్శించుకునేవాళ్లం. ఆఖరున విజయదశమి రోజున జరిగే అమ్మవారి ఊరేగింపుని కళ్లారా చూడ్డానికి వేలమంది వచ్చారు. మనమూ వెళ్లాం.  దివ్యమంగళకరమైన అమ్మవారి రూపాన్ని  చూసి... 'చాలా సంతోషంగా ఉంది. ఏదో తెలియని అనుభూతికి లోనయ్యా'నని చెప్పావు. అవును మరి... అమ్మను చూస్తే ఎవరికి మాత్రం అలా అనిపించదు. ఆ పదిరోజులు మనం గడిపిన అద్భుత క్షణాలు మళ్లీ ఎప్పుడొస్తాయా... అని ఎదురుచూస్తున్నా.
      ప్రతి చిన్న విషయానికీ కోప్పడేవాణ్ని. దానిక్కారణంగా ఒకరిని చాలా బాధపెట్టాను. 'ఎందుకంత కోపం. కోపం వల్ల నీలోని మనిషి కాసేపు రాక్షసుడు అవుతాడు. అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటేనే మనం గొప్ప విజయం సాధించినవాళ్లమవుతాం' అని నువ్వు చెప్పావు. అప్పటి నుంచీ ఎవరి మీదా కోపం రావట్లేదు నాకు. నీ మాటలే నాలోని కోపాన్ని చంపేశాయి. 
      ఇంకా నీ గుర్తులు చాలానే ఉన్నాయి. కానీ, మరో రెండు నెలల్లో నువ్వొచ్చేస్తావుగా.... అప్పుడు తీరికగా వాటిని నెమరు వేసుకుందాం. నువ్వు అక్కడ వేళకు తింటున్నావో లేదో, బాగా తిను. వేళకు నిద్రపో. బాగా చదువుకో. జాగ్రత్త... నీకోసం ఎదురుచూస్తూ... 

       నీ 
ఎం.వి.యన్‌. విశ్వనాథ్‌

 

 

ప్రియమైన మిస్సమ్మకు...

వెనక్కి ...

మీ అభిప్రాయం