నువ్వే నా వసంతం

  • 1157 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.వై.దీపిక పద్మశ్రీ

  • హైదరాబాదు deepikapadmasri@gmail.com
వి.వై.దీపిక పద్మశ్రీ

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన ప్రకృతికి
నేనే! నిన్ను అమితంగా ఆరాధించే అభినవ్‌ని. ఊహ తెలిసినప్పటి నుంచి నీలోని సహజత్వాన్ని... నిర్మలత్వాన్ని శ్వాసగా చేసుకుని జీవిస్తున్న వాణ్ని. భువికీ.. దివికీ నీ దేహమే ఆవాసం. సమస్త జీవరాశికీ నీ చిగురుటాకుల పొత్తిళ్లలోనే జీవనం. నదులు, కొండలు, గుట్టలు, పర్వతాలు, లోయలు అన్నింటికీ.. నీ ఒంపు సొంపుల్లోనే ఆశ్రయం. ఆ అందానికి నేను దాసుణ్ని. పరవశుణ్ని. అందుకేనేమో.. ఎప్పుడో.. ఎందుకో.. ఎలాగో.. తెలియదుగాని నీ ప్రేమలో మునిగిపోయా. చిరు ఓరచూపైనా నాపై విసురుతావేమో, మాట కలిపి మది రొదనంతా వినిపించేద్దామని ఇన్నాళ్లూ వసంతం కోసం నిరీక్షించే కోయిలలా పరితపించా. అయినా ఫలితం లేదు. నీ కోసం పాకులాడుతున్నాననే కదా నీకు లోకువ! అందుకే నా మీద కనికరం చూపకుండా ఇలా దోబూచులాటలు ఆడుతున్నావు! అయినా వదులుతానా? నా భావాలను అక్షర సుమాలతో గుదిగుచ్చి నీకు అర్పించాలనే... ఆత్రంగా అల్లుతున్నానీ మాలికను. అందుకుని చేయందించు చెలీ!
      ఎప్పట్నుంచో నీకో విషయం చెప్పాలని నా మనసు తహతహలాడుతోంది. అదేంటో! ప్రతి ఉగాదికీ నిన్ను చూస్తానా! ఏటికేడు నీ అందం రెట్టింపై నా మతిపోగొట్టేస్తోంది. నిన్ను చూసిన వెంటనే నీ రమణీయతను ఆస్వాదించాలని నా కళ్లు దిగంతాల వరకు పరుగులు పెడతాయి.. తొందరపడతాయి.. తొందరపెడతాయి.
      ఉగాది రోజు... పచ్చని పొలాల పట్టు పావడాగట్టి.. పాడ్యమి చీకట్లను కళ్లకు కాటుకగా పెట్టి... వేపపూల ముక్కెరను ముక్కుకు వేలాడదీసి.. అధరాలకు మావిచిగురు రంగులద్ది... అప్పుడే విరియడం నేర్చుకుంటున్న మల్లియల్ని జడన తురిమి... మామిడి గుత్తుల్ని జడగంటలుగా వేసుకుని.. నువ్వు ముస్తాబవుతావు! నా గుండెల్లో గుడిగంటలు మోగిస్తావు! ఆ సోయగాలు చూసి... రసికత ఉన్న ఏ హృదయమైనా స్పందించకుండా ఉండగలదా చెప్పు?  ‘ఆకులో ఆకునై.. పూవులో పువ్వునై..’ అంటూ కవితా కుసుమాలతో నిన్ను పూజించారు కృష్ణశాస్త్రి. నీ తలపులు ఎందరో కవుల కలాలకు వలపులు... మనోహరాలు... మధురస్మృతులు!
      మరి నా సంగతేంటని అడగవేం? నిన్ను చేరాలనుంది... నీతో కలిసి జీవించాలని ఉంది. నీ స్నిగ్ధసుందర వదనంలో నా రూపాన్ని వీక్షించాలని ఉంది. ఏ చిక్కని అరణ్యంలోనో ఒక చిరుప్రాణిగా జన్మించి ఉంటే... నీ ఒడిలో పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే బతికి, అక్కడే ఆఖరిశ్వాస విడిచి ఉండేవాణ్ని. కానీ, ఏం చేయను! దురదృష్టవంతుణ్ని. జనారణ్యంలో మనిషిగా పుట్టా. తోటివాళ్లంతా నీ దేహాన్ని కాంక్రీటుమయం చేస్తుంటే.. మట్టి వాసనకు ఎక్కడ దూరమైపోతానో అని భయపడిపోతున్నా. ఆకుపచ్చని నీ మేనిఛాయ నిగనిగల నిగ్గు చూస్తుంటే.. నీ మీద బెంగతో ఇంకా తల్లడిల్లిపోతున్నా.
      ప్రియా! నిన్ను రక్షించుకునేదెలా? నీతో కలిసి బతికేదెలా? నువ్వు లేని నా జీవితంలో వసంతం లేదు. నీ తోడు లేని జీవితగమనం... అమ్మో! నా ఊహలకు అతీతం!! చేయందించు. నులివెచ్చని వెన్నెలలాంటి నీ కౌగిలిలో నన్ను బంధించు. నా తోడువై నడిపించు. నీ నీడలో నన్ను బతికించు... బతికిస్తావనే ఆశతో... నీ అభినవ్‌ 

* * *

నువ్వే నా వసంతం

వెనక్కి ...

మీ అభిప్రాయం