శ్రీమతికి ప్రేమలేఖ
 

  • 973 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అభిసారిక

  • రాజమండ్రి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

అమ్ము కుట్టీ!
      ‘భార్యకి ఉత్తరం రాయటం’ - చాలా ముచ్చటైన అనుభవం కదూ! పెళ్లయితే అన్న నా కోరికల జాబితాలో ఈ ఉత్తరం రాయడం, రాయించుకోవడం కూడా ఒకటి. ఇ-మెయిల్స్, సెల్‌ఫోన్ల యుగంలో ఉంటూ, ఉత్తరం రాయటమంటే ఇప్పటివాళ్లకి మళ్లీ రాతియుగంలోకి వెళ్లినట్లే ఉంటుంది. మార్పు అభిలషణీయమే కానీ కొన్నికొన్ని మారకుండా ఉంటేనే బావుంటుందేమో అనిపిస్తుంది కదూ! నాకెందుకో ఇప్పుడు చలం గారి ప్రేమలేఖలు గుర్తుకు వస్తోంది. 
      ఆయన అంటాడు అందులో, ‘ఉత్తరం అంటే భార్య దృష్టిలో పుట్టింటికి వెళ్లినప్పుడు తప్పనిసరై మొగుడుకు రాసేవి. వాటినుంచి ఎలాంటి అనుభూతులూ కల్గవు. గోంగూర పచ్చడి, ఆవకాయ జాడీ, పాల బాకీలు, ఇంటి అద్దెలు ఇవే ఉంటాయట. అలాంటి ఉత్తరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’, అని. ఈ విషయంలో నేను అదృష్టవంతుణ్ని కదూ! నా భార్య చలం గారి సగటు భార్యల కోవలోకి రానందుకు.
భార్యలకు ప్రేమలేఖలు రాసే వాళ్లుంటారా? ఉంటారేమో! ఏం రాస్తారంటావు? ప్రేమలేఖకు పొగడ్తలు, ఉపమానాలు, అతిశయోక్తులు, అలంకరణలు తప్పనిసరి. మరి నాకైతే నీతో నిజం చెప్పడం తప్ప, అబద్ధం చెప్పడం చేతకాదు. ఆ అవసరం లేదు కూడా! కాబట్టి నేను ప్రేమలేఖ రాయడానికి అనర్హుణ్ని కదూ! అయినా నా పిచ్చిగానీ నా ప్రేమని వ్యక్తపరచగల శక్తి ఈ ప్రపంచంలో ఏ భాషలోని, ఏ అక్షరానికీ లేదని నా నమ్మకం. నా ప్రేమని నా గుండెలోనే నిండి ఉండనీ! దాన్ని బయటపెడితే తక్కువ చేసుకున్నట్లే, ఎందుకంటే ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోయిందన్న అసంతృప్తి. అన్నట్లు నేను మరోసారి అదృష్టవంతుణ్ని, ఎందుకంటే నా భార్య మౌనంతో మాట్లాడాలనే నా కోరిక తీర్చినందుకు. నువ్వు పెదవులతో, అక్షరాలతో బాగా మాట్లాడగలవు. అన్నట్లు మనం తీయించుకున్న ఫొటో వచ్చింది. ఎలా ఉందనుకున్నావ్‌? ముందు నా గురించి చెప్తాను. నేను చాలా అందంగా ఉన్నాను. పక్కన నువ్వుంటే ప్రపంచాన్ని జయించినంత తృప్తి గుండెల్లో, అదే మొహంలో ప్రతిబింబించి అందంగా ఉన్నాను.
      ఇక నీ గురించి ఎలా చెప్పను? పున్నమి చంద్రుడిలా వెలిగిపోతున్నావు. అన్నట్లు చంద్రోదయానికీ రోజుల లెక్క ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ప్రకాశించడు. అవునూ! నీకు తెలుగు అంకెలు తెలుసా? నీ కోసం నేను నేర్చుకున్నానులే! నీ నుదురు ఒకటిలా, కనుబొమలు పదకొండులా, చెవులు రెండు తొమ్మిదుల్లా ఉండి (1+11+9+9=30) అయి నువ్వు పౌర్ణమి నాటి చంద్రునిలా ప్రకాశిస్తున్నావు.
      చిత్రమైన వర్ణన కదూ! తెలుగు పండితునికి ఈ మాత్రం తెలుగుదనం ఉండొద్దూ! చాలా పొద్దుపోయింది. లోకమంతా గాఢనిద్రలో ఉంది. నువ్వూ మంచి నిద్రలో ఉండి ఉంటావు. పెళ్లికి ముందు ఆడదానికీ, పెళ్లయ్యాక మగాడికీ నిద్ర ఉండదని నా అభిప్రాయం. సరే! చాలా ఆలస్యమైంది. నీతో మాట్లాడుతూంటే సమయమే తెలీదు. నీతో వచ్చే వసంతం కోసం చకోరంలా ఎదురుచూస్తూ ఉంటా! మరి.
      ఈ ఉత్తరం నీకు నచ్చకపోతే - నడి సముద్రంలో పడవ మునిగినట్టు.
      నీకు నచ్చి నవ్వితే - గోదావరి ఒడ్డున దీపం వెలిగించినట్టు.

ప్రియనెచ్చెలికి ప్రేమతో,
నీ జీవిత భాగస్వామి

శ్రీమతికి ప్రేమలేఖ
 

వెనక్కి ...

మీ అభిప్రాయం