నీ నవ్వే చాలు పూబంతీ... చామంతీ!!

  • 281 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బి.సాయికుమార్

  • శ్రీకాకుళం
  • 8008199876

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ఓయ్‌ బంగారం...
      గడియారానికి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది.  ఏడాది తర్వాత నిన్ను చూస్తున్నానన్న ఆనందమే నన్ను ఓ చోట నిలబడనివ్వడం లేదు. నీతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని చిన్న పిల్లాడిలా ఒకటికి పదిసార్లు వల్లె వేసుకుంటున్నా. ఎంత చేసినా నీ ముందుకొస్తే... ఆనందంతో ఊపిరి తీసుకోవడమూ మరిచిపోతా. అందుకే మాటల్లో చెప్పలేని నా భావాలను ఈ లేఖ ద్వారా నీకు చెప్పాలనుకుంటున్నా. 
      హైదరాబాదులో మెట్రో రైలుకు పునాది రాయి పడ్డప్పుడే నా ప్రేమకు పునాది పడింది. ఆ విషయం నీకు వెంటనే చెప్పలేకపోయాను. నిన్ను పరిచయం చేసుకోవడానికే ఆర్నెల్లు పట్టింది. మొదటిసారి నిన్ను ఆ బస్టాప్‌లో చూసినప్పుడు... వెన్నెల రాత్రి ఆరుబయట పడుకుని చందమామను చూసిన అనుభూతి. బాపుబొమ్మ లాంటి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా. నీ నవ్వు చూస్తే చాలు చనిపోవాలనుకునే వాడికీ జీవితం మీద ఆశపుడుతుంది. అదే నన్ను నీ నీడను చేసింది. ఆ రోజు నుంచి నీకోసం బస్టాప్‌లో రోజూ వేయి కళ్లతో ఎదురుచూసేవాణ్ని. ఆ నిరీక్షణ ఎంత మధురమో! 
      ‘‘నిన్ను ప్రేమిస్తున్నా’’ అని నీకు చెప్పలేని నా అశక్తతకు తిట్టుకునే వాణ్ని. ధైర్యం చేసి చెప్పాక... ఇంతవరకూ ఎందుకు చెప్పలేదా అని నిందించుకున్నా. నీ పరిచయం తర్వాత ప్రతిరోజూ దీపావళే. కోటి కాంతులను వెదజల్లే నీ కళ్లకు కొత్తగా కనబడాలని నేను చేయని ప్రయత్నం లేదు. వాటిలో కొన్నిసార్లు విఫలమై... నీకు నవ్వు తెప్పించిన సందర్భాల జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. అవన్నీ తలచుకుంటుంటే ఏదో ఆనందం. గలగల మాట్లాడే నీ మాటల జడిలో తడిసి ముద్దయ్యేవాణ్ని. సూర్యుణ్ని చూసి పొద్దు తిరుగుడు పువ్వు ఎంత సంతోష పడుతుందో తెలియదు కానీ, నిన్ను చూస్తే మాత్రం నా సంతోషం పదింతలు అవుతుంది. కలిసిన ప్రతిసారీ నువ్వు చెప్పిన కబుర్లు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ‘‘ఓయ్‌’’ అని ఎవరు పిలిచినా నువ్వే అనుకుని తిరిగి చూసేవాణ్ని. నీ అడుగులో అడుగేస్తూ... నిన్ను అనుకరిస్తూ, అనుసరిస్తూ నడచిన రోజులను తలచుకోని క్షణం లేదు. నువ్వే నా జీవితం. నీ నవ్వే నా ప్రపంచం.  
      ఓసారి మాటల మధ్యలో మీ కుటుంబం గురించి చెబుతూ ‘‘మా ఇంటికి నేను పెద్ద కొడుకులాంటి దాన్ని’’ అని అన్నావు. నా బంగారం ఎంత బాధ్యత గలిగిన వ్యక్తి అని గర్వపడ్డా. మొదట్లో నా ప్రేమను అంగీకరించవని భయమేసింది తెలుసా! ఎలాగో ఒప్పుకున్నావు. ఆ క్షణంలో ఈ భూమ్మీద నా అంత అదృష్టవంతుడు లేడనుకున్నా. రోజులు సంతోషంగా గడచిపోతున్నాయి. ఇంతలో ఉద్యోగ శిక్షణ కోసం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఏడాదిపాటు నిన్ను విడిచి ఉండలేక ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. చుట్టూ ఎంత మంది ఉన్నా... నువ్వు లేక నేను ఒంటరినయ్యాననే భావన వెంటాడేది. నా బంగారాన్ని ఎప్పుడు చూస్తానో అని రోజులు లెక్కపెట్టేవాణ్ని. తిండి తినాలనిపించకపోయేది. రోడ్డు మీద ఏ జంటను చూసినా, నువ్వూ నేను మాట్లాడుకున్న కబుర్లే గుర్తుకొచ్చేవి. సుదూరపు దీవిలోని చీకటి కొట్లో బంధించిన ఖైదీలా నరకం అనుభవించా. ఇక్కడ వర్షం కురిస్తే నువ్వు ఉన్న చోట కూడా కురుస్తుందేమో, నువ్వేం చేస్తుంటావో అని అనుకునే వాణ్ని. ఈ విరహంలో నా ప్రేమ వేల రెట్లు పెరిగింది. 
      నువ్వు నా జీవితంలోకి వచ్చాక, నా ప్రతి పనిలో నీ ముద్రే కనిపిస్తుంది. అంతలా మార్చావు బంగారం నన్ను. నీ ఇష్టాలన్నీ నా ఇష్టాలుగా మార్చుకున్నా. నీకిష్టం లేని వాటిని వదులుకున్నా. ఒకవేళ నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉంటే..? అమ్మో!! ఆ ఊహే భయంకరం.
      ఇన్నాళ్లు నేను ఇక్కడ ఉండటానికి నువ్విచ్చిన ధైర్యమే  కారణం. వచ్చే ముందు నాకు వీడ్కోలు పలికినప్పటి నీ మోము నా కళ్లలో అలాగే ఉండిపోయింది. చివరిసారి నీ పుట్టిన రోజు నాడు నిన్ను చూశా. మళ్లీ సరిగ్గా ఏడాదికి నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి చెప్పకుండానే వస్తున్నా. నాకు తెలుసు నువ్వు నాకోసం అదే బస్టాప్‌లో ఎదురుచూస్తూ ఉంటావని! ప్రతీసారి నీకోసం నేను ఎదురు చూసేవాణ్ని... ఈసారి నువ్వొస్తున్నావు. ఇక నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లను. నీ వెంటే ఉంటా... నీకు తోడుగా నడుస్తా. ఆఖరి శ్వాస వరకు నీతోనే కలిసుంటా. కోటి జన్మల పుణ్యఫలంగా పక్కన నువ్వుంటే చాలు బంగారం... ఒడుదొడుకుల ప్రపంచంలో విజేతనై నిలుస్తా. 

ఇట్లు నీ సాయి...

నీ నవ్వే చాలు పూబంతీ... చామంతీ!!

వెనక్కి ...

మీ అభిప్రాయం