నీ కోసం జీవితమంతా

  • 1922 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జి.కుసుమ

  • జంగారెడ్డిగూడెం
  • 8500707056

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

మహీ,
నువ్వు మళ్లీ నా జీవితంలోంచి వెళ్లిపోయావన్న సంగతిని ఇంకా నమ్మలేకపోతున్నా. నువ్వు లేవన్న విషయాన్ని నేనెందుకు గ్రహించలేకపోతున్నానో నాకే అర్థం కావట్లేదు! బాధపడటానికి, ఏడవటానికి కూడా మనసు అంగీకరించట్లేదు. 
      ఒకోసారి అంటుండేదాన్ని కదా... ‘‘నేను నీ నీడని మహీ!’’ అని గుర్తుందా? నీ గురించి నీకంటె నాకే బాగా తెలుసు. నీ ప్రతి కదలికనూ అర్థం చేసుకోగలను. నీ ‘బలం’, ‘బలహీనతలు’ అన్నీ నాకు తెలుసు.
      జీవితాలను ప్రభావితం చేసే గట్టి నిర్ణయాలను తీసుకోవు నువ్వు. తీసుకున్నా... వాటిమీద నిలబడలేవు. నువ్వు ఎదురు చూస్తావు మహీ... ‘విధి’ తన దారి తను వెతుక్కుంటుందని! దాన్ని శాసించే ధైర్యం లేక సమయాన్ని అరువు తీసుకోవాలని చూస్తావు. పుణ్యకాలం కాస్తా గడిచాకా... జరగాల్సింది జరిగిన తర్వాత... ‘ఇది విధి రాత... నేనేమీ చెయ్యలేకపోయా’నని బాధపడతావు!
      మహీ, మామూలుగానైతే నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటా. కానీ నువ్వు తిరిగొచ్చాక, ముందు నువ్వు నడుస్తుంటే... నీ నీడలో కలిసిపోయి నడుద్దామనుకున్నా. ‘‘నీకెందుకురా, నేనున్నాను కదా, నువ్వు ప్రశాంతంగా నా గుండెలపై నిద్రపో’’ అని అంటావని ఎదురుచూశా. అలిసిపోయా. మహీ! నన్ను నేను బతికించుకుంటూ, నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ, నాతో నేను పోరాడుకుంటూ చాలా అలసిపోయా. 
      అయిదేళ్ల తర్వాత తిరిగి నువ్వు నా జీవితంలోకి వచ్చావు. అంతే... ఏడుకొండలు ఎక్కిన అలసట, వేంకటేశ్వరస్వామి దర్శనంతో మాయమైపోయినట్లు, మన అయిదేళ్ల ఎడబాటు బాధ మొత్తాన్ని మర్చిపోయా. ఆ ఆనందంలోనే... నా ఊపిరి కూడా నువ్వే పీల్చి నాకు జీవం పోస్తే బాగుండు అనేంతగా ఆశపడ్డా. కంటి ముందు శివుడుంటే, జీవం లేని ఎడారి కూడా సస్యశ్యామలంగా కనిపిస్తుంది. ఇంకేం కావాలనిపిస్తుంది. నా పరిస్థితి కూడా అలాగే అయింది.
      దీన్ని ఏమంటారో తెలీదు కానీ,   చలికాలంలో వెచ్చటి ఎండ నా ముఖాన్ని తాకుతుంటె నువ్వే గుర్తొస్తావు! 
      చిగురాకు మీద నిదరోతున్న హిమ బిందువు మీద లేలేత రవి కిరణాలు హరిచాపాన్ని చిత్రిస్తే, ఆ రంగుల్లో నువ్వే కనిపిస్తావు!  నేల మీద ఉన్న నీటిని తాకే వాన చినుకుల సవ్వడిలో నీ నవ్వే వినిపిస్తుంది! వసంత రుతువులో కళ్లు తెరిచి మొదటి సారిగా ప్రకృతిని చూసే ప్రతి ఆకూ, ప్రతి పువ్వూ, నీ చూపులనే గుర్తుచేస్తాయి! హేమంత రుతువు చల్లగాలి నా మెడ వంపుని తాకి వెళ్తుంటే... నా జడ పక్కకు తీసి, నా మెడపై నువ్వు ముద్దుపెట్టుకున్నట్లు అనిపిస్తుంది!
      నువ్వు లేనిదెక్కడ మహీ!!! నువ్వు లేని చోటు, నువ్వు లేని సమయం, నువ్వు లేని విషయం కనీసం ఒక్కటి చూపించు....
      అది కలో, నిజమో గ్రహించుకునేలోపే మళ్లీ నా జీవితంలోంచి వెళ్లిపోయావు. కాదు, నిన్ను పంపించేశా. అందరూ దేవుడి చేతిలో జీవితాన్ని పెట్టి ప్రశాంతంగా నిట్టూర్చుతారు. నేను నా శివుడి చెయ్యి పట్టుకుని... నా తలమీద తన పాదం మోపించుకున్నా. నీ దేహంలో అర్ధభాగాన్ని అయ్యానో లేదో తెలీదుగానీ, నీ పాదం కింద భస్మాన్ని మాత్రం అయ్యాను. ఒక్కసారి నీ పాదం పైకెత్తి చూడు మహీ! అక్కడే, ఎక్కడో నా జీవితం కనిపిస్తుంది.
      సమస్యలకు పరిష్కారాలు వెతికే తెగువను నీకందివ్వలేకపోయింది ‘నా ప్రేమ’. నిర్ణయాల మీద నిలబడే ధైర్యాన్ని నీకు కల్పించలేకపోయింది. నీ ప్రేమ వల్ల... శిలలాంటి నేను శిల్పాన్నయ్యా. నీ ప్రేమతో నిండిన నా మనసులో ద్వేషం అనే భావనకు తావు లేకుండా పోయింది. ఎంత గొప్పది మహీ, నీ ప్రేమ.
      నా ఆశ కాదిది... నా నమ్మకం... నాకోసం నువ్వు తిరిగొస్తావు మహీ.... ఎప్పుడు, ఎన్నాళ్లకు అనేదే నాకు తెలీదు.
      కానీ నీ కళ్లలోకి చూస్తూనే చివరిశ్వాస వదులుతా. అది సత్యం. ఎందుకంటే... పరమశివుడే నా ప్రేమను తిరస్కరించలేక నా గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయాడు.
      నాకు దూరంగా ఉండాలనుకునే నీ ప్రయత్నం ఫలిస్తుందా? ప్రయత్నించు మహీ ప్రయత్నించు! ఆ ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే నేనున్నాను కదా... నిన్ను నా కౌగిలిలో దాచుకుని నీ అలసటనంతా మరిపించేస్తాను. నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను...
      ఇంకెప్పుడూ ‘‘రాను’’ అని నువ్వు చెప్పినా....  ‘‘రాలేవని’’ నాకు తెలిసినా.....

నీ  సుమ

నీ కోసం జీవితమంతా

వెనక్కి ...

మీ అభిప్రాయం