తాత యాదిలో...

  • 696 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పొద్దుటూరి సుజాత

  • చీమన్‌పల్లి, నిజామాబాదు
పొద్దుటూరి సుజాత

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ఓ తాత ఎలాగున్నవే? పాణమెలా వుందే? ఉషారుగా ఉందా? బాపమ్మ ఎలా ఉండాదే? పొద్దుమాపు బీపీ గోళీలు వేసుకుంటున్నవా? లేకపోతే ఆయిని సతాయిస్తున్నవా? ఎవుసం పన్లు ఎలా నడుస్తున్నయి? అవ్వ, బాపు ఎలా ఉన్నరే? అయ్యో! మరిసిన... ఇన్ని ఇషయాలు నిన్ను అడగాలనుందే. నీతోని ఆట్లాడాలని ఉందే. కానీ.. ఇన్ని ముచ్చట్లు సెప్పనీకి నువ్వు లేవాయె!
      ఆనకాలం అనుకుంటా ఓసారి నన్ను, తమ్ముణ్ని హాస్టలు నుంచి ఇంటికి తీసుకెళ్లనీకి వచ్చినవు. మనూరికి రోడ్డేమో సక్కగా లేదాయె. నువ్వు మాతో నడుసుకుంటూ ఎల్దామా? అన్నవ్‌. అదేమో 12 కి.మీ దూరం! నేనుగాని, తమ్ముడుగాని, కాదంటే మళ్లీ తీసుకెళ్లవేమోనని సరే అన్నం. ఎందుకంటే పంజరంలో చిలుకలెక్క ఉండేది మాకు. మన ఊరి దారంతా అడవిలెక్కుండె. షానా బయమేసేది. కానీ నువ్వు మాకు ఎన్నో కథలు, జోల్లు చెప్పుకుంటా తీసుకెళ్లినవ్‌. కాస్తంత దూరం నడిచాక, ఈదురు గాలులు చాలైనయి. దుమ్ము కంట్లోవడి తమ్ముడు ఏడుస్తుండు. మొగులు కమ్ముకుని దారంతా సీకటాయె. నీకేమో చూపు సరిగ కాన్రాకపాయె. ఇంక ముందుకెళ్లలేక పోతిమి. సరే గదాని, దగ్గర్లోని మైసమ్మ గుడిలోకి ఉరికినం. అంతలోనే వాన మొదలైంది. కాస్త తెరపిచ్చినాక మళ్లీ తోవ పట్టినం. ఎడమవేపు ఏదో అలికిడైంది. అటు చూసేసరికి నల్లగా ఓ ఎలుగుబంటి! మేమిద్దరం జడుసుకుని నీ చేతులు గట్టిగా పట్టుకున్నం. కాని.. నువ్వు మమ్మల్ని బయపడొద్దని సెప్పి, దాన్ని ఇకమతుతో తరిమేసినవు. అప్పుడు నువ్వు మాకు వివేకానందుడు లెక్కనే కనబడ్డవు. ఆయన మాటలే యాదికొచ్చినయి తాత. ‘బయమనే అరదను అరికట్టడానికి, దయిర్నమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలని’ సెప్పినవు. నడ్సుడ్ని జీవితంలో భాగం చేసుకోమన్నవు. అప్పటిసంది అలాగే చేస్తున్నం. 
      ఓనాడు పొద్దుగూకినంక నాకు ఉన్నట్టుండి పిడుసొస్తే నువ్వు సిన్నపిల్లోడల్లే అల్లాడినవని నైనమ్మ అన్నదే. ఎందుకని అడిగితే నేను అచ్చం మీ అవ్వ లెక్కనే ఉంటనని సెప్పిందే. నాలో మీ అవ్వ రూపుని సూసుకుంటు న్నవన్నదే. అవ్వ, బాపు పొలం పన్లకు పోతే షానాసేపు మీకాన్నే గడిపేది. మీతోనే సనువు బాగ ఉండేది నాకు. రోజులు గడిసిపాయె. నాకు లగ్గంచేసి అత్తోరింటికి పంపినప్పుడు నువ్వు సంటిపిల్లోడిలా ఏడిస్తే నిన్ను ఆపేతరం ఎవ్వరివల్లా కాలేదే. మళ్లీ నేనే నిన్ను సముదాయించిన్నే.     
      ఓ రోజు కోడికూత ఏలకంటే ముందే నాన్న నుంచి ఫోన్, తాత గుడ్డలు ఉతుక్కుంటూ పడ్డాడని. ఎంటనే దవాఖానకి తీసుకుపోయినరంట. డాక్టరు సూసి వైద్యానికి నీ శరీరం సహకరించ దని, షానరోజులు బతకలేవని సెప్పిన్రు. ఆ దెబ్బ నెత్తికి తగిలి నీకు మతిస్తిమితం తప్పింది. దాంతో ఇంటిల్లిపాదికి గుబులు పుట్టింది. నిన్ను బాపు సిన్న పిల్లోడిలా సూసుకున్నడు. అయినా.. నువ్వు తొందరగనే మమ్మల్ని ఒదిలి ఎల్లిపోయినవే. నీకు ఎంతో సాకిరీలు సేయాలని ఉండెనే. కానీ నేను నీకు దగ్గర్ల లేకుంటిని. నువ్వు మళ్లీ మా ఇంట పుడితే నేను నీకు సేవలు  జేయాలనుందే. తొందరగనే నా కోరిక తీర్చు దేవుడా.. నీ సల్లని సూపులు 
      మా మీద  ఉంచే. 

ఇట్లు నీ మనవరాలు...

తాత యాదిలో...

వెనక్కి ...

మీ అభిప్రాయం