విడదీయలేని అనుబంధం

  • 172 Views
  • 0Likes
  • Like
  • Article Share

    భైతి దుర్గయ్య

  • రామునిపట్ల, మెదక్‌ జిల్లా
  • 9959007914

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన యజమానికి... 
నేను గుర్తున్నానా? మనది మరిచిపోయే బంధం కాదు. పదహారేళ్ల అనుబంధమది. ఒక తీయని అనుభూతిగా నా మదిలో చిరస్థాయిగా నిలుస్తుంది. నాలాంటి వాళ్లు మీకు తారసపడినా నాతో పరిచయం మీకో ప్రత్యేకతని తెచ్చిపెట్టింది. నాతో అనుబంధం మొదలయ్యాక మీ జీవన ప్రస్థానం ఆరంభమైంది. తక్కువ జీతమే అయినా రోజూ 26కి.మీ వెళ్లొచ్చేవారు. నా సాహచర్యం మధురానుభూతిని కలిగిస్తోందని మీ స్నేహితులతో చెప్తుంటే విని మురిసిపోయాను.
      మీరు పనిచేసే బడి దగ్గర రోజూ నా కాలి అందెల సవ్వడి విని పరుగెత్తుకొచ్చే పసిపాపల నవ్వు ముందు నా అలసటంతా మటుమాయమయ్యేది. వాళ్లు నా శరీరాన్ని ఆత్మీయంగా తడుముతుంటే నా మనసు ఒకింత పులకరించేది. నన్నూ మీయంతగానే గౌరవించేవాళ్లు. ఇంతకన్నా ఈ జన్మకేం కావాలి అని అనిపించేది.
      ఉదయాన్నే పొలానికి వెళ్లినా, సాయంత్రం సరదాగా ఊరి బయటికెళ్లినా, బాధతో అలిగినా, పట్టలేని ఆనందాన్ని అందరితో పంచుకోవాలన్నా మీకు ముందుగా గుర్తుకొచ్చేది నేనే. అది నా పూర్వజన్మ సుకృతం. మీ కష్టసుఖాల్లో నన్ను భాగస్వామురాలిని చేసి మరింత బాధ్యతని పెంచారు. నా కర్తవ్యం, మిమ్మల్ని సమయానికి బడికి తీసుకెళ్లి, క్షేమంగా ఇంటికి తీసుకురావడం. నిజాయతీగానే శ్రమించాను. అయినా నావల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడ్డారు. దానికి లోలోపల నేను పడే వేదనను గమనించి, పల్లెత్తు మాటకూడా అనలేదు. మీ మంచితనానికి సేవ చేసే అవకాశమిచ్చిన భగవంతుణ్ని రోజూ దణ్నం పెడతాను.
      అమ్మగారు, మీరూ సెలవు రోజుల్లో సినిమాలకు, షికార్లకు వెళ్లినప్పుడు మీ జంటను చూసి నాకు ముచ్చటేసేది. మీతో పాటు నన్నూ తీసుకెళ్లేవారు. మీలో ఒకడిగా చూసుకున్నారు. జీవితంలో మీరు పడిన బాధలు, పై చదువులకు చేసే మీ ప్రయత్నాలకు నేనే ప్రత్యక్షసాక్షిని.
      ఎన్నోసార్లు మీ కన్నీళ్లను నేలపై పడనీయకుండా కాపుగాశాను. ధైర్యం చెప్పాను. మీ ఆనంద బాష్పాలకు కారణాలైన విజయాలకు ఎగిరి గంతులేశాను. నాకోసం ఒక పాఠశాలనే కాదనుకొని వదిలేశారు. అది నేనెప్పటికీ మరువలేను.
      కొన్నాళ్లకు ప్రభుత్వ ఉపాధ్యాయుడయ్యారు. అయినా నన్ను మరిచిపోలేదు. నిరాడంబరమైన జీవనాన్ని ఆస్వాదించే మీరు కాలక్రమేణా అవసరార్థం మారక తప్పలేదు. నా స్థానంలో ఉన్న వేరెవరైనా అసూయ చెందేవారేమో, కానీ నేను మాత్రం గర్వపడ్డాను. మీ స్థాయి పెరిగిందని  సంబరపడ్డాను.
      నాకోసం మీరు కేటాయించే సమయం తక్కువైంది. నా అవసరం మీకు లేదని నాకనిపించింది. నన్ను వదిలించుకోమని కొందరు మీకు చెప్పినా మీ మనసు అంగీకరించలేదు. రోజూ పాఠశాలకు బయలుదేరే సమయంలో నన్ను చూడటం, తిరిగి ఇంటికి రాగానే నాతో కబుర్లు చెప్పడం హాయిగా అనిపించినా, మీకు సేవ చేయలేకపోతున్నాననే బాధ రోజురోజుకి ఎక్కువైంది. మీ బళ్లోని చిన్నారులను చూడాలని ఎంత ఆశపడ్డానో పైకి చెప్పలేకపోయాను. ఇంటి దగ్గర చిన్నచిన్న పనులు చేస్తున్నా ఏదో వెలితి. ఏమీ కానేమోననే భయం మొదలైంది.
      వసంత జీవనం కరిగిపోయి, యవ్వనంలోనే వృద్ధాప్యం వచ్చినట్లు.. నాకు తెలియకుండానే శిథిలావస్థలోనికి జారుకున్నాను. మీరు నన్ను మరిచిపోలేరని నాకు తెలుసు. నేను సేవ చేయలేక ఖాళీగా ఉండలేక పదేపదే ఆలోచించి చిక్కిశల్యమయ్యాను. అవయవాలన్నీ అచేతనస్థాయికి దిగజారి మూలన పడ్డాను. అవయవ దానంవల్ల పుణ్యమొస్తుందని కాబోలు... నా అవయవాలు కొన్నింటిని మీ బంధువులకు ఇచ్చారు. పూర్తిగా పాడైన భాగాలను స్వాగతించడానికి, నాలాంటి అభాగ్యులని సమకూర్చుకుని తీసుకెళ్లే మనిషి ఓరోజు వచ్చాడు. మనిద్దరి బంధాన్ని రెండు పచ్చనోట్లకు వెలకట్టి వెళ్లాడు. అయినా మన బంధం ఎవరు విడదీయలేనది.

- సదా మిమ్మల్ని గౌరవించే మీ 
అట్లాస్‌ సైకిల్‌

విడదీయలేని అనుబంధం

వెనక్కి ...

మీ అభిప్రాయం