నా ప్రియదర్శినీ...

  • 307 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ప్రవాహి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

రాత్రి మాయాబజార్‌ సినిమా చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావ్‌. ఈ మధ్యే రంగుల్లోకి దాన్ని మార్చార్లే. ఇంతకీ ఇన్నేళ్ల తర్వాత ఎందుకు నిన్ను బీరువాలోంచి బయటికి తీశానో చెప్పలేదు కదూ.. ఉండు.. పెట్టె తెరుస్తున్నాగా.. 
      కృష్ణుడు ప్రియదర్శిని తెచ్చి అందరిముందూ ఉంచుతాడు. దాన్ని తెరిస్తే ఎవరికి ఇష్టమైంది వారికి కనిపిస్తుంది. ఆ సన్నివేశం అవుతుండగానే నువ్వు గుర్తొచ్చావు. అవును మరి.. నా ప్రియదర్శిని నువ్వే కదా!
      హైస్కూల్‌లో అడుగు పెట్టిన రోజే నువ్వు పరిచయం అయ్యావు. ఎంచెంచి కొనుక్కున్న నిన్ను కవరులోనే ఎన్నో నెలలు మురిపెంగా దాచుకున్నానో. 
      నీతో దోస్తీ ఎంత గమ్మత్తుగా ఉండేదో. బడిముందు బామ్మ అమ్మే ఉసిరికాయలు, జీళ్లు నీ దగ్గరే దాచేవాడిని. పెన్సిలు ముక్కలు, పెన్నూరీఫిళ్లూ ఎన్నెన్నో ఉంచేవాడిని. రబ్బరు ముక్కలు, బ్లేడూ, మెండరూ, స్కెచ్చుపెన్నులూ, రెడ్డింకు పెన్ను.. ఏది పెట్టాలనుకున్నా నవ్వుతూ తెరచుకునేదానివి. నేనేమైనా ఊరుకునేవాణ్నా.. ఫాంటమ్, ఆంజనేయుడు, రజనీకాంత్‌ స్టిక్కర్లంటించి అలంకరించేవాడిని! అసలు ఎన్ని పెట్టినా సరిపడేంత చోటు ఉందనే సర్దుకునేదానివి. అందుకే అప్పుడప్పుడూ అనిపించేది.. నువ్వేమైనా పుష్పక విమానానికి తోడబుట్టినదానవా అని. 
      వానాకాలం తర్వాత మొదలయ్యేవి జామిట్రీ అధ్యాయాలు. అప్పటిదాకా నీ కవరు జాగ్రత్తగా దాచాను. నా మిత్రులకు కూడా నువ్వు ఒక్కోసారి సాయానికి సిద్ధపడేదానివి. అన్నయ్య ఓసారి పరీక్షకెళ్తూ నిన్ను తోడుగా తీసుకుపోయాడు. అప్పుడు నన్ను బతిమాలుతుంటే భలే సరదాగా అనిపించింది. అసలే ఆరోజు వర్షం. హాల్‌టికెట్టు తడవకుండా నలిగిపోకుండా పట్టుకెళ్లాలంటే నువ్వు ఉండాల్సిందే అని అమ్మానాన్నల్ని ఒప్పించుకుని నాతో బతిమాలించుకుని నిన్ను పట్టుకెళ్లాడు. అది మొదలు పరీక్షలకు నువ్వు అచ్చొచ్చావని నాకో రూపాయి తాయిలంగా ఇచ్చి నిన్ను తోడు పట్టుకెళ్లేవాడు. అప్పుడు నేనెన్ని ఆంక్షలు విధించేవాడినో! గీతలు పడకూడదు, సొట్టపడకూడదు, అందులో ఉన్నవేవీ పాడవ్వకూడదు.. అంటూ ప్రతిసారీ ఉపన్యాసం ఇచ్చేవాడిని.
      ఓసారి సైకిల్‌ మీద వెళ్తుంటే నువ్వు పోస్టాఫీసు దగ్గర జారిపోయావు. బడికెళ్లి చూసుకుంటే లేవు. ఏడుపొచ్చేసింది. మాస్టారికి చెప్పకుండా వచ్చిన దారిలోనే వెతుక్కుంటూ వెళ్తుంటే అక్కడ కిళ్లీ కొట్టు సోములు తాత ‘ఒరే బాబూ.. నీదేనా..’ అంటూ నిన్ను చూపించాడు. అప్పటికి గానీ పోయిన ప్రాణాలు తిరిగి రాలేదు. బడికి తిరిగెళ్లి మాస్టారితో నాలుగు చీవాట్లు, రెండు దెబ్బలు తిన్నా.. నేనెందుకు నవ్వుకుంటున్నానో ఎవరికీ అప్పుడు తెలీదు. 
      నాతో ఉత్తినే గొడవపడ్డ రవిగాడిని ఉత్తుత్తినే వృత్తలేఖినితో బెదిరించడం నీకు గుర్తుందా? అసలు దాన్ని నా కన్నా మా అమ్మమ్మ చింతపండు పిక్కలు తీయడానికే ఎక్కువ వాడింది. విభాగిని పట్టుకోడానికి అంతగా సౌకర్యంగా లేదని వాపోయేది పాపం. నానమ్మ అయితే.. ఈ దబ్బనాలతో పిల్లలకు ఏం పాఠాలు చెప్తార్రా.. వెర్రి కాకపోతే అంటూ నసుక్కునేది! కోణమాలిని చూస్తే భలే తమాషాగా అనిపించేది.. హేమమాలిని పేరులాగ ఉందే అని! అసలు దానిపేరు ‘కోణమానిని’ అట! ఈ మధ్యే తెలుసుకున్నా. దాన్ని మాత్రం చెల్లి ఎక్కువ వాడేది. దాంతో సూర్యుడి బొమ్మ, మూలమట్టాలతో కొండలు గీసి స్కెచ్చులన్నీ రుద్దేసేది! అప్పుడప్పుడు నేను లేని సమయం చూసుకుని, అందులో ఏమైనా తినేవి ఉంటే మాయం చేసేది.
      ఎన్నెన్ని జ్ఞాపకాలు నీతో!? 
      ఎన్నెన్ని జ్ఞాపకాలు నీలో!?
      ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. నేను మొదటిసారి రాసిన కవిత చూసింది నువ్వు కాదూ! ఎన్ని రోజులు దాచావు దాన్ని? ఇంకా అందులో శ్రీదేవి, మాధురీల ఫొటోలు అడుగున పెట్టిన కాగితం మడతల్లో ఎంత అపురూపంగా ఉంచావూ? 
      నాకిష్టమైనవన్నీ చూపించేది నువ్వే అయినప్పుడు.. నా ప్రియదర్శిని నువ్వే కదా!  నీకోసం రామానుజన్‌ బొమ్మ తెస్తా. చాలారోజులైంది కదా నీకు స్టిక్కరేసి. గణిత దినోత్సవానికి ఇదే నా కానుక. నీకు నచ్చుతుందని ఎక్కాలు వల్లిస్తూ..

నీ 
రేఖామిత్రుడు 

 

నా ప్రియదర్శినీ...

వెనక్కి ...

మీ అభిప్రాయం