నీ కోసం అన్వేషణ

  • 392 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తులసీబృంద జంపన

  • హైదరాబాదు
  • 9959966768

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

నువ్వెవరో నాకు తెలీదు...
      ఎక్కడుంటావో, ఎలా ఉంటావో అంతకంటే తెలీదు...
      కానీ... స్పష్టత లేని నీ రూపం నా కంటికి ఎదురుగా కదలాడుతూనే ఉంది.
      పరిచయంలేని గొంతేదో నా చెవులకు తియ్యగా వినిపిస్తూనే ఉంటుంది
      నా ఊహల గగనపు వీధుల్లో విహంగంలా విహరిస్తున్న నిన్ను నా ప్రేమనేది కిందికి తీసుకురాలేకపోవచ్చు.
      స్వేచ్ఛా సంద్రపు అలల మీద తేలియాడుతున్న నిన్ను ఇసుక రేణువుగానైనా మోసుకురాలేకపోవచ్చు.
      అయినా ఏదో అంతులేని ఆశ...
      అదేమి చిత్రమో! ఎదురుపడ్డ ప్రతి ఒక్కరిలో నిన్ను వెతుక్కుంటుంటాను. 
      నాలో అణువణువునా నిండిపోయిన నిన్ను వారితో పోల్చి చూసుకుంటాను. 
      అంతలో ఏదో నిరాశ, నిస్తేజం! నా మనసు నాతోనే గొడవ పడుతుంది...
      వాళ్లలో ఏదో ఒక లోపం చూపించి నన్ను నిలువరిస్తోంది...నువ్వు కాదనే నిజాన్ని నాలో నింపి చికాకు పరుస్తోంది.
      ఆఖరికి... నా అభిరుచుల జాడలు అవి కావని తెలిపి సర్ది చెప్పుకోవాల్సొస్తోంది!
      ఏదైనా కానీమని గమ్యం లేని వెతుకు బాటలో విసుగు, విరామం లేకుండా నిరంతరం పయనిస్తూనే ఉన్నా!
      ఇక ఎప్పటికీ అందుకోలేకపోతానేమోనని నాలో నేనే సతమతమవుతున్నా!
      నీకు తెలుసా! ఏళ్లకేళ్లు గడుస్తున్నా.. ఎప్పటికప్పుడే... ఈ కొత్త సంవత్సరంలోనన్నా నాలో ఆశలు చిగురించకపోవన్న ఆశ...నన్ను కుదిపేస్తుంటుంది.
      అంతులేని ఆలోచనలను ఇచ్చి నన్ను సిద్ధం చేస్తుంటుంది. ఆ ప్రేరణతోనే... లేలేత ఆకులతో ముస్తాబవుతున్న చిరుకొమ్మల్ని అడిగి చూశా!
      కొమ్మల మాటున దోబూచులాడుతున్న మావి పిందెలనడిగి చూశా!
      పిందెల చాటున నీ గొంతునే అనుకరిస్తున్న కోయిలమ్మని కూడా అడిగా! 
      నువ్వెవరివని? ఎలా ఉంటావోనని...
      కానీ... వాటికేమనిపించిందో... ఫక్కున నవ్వి నా మనసునే అడగమన్నాయి...
      చిలిపిగా గేలి చేస్తూ... నాలోనే నిన్ను వెతుక్కోమన్నాయి...
      ఆసాంతం తరచి చూసుకున్నా నీ జాడ లేదు. తరింపజేసే నీ రూపం కాస్తయినా కానరాలేదు...
      ఆఖరికి నా మనసే ఉగాది పచ్చడిలా తయారైంది. ఇక షడ్రుచుల కలయికలో... తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు రుచులనేవి నన్నెలా మెప్పించగలవు?  
      చూస్తుండగానే... పండగ కూడా పరిహాసమాడి వెళ్లిపోయింది. నిన్ను మార్చడం నా వల్ల కాదంటూ చక్కాపోయింది.
      అయినా! నా మనసు నిరాశను ఓడించింది. ఆశను రేకెత్తించి ముందుకు తోసింది.
      ఆ ధైర్యంతోనే! చిరుజల్లుల మట్టి తడుల్లో తడుముకున్నాను, ఆ పరిమళం నీశ్వాసకు సంకేతమనుకుని.  
      వణికించే చలిని సైతం నిగ్గదీశాను నీరాక ఎప్పుడని... 
      హుఁ...! సమాధానం లేని నా ప్రశ్నల నుంచి అవీ తప్పించుకు తిరుగుతున్నాయి..
      చేసేదేం లేదా? అనుకుంటూ నాలో నేనే కుంగిపోయే తరుణంలో...  ఎండ మావులు కూడా నన్ను ఆటపట్టిస్తున్నాయి. నీ నీడను చూపించి వాటి వెంట పరుగు పెట్టిస్తున్నాయి. వాటిలా నువ్వో భ్రమవు కాకూడదని... ఆగిపోతున్నాను. కానీ ఏదో అలికిడి నాలో ఉత్తేజాన్ని నింపుతోంది. ఓపిగ్గా వెతుక్కోమంటూ నా భుజం తడుతోంది... 
      వాటి వెంటే...!
      మళ్లీ నాలో ఆశలు నింపాలనేమో! కొత్త ఉగాది కూడా వచ్చేస్తోంది... నన్ను నేను సిద్ధపరుచుకోవడమే తరువాయి... 
      ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా... నీ కోసం సాగే నా అన్వేషణలో... 
      నీ నేను...

నీ కోసం అన్వేషణ

వెనక్కి ...

మీ అభిప్రాయం