నీ స్నేహమే నన్ను మార్చింది

  • 393 Views
  • 0Likes
  • Like
  • Article Share

    భరత్‌రుషి

  • బెల్లంపల్లి, ఆదిలాబాదు.
  • 9059667738

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

అనూ! 
బావున్నావా?
నా మీద ఇంకా కోపం పోలేదా? అది ఇంకా అలాగే ఉండి ఉంటుందిలే.. ఆ సందర్భం అలాంటిది. కానీ, దాని గురించి నీకు తెలియాల్సిన నిజం ఒకటుంది.  
      అనూ! మొదటినుంచీ నేను అంతర్ముఖుణ్ని. అనుబంధాల్లోని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక ఇన్నాళ్లూ అలాగే ఉండిపోయాను. ఇంకా అలాగే ఉండేవాణ్నేమో- నువ్వు కలవకపోయుంటే!
      నేను వెళ్తున్న దారి నన్ను ఏ గమ్యానికి తీసుకెళ్తోందో తెలియకుండానే సాగిపోతున్న సమయంలో... నా జీవిత పథాన్ని సరైన మలుపు తిప్పడానికి ఎవరో పంపినట్టు నువ్వొచ్చావు. నువ్వే వచ్చి పలకరించావు. నీ పలకరింపులోని ఆప్యాయత, మాటల్లోని తీయదనం, నవ్వులోని స్వచ్ఛత, కల్మషం లేని నీ మనస్తత్వం నన్ను ఆకట్టుకున్నాయి. అందరితో నువ్వు ఇట్టే కలిసిపోవడం, తోటివారితో స్నేహపూర్వకంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. అవసరం కోసమే బంధాల్ని పెంచుకునే వాళ్లనీ, స్వార్థం కోసం స్నేహాన్ని వాడుకునే వాళ్లనీ చూసిన నాకు... స్వచ్ఛమైన చెలిమికి నిర్వచనం లాంటి నిన్ను చూసి చాలా సంతోషించా.
      నిజంగా నీ పరిచయం నాకొక కొత్త అనుభూతినిచ్చింది. ఇలాంటి అరుదైన స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోకూడదని అనుకున్నా. అందుకే సందర్భాలను సృష్టించుకుని మరీ నీకు బహుమతులిచ్చా. ఏదోలా నీకు గుర్తుండిపోవాలనీ, నీ నేస్తాల్లో నేనూ ఒకణ్ని కావాలని తపించా. కానీ, హఠాత్తుగా నువ్వు నాతో మాట్లాడటం మానేశావు. నావల్ల తప్పేమైనా జరిగిందేమోననీ, దాన్ని సరిదిద్దుకుందామనీ అనుకున్నా. నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. నన్ను పూర్తిగా దూరం పెట్టేశావు. క్రమంగా నాకు దూరంగా వెళ్లిపోయావు.
      అప్పటినుంచీ నీకోసం వెతుకుతున్నా. నువ్వు నన్ను దూరం పెట్టడానికి కారణమేంటో ఈమధ్యనే నీ స్నేహితురాలి ద్వారా తెలిసింది. నీ పట్ల నేను చూపిన అభిమానాన్ని ప్రేమగా భావించావని, అందుకే నాతో స్నేహం వద్దనుకున్నావని తను చెప్పింది. నువ్వు దూరమైనప్పుడు ఎంత తల్లడిల్లిపోయానో కారణం తెలిశాక అంతకన్నా ఎక్కువ విలవిల్లాడిపోయాను. సంజాయిషీ కాదు కానీ, నీకు నిజం తెలియాలి, నా మనసులోని మాటను నీకు చెప్పాలనే తన దగ్గర నీ చిరునామా తీసుకుని ఈ ఉత్తరం రాస్తున్నా. 
      నీ నుంచి నేను నేర్చుకున్నదీ, తిరిగి ఆశించిందీ స్వచ్ఛమైన స్నేహం మాత్రమే అనూ! స్నేహంలోని మాధుర్యాన్ని చవిచూపించిన నిన్ను మంచి స్నేహితురాలిగానే భావించా. నువ్వు అనుకున్నట్టు, కలలో కూడా నీ గురించి అలా ఊహించలేను. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా.

సదా నీ స్నేహాన్ని కోరుకునే... 
రామ్‌

 

నీ స్నేహమే నన్ను మార్చింది

వెనక్కి ...

మీ అభిప్రాయం