మమతల మహికి...

  • 165 Views
  • 1Likes
  • Like
  • Article Share

    పావులూరి కిశోర్‌బాబు

  • హైదరాబాదు
  • 9949094370
పావులూరి కిశోర్‌బాబు

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

పుట్టిన ఏడాదిలోనే ఎన్నెన్నో మధురానుభూతులు మిగిల్చావు నువ్వు. నా గుండెలపై ఎక్కి ఆడుతూ చంటిబిడ్డల పెంపకంలోని మాధుర్యాన్ని రుచి చూపావు. అంతర్జాలంలో నా పనేదో నేను చేసుకుంటుంటేే ఒడిలో కూర్చుని నీ చిట్టి చేతులతో కీ బోర్డుని అలల మాదిరి కదిలిస్తుంటే ముచ్చటేసి అలాగే చూస్తుండిపోయేవాణ్ని.
      చిన్నప్పటినుంచే వ్యాయామం అలవాటు కావాలని... ఎనిమిదో నెలలో నీ కాళ్లు పట్టికొని శీర్షాసనం వేయించాను. దానికి సర్కస్‌ అని పేరు పెట్టాను కూడా! అలా నాలుగైదురోజుల్లోనే నేర్చుకున్నావంతే! ఎప్పుడన్నా సరదాపడి సర్కస్‌ చేయమ్మా అనగానే పల్టీలు కొడ్తూ నువ్వు కిందపడినప్పుడల్లా నా హృదయం ద్రవించిపోయేది. ముద్దుముద్దు తొలి పలుకుల మాధుర్యంతో ‘‘నాన్నా..! నాన్నా..!’’ అంటూ చేతులు చాచి నన్ను సమీపిస్తుంటే ఎంతటి అనిర్వచనీయ అనుభూతిని పొందానో!  పక్షులు, పిల్లులు, శునకాలు కనిపిస్తే చాలు వాటివైపు దూకే నిన్ను చూసి తండ్రి లక్షణాలని పుణికి పుచ్చుకుందని అందరూ అంటుంటే ఎంత ఆనందపడ్డానో వర్ణించలేను చిట్టితల్లీ!
      ఓ రోజు రాత్రి నిన్ను చంకనెత్తుకుని ఎదురుగా ఉన్న బుద్ధుడి ప్రతిమని తాకి కళ్లకద్దుకొన్నాను. అప్పుడు నువ్వూ అచ్చం అలాగే ప్రతిమ మీద చేయి పెట్టి ముఖానికి అద్దుకున్నప్పుడు నేనంత పరవశించిపోయానో మాటల్లో చెప్పలేను. నీ రాకతో ఇల్లు ఆనందాల హరివిల్లుగా మారింది. నీ అల్లర్లు.. ఆ చిరుపాదాల సందళ్లు.. ముద్దుమాటల పరవళ్లు... లోగిలంతా నువ్వలా తిరుగాడుతుంటే ఒక పూలవనం కదలాడుతున్నట్టే ఉండేది మాకు. ప్రేమపాశానికి చోటే లేని నా శిలాహృదయంలో బంధాల బీజాలను నాటావు. భవబంధాలకి దూరంగా మసలుదామని గిరిగీసుకున్న నా మదిలో ప్రేమానురాగాలను పొంగించావు. వరాల తల్లి... నువ్వు ఊరు వెళ్లినప్పుడు తొలిసారి మమకార వేదన అనుభవించాను. గడియ గడియకీ నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా చూడాలని తపించాను. ముద్దుల బిడ్డకి దూరమై ఉండటం ఏ తండ్రికైనా ఎంతకష్టమో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. నువ్వు ఉత్సాహంగా ఊఊ అంటూ ఇల్లంతా పాకేస్తుంటే కలిగే ఆనందం... నువ్వు బాధతో విలవిల్లాడేప్పుడు ఆవిరయ్యేది. జలుబు, జ్వరంతో అవస్థలు పడేటప్పుడు నా ప్రాణం గిలగిల్లాడేది. పూల రేకుల్లాంటి నీ పాదాల కింద రాయి పడితేనే తల్లడిల్లిపోతానే అలాంటిది నావల్లే నువ్వు మూడుసార్లు కిందపడి కంటతడి పెట్టిన దృశ్యాలు ఇప్పటికీ కలచి వేస్తాయి. ఆ చేదు జ్ఞాపకాల ఆనవాళ్లు తెలియకుండా నువ్వు ఎప్పటిలాగే సంతోషంగా కేరింతలు కొడుతుంటే కష్టసుఖాల జీవనయానంలో ఇవన్నీ మామూలేనని తెరిపినపడ్డాను బంగారం.
      ఎప్పటికీ! మా ఆశ నువ్వే. శ్వాస నువ్వే. మా సర్వస్వం నువ్వే. మంచి నడవడికతో ఉన్నత శిఖరాలకి ఎదిగి మాకు మంచి పేరు తేవాలన్నది నీ తండ్రి కోరిక. సరస్వతీ పుత్రికగా ఆశయాల పల్లకీ ఎక్కి నా స్వప్నాన్ని సాకారం చేస్తావు కదూ!

ఇట్లు
మీ నాన్న

మమతల మహికి...

వెనక్కి ...

మీ అభిప్రాయం