ఎదురు చూస్తూ...

  • 262 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎం.ధనలక్ష్మి

  • పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
  • 8179965538
ఎం.ధనలక్ష్మి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

బుజ్జీ..... 
      ఎలా ఉన్నావ్‌? డైలీటెస్టులు, వీక్లీటెస్టులు, మంత్లీ టెస్టులంటూ క్షణం తీరికలేకుండా ఉంటున్నావ్‌ కాబోలు. ఎప్పుడైనా మేం జ్ఞాపకానికొస్తామా! ఇంట్లో అయితే రోజూ నీ ఊసే.
      నిజం చెబుతున్నాను... నువ్వు వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా ఇల్లెంత నిశ్శబ్దమైపోయిందో తెలుసా? నాకైతే అసలు ఇంట్లో ఉండాలనే అనిపించటం లేదు. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా? అని ఎదురు చూసేదాన్ని కదా! ఇప్పుడు మాత్రం సండే స్పెషల్‌ క్లాస్‌ పెడితే బాగుంటుందనిపిస్తుంది.
      ఆదివారం వస్తేచాలు ఎంతలా కొట్టుకునే వాళ్ళమో టీవీ రిమోట్‌ కోసం! గంట నువ్వూ గంట నేనూ అని వంతులేసుకునేవాళ్లం. ఆ ఛానల్‌ వద్దని, ఈ ఛానల్‌ కావాలనీ రోజూ గొడవే. తగవు తారస్థాయికి చేరినప్పుడు నాన్న గొంతు వినిపిస్తే చాలు గప్‌చుప్‌ అయిపోయే వాళ్లం! అదికూడా కాసేపేలే.
      నువ్వంత దూరంగా వెళ్లినప్పుడు కానీ నాకర్థం కాలేదు, నేను నీకెంత దగ్గరయ్యానో అని. నువ్వు లేవన్నది మరచిపోయి ఎప్పటిలానే అలవాటుగా ఎన్నిసార్లు పిలుస్తున్నానో? నా చున్నీ ఏదే? రికార్డ్‌ వెతికావా? బైరా బుజ్జీ అంటూ... అసలు నిన్ను తలవని రోజు లేదు తెలుసా! నేనే కాదు, అమ్మ కూడా సైకిల్‌ బెల్‌ వినిపించిన ప్రతిసారీ బయటకొస్తుంది నీ పుస్తకాల సంచి అందుకుందామని. ఇంట్లో ఉండే ప్రతీ క్షణం నీతో గొడవపడే నానమ్మ కూడా నిన్నే స్మరిస్తోంది. అబద్ధమెందుకుగానీ నాన్న నిన్ను హాస్టల్లో వేస్తానన్నప్పుడు ఎగిరిగెంతాలనిపించింది, టీవీ రిమోట్‌ కోసం ఇక పేచీ ఉండదని. ఇక గది మొత్తం నాదైపోతుందని. కానీ ఆ రోజు నువ్వు వెళ్లిపోతున్నప్పుడు నువ్వెక్కిన బస్సువంకా... నీవంకా చూసేసరికి ఒక్కసారిగా గుండె ఆగినట్టయ్యింది
      చాలా చాలా మిస్సవుతున్నానే..... 
      సర్లే! ఇప్పుడదంతా ఎందుకుగానీ, దసరా సెలవులంట కదా? తొందరగా వచ్చేసెయ్‌. ఆ పది రోజులూ ఊరంతా తిరిగేద్దాం. నడిచి కాదు, నీకు చెప్పలేదు కదా! నాన్న స్కూటీ కొన్నారు. నేను బాగా నేర్చుకున్నా, నువ్వు వస్తే డబుల్స్‌ ప్రాక్టీస్‌ చేద్దామని చూస్తున్నా.
      చెప్పడం మరచిపోయాను, నువ్వు నాటిన గులాబీ నిన్ననే పూచింది. ఎంత బాగుందో తెల్సా! తొలిసారి పూచిన పువ్వు కదా అని నానమ్మ గుడికివ్వమంది. నేనే తీయనివ్వలేదు. అది మొక్కకి ఉంటేనే నువ్వు ఇష్టపడతావు కదా!
      ఆరోగ్యం జాగ్రత్త. కూరలు బాగాలేవని తినటం మానెయ్యకు. అనవసర వ్యాపకాలేవీ పెట్టుకోకుండా చదువు అని నీకు చెప్పక్కర్లేదనుకో. ఎవరితోనూ గొడవ పడకు, వాదించకు అలాగని అకారణంగా మాటపడకు. 
      నీకిష్టమని కోడిగుడ్డు అట్టు వేయటం కూడా నేర్చుకున్నా. ఇకనుంచి నువ్వు అమ్మని బతిమాలనవసరం లేదు. 
      ఇంకా వారం రోజులు. ఎప్పుడెప్పుడైపోతాయో? అని రోజూ నీరాక కోసం ఎదురుచూస్తున్నాం, అదేంటో ఎదురు చూసే కొద్దీ ఇంకా లేటవుతున్నట్టుంది. నువ్వు దిగాల్సిన బస్టాండ్‌ దగ్గర స్కూటీతో సహా ఎదురు చూస్తుంటా...  

మీ అక్క

ఎదురు చూస్తూ...

వెనక్కి ...

మీ అభిప్రాయం