సదా సరిగమల ప్రేమలో...

  • 1107 Views
  • 1Likes
  • Like
  • Article Share

    పిన్నింటి కృష్ణ నిజాశ్రిత

  • శ్రీకాకుళం
  • 7675924496
పిన్నింటి కృష్ణ నిజాశ్రిత

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

వేయి భావాలనైనా పలికించగలిగే శక్తి ఒక మాటకు ఉందంటారు. అటువంటి ఎన్నో మాటలు కలిస్తే నువ్వు వస్తావు. అన్ని భావాలు ఎలా పలికించగలవు నువ్వు!
      ఈ ఆలోచనే నీతో స్నేహం చేయించింది. నీతో ఎన్నెన్నో చెప్పాలని రాసుకున్నా నీ రూపంలోనే తెలపడానికి రాగం కుదరడం లేదు. అందుకే ఈ ప్రేమలేఖ రాస్తున్నా... హావభావా లను ముఖకవళికలతో తెలుపుతూ ఉంటారు అందరూ. నాకు మాత్రం ఏ భావం తెలపాలన్నా మొదటగా గుర్తొచ్చేది నువ్వే. నీ సాయంతోనే ఎన్నో భావాలను తెలపగలిగాను. ఇన్నాళ్లకు నీకు ఇవన్నీ చెప్పగలుగు తున్నా. నీతో సాగుతున్న ప్రయాణా నికి ఏనాడో బీజం పడిందిగా...
      నేనేంటో నాకు తెలియక ముందే నిన్ను తెలుసుకున్నాను. ‘నారాయణతే నమో నమో’ అంటూ పాడిన పాటతోనే నీతో ‘మైత్రి’ కుదిరింది. మొదట్లో ఏదో నామమాత్రానికే అనుకున్నా. ఆపై ఆసక్తితో నీ అసలు స్వరూపమైన సంగీతాన్ని నేర్చుకునేందుకు సాహసం చేశా, మొదట్లో సాలోచన కుదరక ఏం జరుగుతుందో తెలియక సతమతమయ్యే దాన్ని. బుద్ధుడికి బోధిచెట్టు కింద జ్ఞానోదయమైనట్టు నాకు మా గురువు దగ్గర అయింది. అప్పటినుంచి రోజూ నీతో ప్రేమలో పడుతూనే ఉన్నా. ఆనందంగా ఉన్నప్పుడు అలవోకగా పాటలు వచ్చేవి. బాధలో గుండెను బరువెక్కిస్తూ వచ్చేవి. ఏ భావంలోనైనా నువ్వే గుర్తొచ్చేవాడివి. అంతటితో ఆగిందా అంటే అదే రాయడం వైపు నా మనసు మళ్లేలా చేసింది. 
      ఇంకేముంది, ఎవరికైనా నా మాటలు అర్థం కాలేదనుకో.. ఇంకోలా చెప్పేదాన్ని. ఎలా అనుకుంటున్నావా! నీ రూపంలోనే. రాసిన దానికి రాగం కట్టేయడమే. ‘కల’ తీరడం ఓ ‘వరం’. కల ‘కళ’తో ముడిపడటం ‘అదృష్టం’. నీతో బంధంతో బంగారు భవిష్యత్తుకు బాట వేద్దామనుకున్నా. అలా నీతో ప్రేమ కాస్తా ‘పరిణయ’మై పల్లవిస్తుందని పరవశించి పోయాను. విధి విషవలయం విసరడమంటే ఇదేనేమో ‘గానం’ చదువుకు అడ్డుగోడ అని అమ్మానాన్నల అభిప్రాయం. ఆ అదృష్టాన్ని అందుకునే ‘అవకాశం’ చిక్కించుకోలేక అనాథనై పోయా. ‘కన్నీరు’ కార్చినా ‘కన్నవారు’ కరగలేదు. నా అనుబంధానికి ‘మావిడాకులు’ కడతావనుకున్న నాకు నీతో విడిపోవాలని రాసిపెట్టుంది కాబోలు. ఏం చేయను! అందరిలానే మామూలు అమ్మాయిని. అమ్మానాన్నల కోసం ప్రేమను త్యాగం చేయలేను. అలా అని ఎదిరించి ముందుకు పోలేను. పూర్తిగా నచ్చనిదానితో కలిసుండలేను. అందుకే వారి అంగీకారానికి ఎదురు చూపుగా సంగీతాన్ని మధ్యలో ఆపేశా... నిన్ను మాత్రం అంటిపెట్టుకుని ఉన్నా,
      నీలో ఎంత సంగీతం ప్రవహిస్తున్నా.. ఎన్ని స్వరాలు నీలో లయమవుతున్నా నువ్వు నాకు ప్రత్యేకమే. నిన్ను నేర్చుకునే సాధన నిరంతర ప్రక్రియ. మదిలో మౌనరాగాల వెనుక దాగివున్న పాట నీవే. నీతో సాగే పయనంలో యుగం గడిచినా క్షణమే నాకు.  
      నాకు నువ్వు కావాలి.. నీతో గడిపే సమయం కావాలి.. నీ వల్ల పొందే ప్రేమ కావాలి. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పగలను... ఎందుకంత ఇష్టం అంటే సమాధానం లేదు. ఎందుకంటే ప్రేమలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. నీకు రూపుదిద్ది, ప్రాణం పోసి నా ఎదురుగా నిలబెట్టి నాతో జోడీ కట్టిస్తే ఆ ఆకాశాన్ని తాకే అవకాశమైనా నాకే సొంతమిక, అనుభవాల నుంచే అనుభూతులు వస్తాయి... ఆలోచనలతోనే అవకాశాలొస్తాయి. 
      నా నిరీక్షణకు ఫలితం దక్కింది. నా ప్రేమకు పచ్చజెండా ఊగింది. తల్లిదండ్రుల అంగీకారం వచ్చింది. ఆనందం అవధులు దాటింది. గుండె ఓ క్షణం ఆగినంత సంతోషం కలిగింది. అలా నిన్ను పరిణయమాడే సమయం నా దరిచేరింది. ‘పాడుతా తీయగా’ ఎంపికలకు హాజరయ్యాను. నిన్ను నా సొంతం చేసుకునే మజిలీలో మొదటి అడుగు పడింది. విజయం వరించకపోవచ్చు కానీ నా ప్రయత్నం వృథా కాదు. నిన్ను నేను చేరుకోవడ మంటే భూగోళం చుట్టిరావడమేగా... ఎందుకంటే నా ప్రేమ ‘ఏకలవ్య’ ప్రయత్నం కదా మరి... ఏనాటికైనా నీ దరి చేరుకుంటాననే ఆశే నన్ను నిన్ను దూరం చేసుకోనివ్వట్లేదు. దాని కోసమే నా ఈ నిరీక్షణ...

ఇట్లు నీ ప్రేమిక

సదా సరిగమల ప్రేమలో...

వెనక్కి ...

మీ అభిప్రాయం