ఇదే నాతొలి ప్రేమలేఖ

  • 625 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తోపల్లి నాగసాయి శ్రీదేవి

  • రాజోలు, తూ.గో.జిల్లా
  • 8247690316
తోపల్లి నాగసాయి శ్రీదేవి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన భాను దొడ్డమ్మకి
      ఉన్నపళంగా ఈ ఉత్తరమేంటీ! అని, కంగారు పడుతున్నావు కదూ! ఊరకనే నిన్ను ఆశ్చర్యపరుద్దామని ఇలా రాస్తున్నా.
      దొడ్డా నిన్ను తలచుకున్నప్పుడల్లా నీ హుషారు, నీ దరహాసం కళ్లముందు కదుల్తాయి తెలుసా! నీకిలా ఉత్తరం  రాయడానికి కారణం మా అమ్మ. ఆగాగు మరోలా అనుకోకు. ఈ ఇంగ్లీషు చదువులొచ్చినాక తెలుగక్షరాలమీదే పట్టింపులేకుండా పోయింది కదా! అందులోనూ ఏదో చదూతుందన్నమాటే గాని తెలుగులో ఉత్తరం రాయడం కూడా చేతకాలేదని నా మీద కేకలేస్తుంటుంది అమ్మ.
      ఇదివరకటి రోజుల్లో చెప్పదలచుకున్నవన్నీ కార్డుముక్కపైనో.. కవర్ల ద్వారానో పంపీ... మళ్లీ ఉత్తరం ఎప్పుడొస్తుందా! అని ఎదురుచూసేవారట. పోస్ట్‌! అనే పిలుపుకి వీధిలో తలుపులన్నీ తెరచుకునేవట. ఎవరినుంచే! ఎక్కడినుంచీ! అని ఆ రోజంతా ఆ ఉత్తరం గురించే గొప్పగా చెప్పుకునేవారని అమ్మ చెప్పేది.
      ఒకసారి అమ్మకి నువ్వు ఉత్తరం రాస్తే... ముందు నేను చదువుతానంటే నేను చదువుతానని అమ్మ, అమ్మమ్మ పోట్లాడుకున్నారట కదా! అమ్మ, అమ్మమ్మని మన పెరడు, వరండా, హాలు, అలా ఇల్లంతా తిప్పేసిందట. చివరికి అమ్మే ముందు కవరు చింపి చదివిందట. అప్పుడు అమ్మమ్మకి కోపం వచ్చేసిందట. అమ్మ ఆ రోజులు గుర్తుతెచ్చుకుని పక పక నవ్వుతూంటే, నేను విచిత్రంగా చూశాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ ఉత్తరాలు రాయట్లేదు. ఉత్తరాలు అలా రాయడమేంటో, దాని జవాబుకోసం ఎదురు చూడటమేంటో తెలీక వింతగా అనిపిస్తుంది నాకు. ఖండాంతరాలు దాటిపోయిన వారినెవరినైనా చిటికెలో ముందునిలిపే సాంకేతిక యుగంలో పుట్టిన నాలాంటివాళ్లకి ఉత్తరం గురించి ఏం తెల్సనీ! నీగురించి ఏవేవో రాద్దామనీ.. పెన్ను పట్టుకుని కూర్చుంటే ఒక్క పలుకు ఊడిపడటంలేదు. సంగం లక్ష్మీబాయి తన జైలు అనుభవాల గురించి మా చిన్నతనంలో తెలుగుపాఠంగా చదువుకున్నాం. అందులో ఉత్తరం గొప్పతనం గురించి చెప్పిన సంగతులు ఇప్పటికీ లీలగా గుర్తున్నాయి. చాలా కాలం తర్వాత తన మేనమామ కూతురు విమల నుంచి ఉత్తరం వచ్చినప్పుడు... నడిసముద్రంలో పడి కొట్టుమిట్టాడుతున్న నాకు చుక్కానిలా ఈ ఉత్తరం ఊరట కలిగించిందంటారావిడ. దొడ్డా! నిజంగా ఉత్తరంలో అంత శక్తి ఉందంటావా!
      దొడ్డా! మొన్న జరిగిన తెలుగు పరీక్షలో లేఖకి సంబంధించిన ప్రశ్న వచ్చింది. దాన్ని రాయడానికి ఎంతో కష్టపడాల్సొచ్చింది. అప్పుడు అమ్మ గుర్తొచ్చింది నాకు. అమ్మ తెలుగులో ఎప్పుడూ ప్రథమంగానే ఉండేదట. అందుకే అమ్మ ది గ్రేట్‌! అంటాను. అమ్మపై ఒక కవిత కూడా రాసుకున్నాను అప్పటికప్పుడే. అది రాస్తున్నా. నవ్వకుండా చదువు.
      అమ్మ కన్నా మధురమైనదేదీ
      అమృతము కన్నా తీయనైనదేదీ
      ఉంగా... ఉక్కూ... అంటూ బోధించేదీ
      జీవితానికి చక్కని బాట వేసేదీ
      కోడికూత కన్నా ముందే మేల్కొని
      పిల్లలకు ఉగ్గు పట్టినా
      ఇంటిముందు ముగ్గుపెట్టినా
      పిల్లలను ఒడిలో పరుండబెట్టుకొని
      వారి బోసినవ్వులకు మురిసేదీ అమ్మే.
      దొడ్డా! ఎలా ఉంది నా కవిత!
      పెద్దనాన్నగారికి నా నమస్సులు అని చెప్పు! అమ్మ చెప్పినట్లే  ఆంటీ, అంకుల్, సిస్టర్‌ వంటి పదాలను వదిలేసి, అందరినీ అత్త, మావయ్యా, పిన్ని.... అనే పిలుస్తున్నాను. ఇప్పుడర్థమవుతోంది ఈ పిలుపుల్లోని మాధుర్యం. దొడ్డా! ఇది నీకోసమే రాసిన ప్రేమలేఖ సుమా! చదివిన వెంటనే జవాబిస్తావు కదూ! ఉంటాను మరి!.
ఇట్లు
నీ చిన్ని కూతురు 

ఇదే నాతొలి ప్రేమలేఖ

వెనక్కి ...

మీ అభిప్రాయం