తెలుగు వెలుగుకి ప్రేమలేఖ

  • 394 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శివకుమార

  • నెల్లూరు.

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

జిలుగు మెరుగుల నా తెలుగు వెలుగుకి,
నువ్వు కళ్లు తెరవక ముందే, నీ పుట్టుకను తెలిపే సంకేతాలను అర్థం చేసుకుని నీ మైకంలో పడిపోయాను! చాలా ఆతృతగా చూడగా చూడగా నువ్వొచ్చావు. నీలో ఎన్ని రంగులో. నిన్ను ఎక్కడ తాకినా నునుపే! అలా ఎలా?! ఒక్కసారి నిన్ను నా చేతులతో పట్టుకుని నీ సుగంధాన్ని తీసుకున్నానా- నా శ్వాసలోంచి లోనికి, లోలోనికి చేరి జీవరసాలతో పాటు దేహమంతా తిరిగేస్తావు. నెలకొకసారి నెలవంకలా వస్తావు. కొత్త కొత్త వర్ణాలతో నన్ను చిత్తు చేసేస్తావు.
      వచ్చీ రాగానే నాలుగే రోజుల్లో నిన్ను పూర్తిగా చదివేస్తాను. నీ ప్రతి పుటకీ నా శత కోటి సంపుటాలు! అన్ని పుటలూ చదివేసినా ఇంకా రాబోయే సంచిక గురించి ఆత్రుతపడుతోంది మనసు. ఇంకో నెల ఆగాలి. మరి ప్రియమైనదాన్ని పొందాలంటే ఆ మాత్రం ఎదురు చూడొద్దా!
      పగలూ రాత్రీ నా చేతికి అందుబాటులో ఉండేలా నిన్ను జాగ్రత్తగా సర్దిపెడతాను. మధ్య రాత్రి మెలకువ వస్తుంది. నిద్రపట్టదు. ఇంక నువ్వే దిక్కు. కాసేపు ఊసులు చెబుతావు. మనసుని మరిపించే జోల పాడతావు. అలా నిద్రలోకి జారిపోతాను. తెల్లారే మెలకువ వచ్చిందా, పక్కన నువ్వున్నావో లేదో చూసుకుంటాను. ఒక్కసారి నీ మెరుపుల్ని నా బుగ్గలకి తాకించుకుని చిన్నగా నువ్వుకుని నా రోజువారి పనిలో పడిపోతాను.
      నీకు తెలుసా, నాకసలు మామూలు మాటలే సరిగా రావంటారు నా మిత్రులు. కానీ, నీతో స్నేహం తరవాత నేను ఏకంగా కవినైపోయాను. ఆశ్చర్యం! ఏనాడో రాముడి పాదం తగిలి రాయి అతివైపోయిందట. అలాగే నన్ను చూడు, పాషాణంలా ఉండేవాణ్ని. నీ చమత్కారం వల్ల పాదరసంలా మెరిసిపోతున్నాను!
      లోకంలో అందరి ప్రియురాళ్లూ కాలంతో పాటు మీదపడిన ముదిమితో పండి పోతున్నారు. నా ప్రియురాలు మాత్రం మళ్లీ మళ్లీ యవ్వనాన్నిలా సంతరించుకుంటూ తాజా పువ్వులను విరగబూస్తుంది. నాకో భయం ఉంది, నువ్వు ఎన్నాళ్లకీ పౌర్ణమి చంద్రికలా నన్ను ఉన్మత్తుణ్ని చేస్తుండగా, రాబోయే రోజుల్లో నేను వయసు ఉడిగి పోయి నీ చూపునకి ఆనకుండా పోతానేమోనని! ఒక్కసారి నా చేతిని పట్టి ప్రేమగా నొక్కి ధైర్యం చెబుతావా?! 

నీ ప్రేమలో తరించే భావుకుడు

తెలుగు వెలుగుకి ప్రేమలేఖ

వెనక్కి ...

మీ అభిప్రాయం