కరోనా కష్టకాలంలో...

  • 326 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అరుణ కుమారి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ఎలా ఉన్నావ్‌ చిన్నా! 
ఇక్కడ పరిస్థితిలేం బాగోలేదు. పెందలకాడే దీపాలార్పేసుకుని ఎవరిళ్లలో వాళ్లు గంప కింద కోళ్ల మాదిరి మునగదీసుకుని ఉంటున్నారు. రోజూ ఇదే తంతు. గ్రామనౌకరి కూడా అదే చెబుతున్నాడు. ‘‘అమ్మా అరుణమ్మా! గడప దాటి బయటికిరాకు. అదేదో కరోనా రోగమట. అదొచ్చిందంటే మందూ మాకూ లేదు. చేతులు శుభ్రంగా కడుక్కొని మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందేనట. గొడ్ల చావిట్లోకి పోయినప్పుడు కూడా ఏ రుమాలో నోటికడ్డం కట్టుకుని వెళ్లు!’’ అని నాలుగు రోజులనుంచి పోరుతూనే ఉన్నాడు.
      ఇక ఆ మాట పట్టుకుని ఎవరూ గడపదాటి బయటికి రావడం లేదనుకో.   ఏంటోరా! ఈ మహమ్మారి! ఏనాడూ కని వినీ ఎరుగô! పొద్దుననగా పొలానికి పోయే మీ నాన్న పంటచేను దగ్గరే పరధ్యానంగా ఉండిపోతున్నాడు. మామిడి కాపుకొచ్చింది. వరి కోత కొచ్చింది. పండి రాలిపోతున్నాయి కంకులు. దోరమాగిన చింతకాయలన్నింటినీ చిలుకలు కొట్టేస్తున్నాయి. ఉన్నపాటికి ఒబ్బిడిచేశాం. కాస్తో కూస్తో మడిచెక్కలుండేవాళ్ల పరిస్థితే ఇలా ఉంటే పెద్ద కమతాలుండే వాళ్ల సంగతో అంటావా! వాళ్లు.. కోత మిషన్లు రాకా.. కూలోళ్లు దొరక్కా కుమిలిపోతున్నార్రా!. పండిన నాలుగు గింజలూ నోటిదాకా రాకపోతే ఇకముందు బతికేదెలాగా!  మొన్న హైదరాబాదు నుంచొచ్చిన మునసబుగారి మనవడిని కరోనా సోకిందని పోలీసులొచ్చి తీసుకుపోయారు. అంతే ఆరోజు నుంచి  ఊరిని కట్టడి చేసేశారు. ఒకరితో ఒకరికి మాటామంతీ లేదు. ఉప్పుకీ.. పప్పుకీ.. అప్పుకీ.. ఎలానూ కదిలేది లేదు. నొప్పుల బిళ్లకి కూడా నరసమ్మ దగ్గరికి పోయేందుకు కూడా గుబులుగా ఉంటోంది. ఉన్నట్టుండి దగ్గొచ్చినా.. పొరపాటున తుమ్మొచ్చినా, పొలమారినా నాన్నే నావంక అనుమానంగా చూస్తున్నారు. ఒకవేళ కాస్త ఒళ్లు వెచ్చబడిందనుకో ఇప్పుడు దిక్కేదిరా భగమంతుడా! అని లేని జ్వరం ఉన్నట్టు నాలో నాకే ఒకటే సలపరింపు. ఇదిగో ఇలా ఉన్నాయి మనూరి బాగోగులు. మా సంగతికేమిలే కానీ.. నీ నుంచి ఏ కబురూ లేదు. ఎలా ఉంటున్నావో.. తింటున్నావో.. అసలు అక్కడ పరిస్థితులేంటో అని... అవన్నీ చెబుతావేమోనని... రోజూ ఫోను దగ్గరే పెట్టుకుని ఉంటున్నాం ఇద్దరమూనూ. తీరా మేం అనుకున్నట్టుగానే సగం రాత్రప్పుడు చేస్తావు. మనసు నిండుగా మాట్లాడతావా! ఏవో రెండు మాటలు అనేసి సరే ఉంటానమ్మా! అని పెట్టేస్తావ్‌! ఒంటిగా ఉంటున్నావ్‌! నీ గురించే మా దిగులంతానూ. పట్టణం వాళ్లంతా ఉద్యోగాలు ఎత్తిపెట్టేసి ఎవరిళ్లలో వాళ్లు ఉంటున్నారని వినికిడి. కాసిని మెతుకులు వండి, పిల్లలకు పెట్టేందుకు ఉప్పు, పప్పు దినుసులూ దొరుకుతాయక్కడ. మన పల్లెల్లో కాలుమీద కాలేసుకుంటే రోజులు గడవవు కద నాన్నా! ఇక్కడ పనులు జరగాలి. పంట చేతిలో పడాలి.. పంట నోటిదాకా రావాలంటే ఇళ్లల్లో ఉన్నవాళ్లంతా పొలం దారి పట్టాలి! అదీ ఇక్కడ పరిస్థితి! పరిస్థితులు చక్కబడ్డాక చూసిపోదువుగానిలే! మేం బాగానే ఉంటున్నాం గానీ నువ్వు జాగ్రత్త! ఉంటాను. 

ఇట్లు
మీ అమ్మ

 

కరోనా కష్టకాలంలో...

వెనక్కి ...

మీ అభిప్రాయం