ఓయ్‌ పొట్టీ.. నిన్నే..!

  • 3300 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రావాడ కుమార స్వామి

  • ఇండుగపల్లి, తూ.గో.జిల్లా
  • 8106639115
రావాడ కుమార స్వామి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ఎలా ఉన్నావ్‌..! నీకేం నువ్వు బాగానే ఉంటావులే. నేనే చిక్కిపోయాను. నిన్ను పొందాలనే కోరికతో అల్లాడిపోతున్నాను. నీకు తెలియదు..! సరిగ్గా ఆరు సంవత్సరాల కిందట అంతర్జాలంలో నిన్ను చూశాను. వయ్యారాలొలికే నీ శరీర సౌందర్యం నన్ను కట్టిపడేసింది. చూడగానే ఇష్టపడ్డాను. నాలో లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనే భావన కలిగింది. నిన్ను ఇష్టపడుతున్నట్టు అందరికీ చెప్పేశా. నీకు మాత్రం చెప్పలేకపోయా. నా ప్రేమను తెలియజేద్దామంటే అంతర్జాలంలోనూ, టీవీలోనూ తప్ప, బయటెక్కడా కనిపించేదానివి కాదు. అందుకే నిన్ను నా గుండెల్లో దాచేసుకున్నా. పొట్టిదానివేమో నా హృదయంలో ఇట్టే ఒదిగిపోయావ్‌. అప్పటినుంచి నా ఫేస్‌బుక్‌ గోడ నిండా నీ ఫొటోలే అంటించేశాను. ‘ఇన్‌స్టా’గ్రాంలో నీ కథలు కుప్పలు కుప్పలుగా రాశాను. ట్విట్టర్‌నిండా నీ ఊసులే. వాట్సాప్‌ స్టేటస్‌లో రోజూ నీ ఫొటోనే పెడుతున్నా. నీ ఫొటోలు చూస్తూనే కాలం గడిపేస్తున్నా. నీ కోసం మద్యపానం చేయని దేవదాసు అయిపోయాననుకో... అయినా మద్యపానమే చేయాలా..! నీ ఫొటో చూస్తే కిక్కు ఎక్కేస్తుంది నాకు. తెలుసా..! నిన్ను కలవడానికి చేయని ప్రయత్నం లేదు. ఎంత ప్రయత్నించినా నువ్వు దొరకలేదు. నా భావాలను పంచుకోడానికి తోడు లేదు. ఒంటరిగా బతుకుతున్నా. నిన్ను తోడు తెచ్చుకుందాం అంటే, నువ్వు నాకు అందనంత దూరంలో ఉన్నావ్‌. ఎంత దూరంలో ఉన్నా నువ్వు ఎప్పటికైనా నా ఇంటిలో అడుగు పెడతావని ఆశతో ఉన్నా. 
    పొట్టీ..!  చెప్పడం మర్చిపోయా..! నాకు హైదరాబాదులో ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఈ మధ్య నిన్ను హైదరాబాద్‌ సెంట్రల్‌ షాపింగ్‌ మాల్‌లో చూశాను. కాని అక్కడున్న సెక్యూరిటీ గార్డు నన్ను నీ దగ్గరకు రానివ్వలేదు. ఏమీ చేయలేక అక్కడి నుంచి వచ్చేశాను. అంత దగ్గరగా నిన్ను చూడటం అదే మొదటిసారి. ఆ రోజు నిన్ను అలా చూసి ఎంత సంతోషించానో నీకు తెలియదు. అవునులే..! నీకెలా తెలుస్తుంది? నన్ను పట్టించుకుంటే కదా నువ్వు. నేనంటే లెక్కే లేదు నీకు. పొట్టీ..! నన్ను ఒక అమ్మాయి ప్రేమించానంది. నన్నే పెళ్లి చేసుకుంటానంది. నాకేమో, మనసులో నిన్ను పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా పెళ్లికి అంగీకరించవలసి వచ్చింది. మనం ఇష్టపడేవాళ్లు మనకి దక్కనప్పుడు, మనల్ని ప్రేమించే వాళ్లకైనా మనం దక్కాలి కదా పొట్టీ. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నా. పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించారా..? అని నా భార్య అడిగితే, నిన్ను ఇంకా ఇష్టపడుతున్నా అని చెప్పాను. నీ గురించి చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది పొట్టి. నీ మీద చూపించే ప్రేమ తన మీద చూపించడం లేదని ఎప్పుడూ నాతో గొడవడుతుంది. ఏదేమైనా నాకు మీ ఇద్దరూ సమానమే అని తేల్చి చెప్పేశా. నిన్ను ఇంటికి తీసుకువస్తా అని కూడా చెప్పాను. నువ్వు ఇంటికి వస్తే నీతోనే ఎక్కువ సమయం గడిపేస్తానని తను భయపడుతోంది. భయపడినా, బాధపడినా నాకు నువ్వు కావాలని చెప్పాను. నేను పెట్టే పోరు తట్టుకోలేక, ఆఖరికి నా సంతోషం కోసం నిన్ను ఇంటికి తీసుకురాడానికి ఒప్పుకుందిలే. ఇంకో విషయం చెప్పాలి నీకు. ఈ మధ్యనే కొత్తగా ఇల్లు కట్టాను. నీ కోసం ఇంటి మీద ఒక చిన్న గదిని ప్రత్యేకంగా అలంకరించాను. త్వరలోనే నిన్ను ఇంటికి తీసుకొస్తాను. నాతో రావడానికి సిద్ధంగా ఉండు పొట్టీ. నీళ్లవీ ఎక్కువ తాగేసి మరీ లావుగా అయిపోమాకు. లావుగా ఉన్నా ముద్దుగా ఉంటావులే. నేనొచ్చే వరకూ నీ పొట్టి పొట్టి కొమ్మలను, చిన్న చిన్న ఆకులను, బొద్దుగా ఉండే కాండాన్ని జాగ్రత్తగా కాపాడుకో. లవ్‌ యూ పొట్టీ. ఉంటాను మరి. 

ఇట్లు 
శ్రీస్వామి

 

ఓయ్‌ పొట్టీ.. నిన్నే..!

వెనక్కి ...

మీ అభిప్రాయం