మమతల తల్లికి... మా చెల్లికి!

  • 71 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పాతకోటి అంజిరెడ్డి

  • రామసముద్రం, ప్రకాశం జిల్లా.
  • 9100434489
పాతకోటి అంజిరెడ్డి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన చెల్లికి
నా జ్ఞాపకాలను నీతో పంచుకుందామంటే నువ్వు నా దగ్గర లేవు. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయావు. దగ్గరున్నంతకాలం తెలియలేదు నీ విలువ. దూరమయ్యాక తెలిసింది ఆ ప్రేమ ఎటువంటిదోనని. చిన్నతనంలో నువ్వు పడిన కష్టాలు మరచిపోలేను చెల్లీ! బడికి వెళ్లనంటే వెళ్లనని మారం చేసేదానివి. చిన్నప్పటి నుంచీ ఇంటిపనంతా నవ్వుతూ చేసేదానివి. మేత కోసమని పశువులను కాయటానికి పోతున్న నీ వెనుకే నేనూ బడికి పోయేవాణ్ని గుర్తుందా! సెలవురోజుల్లో మాత్రం నీ బదులు నేను పశువులు మేపేందుకు వెళ్లాల్సొస్తుందని పొద్దుపొడవకముందే ఇల్లు దాటేసేవాణ్ని. వాటితో పోనంటే పోనని తెగ మొండికేసేవాణ్ని. చివరికి అయ్య నేనెక్కడున్నా వెతికి పట్టుకుని నాకా పని అప్పగించేవాడు. అప్పుడు నీ మీద పట్టరాని కోపం వచ్చేది. ఐనా ఆ కోపం ఎంతోసేపు ఉండేది కాదులే! 
నీకు గుర్తుందో లేదో... పండక్కి కొత్త బట్టలు తీసుకోవడానికి పట్నం పోయినప్పుడు నీకు నచ్చుతుందో లేదో అనే భయందో నీకూ కొత్తబట్టలు తీసుకునేవాణ్ని. వాటిని నువ్వు పదేపదే చూసుకుని మురిసిపోతూ ఉంటే నాకు ఎంత ఆనందమనిపించేదో! అమ్మ కూడా మంచివి తీసుకున్నావురా! అనేది. నేను మిరపకాయలు తొక్కేపనికి పోయి అన్నానికొచ్చినప్పుడు నా కోసమని కూరలో మసాలా దట్టించి మరింత రుచికరంగా వండేదానివి. ఆ జ్ఞాపకం నేను వంటచేసుకున్నప్పుడల్లా వెంటాడుతుంది. ఏం కొనుక్కోవడానికైనా చిన్నప్పుడు డబ్బులు ఉండేవి కావు. అందుకోసం ఇంట్లో మారాం చేసేవాళ్లం. అల్లరి చేసేవాళ్లం! నువ్వు మాత్రం కుదురుగా ఉంటూ ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని మసలుకునేదానివి. 
 నీ పెళ్లిరోజున దిగులుతో నీవంకే చూస్తుండిపోయాను. మహా సముద్రం పొంగినట్టు ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగాయి. మా చెల్లి మా ఇంటికి రాదిక! అనిపించి నన్ను నేనే సముదాయించుకున్నాను. నీతో పాటూ బావ కాళ్లు కడుగుతూ మా బంగారు తల్లిని మా ఇంటి నుంచి తీసుకుపోతున్నావే! అంటూ తల్లడిల్లిపోయాను. పెళ్లి తంతు ముగిసి మేమంతా వెళ్లిపోతుంటే వాకిట గుమ్మంలో నిలబడి మా వంక చూసిన నీ దీనమైన చూపులు నన్నింకా బాధిస్తున్నాయి చెల్లీ! ఏ రోజూ ఊరి పొలిమేర దాటి ఎరుగని నువ్వు ఇప్పుడిలా దూరమైపోవడం కష్టమనిపించినా నీకంటూ ఒక జీవితం ఉండాలి కదా! అని ఊరటచెందాను. రోజూ మా పక్కన ఉండే మా చెల్లి ఈ రోజు దూరంగా ఉంది. అమ్మీ దుప్పటి ఇవ్వు, అమ్మీ కొద్దిగా బువ్వ పెట్టు, అమ్మీ కొంచెం నీళ్లు ఇవ్వు అని పదే పదే నిన్ను తలచుకునే నేను నువ్వు ఇంట్లో లేకుండా పోవడం చూసి ఏడుపొస్తోంది. నీ కోసం ఎదురుచూసే మేమంతా ఉన్నామనే సంగతి మరచిపోవద్దు. ఉంటాను 

ఇట్లు.. మీ అన్న
 

మమతల తల్లికి... మా చెల్లికి!

వెనక్కి ...

మీ అభిప్రాయం