ప్రియమైన కన్నీటికి...
నేను నీకేమౌతానో తెలీదు.. నువ్వు మాత్రం నాకు అత్యంత ఆత్మీయురాలివి.
ఏంటీ కన్నీటికి ప్రేమలేఖా! అది కూడా ఎవరో ఆప్తులకి రాసినంత ప్రేమగా రాస్తున్నానని ఆశ్చర్యపోతున్నావా? చుట్టూ ఉన్న కల్తీజనాన్ని, వస్తువులని చూశాక ఏ కల్మషం, కలుషితం లేని నీకు జాబు రాయడం నాకు సబబుగానే తోస్తోంది.
చిరునవ్వు విలువ అందరికంటే నీకే బాగా తెలుసు ఎందుకంటే చిరునవ్వుకి దూరమయ్యాకే కన్నీటికి దగ్గరౌతాం.
ఎంతోమంది ఆప్తులుండగా నాకే ఎందుకీ ఉత్తరం అని నువ్వు నన్ను ప్రశ్నించొచ్చు. దానికి నాదగ్గరున్న బదులొక్కటే ఏదైనా కష్టంరాగానే చిరునవ్వు వెంటనే మాయమౌతుంది, కానీ నువ్వు నాకు కావలసిన వారికంటే ముందే నన్ను చేరతావు. ఇదొక్కటి చాలదా నీకు ఉత్తరం రాయడానికి?
ఏదో తెలియని బాధ గుండెల్ని మెలిపెట్టినప్పుడు, నైరాశ్యం కమ్మి నేనొంటరయినప్పుడు, దిగులు మేఘాలావరించి ఏమీ చేయలేని దీనస్థితిలో పెదవి దాటి మాట బయటకు రానంటుంది. కంటికి కనబడని ఆంక్షలతో నన్ను బందీని చేసి వికసిస్తున్న నా ఆశల్ని మొగ్గలోనే తుంచేసినప్పుడు ఎప్పుడూ నాతోనే ఉంటానన్న చిరునవ్వు మాయమైంది. ఎప్పుడొచ్చిందో తెలీదు అకస్మాత్తుగా కంటి నుంచి జారిందో కన్నీటి చుక్క. రెప్పలనుంచి జారి నా చెక్కిళ్లను తడిపేశావు. నంగనాచి! నా ఆవేదనంతా నీతో తీసుకెళ్లిపోయావు.
ఎందుకే నీకు చిరునవ్వంటే అంతిష్టం. చిరునవ్వెప్పుడు నీకు దూరంగా జరిగినా నువ్వు మాత్రం దాని చెయ్యందుకోవడానికి ఆరాటపడతావు? అది నిన్నెప్పుడూ శత్రువులా చూసినా నువ్వు మాత్రం దాన్ని మిత్రునిలా చూస్తావు. కన్నీరు దుఃఖానికి ప్రతీకంటే నేనెంత మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే ఆనందంలో చిరునవ్వుతో పాటు నువ్వూ ఉంటావు. నయనాల నుంచి జారే తెల్లటి బిందువులే దీనికి రుజువులు.
మానవ జీవితం తన కన్నీటితో మొదలై, ఆత్మీయుల కన్నీటితో ముగుస్తుంది. మధ్యమధ్యలో నువ్వు అప్పుడప్పుడూ మమ్మల్ని పలకరించినా అంతిమంగా మేం సంతోషంగా ఉండాలనేదే నీ కోరిక.
మనిషెంత సంతోషంగా ఉన్నాడో లేదో చిరునవ్వుని చూసి చెప్పొచ్చు.. గుండె లోతుల్లోని ఆవేదన మాత్రం నీవల్లే తెలుస్తుంది ఎవరికైనా.
ఇంకొక్క విషయం శత్రువులెప్పుడూ చిరునవ్వుని చెరిపెయ్యాలని చూస్తారు కానీ ఆత్మీయులు మాత్రం కన్నీటిని తుడవాలని చెయ్యందిస్తారు. కాబట్టి ఎంతమంది నిన్ను తిట్టుకున్నా బాధపడకు.
ఇలా నీ గొప్పతనం గురించి ఎంతరాసినా ఎంతోకొంత మిగిలే ఉంటుంది. నేనెప్పుడైనా బాధలో ఉంటే నువ్వొస్తావుగా? నేను పిలవకపోయినా వస్తావని నాకు తెలుసు. ఉంటామరి.