చెలీ! కుశలమా!

  • 272 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నమిలకొండ సునీత

  • కామారెడ్డి,
  • 9908468171
డా।। నమిలకొండ సునీత

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియాతి ప్రియమైన స్నేహితురాలికి,
      ఉత్తరం మొదలుపెడుతుంటే మన బాల్యం గుర్తొచ్చి ఆనందంతో చేతులు వణుకుతున్నాయి. మన స్నేహం, అల్లరి, సరదాలు, కోపతాపాలు అబ్బో తలుచుకుంటేనే మనసు పులకరిస్తోంది.  
      అనుకోకుండా ఎప్పుడైనా బడికి సెలవు వచ్చిందంటే ఎగిరిగంతేసే వాళ్లం కదే! ఆ రోజు పొద్దున్నే అల్పాహారాలు తీసుకుని భీమేశ్వరాలయానికి వెళ్లేవాళ్లం. దర్శనం అయ్యాక చక్కగా ఆడుకుని సాయంత్రానికి ఇల్లు చేరేవాళ్లం. ఎన్ని కబుర్లో, ఎన్ని ఆటలో! ఈతరం పిల్లలకు ఆ అదృష్టం లేదు. అంతర్జాలమే వాళ్ల నేస్తం అవుతుండటంతో ఎక్కువమంది అంతర్ముఖులుగా మారుతున్నారు.
      చదువులో ఒకరితో ఒకరం పోటీపడే వాళ్లం కదా మనం. అరమార్కు విషయంలోనైనా తెగ ఇదైపోయేవాళ్లం. తలచుకుంటే భలేగా అనిపిస్తుందా పోటీ ఇప్పుడు. అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటూ చదువుకునే నువ్వు, సెలవుల్లో అమ్మానాన్నల దగ్గరికి వెళ్లొచ్చేదానివి. అక్కడ మన అభిమాన నాయికానాయకులైన సుహాసిని, చిరంజీవిల సినిమాలు చూసి రావటం, బడిలో సమయం చిక్కితే చాలు మా అందర్నీ కూచోబెట్టుకుని సినిమా కథ చెప్పడం ఇప్పటికీ మధురానుభూతులే. నువ్వు కథ చెప్పాక ఇక మేము ఆ సినిమా చూసేవాళ్లం కాదు. ఎందుకంటే నువ్వు చెబుతుంటే, అందులోని దృశ్యాలన్నీ కళ్లముందు కదలాడేవి మరి. మా నానమ్మ తర్వాత నీలాగా కథలు చెప్పేవాళ్లు నాకిప్పటి వరకు ఎవరూ కనపడలేదంటే నమ్ము. 
      మీ అమ్మమ్మ చూడకుండా మనమంతా మీ ఇంట్లో జామ, దానిమ్మ కాయలు కోయడం గుర్తుందా? మామ్మ ఎప్పుడైనా చూసి కోప్పడగానే పారిపోవడం భలే సరదాగా ఉండేది. బడి దగ్గర చింతకాయలు, మామిడికాయలు కొనుక్కొని,  ఇంటి దగ్గరి నుంచి తెచ్చుకునే ఉప్పుతో కలిపి తినడం... అబ్బో! ఆ రుచే వేరు కదా.  
      జెండా పండగ సందర్భంగా తరగతి గది శుభ్రపరచడానికి అబ్బాయిలు మూడో అంతస్తులోకి నీళ్లు మోసుకురావడం, ఆ నీళ్లతో మనం గదిని శుభ్రం చేసి అలంకరించడం...  అందరం అన్నాచెల్లెళ్లలా కలిసి ఉండేవాళ్లం కదా. 
      లెక్కల మాష్టారు తరగతిలో మనమంతా బాగా అల్లరి చేసేవాళ్లం. కానీ, గురువుగారు మాత్రం నిన్నే నిలబెట్టే వారు. చిత్రం ఏంటంటే, మేమందరం నీ దగ్గరే లెక్కలు నేర్చుకునేవాళ్లం. అంత తెలివిగల దానివి అయినా, గురువుగారి దృష్టిలో నువ్వే ఎక్కువ అల్లరి చేసినట్టుండేది. గుర్తుందా! ఓరోజు మాస్టారు తరగతి గదిలోకి రాగానే అందరం గౌరవంగా లేచి నిలబడి, తర్వాత కూర్చున్నాం. నువ్వు మాత్రం అలాగే నిల్చుండిపోయావు. మేమంతా కూర్చోమని అంటుంటే, గురువుగారికి వినపడేటట్టు ‘‘నన్ను ఎలాగూ నిలబెడతారుగా! నేనెందుకు కూర్చోవటం’’ అనేశావు. దాంతో ఆయన నవ్వుతూ నిన్ను కూర్చోమనడంతో మేమంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వేశాం. ఆ నవ్వులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇలా రాస్తూ ఉంటే ఎన్ని గుర్తొస్తున్నాయో! మన స్నేహ సుమాలను కూర్చితే సుందర ప్రేమానురాగాల పుష్పమాలిక తయారవుతుంది కదూ!
      మనం పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్లేవాళ్లం. కష్టమైన విషయాన్నయినా ఇష్టంగా నేర్చుకునే వాళ్లం. చదువు మీద ఆ ఇష్టమే నేటి మన జీవితాలకు మార్గదర్శకమైంది. రోజంతా పాఠశాలలో కలిసే ఉన్నా... సాయంత్రం ఇంటికి వెళ్లి మళ్లీ పుస్తకాలు చేతబట్టుకుని వచ్చి ఎవరోఒకరి ఇంట్లో కలిసేవాళ్లం. కాసేపు కబుర్లు, ఆటల తర్వాత చక్కగా చదువుకునేవాళ్లం. అలా మనకు తెలియకుండానే ఎన్నో జీవన నైపుణ్యాలు మనకు అలవడ్డాయి.  బృందస్ఫూర్తి, చొరవ, భావప్రకటనా సామర్థ్యం... ఇలా ప్రతిదీ ఒంటబట్టింది. కానీ, మన పిల్లల తరానికి వచ్చేసరికి ఆ ఆనందాలూ పోయాయి. వాటితోపాటే ఆ నైపుణ్యాలూ తగ్గాయి. అందుకే ఈరోజుల్లో పిల్లలకి చదువులు పూర్తయినా, ఎదుటివారితో మాట్లాడటానికీ  ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిన దుస్థితి ఏర్పడింది. 
      ఏది ఏమైనా, మన చిన్ననాటి జ్ఞాపకాలు మదిలో మెదిలినప్పుడు చెప్పరాని సంతోషంతో గుండెనిండుతుంది. ఆ సంతోషాన్ని నీతో పంచుకోవాలనే ఈ లేఖ రాశా....  ఉంటామరి!

ఇట్లు... నీ చిన్ననాటి నేస్తం

చెలీ! కుశలమా!

వెనక్కి ...

మీ అభిప్రాయం