మనసున మనసై...

  • 301 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎం.కిరణ్‌ కుమార్

  • శాఖా నిర్వహణాధికారి, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • నిడుబ్రోలు, గుంటూరు జిల్లా.
  • 7382488204

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియసఖీ!
      మన షష్టిపూర్తి, పెళ్లిరోజు సందర్భంగా నేను ఇస్తున్న చిన్న బహుమతి ఈ ప్రేమలేఖ. మన నలభై వసంతాల వివాహవేడుక, షష్టిపూర్తి ఒకేరోజు రావటం విశేషమే కదా. ప్రతి పెళ్లిరోజుకూ ఏదో ఒక కానుక ఇస్తూ నిన్ను మురిపిస్తుండేవాణ్ని. ఈసారి కాస్త ఆలస్యంగా, మరికాస్త కొత్తగా ఈ ఉత్తరం రూపంలో నా ప్రేమను తెలియజేస్తున్నా. ఇది మన ఆలోచనలను- శ్రావణంలో కొత్తనీరు నింపుకున్న నదిలా- నిండుగా మారుస్తుందనీ, జీవిత వసంతంలో చిగురించిన మన యౌవన అనుభూతులను మరోసారి గుర్తు చేసుకుని ఆస్వాదించేలా చేస్తుందనీ ఆశిస్తున్నా.
      నా జీవితంలోకి ఓ మెరుపులా ప్రవేశించి, నా జీవన గమనాన్ని మార్చావు నువ్వు. యాంత్రికమైన నా దినచర్యలో ఆహ్లాదకరమైన మార్పును తీసుకొచ్చిన నెచ్చెలివి. ఎదురుచూపుల్లోని విరహాన్నీ, కలిశాక వచ్చే మధురానుభూతినీ నాకెన్నోసార్లు రుచి చూపించావు. ఆ ‘తీపి’ ముందు తేనె కూడా దిగదుడుపే. 
     నాకోసం ప్రేమగా వేచిచూసే కోయిలవి. జీవిత ప్రయాణంలోని ఆనందాన్ని పంచుకోవటానికీ, దుఃఖంలో తోడుగా నిలవటానికీ, ఆప్యాయతతో కూడిన స్పర్శను అందించటానికొచ్చిన ప్రణయబాంధవి నువ్వు. పరిచయం, ప్రణయం, పరిణయాలతో ప్రారంభించిన కొత్త జీవితంతో ప్రతి క్షణం తోడూనీడగా నిలిచిన నా జీవన నేస్తానికివే నా శుభాకాంక్షలు.
      చెలీ! నీకు గుర్తుందా తొలిసారి మనం కళాశాలలో కలిసిన రోజు? అందంగా ముస్తాబై పట్టు పరికిణీతో జడనిండా పూలతో తెలుగింటి విరిబోణిలా కనిపించావు. నువ్వు అలా నడిచివెళ్తూ... నేను నిన్ను అనుసరిస్తున్నానేమోనన్న అనుమానంతో నా వైపు చూశావు. ఆ చూపు నా హృదయాన్ని తాకిన క్షణాన్ని నేనిప్పటికీ మరవలేను. 
      కళాశాలలో జరిగిన బృందచర్చలో నీ వాక్పటిమ... బాపుబొమ్మలా అణకువగా ఉండే నీలోని ‘సత్యభామ’ని కళ్లకుకట్టింది. ఆ ఆత్మవిశ్వాసమే నీమీద గౌరవం, ప్రేమ పుట్టేలా చేసింది. పొందికైన, మంచి భావాలున్న అమ్మాయిని నీలో చూశాను ఆ రోజు. పెళ్లంటూ చేసుకుంటే నీలాంటి అమ్మాయినే... కాదు కాదు నిన్నే చేసుకోవాలనుకున్నాను. నువ్వు నన్ను ఇష్టపడాలంటే, మీ కుటుంబ సభ్యులు నన్ను అల్లుడిగా అంగీకరించాలంటే ఏం చేయాలో ఆలోచిస్తూ... నన్ను నేను ఓ శిల్పంలా తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నించాను. అది ఎంత కష్టంగా తోచినా, నీకోసమే చేస్తున్నానన్న ఆనందమే ఆ సమయంలో నన్ను ముందుకు నడిపించింది. మనం మంచి స్నేహితులుగా మారటానికి అనుకూలించిన ప్రతి పనీ చేయడానికి సిద్ధపడ్డాను. ప్రతిక్షణానికీ దాసోహమయ్యాను.
     మన అభిప్రాయాలూ, ఆలోచనలూ కలుస్తూ దగ్గరవుతున్న కొద్దీ నా ఆనందానికి హద్దులుండేవి కాదు. మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నానని చెప్పినరోజు నువ్వు ఇచ్చిన ప్రోత్సాహం కొండంత భరోసానిచ్చింది. నా తొలిప్రయత్నం విఫలమై బాధపడిన రోజు, నాకు ధైర్యం చెబుతూ నువ్వు చెప్పిన మాటలు... నీ మీద నాకున్న నమ్మకాన్నీ, ప్రేమనీ మరింత పెంచాయి. 
      ‘నా జీవితాన్ని తీర్చిదిద్దటానికే ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపాడు’ అని నేను చెప్పినప్పుడు నీ ప్రతిస్పందన నన్ను ఆనందసాగరంలో ముంచెత్తింది. ‘నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను’ అని నువ్వు చెప్పిన క్షణం నా జీవితంలో అత్యంత ఆనందభరితమైంది. ‘ప్రేమించిన హృదయాన్ని గెలుచుకోవటం కన్నా మించిన విజయం ఈ ప్రపంచంలో మరొకటి లేద’ని భావించిన నా కల ఆనాడు ఫలించింది. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ నీ కోసమే కన్నీరు నించుటకు..’ అన్న శ్రీశ్రీ మాటల్ని నిజం చేస్తూ ఆ తర్వాత ప్రతి పనిలో నువ్వు నాకు అందించిన సహకారం అనంతం.
      నా ఉద్యోగరీత్యా మనకు కొన్నాళ్లు ఎడబాటు తప్పలేదు. అయినా అది తాత్కాలికమేనని నాకు నేను సర్దిచెప్పుకుంటూ ఆ విరహాన్ని భరించాను. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి, వాళ్ల ఆశీస్సులతో ఒక్కçయ్యాం. ఎలాంటి ఒడుదొడుకులూ లేకుండా నలభై వసంతాల నుంచి అన్యోన్యంగా కలిసి సాగుతున్నాం. మన వైవాహిక జీవితం ఇలా అర్థవంతమయ్యేలా నామీద అనంత ప్రేమను కురిపించిన... కురిపిస్తూనే ఉన్న నా అర్ధాంగీ! నీకు జోహార్లు. మలివయసులో మిగిలిన ఈ జీవితయానంలో కూడా నీ ప్రేమాప్యాయతలను ఆస్వాదిస్తూ, అంతకుమించిన ప్రేమానురాగాలను నీకు అందించగలనని ప్రమాణం చేస్తున్నాను. 

ఇట్లు నీ ప్రాణనాథుడు...

మనసున మనసై...

వెనక్కి ...

మీ అభిప్రాయం