చిరునామా లేని లేఖ...

  • 298 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గురుగుబెల్లి గోవింద రాజులు

  • శ్రీకాకుళం
  • 7382536536

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియ నేస్తమా....!
ఎలా ఉన్నావు..?
అడగాలని అడిగా కానీ, బావుంటావులే, ఎందుకంటే నీ దగ్గర ఉన్నది... నువ్వు ప్రేమించిన నా హృదయం కదా! 
      కళాశాల రోజుల్లో ఓసారి నిన్ను వర్ణిస్తూంటే, నా వైపు చాలా కోపంగా చూశావు. కానీ, ఆ చూపుల్లో నా మీద నీకున్న ప్రేమ కనిపించింది. ఆ చూపులు ఇప్పటికీ నా హృదయాన్ని చిందరవందర చేస్తున్నాయంటే నమ్ముతావా! నా అల్లరి పడలేక బాగా తిట్టేదానివి. కానీ, ఆ తిట్లెందుకో నాకు ప్రేమలో ముంచితీసిన పంచదార ‘పలుకు’ల్లా అనిపించేవి.
       ఓసారి స్నేహితులతో కలిసి కార్తీక వనభోజనానికి వెళ్లాం. ఆ రోజు ఇంటి నుంచి సోంపాపిడి తెచ్చి ఇచ్చావు. అదీ నా ఒక్కడికే! ఆ తీపి జ్ఞాపకం ఇప్పటికీ నా నోటిలో కరుగుతూనే ఉంది. ఆ భోజనాల సందడిలో ప్రమాదవశాత్తూ కొండ మీదినుంచి జారిపడ్డా. ఆ క్షణంలో నీలో నువ్వు ఎంత కుమిలిపోయావో కదా! పంటిబిగువున నువ్వు భరించిన బాధ ఆ రోజు నీ కళ్లలో కనిపించింది. అప్పుడే నా బుల్లి మనసులో అలజడి మొదలైంది. నా హృదయాన్ని మరో హృదయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని! నా బాగుకోసం అనుక్షణం ఆరాటపడుతోందని! అమ్మానాన్నల తర్వాత నా మంచిని మనస్ఫూర్తిగా కోరుకునేది నువ్వే కదా! ఏమంటావు బంగారం? నిజమే కదా! అందుకే ఆ క్షణంలో నాలో కలిగిన వింత హృదయ స్పందనలను ఎవరితోనూ చెప్పలేకపోయాను. అవి నీతోనే పంచుకోవాలని ప్రతీ క్షణం పరితపించా. 
       బంగారం... నిన్ను చూస్తున్నప్పుడు ఏమనిపించేదో తెలుసా! అమ్మ ఒడిలోంచి అప్పుడే బయటికొచ్చి ఈ వింత ప్రపంచాన్ని చూస్తున్న పసిపాపలా కనిపిస్తావు. చిన్నారి మోములో మెరుపులా మెరిసే నిష్కల్మషమైన చిరునవ్వుకు ఒక రూపమంటూ వస్తే అది నువ్వే బంగారం! చెబితే తిడతావేమో కానీ, ఎప్పుడో ఊహ తెలియని రోజుల్లో గిరిజకు మొదటిసారి ప్రేమలేఖ రాశా. అందులో అన్నీ అక్షరదోషాలే. ఇప్పుడు నా కలానికి నిజమైన ప్రేమను సిరాగా పోసి రాస్తున్నాగా, అక్షరదోషాలు రావట్లేదు. 
      ‘ప్రేమనేది ప్రేమిస్తేనే తెలుస్తుంద’ని చెప్పావు ఓసారి గుర్తుందా! నిజమే... పంచభూతాల సాక్షిగా నిన్ను ప్రేమించినప్పుడే తెలిసింది... ప్రేమలోని మధురిమ ఏంటో! క్షణ కాలమైనా నువ్వు కనిపించకపోతే తట్టుకోలేని నా మనసుకు ఊహించని ఉత్పాతం ఎదురైంది. నన్ను ఒంటరివాణ్ని చేసి నువ్వు వెళ్లిపోయావు. నువ్వు లేని నా జీవితం ‘ఎడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటె బతుకైంది. ఇక తట్టుకోవడం నావల్ల కాదు. తొందరలోనే నీ దగ్గరికి వచ్చేస్తాను... నీకిష్టం లేకపోయినా!! కన్నీటి అక్షరాలతో రాసిన ఈ లేఖను ఏ చిరునామాకు పంపాలో తెలియట్లేదు. అయినా... నా పిచ్చిగానీ, నువ్వు నా గుండెల్లోనే ఉన్నావు కదా! అందుకే ఈ లేఖనూ నా గుండెలోనే పదిలపరుచుకుంటా.  

ఇట్లు నీ గుగోరా

చిరునామా లేని లేఖ...

వెనక్కి ...

మీ అభిప్రాయం